సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఇప్పుడు ప్రపంచం మొత్తం కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) వైపు చూస్తోంది. ఇప్పటికే అన్ని రంగాల్లోనూ ఏఐ తన ప్రభావం చూపిస్తోంది. తాజాగా వ్యవసాయ రంగంలోనూ అడుగుపెట్టనుంది. ఈ రంగంలోని అన్ని విభాగాల్లో కృత్రిమ మేధను అమలు చేయడానికి గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అడుగులేస్తోంది. ఇప్పటికే కలుపు తీసే రోబోట్లపైన ప్రయోగాలు చేస్తోంది. ఇవి పూర్తయ్యాక పూర్తి స్థాయిలో కృత్రిమ మేధను అమల్లోకి తేవాలని నిర్ణయించింది.
రైతులకు ప్రయోజనకరం ఏఐ..
మనదేశంలో ఉన్న 143 మిలియన్ హెక్టార్లలో వ్యవసాయం చేయడానికి అవసరమైనంత మంది రైతులు అందుబాటులో ఉండటం లేదు. యువతరానికి వ్యవసాయం మీద పూర్తిస్థాయి అవగాహన ఉండటం లేదు. చదువులు, ఉద్యోగాలకు వారు వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏఐలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయరంగంలో ప్రవేశపెడితే కూలీలు, మానవవనరుల కొరతకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. గతంలో చేలో మందు కొట్టడానికి రెండు గంటలు పట్టేది. ఇప్పుడు డ్రోన్లు అందుబాటులోకి వచ్చాక ఆరు నిమిషాల్లోనే పని పూర్తవుతోంది.
ఉద్యోగాలు చేసుకుంటూనే వీకెండ్ వ్యవసాయం చేద్దామనుకునేవారు డ్రోన్లు అందుబాటులోకి వచ్చాక ఇటు వైపు మొగ్గు చూపుతున్నారు. బీమా కంపెనీలు, ప్రభుత్వాలు రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వడానికి కూడా ఈ కృత్రిమ మేధ ఉపయోగపడుతుంది. వాతావరణంలో తేమ శాతం ఎంత ఉందో ఒక్క క్షణంలోనే ఏఐ పరిజ్ఞానం ద్వారా చెప్పొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రస్తుతం 167 భూసార పరీక్షా కేంద్రాలను మన రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు. వీటికి శాంపిల్స్ తీయడం కష్టమవుతుండటంతో ఒక రోబోట్ రూపకల్పనపై వ్యవసాయ వర్సిటీ పరిశోధనలు చేస్తోంది. ఏఐ పరిజ్ఞానంతో ఏదైనా పంటకు రాబోతున్న తెగులును కూడా ముందుగానే తెలుసుకునే వీలుంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. తద్వారా దాని నివారణకు చర్యలు చేపట్టవచ్చంటున్నారు.
సాగులో తగ్గనున్న ఖర్చు..
దేశంలో ఇప్పటికే నీటిపారుదలను నియంత్రించే యాప్‌లు, ట్రాక్టర్లను నడిపించే జీపీఎస్ సిస్టమ్‌లు, పశువులను పర్యవేక్షించే ఆర్‌ఎఫ్‌ఐడీ–చిప్డ్ ఇయర్ ట్యాగ్‌లు ఉన్నాయి. వ్యవసాయంలో సాంకేతిక స్థిరత్వం రావాలంటే కృత్రిమ మేధ అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు. సంప్రదాయ పద్ధతుల కంటే సులువుగా, ఖర్చు తగ్గించేలా చేయడానికి వ్యవసాయ వర్సిటీ కృషి చేస్తోంది. దేశంలోనే అత్యాధునిక ఏరియల్ రోబో డ్రోన్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4 లక్షల ఎకరాల్లో ఈ డ్రోన్లను వినియోగిస్తున్నారు. వీటి ద్వారా పురుగు, కలుపు, తెగుళ్ల మందుల పిచికారీలే కాకుండా విత్తనాలు వేయడం, యూరియా, డీఏపీ లాంటి ఎరువులు చల్లడం వంటివి చేస్తున్నారు.
ప్రయోగాత్మకంగా వ్యవసాయ రోబో..
వ్యవసాయ రంగంలో ఎల్వోటీ, బిగ్‌డేటా ఎనలిటిక్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను రైతుల ముంగిట్లోకి తేవడానికి వర్సిటీ పరిశోధనలను ముమ్మరం చేసింది. తద్వారా కూలీల కొరత, ఖర్చు, వాతావరణ మార్పుల వల్ల వచ్చే సమస్యలను పరిష్కరించవచ్చని పరిశోధకులు అన్నారు. సాగు పనులకు వ్యవసాయ రోబోను వర్సిటీ ప్రయోగాత్మకంగా పరీక్షించింది.
సంప్రదాయ సాగు పద్ధతులతో పోలిస్తే వ్యవసాయ రోబో 4–5 రెట్ల సామర్థ్యంతో పనిచేస్తుందంటున్నారు. అదే డ్రోన్‌ల ద్వారా అయితే పదిరెట్ల పని సామర్థ్యం ఉంటుందని పేర్కొంటున్నారు. వీటితో రైతులకు ఖర్చులూ తగ్గిపోతాయని అంటున్నారు. కూలీలు దొరక్కపోయినా మందులు, పోషకాలను అందించి పంటను కాపాడతాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ వర్సిటీ రోబోలను అందుబాటులో తేవడానికి వడివడిగా అడుగులేస్తోంది.
వచ్చే మూడేళ్లలో అందుబాటులోకి..
మానవ రహిత వ్యవసాయంతోపాటు, ఖచ్చిత వ్యవసాయం చేసేందుకు కృత్రిమ మేధ దోహదపడుతుంది. వచ్చే మూడేళ్లలో పూర్తిస్థాయిలో కృత్రిమ మేధను వ్యవసాయంలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయతి్నస్తున్నాం. పరిశోధనలు ముమ్మరం చేశాం. – అంగిరేకుల సాంబయ్య, సీనియర్ శాస్త్రవేత్త, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment