ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిణామాలు గాజా సరిహద్దులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. గాజాలో తలదాచుకుంటున్న పాలస్తీనియన్లు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తిండి గింజలు కరువై, ప్రాణాలు నిలుపుకునేందుకు కలుపుమొక్కలు, ఆకులు, చివరికి గడ్డి కూడా తింటూ కాలం గడుపుతున్నారని మీడియా సంస్థ అల్ జజీరా పేర్కొంది
గాజాలో లక్షలాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే తెలియజేసింది. దాదాపు 20 లక్షల మంది పాలస్తీనియన్లు తమ ఇళ్లను, జీవనోపాధిని కోల్పోయి చివరికి కడుపును కూడా నింపుకోలేని పరిస్థితికి చేరుకున్నారు. ఇజ్రాయెల్ దాడి ఇంకా కొనసాగుతున్నందున గాజాలోని పాలస్తీనియన్లు ఆకలితో అలమటిస్తున్నారని అల్ జజీరా కరస్పాండెంట్ తారెక్ అబూ అజౌమ్ తెలిపారు. దక్షిణ గాజాలోని తలదాచుకున్న ప్రజలు ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా అందుతున్న నిత్యావసర సామాగ్రిపై ఆధారపడి కాలం గడుపుతున్నారని పేర్కొన్నారు.
గాజాలో 1949 నుండి సేవలు అందిస్తున్న నోబెల్ శాంతి బహుమతి పొందిన క్వేకర్ సంస్థకు చెందిన అమెరికన్ ఫ్రెండ్స్ సర్వీస్ కమిటీ జనరల్ సెక్రటరీ జాయిస్ అజ్లౌనీ మాట్లాడుతూ గాజాలో ఆకలి చావులు తీవ్ర స్థాయిలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. గాజాలోని ప్రజలంతా ఆకలితో అలమటిస్తున్నారని, ఇలాంటి విపత్తు ఎన్నడూ చూడలేదని తమ సిబ్బంది చెబుతున్నారని జాయిస్ అజ్లౌనీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment