సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, వరంగల్/చర్ల: రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) శనివారం వరుస దాడులు నిర్వహించింది. తెలంగాణలోని వరంగల్, కొత్తగూడెం జిల్లాలతోపాటు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లోనూ ఎన్‌ఐఏ అధికారుల సోదాలు కొనసాగాయి. ఈ దాడులు రెండు రోజులుగా జరుగుతున్నప్పటికీ శనివారం వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది జూన్‌లో కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ముగ్గురి నుంచి పేలుడు పదార్థాలు, డ్రోన్‌లు, లాత్ మిషన్‌ను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకుని ఆ ముగ్గురినీ అరెస్టు చేశారు.
భద్రతా బలగాలకు వ్యతిరేకంగా పేలుడు పదార్థాలు, డ్రోన్‌లు ఉపయోగించేందుకు చేసిన కుట్రలో నిషేధిత మావోయిస్ట్ పార్టీ ప్రమేయం ఉండటంతో కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ అధికారులు స్థానిక పోలీసుల ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మరో 12 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. ఆ విచారణ కొనసాగింపులో భాగంగానే శనివారం వరంగల్‌లో ఐదు చోట్ల, భద్రాద్రి కొత్తగూడెంలో రెండు చోట్ల, అదేవిధంగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడులోని నిందితుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్‌ఐఏ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
సోదాల్లో స్వాధీనం చేసుకున్న డిజిటల్ డివైజ్‌లను, డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. నిందితులు యాంటీ భారత్ ఎజెండాలో భాగంగా పలు ముడిపదార్థాలను మావోయిస్టులకు చేర్చేందుకు ప్రయత్నించినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయని తెలిపారు.
ఏజెన్సీలో ఇద్దరు అదుపులోకి?
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, వెంకటాపురం ఏజెన్సీలో మావోయిస్టుల గురించి ఎన్‌ఐఏ అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. ఎదిరె, సూరవేడు కాలనీ, విజయపురితో పాటు పలుచోట్ల మావోయిస్టు దళానికి డ్రోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర సామగ్రి సరఫరా చేశారనే సమాచారంతో సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ.. ఏజెన్సీలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రెండు రాష్ట్రాల సరిహద్దులోని ఏజేన్సీ ప్రాంతాల్లో దేశవాళీ తుపాకులను తయారు చేసి వాటిని మావోలకు పంపుతున్నారన్న సమాచారం మేరకు సోదాలు జరిపినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment