tulips
-
రోబో తోటమాలి!
కృత్రిమ మేధ ఇందుగలదు, అందులేదనే సందేహానికి తావులేకుండా విస్తరిస్తోంది. అన్ని రంగాల్లోనూ ఏఐ వాడకం ఇంతింతై... అన్నట్టుగా క్రమంగా పెరిగిపోతోంది. వ్యవసాయంలో కూడా ఇప్పటికే కృత్రిమ మేధను పలు రకాలుగా ఉపయోగిస్తున్నారు. నెదర్లాండ్స్‌లో తులిప్స్ రైతులు ఈ విషయంలో ఇంకో అడుగు ముందుకేశారు. తెగుళ్ల బారిన పడ్డ పూల ఏరివేతకు హైటెక్ బాట పట్టారు. వాటిని ఎప్పటికప్పుడు గుర్తించి ఏరేసేందుకు ఏఐ సాయంతో రూపొందిన రోబోను ఉపయోగిస్తున్నారు. ఖరీదు చాలా ఎక్కువే అయినా ఈ రోబో మనుషులకు ఏమాత్రంతీసిపోకుండా పని పూర్తి చేస్తూ మన్ననలు అందుకుంటోంది. దాంతో నెదర్లాండ్స్ అంతటా తులిప్ తోటల్లో ఈ రోబోల వాడకం నానాటికీ పెరిగిపోతోంది. అందాల తులిప్ పూలకు నెదర్లాండ్స్ పెట్టింది పేరు. అంతేగాక ప్రపంచంలోకెల్లా అతి పెద్ద తులిప్స్ ఉత్పత్తిదారు కూడా. సీజన్లో విరగబూసి అందాలు వెదజల్లే అక్కడి తులిప్ తోటలను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ పర్యాటకులు బారులు తీరతారు. ఇలా తులిప్స్ సాగు ఉత్పత్తిపరంగానే గాక పర్యాటకంగా కూడా నెదర్లాండ్స్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. అయితే వాటి సాగు ఖరీదైన వ్యవహారం. పూలను, మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. చీడపీడల బారిన పడకుండా నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. వైరస్లు, తెగుళ్ల బారిన పడ్డ పూలు, మొక్కలను ఎప్పటికప్పుడు కనిపెట్టి ఏరివేయడం చాలా కీలకం. లేదంటే మొక్కలు బలహీనపడిపోతాయి. పూలు కూడా చిన్నగా, బలహీనంగా పూస్తాయి. పైగా వైరస్ తోటంతా విస్తరించి మొత్తానికే చేటు తప్పదు. ఇప్పటిదాకా మనుషులే రాత్రింబవళ్లూ తోటల్లో కలియదిరుగుతూ ఒక్కో మొక్కనూ, పువ్వునూ పట్టి చూస్తూ పాడైన వాటిని గుర్తించి ఏరేసేవారు. ఇందుకు ప్రత్యేక నైపుణ్యం అవసరం. వారిని సిక్నెస్ స్పాటర్స్‌గా పిలిచేవారు. కానీ ఏఐ సాయంతో తయారు చేసిన రోబో ఇప్పుడు వారికి దీటుగా ఈ పని చేసి పెడుతోంది. తులిప్ తోటలను తెగుళ్ల బారినుంచి కాపాడే హైటెక్ ఆయుధంగా మారుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 45కు పైగా ఏఐ రోబోలు తులిప్ తోటలను కాపు కాస్తున్నాయి. చీడపీడలు, రోగాల బారినుంచి వాటిని కాపాడే పనిలో తలమునకలుగా ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ ఇలా పని చేస్తుంది... ► ఏఐ రోబో తులిప్ తోటల్లో ఒక్కో సాలు గుండా గంటకు కిలోమీటర్ వేగంతో నింపాదిగా కదులుతుంది. ►ఒక్కో మొక్కనూ, ఒక్కో పూవునూ, దాని తాలూకు రెమ్మలను అణువణువూ పరీక్షిస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వేలాది పొటోలు తీస్తుంది. ►తనలో స్టోరై ఉన్న సమాచారం సాయంతో ఆ ఫొటోలను కూలంకషంగా విశ్లేషిస్తుంది. తద్వారా సదరు మొక్క, పూవు పాడైందీ, బాగున్నదీ నిర్ణయిస్తుంది. ►పాడైనవాటిని ఎప్పటికప్పుడు ఏరేస్తూ ముందుకు సాగుతుంది. ►ఈ రోబోలను తయారు చేసింది హెచ్2ఎల్ రోబోటిక్స్ లిమిటెడ్‌కు చెందిన ఎరిక్ డీ జోంగ్ కంపెనీ. ►తెగుళ్ల బారిన పడ్డ మొక్కలు, పూలను పక్కగా గుర్తించేందుకు కావాల్సిన సమాచారమంతటినీ రోబోకు ఫీడ్ చేసినట్టు కంపెనీ వివరించింది. ►ఈ సమాచారాన్ని తులిప్స్ సాగు చేసే రైతులు, సిక్నెస్ స్పాటర్ల నుంచి కంపెనీ సేకరించింది. కచ్చితత్వంతో కూడిన సాగు... అలెన్ విసర్ అనే ఆసామి తన తులిప్ తోటలో రెండేళ్లుగా ఏఐ రోబోను వాడుతున్నాడు. ఆయన కుటుంబం మూడు తరాలుగా తులిప్స్సాగు చేస్తోంది. ‘‘ఈ రోబో ఖరీదు 2 లక్షల డాలర్లు! అంత డబ్బుతో ఓ ఖరీదైన స్పోర్ట్స్ కారే కొనుక్కోవచ్చు’’ అన్నాడాయన. అయితే, ‘స్పోర్ట్స్ కారు పాడైన తులిప్‌లను ఏరిపడేయదు కదా!’ అంటూ చమత్కరించాడు. ‘‘ఈ రోబో ఖరీదైనదే. కానీ నిపుణులైన సిక్నెస్ స్పాటర్లు నానాటికీ తగ్గిపోతున్న సమయంలో సరిగ్గా చేతికి అందివచ్చింది’’ అని చెప్పాడు. దీన్ని ‘కచ్చితత్వంతో కూడిన సాగు’గా అభివరి్ణంచాడు! కొసమెరుపు నెదర్లాండ్స్ ఉత్తర కోస్తా తీరంలో ప్రఖ్యాత డబ్ల్యూఏఎం పెన్సింగ్స్ తులిప్ తోటలోని ఏఐ రోబోకు అక్క డే జీవితాంతం సిక్నెస్ స్పాటర్‌గా పని చేసి రిటైరైన థియో వాన్‌డర్ వూర్ట్ పేరు పెట్టారు. దీని పనితీరు ఆయన్ను కూడా మెప్పించడం విశేషం. ‘‘తోటల్లో తిరిగీ మా నడుములు పడిపోయేవి! మా పనిని ఈ రోబో అలవోకగా చేసేస్తోంది. పాడైన మొ క్కలు, పూలను మాకు ఏ మాత్రమూ తీసిపోని విధంగా గుర్తించి ఏరేస్తోంది’’ అంటూ కితాబిచ్చాడాయన! -
తిరుమల గిరుల్లో తులిప్ విరులు
తులిప్స్.. ఎన్నెన్నో రంగుల్లో మనసుల్ని ఇట్టే కట్టిపడేస్తాయి. మగువలు సిగలో అలంకరించుకునేందుకు ఉపయోగపడకపోయినా.. వేడుకల అలంకరణలో మాత్రం రాజసాన్ని చాటుతాయి. నింగీనేలా చుంబించే లాలిలో ఓలలాడించే ఈ పుష్ప రాజాలు కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాల్లో మాత్రమే ప్రస్తుతం సాగులో ఉన్నాయి. కళ్లు తిప్పుకోనివ్వని అందాలతో ఆహ్లాదాన్నిపంచే ఈ పుష్పాలు ఉద్యాన శాస్త్రవేత్తల పుణ్యమా అని ఇప్పుడు తిరుమల గిరులపైనా విరబూస్తున్నాయి. సాక్షి, అమరావతి: అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న తులిప్ పూలను ఏపీలోనూ సాగు చేయించాలన్న తలంపుతో వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని సిట్రస్ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఫలించాయి. వీటి సాగుకు తిరుమల గిరుల్లోనూ అనువైన వాతావరణం ఉన్నట్టు గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా చేపట్టిన సాగు సత్ఫలితాలనివ్వడంతో భవిష్యత్‌లో మరిన్ని రకాల సాగుకు సన్నాహాలు చేస్తున్నారు. శీతల పరిస్థితులు గల ఎత్తైన కొండ ప్రాంతాల్లో మాత్రమే సాగయ్యే ఈ పూల మొక్కలు జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన తులిప్స్ రానున్న రోజుల్లో కలియుగ దైవం కొలువైన ఏడుకొండలపైనా ఇకపై కనువిందు చేయనున్నాయి. తులిప్స్ పూలకు ప్రత్యేకతలెన్నో..: లిలియాసీ (లిల్లీ) పూల జాతికి చెందిన ఈ పుష్పాలు ప్రపంచంలోనే టాప్–10 కట్ ఫ్లవర్స్‌లో ఒకటిగా ఖ్యాతి చెందాయి. తులిప్‌లో దాదాపు వందకు పైగా రకాలు ఉన్నాయి. వీటిని దుంపల ద్వారా సాగు చేస్తారు. తల్లి దుంపల(బల్బ్సŠ)ను నెదర్లాండ్స్ నుంచి దిగుమతి చేసుకుంటారు. తల్లి దుంపల్ని 2 డిగ్రీల ఉష్ణోగ్రతలో 3 నెలలపాటు ఫ్రీజ్ చేస్తారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో వీటిని నాటుకుంటారు. దుంపకు దుంపకు మధ్యలో 8–10 సెం.మీ. దూరంలో దుంప సైజును బట్టి 5–8 సెం.మీ. లోతులో నాటుకోవాలి. మొక్కల మధ్య 15 సెం.మీ., వరుసల మధ్య 10 సెం.మీ. దూరం ఉండేలా చూస్తారు. 20 చదరపు అడుగులకు 100 దుంపల చొప్పున ఎకరాకు 45 వేల దుంపల వరకు నాటుకోవచ్చు. ఏడాది పాటు భూమిలోనే ఉంచితే పిల్ల దుంపలు పుట్టుకొస్తాయి. వాటిని సేకరించి మరుసటి ఏడాది నాటుకోవచ్చు. పుషి్పంచే కాలంలో నీరు పెట్టాల్సిన అవసరం లేదు. నాటిన 45–60 రోజుల్లో పుషి్పస్తాయి. పుష్పించే సమయంలో రాత్రి పూట 5–12 డిగ్రీలు, పగటి పూట 20–26 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండాలి. 10 రోజుల పాటు తాజాగా..: రెండాకులు ఉండేలా పూలను కత్తిరించి, వాటి తాజాదనం కోల్పోకుండా ప్యాకింగ్ చేసి ఎగుమతి చేస్తారు. మొక్కకు ఒక పువ్వు మాత్రమే పూస్తుంది. కత్తిరించిన తర్వాత కనీసం 5–10 రోజుల వరకు తాజాదనం కోల్పోకుండా ఉంటాయి. పూలు కోసిన తరువాత 10 రోజుల్లో మొక్క ఎండిపోతుంది. ఎండిన మొక్కను తొలగించి భూగర్భంలో ఉన్న దుంప బయటకు తీసి మళ్లీ ఫ్రీజ్ చేయాలి. మరుసటి ఏడాది సీజన్ ప్రారంభమైన తర్వాత మళ్లీ నాటుకోవాలి. ఎత్తైన మడుల్లో డ్రిప్ ఇరిగేషన్ సాయంతో కూడా వీటిని సాగు చేసుకోవచ్చు. వసంతకాలంలో 3–7 రోజుల పాటు వికసించే ఈ పూలు దాదాపు అన్ని రంగుల్లోనూ కనువిందు చేస్తాయి. మెజార్టీ రకాల పూలు ఒకే విధమైన ఆకృతిలో ఉంటాయి. అత్యంత ఖరీదైన ఈ పూల రెమ్మలను తింటారు. కొన్ని వంటకాల్లో ఉల్లికి బదులు వీటి రెబ్బలనే వాడుతుంటారు. మార్కెట్లో ఒక్కో పువ్వు రూ.50 నుంచి రూ.75 వరకు ధర పలుకుతుంది. ఫలించిన పరిశోధన తిరుపతిలోని మైదాన ప్రాంతాలతోపాటు సముద్ర మట్టానికి 980 మీటర్ల ఎత్తులో ఉన్న తిరుమల కొండ ప్రాంతాల్లో ప్రత్యేక నర్సరీ నెలకొల్పి వీటి సాగుపై అధ్యయనం చేశారు. ఏడీ రెమ్, డెన్మార్క్, డౌ జోన్స్, రాజవంశం, ఎస్కేప్, గోల్డెన్ పరేడ్, పింక్ ఆర్డోర్, పురిస్సిమా, పర్పుల్ ఫ్లాగ్ సూపర్ మోడల్ రకాలకు చెందిన తులిప్ దుంపలను డిసెంబర్ 2023లో ఎంపిక చేసిన రెండు ప్రాంతాల్లో నాటారు. రెండుచోట్ల మొలకెత్తినట్టు గమనించినప్పటికీ తిరుమలలో మాత్రం నాటిన ప్రతి దుంప మొలకెత్తింది. డెన్మార్క్ రకం 10–12 రోజుల్లో పూర్తిగా పూలు విచ్చుకోవడాన్ని గుర్తించారు. తిరుమలలో తులిప్ పార్క్ అత్యంత శీతల ప్రాంతంలో సాగయ్యే ఈ పూల సాగుపై మేం చేసిన పరిశోధనలు ఫలించాయి. శ్రీనగర్ తరహాలోనే తులిప్ గార్డెన్స్ పెంచేందుకు తిరుమల గిరులు కూడా అనుకూలమని గుర్తించాం. భవిష్యత్‌లో టీటీడీ సౌజన్యంతో వీటి సాగు దిశగా సన్నాహాలు చేయబోతున్నాం. గుర్రం కొండతోపాటు ఇతర ఎత్తైన ప్రాంతాల్లో వీటి సాగును విస్తరించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు గల అవకాశాలపై కూడా పరిశోధన చేస్తున్నాం. – ఆర్.నాగరాజు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఉద్యాన పరిశోధనా కేంద్రం, తిరుపతి -
ఆసియాలోనే అతిపెద్ద ఉద్యానవనంగా ఆ గార్డెన్!
తులిప్ గార్డెన్ చూడగానే ఎవ్వరైన మంత్రముగ్ధులవ్వాల్సిందే. అంతలా అందంగా ఉంటాయి ఆ పూల మొక్కలు. చూడగానే కట్టిపడేసే అందంతో పాటు ఆహ్లాదాన్నీ పంచే తులిప్ పుష్పాల గురించి వర్ణించడం కష్టతరం. తలలో పెట్టుకునేందుకు ఇవి ఉపయోగపడకపోయినా.. గృహాలంకరణలో మాత్రం రాజసాన్ని ఉట్టిపడేలా చేస్తాయి. అలాంటి తులిప్ గార్డెన్ ఆసియాలోనే అతిపెద్ద ఉద్యానవనంగా రికార్డులకెక్కింది. ఇది శ్రీనగర్‌లోని ఇందిరాగాంధీ మొమోరియల్ ఉంది. ఏకంగా 1.5 మిలియన్ల పూలతో ఈ రికార్డును కైవసం చేసుకుంది. ఈ ఉద్యానవనంలో 68 విభిన్న రకాల మొక్కల నుంచి సుమారు 1.5 మిలయన్ల పైగా తులిప్ పుష్పాలు ఉంటాయి. ఈ విషయం గురించి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి గతంలో ట్విట్టర్లో పేర్కొన్నారు కూడా. ఆయన ఈ సుందర వనాన్ని దాదాపు లక్షమంది దాక సందర్శించి ఉండొచ్చన్నారు. అలాంటి అందమైన తులిప్ గార్డెన్ ఆసియాలో అతిపెద్దది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుంది. తులిప్ అంటే లాటిన్ భాషలో తలపాగా అని అర్థం. ఇవి లిల్లీ జాతికి చెందినవి. తులిప్‌లో దాదాపు 150 జాతులకు చెందిన 3వేల వెరైటీలు ఉన్నాయి. ఈ మొక్కలను మనం వెంకటేష్ టబు నటించిన కూలీ నెం.1 సినిమాలో చూశాం. అందులో "కొత్తకొత్తగా ఉన్నది..స్వర్గమిక్కడే అన్నది" అనే పాటలోఒ ఈ గార్గెన్ని కనిపిస్తుంది. చాలాచాలా బాలీవుడ్ సినిమాల్లో కూడా ఉండొచ్చు గానీ. మనీకు తెలిసినంతవరకు ఆ తులిప్ పూలను చూస్తే మనకు మాత్రం నిస్సందేహంగా ఆ పాట గుర్తుకొస్తుంది. నిజంగా ఆ పూలను చూసే అలా పాట రాశారేమో కాబోలు. ఇక ఈ తులిప్ తోట శ్రీనగర్‌లోని దాల్ సరస్సు జబర్వాన్ కొండల మధ్య ఉంది. ఈ ఉద్యానవనం సుమారు 30 హెక్టార్లలో విస్తరించి ఉంది. గతంలో దీని సిరాజ్ బాగ్ అనిపిలిచే వారు. శ్రీనగర్ టూరిజం ప్రకారం ఈ ఉద్యానవనం 2007లో పూల పెంపకంతో పర్యాటకాన్ని పెంచే లక్ష్యంతో ప్రారంభించబడింది. ఈ కాశ్మీర్ లోయలో ఏడు టెర్రస్లతో కూడిన టెర్రస్ పద్ధతిలో నేలపై ఏటవాలుగా ఈ గార్డెన్‌ని ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఆ గార్డెన్‌లోని వివిధ రకాల పూలతో తులిప్ పండుగను ఏటా ఘనంగా నిర్వహిస్తోంది. ప్రతి వసంత రుతువులో ఈ ఫెస్టివల్‌ని నిర్వహించడం విశేషం. (చదవండి: అతిపెద్ద పిల్లి..అచ్చం మనిషిలా..) -
శ్రీనగర్ : తులిప్ గార్డెన్ ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
హిమాలయాల చెంత టులిప్ తోట అందాలు!
అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది.. అంటూ హీరోహీరోయిన్లు డ్యూయెట్లు పాడుకోవడానికి ఇకపై మున్సియారీకి రావొచ్చు అంటున్నారు స్థానికులు. అందమైన రంగు రంగుల టులిప్ తోటల్లో హాయిగా విహరించవచ్చని పర్యాటకులను కూడా ఆహ్వానిస్తున్నారు. అల్లంత దూరాన.. హిమాలయాల్లోని పంచాచౌలి శ్రేణి అందాలు కనువిందు చేస్తుండగా.. పూల సువాసనలు ఆస్వాదించే అద్భుత అవకాశం సొంతం చేసుకోవాలని ఊరిస్తున్నారు. ఇంతకీ విషయమేమిటంటే... పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం మున్సియారీ ప్రాంతంలో టులిప్ తోటల పెంపకాన్ని చేపట్టింది. పైలట్ ప్రాజెక్టుగా ఎరుపు, పసుపు, గులాబీ రంగు పూలనిచ్చే మొక్కల్ని అటవీ శాఖ అక్కడ నాటింది. ప్రపంచంలోని అతిపెద్ద టులిప్ తోటల్లో ఒకటిగా పేరుగాంచిన మున్సియారీ తోట ప్రస్తుతం విరబూసింది. (కనువిందు చేస్తున్న ఫ్లెమింగోలు..) ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ట్విటర్లో షేర్ చేశారు. తన కలల ప్రాజెక్టు విజయవంతమైందని.. ఈ విషయాన్ని ప్రజలతో పంచుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు. పంచాచౌలి శ్రేణుల సమీపంలో మున్సియారీలో పెంచిన టులిప్ తోట ప్రపంచంలోని అతిపెద్ద టులిప్ తోటల్లో ఒకటని... దీని ద్వారా మున్సియారీ ప్రాంతంలో పర్యాటకం బాగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఇక సీఎం షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వేల సంఖ్యలో ఆయన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. టులిప్ తోట అందాలు తమను అమితంగా ఆకట్టుకుంటున్నాయని.. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలంటూ కామెంట్లు చేస్తున్నారు. విదేశీ సొగసులను తలదన్నే అందంతో మైమరపింపజేస్తున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా మున్సియారీ వెళ్లాలనుకుంటున్నారా.. అయితే కరోనా పూర్తిగా కట్టడై లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాతే ట్రిప్‌ను ప్లాన్ చేసుకోండి!(ఇళ్ల ముందు నుంచే కనిపిస్తున్న మంచుకొండలు) I am happy to share the first pics of the successful pilot of my dream project- Munsiyari based Tulip Garden. Set amidst the backdrop of Panchachuli ranges, this garden will be one of the biggest tulip gardens in the world & will transform tourism in Munsiyari region. pic.twitter.com/eCUfnMYilt — Trivendra Singh Rawat (@tsrawatbjp) May 9, 2020 -
తళుక్కుమన్న తులిప్
సాక్షి, సిటీబ్యూరో: తులిప్ పుష్పాలు తళుక్కుమన్నాయి. వైవిధ్యభరితమైన రూపాల్లో కనువిందు చేశాయి. జూబ్లీహిల్స్‌లోని పార్క్‌వ్యూ ఎన్‌క్లేవ్‌లో నిర్వహించిన తులిప్ పుష్పాల పండగ అదరహో అనిపించింది. నగరానికి చెందిన ఫ్లోరల్ బొటిక్ చాంప్స్ ఫ్లవర్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన తులిప్ పుష్పాల పండగ చూపరులకు ఆహ్లాదకర అనుభూతిని అందించింది. ఈ సందర్భంగా నిర్వాహకురాలు చిత్రాదాస్ లగడపాటి మాట్లాడుతూ.. నగరంలో తొలిసారిగా 10 వేల తులిప్ పూల పండగను ఏర్పాటు చేయడం సంతోషాన్ని అందించిందన్నారు. ఈ పూలు ఉద్యానాలతో పాటు ఇంటికీ అందాన్ని పెంచుతాయంటూ.. వాటి గురించిన విశేషాలను సందర్శకులకు వివరించారు. ఫ్లవర్ ఫెస్ట్‌ని సందర్శించిన వారిలో ప్రముఖ సినీనటి నిహారిక, సిటీ సోషలైట్స్ పద్మా రాజగోపాల్, పద్మజారెడ్డి, మంజులారెడ్డి, జ్యోత్స్న, కామిని షరాఫ్ తదితరులు ఉన్నారు. -
తులిప్ అందాలతో స్వర్గంగా మారిన కశ్మీర్
-
లోడెంతైనా ఒకవైపే చార్జీ..!
⇔ లాజిస్టిక్స్ రంగానికి టెక్నాలజీని జోడించిన తులిప్ ⇔ బీ2బీ మార్కెట్లో కస్టమర్లుగా 80కి పైగా కంపెనీలు ⇔ 4 లక్షల వాహనాలు నమోదు; నెలకు రూ.2 కోట్ల వ్యాపారం ⇔ 2 నెలల్లో రూ.150 కోట్ల నిధుల సమీకరణ పూర్తి ⇔ సాక్షి ‘స్టార్టప్ డైరీ’తో సంస్థ ఫౌండర్ నివాస్. కె హైదరాబాద్, బిజినెస్ బ్యూరో దేశంలోని లాజిస్టిక్స్ రంగంలో ప్రధాన సమస్యేంటో తెలుసా? రెండు వైపులా చార్జీని కస్టమరే భరించడం! అలా కాకుండా ఒక వైపు చార్జీలే చెల్లించే విధానముంటే బావుంటుంది కదూ!!. అదనపు ట్రిప్పులతో ట్రక్ డ్రైవర్‌కు, ఒకవైపు చార్జీతో లోడ్ ఓనర్‌కూ ఇద్దరికీ లాభం చేకూరుతుంది. ఇదిగో ఇలాంటి వ్యాపార విధానంతోనే పనిచేస్తోంది హైదరాబాద్‌కు చెందిన తులిప్ లాజిస్టిక్స్.కామ్. ఓలా, ఉబర్లు కారు డ్రైవర్‌ను, కస్టమర్‌ను ఎలాగైతే కలుపుతాయో.. తులిప్ కూడా అదే రీతిలో ట్రక్కుల్ని, కస్టమర్లను కలుపుతుంది. తులిప్ సేవలు, విస్తరణ ప్రణాళికల వివరాలను సంస్థ వ్యవస్థాపక సీఈఓ నివాస్ కె ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ఆయనేమన్నారంటే... మాకు యూఎస్ఎం గ్రూప్ కింద మైనింగ్, సాఫ్ట్వేర్, ఇన్ఫ్రా కంపెనీలున్నాయి. మైనింగ్ విభాగంలో ట్రాన్స్పోర్ట్ ఎప్పుడూ ఇబ్బందే. వాహనం ఎప్పుడొస్తుందో తెలియదు. అసలెక్కడుందో తెలియదు. ఏజెంట్లు, బ్రోకర్లపై ఆధారపడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అప్పుడే అనిపించింది..!! టెక్నాలజీలోనూ సేవలందిస్తున్న మనమే ఎందుకూ ట్రాన్స్పోర్ట్ విభాగాన్ని జోడించకూడదు అని? రూ.20 లక్షల పెట్టుబడితో 2014లో హైదరాబాద్ కేంద్రంగా తులిప్ లాజిస్టిక్స్ ప్రారంభించటానికి ఆ ఆలోచనే కారణం. బీ2సీ నుంచి బీ2బీ మార్కెట్లోకి.. మొదట్లో బీ2సీ మార్కెట్లో పిపీప్ లాజిస్టిక్స్‌ను ప్రారంభించాం. ఇది అగ్రిగేట్ మోడల్. వాహన డ్రైవర్లు తమ వాహనాలను పిపీప్లో నమోదు చేసుకోవాలి. కావాల్సిన కస్టమర్లతో వారిని పిపీప్ కలుపుతుంది. 800 కి.మీ. వరకు రూ.400, 1,200 కి.మీ వరకైతే రూ.800, ఆపైన ఎన్ని కి.మీ. అయినా రూ.1,000 చార్జీ వసూలు చేస్తాం. కానీ ఈ విధానంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. వాహనంలోని సరుకుకు బాధ్యత ఎవరిదని చాలా మంది కస్టమర్లు అడిగారు. దీంతో టెక్నాలజీని అభివృద్ధి చేసి తులిప్ లాజిస్టిక్స్ పేరిట బీ2బీ మార్కెట్లోకి వచ్చాం. సాంకేతికత, వేగం, కచ్చితత్వం.. ఈ మూడే తులిప్ స్పెషాలిటీ. ఇందులో కాంట్రాక్ట్ పద్ధతిలో కంపెనీలతో భాగస్వామ్యమవుతాం. ట్రక్ డ్రైవర్‌కు చార్జీ తులిపే చెల్లిస్తుంది. ఆ తర్వాత కస్టమర్ నుంచి తులిప్ వసూలు చేసుకుంటుంది. ఈ విధానంలో సరుకు బాధ్యత తులిప్దే. 2 టన్నుల నుంచి మొదలు... తులిప్ లాజిస్టిక్స్.కామ్‌లో ట్రక్ల సామర్థ్యం 2 టన్నుల నుంచి మొదలవుతుంది. ప్రస్తుతం తులిప్‌లో 50 వేల మంది ఏజెంట్లు, వాహన ఓనర్లు రిజిస్టరయ్యారు. 4 లక్షలకు పైగా వాహనాలు నమోదై ఉన్నాయి. ఇందులో టాటా ఏస్ నుంచి 20 చక్రాల భారీ వాహనాల వరకూ ఉన్నాయి. మాంసాహార ఉత్పత్తులు, పాలు, పండ్ల వంటి ఉత్పత్తుల సరఫరా కోసం ప్రత్యేకంగా ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసే వాహనాలూ ఉన్నాయి. జీపీఎస్ సాంకేతిక విధానంతో ట్రక్ ఎక్కడుంది? ఎంత సమయంలో చేరుతుందనే విషయాలను ఎప్పటికప్పుడు లోడ్, ట్రక్ ఓనర్లకు ఎస్ఎంఎస్ రూపంలో తెలియజేస్తుంటాం కూడా. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి లోడ్‌తో వచ్చే వాహనాల తనీఖీ సమయాన్ని తగ్గించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి వాహనానికి తులిప్ లాజిస్టిక్స్.కామ్ సర్టిఫికెట్‌ను ఇస్తాం. ఇందులో వాహనానం, లోడ్‌కు సంబంధించిన పూర్తి వివరాలుంటాయి. దీంతో తనిఖీ అధికారుల పని సులువవ్వటమే కాకుండా ట్రక్ కూడా త్వరగా గమ్యాన్ని చేరుకుంటుంది. గతేడాది రూ.10 కోట్ల టర్నోవర్.. కోకకోలా, జేకే సీడ్స్, భారతి సిమెంట్స్, భవ్య సిమెంట్స్, హల్దీరామ్స్, ఇమామి, కేఎల్ఆర్, పార్లే బిస్కెట్స్, బేక్మేట్ వంటి ప్రముఖ కంపెనీలు మా సేవలను వినియోగించుకున్నాయి. ట్రక్కును బట్టి చార్జీ ఉంటుంది. ప్రారంభ ధర రూ.10–20 వేల మధ్య ఉంటుంది. ఆర్డర్ బుకింగ్ అయినప్పుటి నుంచి సరుకు గమ్య స్థానాన్ని చేరే వరకూ బాధ్యత తులిప్దే. ప్రస్తుతం రోజుకు 30 ట్రక్కులు బుక్ అవుతున్నాయి. ఎక్కువగా హైదరాబాద్–బెంగళూరు, విశాఖపట్నం పోర్ట్–బెంగళూరు, ఆంధ్రప్రదేశ్–లక్నో, పాట్నా మార్గాలుంటున్నాయి. నెలకు రూ.1.5–2 కోట్ల వ్యాపారాన్ని చేస్తున్నాం. గతేడాది రూ.10 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నాం. ఈ ఏడాది రెండింతల వృద్ధిని చేరాం. రూ.150 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం మా సంస్థలో 50 మంది ఉద్యోగులున్నారు. విస్తరణ కోసం తొలిసారిగా నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించాం. రూ.150–200 కోట్ల వీసీ ఫండ్ కోసం చూస్తున్నాం. హైదరాబాద్, బెంగళూరుకు చెందిన పలువురు వీసీ ఇన్వెస్టర్లతో ప్రాథమిక చర్చలు నడుస్తున్నాయి. మరో 2 నెలల్లో డీల్‌ను క్లోజ్ చేస్తాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...