7 డ్రోన్లు సీజ్.. అధికారుల దర్యాప్తు
నిబంధనలకు విరుద్ధంగా, పర్మిషన్ లేకుండా దిగుమతి చేసుకున్న 7డ్రోన్లను సీజ్ చేసినట్లు పుణే కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. ఆ డ్రోన్ల విలువ దాదాపు 1.2కోట్ల రూపాయలపైమాటే అని తెలిపారు. కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ కె శుభేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. భవదాన్ లోని ప్రైవేట్ కంపెనీ ఎంఎస్ మిబ్ నాయిస్ ప్రైవేట్ లిమిటెడ్ ను నిర్వహిస్తున్న అమిత్ తాక్తే అనే వ్యక్తి అమెరికాలో తయారైన డ్రోన్స్ విడి భాగాలను దిగుమతి చేసుకున్నాడు. కెనడా నుంచి ఆ డ్రోన్ ముడిసరుకు భారత్ కు వచ్చిందని తెలుసుకుని సీజ్ చేశామన్నారు.
కస్టమ్స్ యాక్ట్-1962 ప్రకారం లైసెన్స్ లేకుండా డ్రోన్లను దేశంలోకి దిగుమతి చేసుకోరాదు. వైర్ లెస్, ప్లానింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ కు సంబంధించి టెలికాం అనుమతి లేకుండా డ్రోన్లను ఇక్కడికి తీసుకువచ్చే అవకాశం లేదు. ఎంఎస్ హైట్స్ నెక్స్ కు చెందిన వికాస్ కుమార్, అమిత్ తాక్తే సంయుక్తంగా డ్రోన్లపై వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే వారు దిగుమతి చేసుకున్న డ్రోన్లను ఏ అవసరాలకు వినియోగిస్తున్నారన్న విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ శుభేంద్ర వివరించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ ఏ ఒక్కరిని అరెస్ట్ చేయలేదు.