రోబో తోటమాలి! | An AI robot is spotting sick tulips to slow the spread of disease through Dutch bulb fields | Sakshi
Sakshi News home page

రోబో తోటమాలి!

Published Wed, Mar 20 2024 4:22 AM | Last Updated on Wed, Mar 20 2024 4:22 AM

An AI robot is spotting sick tulips to slow the spread of disease through Dutch bulb fields - Sakshi

తెగుళ్లు సోకిన మొక్కల ఏరివేత

నెదర్లాండ్స్‌లో విస్తరిస్తున్న వాడకం 

తులిప్‌ తోటల్లో చీడ పీడలను గుర్తిస్తున్న ఏఐ రోబో 

కృత్రిమ మేధ ఇందుగలదు, అందులేదనే సందేహానికి తావులేకుండా విస్తరిస్తోంది. అన్ని రంగాల్లోనూ ఏఐ వాడకం ఇంతింతై... అన్నట్టుగా క్రమంగా పెరిగిపోతోంది. వ్యవసాయంలో కూడా ఇప్పటికే కృత్రిమ మేధను పలు రకాలుగా ఉపయోగిస్తున్నారు. నెదర్లాండ్స్‌లో తులిప్స్‌ రైతులు ఈ విషయంలో ఇంకో అడుగు ముందుకేశారు. తెగుళ్ల బారిన పడ్డ పూల ఏరివేతకు హైటెక్‌ బాట పట్టారు. వాటిని ఎప్పటికప్పుడు గుర్తించి ఏరేసేందుకు ఏఐ సాయంతో రూపొందిన రోబోను ఉపయోగిస్తున్నారు. ఖరీదు చాలా ఎక్కువే అయినా ఈ రోబో మనుషులకు ఏమాత్రంతీసిపోకుండా పని పూర్తి చేస్తూ మన్ననలు అందుకుంటోంది. దాంతో నెదర్లాండ్స్‌ అంతటా తులిప్‌ తోటల్లో ఈ రోబోల వాడకం నానాటికీ పెరిగిపోతోంది. 

అందాల తులిప్‌ పూలకు నెదర్లాండ్స్‌ పెట్టింది పేరు. అంతేగాక ప్రపంచంలోకెల్లా అతి పెద్ద తులిప్స్‌ ఉత్పత్తిదారు కూడా. సీజన్లో విరగబూసి అందాలు వెదజల్లే అక్కడి తులిప్‌ తోటలను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ పర్యాటకులు బారులు తీరతారు. ఇలా తులిప్స్‌ సాగు ఉత్పత్తిపరంగానే గాక పర్యాటకంగా కూడా నెదర్లాండ్స్‌ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. అయితే వాటి సాగు ఖరీదైన వ్యవహారం. పూలను, మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. చీడపీడల బారిన పడకుండా నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. వైరస్‌లు, తెగుళ్ల బారిన పడ్డ పూలు, మొక్కలను ఎప్పటికప్పుడు కనిపెట్టి ఏరివేయడం చాలా కీలకం.

లేదంటే మొక్కలు బలహీనపడిపోతాయి. పూలు కూడా చిన్నగా, బలహీనంగా పూస్తాయి. పైగా వైరస్‌ తోటంతా విస్తరించి మొత్తానికే చేటు తప్పదు. ఇప్పటిదాకా మనుషులే రాత్రింబవళ్లూ తోటల్లో కలియదిరుగుతూ ఒక్కో మొక్కనూ, పువ్వునూ పట్టి చూస్తూ పాడైన వాటిని గుర్తించి ఏరేసేవారు. ఇందుకు ప్రత్యేక నైపుణ్యం అవసరం. వారిని సిక్‌నెస్‌ స్పాటర్స్‌గా పిలిచేవారు. కానీ ఏఐ సాయంతో తయారు చేసిన రోబో ఇప్పుడు వారికి దీటుగా ఈ పని చేసి పెడుతోంది. తులిప్‌ తోటలను తెగుళ్ల బారినుంచి కాపాడే హైటెక్‌ ఆయుధంగా మారుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 45కు పైగా ఏఐ రోబోలు తులిప్‌ తోటలను కాపు కాస్తున్నాయి. చీడపీడలు, రోగాల బారినుంచి వాటిని కాపాడే పనిలో తలమునకలుగా ఉన్నాయి.  – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

ఇలా పని చేస్తుంది... 
► ఏఐ రోబో తులిప్‌ తోటల్లో ఒక్కో సాలు గుండా గంటకు కిలోమీటర్‌ వేగంతో నింపాదిగా కదులుతుంది. 
►ఒక్కో మొక్కనూ, ఒక్కో పూవునూ, దాని తాలూకు రెమ్మలను అణువణువూ పరీక్షిస్తుంది. ఫ్రంట్‌ కెమెరాతో వేలాది పొటోలు తీస్తుంది. 
​​​​​​​►తనలో స్టోరై ఉన్న సమాచారం సాయంతో ఆ ఫొటోలను కూలంకషంగా విశ్లేషిస్తుంది. తద్వారా సదరు మొక్క, పూవు పాడైందీ, బాగున్నదీ నిర్ణయిస్తుంది. 
​​​​​​​►పాడైనవాటిని ఎప్పటికప్పుడు ఏరేస్తూ ముందుకు సాగుతుంది. 
​​​​​​​►ఈ రోబోలను తయారు చేసింది హెచ్‌2ఎల్‌ రోబోటిక్స్‌ లిమిటెడ్‌కు చెందిన ఎరిక్‌ డీ జోంగ్‌ కంపెనీ.
​​​​​​​►తెగుళ్ల బారిన పడ్డ మొక్కలు, పూలను పక్కగా గుర్తించేందుకు కావాల్సిన సమాచారమంతటినీ రోబోకు ఫీడ్‌ చేసినట్టు కంపెనీ వివరించింది. 
​​​​​​​►ఈ సమాచారాన్ని తులిప్స్‌ సాగు చేసే రైతులు, సిక్‌నెస్‌ స్పాటర్ల నుంచి కంపెనీ సేకరించింది.

కచ్చితత్వంతో కూడిన సాగు... 
అలెన్‌ విసర్‌ అనే ఆసామి తన తులిప్‌ తోటలో రెండేళ్లుగా ఏఐ రోబోను వాడుతున్నాడు. ఆయన కుటుంబం మూడు తరాలుగా తులిప్స్‌సాగు చేస్తోంది. ‘‘ఈ రోబో ఖరీదు 2 లక్షల డాలర్లు! అంత డబ్బుతో ఓ ఖరీదైన స్పోర్ట్స్‌ కారే కొనుక్కోవచ్చు’’ అన్నాడాయన. అయితే, ‘స్పోర్ట్స్‌ కారు పాడైన తులిప్‌లను ఏరిపడేయదు కదా!’ అంటూ చమత్కరించాడు. ‘‘ఈ రోబో ఖరీదైనదే. కానీ నిపుణులైన సిక్‌నెస్‌ స్పాటర్లు నానాటికీ తగ్గిపోతున్న సమయంలో సరిగ్గా చేతికి అందివచ్చింది’’ అని చెప్పాడు. దీన్ని ‘కచ్చితత్వంతో కూడిన సాగు’గా అభివరి్ణంచాడు!

కొసమెరుపు
నెదర్లాండ్స్‌ ఉత్తర కోస్తా తీరంలో ప్రఖ్యాత డబ్ల్యూఏఎం పెన్సింగ్స్‌ తులిప్‌ తోటలోని ఏఐ రోబోకు అక్క డే జీవితాంతం సిక్‌నెస్‌ స్పాటర్‌గా పని చేసి రిటైరైన థియో వాన్‌డర్‌ వూర్ట్‌ పేరు పెట్టారు. దీని పనితీరు ఆయన్ను కూడా మెప్పించడం విశేషం. ‘‘తోటల్లో తిరిగీ మా నడుములు పడిపోయేవి! మా పనిని ఈ రోబో అలవోకగా చేసేస్తోంది. పాడైన మొ క్కలు, పూలను మాకు ఏ మాత్రమూ తీసిపోని విధంగా గుర్తించి ఏరేస్తోంది’’ అంటూ కితాబిచ్చాడాయన!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement