లోడెంతైనా ఒకవైపే చార్జీ..! | tulip starts logistics startup company | Sakshi
Sakshi News home page

లోడెంతైనా ఒకవైపే చార్జీ..!

Published Sat, Apr 1 2017 12:54 AM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM

లోడెంతైనా ఒకవైపే చార్జీ..!

లోడెంతైనా ఒకవైపే చార్జీ..!

లాజిస్టిక్స్‌ రంగానికి టెక్నాలజీని జోడించిన తులిప్‌
బీ2బీ మార్కెట్లో కస్టమర్లుగా 80కి పైగా కంపెనీలు
4 లక్షల వాహనాలు నమోదు; నెలకు రూ.2 కోట్ల వ్యాపారం
2 నెలల్లో రూ.150 కోట్ల నిధుల సమీకరణ పూర్తి
సాక్షి ‘స్టార్టప్‌ డైరీ’తో సంస్థ ఫౌండర్‌ నివాస్‌. కె
 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో
దేశంలోని లాజిస్టిక్స్‌ రంగంలో ప్రధాన సమస్యేంటో తెలుసా? రెండు వైపులా చార్జీని కస్టమరే భరించడం! అలా కాకుండా ఒక వైపు చార్జీలే చెల్లించే విధానముంటే బావుంటుంది కదూ!!. అదనపు ట్రిప్పులతో ట్రక్‌ డ్రైవర్‌కు, ఒకవైపు చార్జీతో లోడ్‌ ఓనర్‌కూ ఇద్దరికీ లాభం చేకూరుతుంది. ఇదిగో ఇలాంటి వ్యాపార విధానంతోనే పనిచేస్తోంది హైదరాబాద్‌కు చెందిన తులిప్‌ లాజిస్టిక్స్‌.కామ్‌. ఓలా, ఉబర్‌లు కారు డ్రైవర్‌ను, కస్టమర్‌ను ఎలాగైతే కలుపుతాయో.. తులిప్‌ కూడా అదే రీతిలో ట్రక్కుల్ని, కస్టమర్లను కలుపుతుంది. తులిప్‌ సేవలు, విస్తరణ ప్రణాళికల వివరాలను సంస్థ వ్యవస్థాపక సీఈఓ నివాస్‌ కె ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు.

ఆయనేమన్నారంటే...
మాకు యూఎస్‌ఎం గ్రూప్‌ కింద మైనింగ్, సాఫ్ట్‌వేర్, ఇన్‌ఫ్రా కంపెనీలున్నాయి. మైనింగ్‌ విభాగంలో ట్రాన్స్‌పోర్ట్‌ ఎప్పుడూ ఇబ్బందే. వాహనం ఎప్పుడొస్తుందో తెలియదు. అసలెక్కడుందో తెలియదు. ఏజెంట్లు, బ్రోకర్లపై ఆధారపడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అప్పుడే అనిపించింది..!! టెక్నాలజీలోనూ సేవలందిస్తున్న మనమే ఎందుకూ ట్రాన్స్‌పోర్ట్‌ విభాగాన్ని జోడించకూడదు అని? రూ.20 లక్షల పెట్టుబడితో 2014లో హైదరాబాద్‌ కేంద్రంగా తులిప్‌ లాజిస్టిక్స్‌ ప్రారంభించటానికి ఆ ఆలోచనే కారణం.

బీ2సీ నుంచి బీ2బీ మార్కెట్లోకి..
మొదట్లో బీ2సీ మార్కెట్లో పిపీప్‌ లాజిస్టిక్స్‌ను ప్రారంభించాం. ఇది అగ్రిగేట్‌ మోడల్‌. వాహన డ్రైవర్లు తమ వాహనాలను పిపీప్‌లో నమోదు చేసుకోవాలి. కావాల్సిన కస్టమర్లతో వారిని  పిపీప్‌ కలుపుతుంది. 800 కి.మీ. వరకు రూ.400, 1,200 కి.మీ వరకైతే రూ.800, ఆపైన ఎన్ని కి.మీ. అయినా రూ.1,000 చార్జీ వసూలు చేస్తాం. కానీ ఈ విధానంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. వాహనంలోని సరుకుకు బాధ్యత ఎవరిదని చాలా మంది కస్టమర్లు అడిగారు. దీంతో టెక్నాలజీని అభివృద్ధి చేసి తులిప్‌ లాజిస్టిక్స్‌ పేరిట బీ2బీ మార్కెట్లోకి వచ్చాం. సాంకేతికత, వేగం, కచ్చితత్వం.. ఈ మూడే తులిప్‌ స్పెషాలిటీ. ఇందులో కాంట్రాక్ట్‌ పద్ధతిలో కంపెనీలతో భాగస్వామ్యమవుతాం. ట్రక్‌ డ్రైవర్‌కు చార్జీ తులిపే చెల్లిస్తుంది. ఆ తర్వాత కస్టమర్‌ నుంచి తులిప్‌ వసూలు చేసుకుంటుంది. ఈ విధానంలో సరుకు బాధ్యత తులిప్‌దే.

2 టన్నుల నుంచి మొదలు...
తులిప్‌ లాజిస్టిక్స్‌.కామ్‌లో ట్రక్‌ల సామర్థ్యం 2 టన్నుల నుంచి మొదలవుతుంది. ప్రస్తుతం తులిప్‌లో 50 వేల మంది ఏజెంట్లు, వాహన ఓనర్లు రిజిస్టరయ్యారు. 4 లక్షలకు పైగా వాహనాలు నమోదై ఉన్నాయి. ఇందులో టాటా ఏస్‌ నుంచి 20 చక్రాల భారీ వాహనాల వరకూ ఉన్నాయి. మాంసాహార ఉత్పత్తులు, పాలు, పండ్ల వంటి ఉత్పత్తుల సరఫరా కోసం ప్రత్యేకంగా ఉష్ణోగ్రతను కంట్రోల్‌ చేసే వాహనాలూ ఉన్నాయి. జీపీఎస్‌ సాంకేతిక విధానంతో ట్రక్‌ ఎక్కడుంది? ఎంత సమయంలో చేరుతుందనే విషయాలను ఎప్పటికప్పుడు లోడ్, ట్రక్‌ ఓనర్లకు ఎస్‌ఎంఎస్‌ రూపంలో తెలియజేస్తుంటాం కూడా. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి లోడ్‌తో వచ్చే వాహనాల తనీఖీ సమయాన్ని తగ్గించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి వాహనానికి తులిప్‌ లాజిస్టిక్స్‌.కామ్‌ సర్టిఫికెట్‌ను ఇస్తాం. ఇందులో వాహనానం, లోడ్‌కు సంబంధించిన పూర్తి వివరాలుంటాయి. దీంతో తనిఖీ అధికారుల పని సులువవ్వటమే కాకుండా ట్రక్‌ కూడా త్వరగా గమ్యాన్ని చేరుకుంటుంది.

గతేడాది రూ.10 కోట్ల టర్నోవర్‌..
కోకకోలా, జేకే సీడ్స్, భారతి సిమెంట్స్, భవ్య సిమెంట్స్, హల్దీరామ్స్, ఇమామి, కేఎల్‌ఆర్, పార్లే బిస్కెట్స్, బేక్‌మేట్‌ వంటి ప్రముఖ కంపెనీలు మా సేవలను వినియోగించుకున్నాయి. ట్రక్కును బట్టి చార్జీ ఉంటుంది. ప్రారంభ ధర రూ.10–20 వేల మధ్య ఉంటుంది. ఆర్డర్‌ బుకింగ్‌ అయినప్పుటి నుంచి సరుకు గమ్య స్థానాన్ని చేరే వరకూ బాధ్యత తులిప్‌దే. ప్రస్తుతం రోజుకు 30 ట్రక్కులు బుక్‌ అవుతున్నాయి. ఎక్కువగా హైదరాబాద్‌–బెంగళూరు, విశాఖపట్నం పోర్ట్‌–బెంగళూరు, ఆంధ్రప్రదేశ్‌–లక్నో, పాట్నా మార్గాలుంటున్నాయి. నెలకు రూ.1.5–2 కోట్ల వ్యాపారాన్ని చేస్తున్నాం. గతేడాది రూ.10 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నాం. ఈ ఏడాది రెండింతల వృద్ధిని చేరాం.

రూ.150 కోట్ల నిధుల సమీకరణ..
ప్రస్తుతం మా సంస్థలో 50 మంది ఉద్యోగులున్నారు. విస్తరణ కోసం తొలిసారిగా నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించాం. రూ.150–200 కోట్ల వీసీ ఫండ్‌ కోసం చూస్తున్నాం. హైదరాబాద్, బెంగళూరుకు చెందిన పలువురు వీసీ ఇన్వెస్టర్లతో ప్రాథమిక చర్చలు నడుస్తున్నాయి. మరో 2 నెలల్లో డీల్‌ను క్లోజ్‌ చేస్తాం.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్‌ చేయండి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement