Weed
-
తిండి లేక అలమటిస్తున్న పాలస్తీనియన్లు!
ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిణామాలు గాజా సరిహద్దులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. గాజాలో తలదాచుకుంటున్న పాలస్తీనియన్లు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తిండి గింజలు కరువై, ప్రాణాలు నిలుపుకునేందుకు కలుపుమొక్కలు, ఆకులు, చివరికి గడ్డి కూడా తింటూ కాలం గడుపుతున్నారని మీడియా సంస్థ అల్ జజీరా పేర్కొంది గాజాలో లక్షలాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే తెలియజేసింది. దాదాపు 20 లక్షల మంది పాలస్తీనియన్లు తమ ఇళ్లను, జీవనోపాధిని కోల్పోయి చివరికి కడుపును కూడా నింపుకోలేని పరిస్థితికి చేరుకున్నారు. ఇజ్రాయెల్ దాడి ఇంకా కొనసాగుతున్నందున గాజాలోని పాలస్తీనియన్లు ఆకలితో అలమటిస్తున్నారని అల్ జజీరా కరస్పాండెంట్ తారెక్ అబూ అజౌమ్ తెలిపారు. దక్షిణ గాజాలోని తలదాచుకున్న ప్రజలు ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా అందుతున్న నిత్యావసర సామాగ్రిపై ఆధారపడి కాలం గడుపుతున్నారని పేర్కొన్నారు. గాజాలో 1949 నుండి సేవలు అందిస్తున్న నోబెల్ శాంతి బహుమతి పొందిన క్వేకర్ సంస్థకు చెందిన అమెరికన్ ఫ్రెండ్స్ సర్వీస్ కమిటీ జనరల్ సెక్రటరీ జాయిస్ అజ్లౌనీ మాట్లాడుతూ గాజాలో ఆకలి చావులు తీవ్ర స్థాయిలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. గాజాలోని ప్రజలంతా ఆకలితో అలమటిస్తున్నారని, ఇలాంటి విపత్తు ఎన్నడూ చూడలేదని తమ సిబ్బంది చెబుతున్నారని జాయిస్ అజ్లౌనీ పేర్కొన్నారు. -
సాగుకూ ఏఐ సాయం!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఇప్పుడు ప్రపంచం మొత్తం కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) వైపు చూస్తోంది. ఇప్పటికే అన్ని రంగాల్లోనూ ఏఐ తన ప్రభావం చూపిస్తోంది. తాజాగా వ్యవసాయ రంగంలోనూ అడుగుపెట్టనుంది. ఈ రంగంలోని అన్ని విభాగాల్లో కృత్రిమ మేధను అమలు చేయడానికి గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అడుగులేస్తోంది. ఇప్పటికే కలుపు తీసే రోబోట్లపైన ప్రయోగాలు చేస్తోంది. ఇవి పూర్తయ్యాక పూర్తి స్థాయిలో కృత్రిమ మేధను అమల్లోకి తేవాలని నిర్ణయించింది. రైతులకు ప్రయోజనకరం ఏఐ.. మనదేశంలో ఉన్న 143 మిలియన్ హెక్టార్లలో వ్యవసాయం చేయడానికి అవసరమైనంత మంది రైతులు అందుబాటులో ఉండటం లేదు. యువతరానికి వ్యవసాయం మీద పూర్తిస్థాయి అవగాహన ఉండటం లేదు. చదువులు, ఉద్యోగాలకు వారు వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏఐలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయరంగంలో ప్రవేశపెడితే కూలీలు, మానవవనరుల కొరతకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. గతంలో చేలో మందు కొట్టడానికి రెండు గంటలు పట్టేది. ఇప్పుడు డ్రోన్లు అందుబాటులోకి వచ్చాక ఆరు నిమిషాల్లోనే పని పూర్తవుతోంది. ఉద్యోగాలు చేసుకుంటూనే వీకెండ్ వ్యవసాయం చేద్దామనుకునేవారు డ్రోన్లు అందుబాటులోకి వచ్చాక ఇటు వైపు మొగ్గు చూపుతున్నారు. బీమా కంపెనీలు, ప్రభుత్వాలు రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వడానికి కూడా ఈ కృత్రిమ మేధ ఉపయోగపడుతుంది. వాతావరణంలో తేమ శాతం ఎంత ఉందో ఒక్క క్షణంలోనే ఏఐ పరిజ్ఞానం ద్వారా చెప్పొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం 167 భూసార పరీక్షా కేంద్రాలను మన రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు. వీటికి శాంపిల్స్ తీయడం కష్టమవుతుండటంతో ఒక రోబోట్ రూపకల్పనపై వ్యవసాయ వర్సిటీ పరిశోధనలు చేస్తోంది. ఏఐ పరిజ్ఞానంతో ఏదైనా పంటకు రాబోతున్న తెగులును కూడా ముందుగానే తెలుసుకునే వీలుంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. తద్వారా దాని నివారణకు చర్యలు చేపట్టవచ్చంటున్నారు. సాగులో తగ్గనున్న ఖర్చు.. దేశంలో ఇప్పటికే నీటిపారుదలను నియంత్రించే యాప్‌లు, ట్రాక్టర్లను నడిపించే జీపీఎస్ సిస్టమ్‌లు, పశువులను పర్యవేక్షించే ఆర్ఎఫ్ఐడీ–చిప్డ్ ఇయర్ ట్యాగ్లు ఉన్నాయి. వ్యవసాయంలో సాంకేతిక స్థిరత్వం రావాలంటే కృత్రిమ మేధ అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు. సంప్రదాయ పద్ధతుల కంటే సులువుగా, ఖర్చు తగ్గించేలా చేయడానికి వ్యవసాయ వర్సిటీ కృషి చేస్తోంది. దేశంలోనే అత్యాధునిక ఏరియల్ రోబో డ్రోన్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4 లక్షల ఎకరాల్లో ఈ డ్రోన్లను వినియోగిస్తున్నారు. వీటి ద్వారా పురుగు, కలుపు, తెగుళ్ల మందుల పిచికారీలే కాకుండా విత్తనాలు వేయడం, యూరియా, డీఏపీ లాంటి ఎరువులు చల్లడం వంటివి చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా వ్యవసాయ రోబో.. వ్యవసాయ రంగంలో ఎల్వోటీ, బిగ్‌డేటా ఎనలిటిక్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను రైతుల ముంగిట్లోకి తేవడానికి వర్సిటీ పరిశోధనలను ముమ్మరం చేసింది. తద్వారా కూలీల కొరత, ఖర్చు, వాతావరణ మార్పుల వల్ల వచ్చే సమస్యలను పరిష్కరించవచ్చని పరిశోధకులు అన్నారు. సాగు పనులకు వ్యవసాయ రోబోను వర్సిటీ ప్రయోగాత్మకంగా పరీక్షించింది. సంప్రదాయ సాగు పద్ధతులతో పోలిస్తే వ్యవసాయ రోబో 4–5 రెట్ల సామర్థ్యంతో పనిచేస్తుందంటున్నారు. అదే డ్రోన్ల ద్వారా అయితే పదిరెట్ల పని సామర్థ్యం ఉంటుందని పేర్కొంటున్నారు. వీటితో రైతులకు ఖర్చులూ తగ్గిపోతాయని అంటున్నారు. కూలీలు దొరక్కపోయినా మందులు, పోషకాలను అందించి పంటను కాపాడతాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ వర్సిటీ రోబోలను అందుబాటులో తేవడానికి వడివడిగా అడుగులేస్తోంది. వచ్చే మూడేళ్లలో అందుబాటులోకి.. మానవ రహిత వ్యవసాయంతోపాటు, ఖచ్చిత వ్యవసాయం చేసేందుకు కృత్రిమ మేధ దోహదపడుతుంది. వచ్చే మూడేళ్లలో పూర్తిస్థాయిలో కృత్రిమ మేధను వ్యవసాయంలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయతి్నస్తున్నాం. పరిశోధనలు ముమ్మరం చేశాం. – అంగిరేకుల సాంబయ్య, సీనియర్ శాస్త్రవేత్త, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు -
కన్నీటి వాగు
కెరమెరి(ఆసిఫాబాద్): పత్తి చేనులో పురుగు మందు పిచికారీ చేస్తూ విష ప్రభావానికి గురైన లక్మాపూర్ రైతు మాలోత్ లక్ష్మణ్ (50)ను వాగు దాటించి ఆస్పత్రికి తరలించడం ఆలస్యం కావడంతో మృతి చెందాడు. లక్ష్మణ్ శుక్రవారం తన పత్తి పంటకు పురుగు మందు పిచికారీ చేస్తుండగా విషప్రభావంతో స్పృహ తప్పి కింద పడిపోయాడు. గమనించిన సమీప రైతులు ఆయనను ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును కష్టంగా దాటించి.. కెరమెరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత ఉట్నూ ర్ సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యానికి ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగా.. అర్ధరాత్రి 12 గంటలకు పరిస్థితి విషమించి మృతి చెందాడు. శనివారం కూడా వాగు ఉధృతి తగ్గక పోవ డంతో మృతదేహాన్ని మంచంపైనే వాగు దాటించారు. కాగా ఈ నెల 8న ‘ప్రాణాలు పోయా కా స్పందిస్తారా..?’ అన్న శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైన రోజే మృతి చెందడం గమనార్హం! ఆలస్యం కాకుంటే.. లక్ష్మణ్ తన చేనులో పడిపోగా.. వాగు దాటించి కెరమెరి పీహెచ్‌సీకి చేర్చడానికి రెండు గంటల సమయం పట్టింది. దీంతో ప్రాథమిక చికిత్స అందడం ఆలస్యమైంది. అక్కడి నుంచి ఉట్నూర్, ఆ తర్వాత ఆదిలాబాద్ రిమ్స్‌కు చేరేసరికి లక్ష్మణ్ పరిస్థితి విషమించింది. రిమ్స్ వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. సకాలంలో తీసుకొస్తే ప్రాణాలు దక్కేవని రిమ్స్ వైద్యులు పేర్కొన్నట్లు మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ నేత్రాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు. -
పాత పరికరాలతో కలుపుతీత యంత్రం
రైతులు వేలకు వేలు పెట్టుబడులు పెట్టి మద్దతు ధరలు లేక ఓ వైపు, కలుపు కూలీల కొరతతో మరో వైపు ఇబ్బందులు పడుతున్నారు. రైతుల కష్టాలు తీర్చాలన్న ఉద్దేశంతో మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్దిపూర్ గ్రామానికి చెందిన కమ్మరి ఆంజనేయులు పాత ఇనుము పరికరాలతో కలుపుతీత యంత్రాన్ని తయారు చేశాడు. ఆంజనేయులు బాల్యం నుంచే వెల్డింగ్ పని నేర్చుకున్నాడు. ఓ కోళ్ల ఫాంను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. కోళ్ల ఫాంలో వరి పొట్టు తిరగేయడం సమస్యాత్మకంగా మారడంతో తన దగ్గర ఉన్న పాత ఇనుము పరికరాలతో వరి పొట్టును దున్నేందుకు ఓ చిన్న యంత్రాన్ని తయారు చేశాడు. ఈ నేపథ్యంలో గ్రామంలో రైతులు కూలీల కొరత కారణంగా పడుతున్న ఇబ్బందులను చూసి ఎలాగైనా∙ఆరుతడి పంటల్లో ఉపయోగపడే కలుపుతీత యంత్రాన్ని తయారు చేయాలని సంకల్పించుకున్నాడు. దీనిలో భాగంగానే తన షెడ్డులో ఉన్న పాత పరికరాలతో కలుపుతీత యంత్రాన్ని తయారుచేశాడు. 4 అశ్వశక్తి గల ఇంజిన్‌ను కొనుగోలు చేసి దానికి జోడించాడు. కంది, పత్తి, ఆముదం, మొక్కజొన్న వంటి పంటల్లో కలుపుతీసేందుకు వీలుగా ఉందని రైతులు చెబుతున్నారు. ఈ యంత్రం తయారీకి రూ.35 వేలు ఖర్చు అవుతున్నది. రైతులకు రూ.40 వేలకు విక్రయిస్తున్నాడు. ఈ యంత్రం ద్వారా లీటర్ పెట్రోల్‌తో ఎకరం పొలంలో అంతరకృషి చేసి కలుపును నిర్మూలించవచ్చని ఆంజనేయులు తెలిపాడు. ఒక ఎకరం పొలంలో దాదాపుగా ఆరు నుండి 10 మంది కూలీలు కలుపుతీస్తుంటారు. ఒక్కో కూలి మనిషికి రూ.300 ఖర్చయ్యేది. ఎకరం పొలం కలుపు తీసేందుకు రూ.3 వేలు ఖర్చయ్యేదని స్థానిక రైతులు తెలుపుతున్నారు. ఈ యంత్రం ద్వారా రూ.100తో ఎకరం పొలంలో కలుపు తీసుకునేందుకు వీలవుతోందని, దీనిపై ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే బాగుంటుందని రైతులు అంటున్నారు. తన వద్ద ఉన్న పాతపరికరాలతో కలుపుతీత యంత్రాన్ని తయారుచేశానని, ప్రభుత్వం ప్రోత్సహిస్తే రైతులకు ఉపయోగపడే వివిధ రకాల యంత్రాలను తయారుచేస్తానని ఆంజనేయులు (95427 74287) అంటున్నాడు. – గడ్డం కాంతారావు, సాక్షి, చిన్నచింత కుంట, మహబూబ్‌నగర్‡ కలుపుతీత యంత్రం (ఇన్సెట్లో) ఆంజనేయులు -
విస్తరిస్తున్న వయ్యారిభామ
అన్నదాతల పాలిట శాపంగా మారిన కలుపుమొక్క శ్వాసకోశ, చర్మ వ్యాధులకు మూలం పంటను ఎదగనీయని మొక్క దృష్టి సారించని అధికారులు ఆందోళనలో అన్నదాతలు మెదక్:వయ్యారిభామ అనే కలుపు మొక్క అన్నదాతల పాలిట శాపంగా మారింది. దానిపేరులోనే అందం ఉన్నప్పటికీ పనితీరుమాత్రం ఘోరమే.. అది మొలకెత్తిన చోట ఏ పంట ఎదగనీయదు...దాని నుంచి వచ్చే గాలితో శ్వాసకోశ, చర్మవ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. పశువులు మేసినా ప్రాణపాయం తప్పదని...సాక్షాత్తు వ్యవసాయ అధికారులు చెబుతున్నారంటే ఆ మొక్క సృష్టించే విధ్వంసం అంతాఇంత కాదు. రోజు రోజుకు విస్తరిస్తున్న వయ్యారిభామ విషపు మొక్కను అంతం చేసేందుకు పాలకులు, అధికారులుగానీ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీంతో అన్నదాతల పాలిట ఆ మొక్కశాపంగా మారింది. జిల్లాలో ఎక్కడచూసినా ఈ కలుపుమొక్కలే కనిపిస్తాయి. సుమారు 7 దశాబ్దాల క్రితం దక్షిణ అమెరికా నుంచి జొన్నలు దిగుమతి చేసుకున్న క్రమంలో ఈ మొక్కకు సంబంధించిన విత్తనాలు ఆ ధాన్యంలో వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ మొక్క మొలకెత్తి పూతదశకు చేరినప్పుడు వీచే గాలిలో దీని విత్తనాలు గాలి తాకిడికి వేలాది అడుగుల దూరం వరకు వెళ్లిపోతాయని పరిశీలకులు చెబుతున్నారు. ఈ మొక్క మొలకెత్తిన ప్రాంతంలో ఎలాంటి పంట మొక్కలు, ఇతర మొక్కలుగాని ఎదగవని చెబుతున్నారు. ఈ మొక్క వల్ల మనుషులకు శ్వాసకోశ వ్యాధులతోపాటు చర్మవ్యాధులు వస్తాయని అంటున్నారు. అన్నదాతలకు వచ్చే ఽశ్వాసకోశ వ్యాధులు కేవలం దీనివల్లేనని పేర్కొంటున్నారు. పశువులు ఈ మొక్కను మేషాయంటే మరణం సంభవిస్తుందని వెటర్నరి అధికారులు పేర్కొంటున్నారు. ఈ మొక్కను నామరూపల్లేకుండా తుదముట్టించాలంటే ఒక్క రైతుల వల్లే కాదని, ప్రభుత్వ చర్యలు తప్పనిసరి అని ఓ జిల్లా ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఈజీఎస్ వంటి పథకాల్లో భాగంగా ఈ మొక్కలను పూర్తిగా తొలగించి నిప్పుపెట్టి కాల్చివేస్తే తప్ప బయట పడటం కష్టమేనని చెబుతున్నారు. ఏదేమైనా అన్నంపెట్టే రైతన్నను ఈ విషఽపు మొక్కబారి నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని పలువురు పేర్కొంటున్నారు. -
కలుపుతీత ఇక సులభం!
పెరటి తోట పనులను సులభతరం చేసే సరికొత్త పరికరానికి రూపకల్పన ఎవరికి వారే తయారు చేయించుకోవచ్చు పెరటి తోటల్లో మనిషి నిలబడే కలుపు తీయడానికి, పాదులు తీసుకోవడానికి ఉపకరించే ఈ పరికరాన్ని ప్రకాశం జిల్లా కందుకూరు ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ ఎం. లక్ష్మణరావు రూపొందించారు. కూరగాయలు, ఆకుకూరలు పండించే రైతులకు ఇది ఉపయోగపడుతుంది. దీన్ని ఎవరికి వారే స్థానికంగా తయారు చేసుకోవచ్చు. తయారీకి కావాల్సిన ఇనప సామగ్రి: 3 అడుగుల పైపు, 2 అడుగుల పైపు, 10 సెంటీమీటర్ల పొడవైన చువ్వలు నాలుగు. 3 అడుగుల పొడవైన పైపునకు పైభాగాన అడ్డంగా 2 అడుగుల పైపును ఉంచి వెల్డింగ్ చేయాలి. 10 సెంటీమీటర్ల పొడవైన 4 చువ్వలను తీసుకొని.. వాటి కొనలను సన్నగా చేసి, వాటిని అర్థ చంద్రాకారంగా వంచాలి. నిలువు పైపునకు అడుగున (కొనలను కింది వైపునకు ఉంచి) వాటిని తగిన విధంగా అమర్చి వెల్డింగ్ చేయాలి. 2 అడుగుల పైపును చేతులతో పట్టుకొని నేల మీద తిప్పుతూ ఉంటే.. కలుపు మొక్కలు వేళ్లతోపాటు లేచి వస్తాయి. నేల గుల్ల బారుతుంది. ఒకే చోట కొంత సేపు అలాగే చేస్తుంటే.. మొక్క నాటు కోవడానికి అడుగు వెడల్పున పాది సిద్ధమవుతుంది. వయోవృద్ధులు నడుము, మోకాళ్ల నొప్పుల బాధ లేకుండా దీనితో పెరటి తోటల్లో పనులు చూసుకోవచ్చు. ఈ పరికరాన్ని వినియోగిస్తున్న గుంటూరు జిల్లా కొలకలూరుకు చెందిన రైతు సురేష్ (98484 06407) సంతృప్తిని వ్యక్తం చేశారు. -
కలుపు తీత భలే తేలిక
ఖమ్మం వ్యవసాయం: ‘నా 16వ ఏటనుంచే వ్యవసాయం చేస్తున్నా. నాకు మూడు ఎకరాల భూమి ఉంది. మరో ఏడు ఎకరాలు కౌలుకు తీసుకున్నా. మొదటి నుంచి వ్యవసాయానికి సంబంధించి ఏ విషయమైనా నాకు ఆసక్తి. శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు ఏర్పాటు చేసే శిక్షణ తరగతులకు వెళ్తుంటాను. సాగు సంబంధ విషయాలను టీ వీలు, పేపర్లలో చూస్తుంటాను. వ్యవసాయాధికారులు, రైతులు ఎవరు చెప్పినా.. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించాలనే చెబుతుంటారు. కూలీల కొరత, కూలి రేట్లు పెరగటం, సకాలంలో కూలీలు దొరకపోవడం, ఇవన్నీ చూశాక ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలనుకున్నాను. గడ్డికోసే యంత్రానికి గేర్ బాక్స్‌ను అమర్చి, దానికి బ్లేడ్లు బిగించి ఈ యంత్రాన్ని తయారు చేశాను. గడ్డి కోసే పవర్ వీడర్ యంత్రానికి అదనంగా పనిముట్లు బిగించాను. పవర్ వీడర్‌కు రెండు వీల్స్ ఏర్పాటు చేశాను. దానికి గేర్ బాక్స్‌ను అమర్చాను. ఈ యంత్రం కోసం వివిధ సైజుల్లో బ్లేడ్లు తయారు చేశాను. అవసరాన్ని బట్టి ఏ బ్లేడ్ సరిపోతుంది దాన్ని బిగిస్తాను. పైనీర్ కంపెనీకి చెందిన 27364 హైబ్రిడ్ వరి విత్తనాలను సాగు చేస్తున్నాను. ఎకరానికి నాలుగు కిలోల విత్తనాలను 10 కిలోల నూకలతో కలిపి తాను రూపొందించుకున్న డ్రమ్ సీడర్ (కేసింగ్ పైపు)తో వేశాను. మొక్కల మధ్య దూరం 10 సెం.మీ, సాలుకు సాలుకు మధ్య 30 సెం.మీ చొప్పున ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నాను. నేనే స్వయంగా విత్తనాలు వేసుకున్నాను. కలుపు నివారణ కూడా ఈ యంత్రంతోనే చేయాలని భావించి పవర్ వీడర్‌కు గేర్ బాక్స్, వీల్స్, బ్లేడ్లు ఏర్పాటు చేశాను. దీని సహాయంతో కలుపు కూడా నేనే స్వయంగా తీసుకుంటున్నాను. సాళ్ల మధ్య యంత్రాన్ని నడుపుతూ కలుపు తొలగిస్తున్నాను. పొలంలో గడ్డి ఉండటాన్ని బట్టి ఎకరానికి 4 నుంచి 6 గంటలు పడుతుంది. గంటకు లీటర్ పెట్రోలు ఖర్చవుతుంది. మొత్తంగా ఎకరానికి పెట్రోలుకు రూ.300 వరకు ఖర్చు వస్తుంది. అదే కూలీలకైతే కలుపును బట్టి ఎకరానికి ఒకసారికి దాదాపు రూ.2 వేలకు వరకు ఖర్చు వస్తుంది. ఈ యంత్రం ద్వారా కలుపు తీయటం వల్ల మరో ఉపయోగం కూడా ఉంది. కలుపు మట్టిలోనే కలిసిపోయి సేంద్రియ ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. వానపాముల చర్యలు క్రియాశీలకంగా ఉంటాయి. ఎరువుల విని యోగం కూడా తగ్గుతుంది. కలుపు నివారించబడి వరి మొక్కలకు గాలి, వెలుతురు సరిగా సోకుతుంది. తెగుళ్లు, పురుగులు సోకవు. పొ లంలో చాలినంతగా నీరు పెట్టి కలుపును బట్టి రెండు సార్లు కలుపు తీసుకుంటే మంచిది. ఎకరానికి మొత్తంగా 10 వేల వరకు ఖర్చు తగ్గుతుంది. గతంలో శ్రీ వరి సాగు పద్ధతిలో సేద్యం చేసి ఎకరానికి 50 బస్తాల వరకు దిగుబడి సాధిం చాను. వరి వేసే ముందు పచ్చిరొట్ట వేసి దున్నటం, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించటం, నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం పాటిస్తున్నాను. -
జోరందుకున్న మిరప సాగు
అనుకూలమైన నేలలు: నల్లరేగడి, ఒండ్రు, ఎర్రమట్టి, ఇసుక నేలలు. నేల తయారీ: పంట నాటుకు ముందు మూడుసార్లు దుక్కి దున్ని రెండు సార్లు గుంటక కొట్టాలి. విత్తనశుద్ధి: మొదటి సారి ఒక కిలో విత్తనానికి గ్రామున్నర టైసోడియం, ఆర్థోపాస్పేట్, రెండోసారి 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్, మూడోసారి 3 గ్రాముల కాప్టాన్ మందును కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. నారు పెంచడం: ఎత్తై నేలను చదను చేసి విత్తనాలు వేసుకోవాలి. నారు 12-15 సెంటీమీటర్లు పెరిగిన తర్వాత పది లీటర్ల నీటిలో రెండున్నర మిల్లీలీటర్ల ఫైటోలిస్ మందును కలిపి పిచికారీ చేయాలి. పంట వేసే విధానం: వర్షాధార పంట కాబట్టి తేమశాతం అధికంగా ఉన్నప్పుడూ కానీ వర్షం పడిన సమయాల్లో కానీ ఒక తాడు సాయంతో అరగజం దూరంలో వరుస క్రమంలో తగినన్ని నారు పోచలను నాటుకోవాలి. అనంతరం తగినంత మోతాదులో నత్రజని, పొటాషియం, భాస్వరం కలిపి చల్లాలి. కొన్ని రోజులకు చేనులో వరుస సాళ్లలో దంతెలు పట్టడం, కలుపు తీయడం చేస్తూ పిచ్చి మొక్కలను తీసేయాలి. పంటలో గడ్డి పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పంటకు ఆశించే తెగుళ్లు ట్రీప్స్, ఎఫైడ్స్ (వెంట్రుక పురుగులు) వంటివి ఆశిస్తే మోనోక్రొటోఫాస్ లేదా కార్బైల్ మందును తగినంత మోతాదులో నీటిలో కలిపి పంటపై పిచికారీ చేయాలి. బూజు, బూడిద తెగులు, మచ్చలు ఏర్పడితే ఆంత్రోసిన్ మందును నీటిలో కలిపి ఉదయం, సాయంత్రం వేళల్లో స్ప్రే చేయాలి. కలుపు తీయడం పంటలో ప్రతీ పదిహేను రోజులకు ఒకసారి కలుపు తీయడం చాలా అవసరం. కలుపు తీసేముందు చెట్టు మొద ళ్లకు మట్టిని ఎగదోయాలి. కలుపుతీతకంటే ముందుగా దంతెలు పడితే మరింత మంచిది. కలుపును నిర్లక్ష్యం చేస్తే తెగుళ్లు ఆశించడంతోపాటు దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. నీటి తడులిస్తే మేలు: సకాలంలో వర్షాలు పడకపోతే నీటి సదుపాయం ఉన్న రైతులు పంటకు తడులు అందించొచ్చు. దంతెపట్టి, కలుపు తీశాక నీటిని పెడితే పంట ఎదుగుదల బాగుంటుంది. ఇలా చేస్తే దిగుబడిని కూడా పెరుగుతుంది.