మంచంపై మృతదేహంతో వాగును దాటుతున్న గ్రామస్తులు
కెరమెరి(ఆసిఫాబాద్): పత్తి చేనులో పురుగు మందు పిచికారీ చేస్తూ విష ప్రభావానికి గురైన లక్మాపూర్ రైతు మాలోత్ లక్ష్మణ్ (50)ను వాగు దాటించి ఆస్పత్రికి తరలించడం ఆలస్యం కావడంతో మృతి చెందాడు. లక్ష్మణ్ శుక్రవారం తన పత్తి పంటకు పురుగు మందు పిచికారీ చేస్తుండగా విషప్రభావంతో స్పృహ తప్పి కింద పడిపోయాడు. గమనించిన సమీప రైతులు ఆయనను ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును కష్టంగా దాటించి.. కెరమెరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
ఆ తర్వాత ఉట్నూ ర్ సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యానికి ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగా.. అర్ధరాత్రి 12 గంటలకు పరిస్థితి విషమించి మృతి చెందాడు. శనివారం కూడా వాగు ఉధృతి తగ్గక పోవ డంతో మృతదేహాన్ని మంచంపైనే వాగు దాటించారు. కాగా ఈ నెల 8న ‘ప్రాణాలు పోయా కా స్పందిస్తారా..?’ అన్న శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైన రోజే మృతి చెందడం గమనార్హం!
ఆలస్యం కాకుంటే..
లక్ష్మణ్ తన చేనులో పడిపోగా.. వాగు దాటించి కెరమెరి పీహెచ్‌సీకి చేర్చడానికి రెండు గంటల సమయం పట్టింది. దీంతో ప్రాథమిక చికిత్స అందడం ఆలస్యమైంది. అక్కడి నుంచి ఉట్నూర్, ఆ తర్వాత ఆదిలాబాద్ రిమ్స్‌కు చేరేసరికి లక్ష్మణ్ పరిస్థితి విషమించింది. రిమ్స్ వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. సకాలంలో తీసుకొస్తే ప్రాణాలు దక్కేవని రిమ్స్ వైద్యులు పేర్కొన్నట్లు మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ నేత్రాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment