తిరుమల గిరుల్లో తులిప్ విరులు | Tulip Park in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమల గిరుల్లో తులిప్ విరులు

Published Mon, Feb 12 2024 4:48 AM | Last Updated on Mon, Feb 12 2024 4:25 PM

Tulip Park in Tirumala - Sakshi

తులిప్స్‌.. ఎన్నెన్నో రంగుల్లో మనసుల్ని ఇట్టే కట్టిపడేస్తాయి. మగువలు సిగలో అలంకరించుకునేందుకు ఉపయోగపడకపోయినా.. వేడుకల అలంకరణలో మాత్రం రాజసాన్ని చాటుతాయి.

నింగీనేలా చుంబించే లాలిలో ఓలలాడించే ఈ పుష్ప రాజాలు కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ కొండ ప్రాంతాల్లో మాత్రమే ప్రస్తుతం సాగులో ఉన్నాయి. కళ్లు తిప్పుకోనివ్వని అందాలతో ఆహ్లాదాన్నిపంచే ఈ పుష్పాలు ఉద్యాన శాస్త్రవేత్తల పుణ్యమా అని ఇప్పుడు తిరుమల గిరులపైనా విరబూస్తున్నాయి. 

సాక్షి, అమరావతి: అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్న తులిప్‌ పూలను ఏపీలోనూ సాగు చేయించాలన్న తలంపుతో వైఎస్సార్‌ ఉద్యాన యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని సిట్రస్‌ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఫలించాయి. వీటి సాగుకు తిరుమల గిరుల్లోనూ అనువైన వాతావరణం ఉన్నట్టు గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా చేపట్టిన సాగు సత్ఫలితాలనివ్వడంతో భవిష్యత్‌లో మరిన్ని రకాల సాగుకు సన్నాహాలు చేస్తున్నారు.

శీతల పరిస్థితులు గల ఎత్తైన కొండ ప్రాంతాల్లో మాత్రమే సాగయ్యే ఈ పూల మొక్కలు జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన తులిప్స్‌ రానున్న రోజుల్లో కలియుగ దైవం కొలువైన ఏడుకొండలపైనా ఇకపై కనువిందు చేయనున్నాయి. 

తులిప్స్‌ పూలకు ప్రత్యేకతలెన్నో..: లిలియాసీ (లిల్లీ) పూల జాతికి చెందిన ఈ పుష్పాలు ప్రపంచంలోనే టాప్‌–10 కట్‌ ఫ్లవర్స్‌లో ఒకటిగా ఖ్యాతి చెందాయి. తులిప్‌లో దాదాపు వందకు పైగా రకాలు ఉన్నాయి. వీటిని దుంపల ద్వారా సాగు చేస్తారు. తల్లి దుంపల(బల్బ్సŠ)ను నెదర్లాండ్స్‌ నుంచి దిగుమతి చేసుకుంటారు. తల్లి దుంపల్ని 2 డిగ్రీల ఉష్ణోగ్రతలో 3 నెలలపాటు ఫ్రీజ్‌ చేస్తారు.

అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌ నెలల్లో వీటిని నాటుకుంటారు. దుంపకు దుంపకు మధ్యలో 8–10 సెం.మీ. దూరంలో దుంప సైజును బట్టి 5–8 సెం.మీ. లోతులో నాటుకోవాలి. మొక్కల మధ్య 15 సెం.మీ., వరుసల మధ్య 10 సెం.మీ. దూరం ఉండేలా చూస్తారు. 20 చదరపు అడుగులకు 100 దుంపల చొప్పున ఎకరాకు 45 వేల దుంపల వరకు నాటుకోవచ్చు.

ఏడాది పాటు భూమిలోనే ఉంచితే పిల్ల దుంపలు పుట్టుకొస్తాయి. వాటిని సేకరించి మరుసటి ఏడాది నాటుకోవచ్చు. పుషి్పంచే కాలంలో నీరు పెట్టాల్సిన అవసరం లేదు. నాటిన 45–60 రోజుల్లో పుషి్పస్తాయి. పుష్పించే సమయంలో రాత్రి పూట 5–12 డిగ్రీలు, పగటి పూట 20–26 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండాలి. 

10 రోజుల పాటు తాజాగా..: రెండాకులు ఉండేలా పూలను కత్తిరించి, వాటి తాజాదనం కోల్పోకుండా ప్యాకింగ్‌ చేసి ఎగుమతి చేస్తారు. మొక్కకు ఒక పువ్వు మాత్రమే పూస్తుంది. కత్తిరించిన తర్వాత కనీసం 5–10 రోజుల వరకు తాజాదనం కోల్పోకుండా ఉంటాయి. పూలు కోసిన తరువాత 10 రోజుల్లో మొక్క ఎండిపోతుంది. ఎండిన మొక్కను తొలగించి భూగర్భంలో ఉన్న దుంప బయటకు తీసి మళ్లీ ఫ్రీజ్‌ చేయాలి. మరుసటి ఏడాది సీజన్‌ ప్రారంభమైన తర్వాత మళ్లీ నాటుకోవాలి.

ఎత్తైన మడుల్లో డ్రిప్‌ ఇరిగేషన్‌ సాయంతో కూడా వీటిని సాగు చేసుకోవచ్చు. వసంతకాలంలో 3–7 రోజుల పాటు వికసించే ఈ పూలు దాదాపు అన్ని రంగుల్లోనూ కనువిందు చేస్తాయి. మెజార్టీ రకాల పూలు ఒకే విధమైన ఆకృతిలో ఉంటాయి. అత్యంత ఖరీదైన ఈ పూల రెమ్మలను తింటారు. కొన్ని వంటకాల్లో ఉల్లికి బదులు వీటి రెబ్బలనే వాడుతుంటారు. మార్కెట్‌లో ఒక్కో పువ్వు రూ.50 నుంచి రూ.75 వరకు ధర పలుకుతుంది. 

ఫలించిన పరిశోధన 
తిరుపతిలోని మైదాన ప్రాంతాలతోపాటు సముద్ర మట్టానికి 980 మీటర్ల ఎత్తులో ఉన్న తిరుమల కొండ ప్రాంతాల్లో ప్రత్యేక నర్సరీ నెలకొల్పి వీటి సాగుపై అధ్యయనం చేశారు. ఏడీ రెమ్, డెన్మార్క్, డౌ జోన్స్, రాజవంశం, ఎస్కేప్, గోల్డెన్‌ పరేడ్, పింక్‌ ఆర్డోర్, పురిస్సిమా, పర్పుల్‌ ఫ్లాగ్‌ సూపర్‌ మోడల్‌ రకాలకు చెందిన తులిప్‌ దుంపలను డిసెంబర్‌ 2023లో ఎంపిక చేసిన రెండు ప్రాంతాల్లో నాటారు. రెండుచోట్ల మొలకెత్తినట్టు గమనించినప్పటికీ తిరుమలలో మాత్రం నాటిన ప్రతి దుంప మొలకెత్తింది. డెన్మార్క్‌ రకం 10–12 రోజుల్లో పూర్తిగా పూలు విచ్చుకోవడాన్ని గుర్తించారు.  

తిరుమలలో తులిప్‌ పార్క్‌ 
అత్యంత శీతల ప్రాంతంలో సాగయ్యే ఈ పూల సాగుపై మేం చేసిన పరిశోధనలు ఫలించాయి. శ్రీనగర్‌ తరహాలోనే  తులిప్‌ గార్డెన్స్‌ పెంచేందుకు తిరుమల గిరులు కూడా అనుకూలమని గుర్తించాం.

భవిష్యత్‌లో టీటీడీ సౌజన్యంతో వీటి సాగు దిశగా సన్నాహాలు చేయబోతున్నాం. గుర్రం కొండతోపాటు ఇతర ఎత్తైన ప్రాంతాల్లో వీటి సాగును విస్తరించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు గల అవకాశాలపై కూడా పరిశోధన చేస్తున్నాం.  – ఆర్‌.నాగరాజు, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్, ఉద్యాన పరిశోధనా కేంద్రం, తిరుపతి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement