వ్యవసాయ డ్రోన్‌ పైలెట్‌ శిక్షణకు గ్రీన్‌సిగ్నల్‌ | Green signal for agricultural drone pilot training Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వ్యవసాయ డ్రోన్‌ పైలెట్‌ శిక్షణకు గ్రీన్‌సిగ్నల్‌

Published Tue, Nov 8 2022 3:51 AM | Last Updated on Tue, Nov 8 2022 3:51 AM

Green signal for agricultural drone pilot training Andhra Pradesh - Sakshi

వ్యవసాయ డిప్లమో విద్యార్థులకు డ్రోన్‌ పైలెట్‌ శిక్షణ ఇస్తున్న దృశ్యం (ఫైల్‌)

సాక్షి, అమరావతి: వ్యవసాయ, సంప్రదాయ డ్రోన్‌ పైలెట్‌ శిక్షణ ఇచ్చేందుకు ఏపీ ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) అనుమతి ఇచ్చింది. దేశంలోనే తొలిసారి వర్సిటీకి లైసెన్సు జారీచేస్తూ డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ జితేందర్‌ లౌరా ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వుల ప్రకారం గుంటూరు లాంలోని వ్యవసాయ డ్రోన్‌ పరిశోధన కేంద్రమైన సెంటర్‌ ఫర్‌ అప్సర ద్వారా సంప్రదాయ, వ్యవసాయ డ్రోన్లపై రిమోట్‌ పైలెట్‌ ట్రైనింగ్‌ కోర్సు (ఆర్పీటీసీ)లో 12 రోజుల శిక్షణ ఇచ్చేందుకు 2032 వరకు అనుమతి లభించింది. దేశంలో సంప్రదాయ డ్రోన్లపై శిక్షణ ఇచ్చేందుకు ప్రైవేటు రంగంలో 34 డ్రోన్‌ పైలెట్‌ శిక్షణ కేంద్రాలకు డీజీసీఏ అనుమతి ఉంది.

ఈ కేంద్రాల్లో ఐదుకిలోల బరువున్న సంప్రదాయ డ్రోన్లపై ఐదురోజుల పాటు కన్వెన్షనల్‌ రిమోట్‌ పైలెట్‌ కోర్సు (సీఆర్పీసీ) కింద శిక్షణ ఇస్తున్నారు. వ్యవసాయ అవసరాల కోసం వినియోగించే డ్రోన్లు 25 కిలోలకుపైగా బరువుంటాయి. వీటిపై శిక్షణ పొందాలంటే ప్రత్యేక పాఠ్యప్రణాళిక ఉండాలి. కనీసం 12 రోజులు   పడుతుంది. డీజీసీఐ మార్గదర్శకాలకనుగుణంగా గుంటూరు లాంలో సెంటర్‌ ఫర్‌ అప్సర పేరిట ఏపీ ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ 2020లో వ్యవసాయ డ్రోన్ల పరిశోధన సంస్థకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయ డ్రోన్‌ పైలెట్‌ శిక్షణ కోసం దేశంలోనే తొలిసారి 12 రోజుల శిక్షణకు ప్రత్యేకంగా పాఠ్యప్రణాళికను సైతం రూపొందించింది.

10 ప్రధాన పంటలైన వరి, పత్తి, మిరప, చెరకు, మొక్కజొన్న జొన్న, మినుము, కంది, శనగ, వేరుశనగ సాగులో డ్రోన్ల వినియోగంపై ప్రామాణికాలను రూపొందించింది. ప్రయోగాత్మకంగా గడిచిన ఖరీఫ్‌లో 30 వేల ఎకరాల్లో వ్యవసాయ డ్రోన్ల వినియోగం ద్వారా సత్ఫలితాలను సాధించారు. అంతేకాదు.. సెంటర్‌ ఫర్‌ అప్సర ద్వారా 75 మంది వ్యవసాయ డిప్లమో విద్యార్థులకు అంతర్గతంగా శిక్షణ ఇచ్చి వ్యవసాయ డ్రోన్‌ పైలెట్లుగా తీర్చిదిద్దారు. వ్యవసాయ అనుబంధ అవసరాలకు తగినట్టుగా అత్యాధునిక టెక్నాలజీతో ప్రత్యేకంగా 16 డ్రోన్లను రూపొందించి వివిధ పరిశోధనల్లో వినియోగిస్తున్నారు.

వ్యవసాయ డ్రోన్‌ పైలెట్‌ శిక్షణ కోసం రూపొందించిన పాఠ్యప్రణాళికతో పాటు పైలెట్‌ శిక్షణకు అనుమతి కోరుతూ వర్సిటీ ప్రతిపాదనలు పంపింది. దీంతో ఈ నెల 3, 4 తేదీల్లో డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్‌ జితేందర్‌ లౌరా నేతృత్వంలోని బృందం లాంలోని సెంటర్‌ ఫర్‌ అప్సరను సందర్శించింది. అక్కడ మౌలిక సదుపాయాలతోపాటు పైలెట్‌ చీఫ్‌ ట్రైనర్‌ డాక్టర్‌ ఎ.సాంబయ్య నేతృత్వంలో శిక్షణ ఇస్తున్న అధ్యాపక బృందం నైపుణ్యతను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేసింది. సెంటర్‌ ఫర్‌ అప్సరకు లైసెన్సు జారీచేస్తూ సోమవారం ఉత్తర్వులు విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా మూడు వర్సిటీలకు మాత్రమే డ్రోన్‌ పైలెట్‌కు శిక్షణ ఇచ్చేందుకు అనుమతి ఉంది. అయితే వ్యవసాయ డ్రోన్‌ పైలెట్‌గా శిక్షణ ఇచ్చే తొలి అవకాశం ఎన్జీరంగా వర్సిటీకే దక్కింది. సంప్రదాయ డ్రోన్లపై ఐదురోజుల శిక్షణ పొందినవారికి  కొనసాగింపుగా వ్యవసాయ డ్రోన్లపై మరో ఏడురోజులు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు జారీచేసే అవకాశం కల్పించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఆర్బీకేలోను డ్రోన్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందుకోసం ఎంపిక చేసిన రైతులకు ఉచితంగా డ్రోన్‌ పైలెట్‌గా శిక్షణ ఇచ్చేందుకు మార్గం సుగమమైంది.

ఇక డ్రోన్‌ విప్లవం
వ్యవసాయ, సంప్రదాయ డ్రోన్లపై శిక్షణ ఇచ్చేందుకు డీజీసీఏ అనుమతినివ్వడం.. రాష్ట్రంలో డ్రోన్‌ విప్లవానికి నాంది పలికింది. ఇదొక చరిత్రాత్మక పురోగతిగా భావించవచ్చు. దేశంలోనే తొలి వ్యవసాయ డ్రోన్‌ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే కాదు.. తొలి శిక్షణ కేంద్రం కూడా మనదే కావడం గర్వంగా ఉంది. 2032 వరకు అనుమతి ఇవ్వడంతో డ్రోన్‌ రంగంలో వేలాదిమంది గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి లభించనుంది. 
– డాక్టర్‌ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి, వీసీ, ఏపీ ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ 

రాష్ట్రానికి దక్కిన గౌరవం 

వ్యవసాయ డ్రోన్‌ పైలెట్‌గా శిక్షణ ఇచ్చేందుకు ఏపీ ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుమతి ఇవ్వడం రాష్ట్రానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఆర్బీకేలో డ్రోన్‌ ఏర్పాటు చేసేదిశగా అడుగులు వేస్తున్నాం. ఇందుకోసం ఎంపికచేసిన రైతులకు శిక్షణ ఇచ్చేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. 
– కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement