లాజిస్టిక్స్‌లో టాప్‌–25లో భారత్‌  | India Aims for Top 25 Spot in World Bank Logistics Index by 2030 | Sakshi
Sakshi News home page

లాజిస్టిక్స్‌లో టాప్‌–25లో భారత్‌ 

Published Fri, Feb 7 2025 6:30 AM | Last Updated on Fri, Feb 7 2025 6:30 AM

India Aims for Top 25 Spot in World Bank Logistics Index by 2030

2030 నాటికి చేరుకుంటుంది

ఫలితమిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలు 

పీఎం గతిశక్తి, నేషనల్‌ లాజిస్టిక్స్‌ పాలసీ దన్ను

అధ్యయన నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: వేగవంతమైన వస్తు రవాణా, వ్యయాల తగ్గింపునకు వీలుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన  పీఎం గతిశక్తి, నేషనల్‌ లాజిస్టిక్స్‌ పాలసీల మద్దతుతో రవాణా రంగ విషయంలో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ స్థానం మెరుగుపడనుంది. ‘ప్రపంచ బ్యాంక్‌ లాజిస్టిక్స్‌ పనితీరు సూచిక’లో 2030 నాటికి భారత్‌ టాప్‌–25 దేశాల్లో ఒకటిగా ఉంటుందని ఒక అధ్యయనం అంచనా వేసింది. ఈఏసీ ఇంటర్నేషనల్‌ కన్సల్టింగ్‌ సాయంతో మెస్సే స్టట్‌గార్ట్‌ ఇండియా (అంతర్జాతీయ ప్రదర్శన సంస్థ) అధ్యయనం నిర్వహించి, ఒక నివేదిక విడుదల చేసింది. 

ఈ నెల 13–15 మధ్య ముంబైలో అంతర్జాతీయ లాజిస్టిక్స్‌ ఎగ్జిబిషన్‌ ‘లాగిమ్యాట్‌ ఇండియా 2025’ సదస్సుకు ముందు దీన్ని విడుదల చేయడం గమనార్హం. ప్రపంచబ్యాంక్‌ లాజిస్టిక్స్‌ పనితీరు సూచీలో (ఎల్‌పీఐ) 139 దేశాలకు గాను భారత్‌ ప్రస్తుతం 38వ స్థానంలో ఉండగా, 2030 నాటికి టాప్‌–25లో చేరాలన్న లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం విధించుకుంది. పీఎం గతిశక్తి, నేషనల్‌ లాజిస్టిక్స్‌ పాలసీ కార్యక్రమాలతో పెద్ద ఎత్తున రవాణా వసతుల అభివృద్ధిని చేపట్టడం ఈ లక్ష్యం సాధనకు ఉపకరిస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది.  

నివేదికలోని అంశాలు.. 
→ భారత ఫ్రైట్, లాజిస్టిక్స్‌ మార్కెట్‌ ఏటా 8.8 శాతం చొప్పున వృద్ధి చెందుతూ 2029 నాటికి 484.43 బిలియన్‌ డాలర్లకు చేరుకోనుంది. 2024 నాటికి ఇది 317.26 బిలియన్‌ డాలర్లుగా ఉంది.  
→ అంతర్జాతీయ లాజిస్టిక్స్‌ కేంద్రంగా మారే విషయంలో భారత్‌ చాలా వేగంగా అడుగులు వేస్తోంది.  
→ ప్రస్తుతం భారత్‌లో లాజిస్టిక్స్‌ వ్యయాలు జీడీపీలో 13–14 శాతంగా ఉండగా, 2030 నాటికి ఒక అంకెకు తగ్గించాలన్నది ప్రభుత్వం లక్ష్యం. మౌలిక వసతులను ఇతోధికం చేయడం, సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా దీన్ని సాధించాలనుకుంటోంది. 
→ హైస్పీడ్‌ రహదారులు, హైపర్‌లూప్‌లు, కొత్త విమానాశ్రయాలు.. ఇలా బహుళ నమూనాల ద్వారా రవాణా సమయాన్ని 66 శాతం తగ్గించి, లాజిస్టిక్స్‌ పోటీతత్వాన్ని పెంచాలన్న లక్ష్యంతో ఉంది. 
→ జపాన్‌ను అధిగమించి 2026 నాటికి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ చేరనున్నట్టు అంచనాలున్నాయి. ఇందుకు పీఎం గతిశక్తి, నేషనల్‌ లాజిస్టిక్స్‌ పాలసీ తదితర బలమైన విధానాల మద్దతు అవసరం ఎంతో ఉంది. 
→ పీఎం గతిశక్తి కింద కేంద్రం రూ.11.17 లక్షల కోట్లతో 434 ప్రాజెక్టులను చేపట్టింది. తద్వారా లాజిస్టిక్స్‌ సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో ఉంది.

ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం అవసరం.. 
‘‘వినూత్నమైన పరిష్కారాలు, అత్యాధునిక టెక్నాలజీతో మౌలిక సదుపాయాల పరంగా అంతరం తొలగించడం ద్వారా అంతర్జాతీయ లాజిస్టిక్స్‌ దిగ్గజంగా భారత్‌ అవతరించొచ్చు. ఇందుకు ప్రభుత్వం, ప్రైవేటు రంగం సమన్వయంతో కలసి పనిచేయడం ఎంతో అవసరం’’అని ఈ నివేదిక సూచించింది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement