ఆరుతడి పంటలలో యంత్రంతో అంతర సేద్యం చేస్తున్న ఆంజనేయులు
రైతులు వేలకు వేలు పెట్టుబడులు పెట్టి మద్దతు ధరలు లేక ఓ వైపు, కలుపు కూలీల కొరతతో మరో వైపు ఇబ్బందులు పడుతున్నారు. రైతుల కష్టాలు తీర్చాలన్న ఉద్దేశంతో మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్దిపూర్ గ్రామానికి చెందిన కమ్మరి ఆంజనేయులు పాత ఇనుము పరికరాలతో కలుపుతీత యంత్రాన్ని తయారు చేశాడు. ఆంజనేయులు బాల్యం నుంచే వెల్డింగ్ పని నేర్చుకున్నాడు. ఓ కోళ్ల ఫాంను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. కోళ్ల ఫాంలో వరి పొట్టు తిరగేయడం సమస్యాత్మకంగా మారడంతో తన దగ్గర ఉన్న పాత ఇనుము పరికరాలతో వరి పొట్టును దున్నేందుకు ఓ చిన్న యంత్రాన్ని తయారు చేశాడు.
ఈ నేపథ్యంలో గ్రామంలో రైతులు కూలీల కొరత కారణంగా పడుతున్న ఇబ్బందులను చూసి ఎలాగైనా∙ఆరుతడి పంటల్లో ఉపయోగపడే కలుపుతీత యంత్రాన్ని తయారు చేయాలని సంకల్పించుకున్నాడు. దీనిలో భాగంగానే తన షెడ్డులో ఉన్న పాత పరికరాలతో కలుపుతీత యంత్రాన్ని తయారుచేశాడు. 4 అశ్వశక్తి గల ఇంజిన్‌ను కొనుగోలు చేసి దానికి జోడించాడు.
కంది, పత్తి, ఆముదం, మొక్కజొన్న వంటి పంటల్లో కలుపుతీసేందుకు వీలుగా ఉందని రైతులు చెబుతున్నారు. ఈ యంత్రం తయారీకి రూ.35 వేలు ఖర్చు అవుతున్నది. రైతులకు రూ.40 వేలకు విక్రయిస్తున్నాడు.
ఈ యంత్రం ద్వారా లీటర్ పెట్రోల్‌తో ఎకరం పొలంలో అంతరకృషి చేసి కలుపును నిర్మూలించవచ్చని ఆంజనేయులు తెలిపాడు. ఒక ఎకరం పొలంలో దాదాపుగా ఆరు నుండి 10 మంది కూలీలు కలుపుతీస్తుంటారు. ఒక్కో కూలి మనిషికి రూ.300 ఖర్చయ్యేది. ఎకరం పొలం కలుపు తీసేందుకు రూ.3 వేలు ఖర్చయ్యేదని స్థానిక రైతులు తెలుపుతున్నారు. ఈ యంత్రం ద్వారా రూ.100తో ఎకరం పొలంలో కలుపు తీసుకునేందుకు వీలవుతోందని, దీనిపై ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే బాగుంటుందని రైతులు అంటున్నారు. తన వద్ద ఉన్న పాతపరికరాలతో కలుపుతీత యంత్రాన్ని తయారుచేశానని, ప్రభుత్వం ప్రోత్సహిస్తే రైతులకు ఉపయోగపడే వివిధ రకాల యంత్రాలను తయారుచేస్తానని ఆంజనేయులు (95427 74287) అంటున్నాడు.
– గడ్డం కాంతారావు, సాక్షి, చిన్నచింత కుంట, మహబూబ్‌నగర్‡
కలుపుతీత యంత్రం (ఇన్‌సెట్‌లో) ఆంజనేయులు
Comments
Please login to add a commentAdd a comment