
ఈ ఏప్రిల్‌లో కస్టమర్లకు అందుబాటులోకి
న్యూఢిల్లీ: ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ క్రిష్ణగిరి ‘ఫ్యూచర్‌ఫ్యాక్టరీ’లో తయారుచేసిన తొలి ‘రోడ్‌స్టర్ ఎక్స్ మోటార్‌సైకిల్’ను శుక్రవారం విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఈ ఏప్రిల్‌లో కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ‘‘విద్యుత్ వాహన విప్లవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే నిబద్దతకు ప్రతిరూపమే ‘రోడ్‌స్టర్ ఎక్స్ సిరీస్’. మా కొత్త ఉత్పత్తి ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో కొత్త శకానికి నాందిగా నిలిస్తుంది.’’ అని కంపెనీ చైర్మన్ ఎండీ భవీశ్ అగర్వాల్ తెలిపారు.
ఓలా ఈ బైక్‌ను కొత్తగా అభివృద్ధి చేసిన మిడ్–డ్రైవ్ మోటార్‌తో రూపొందించింది. ఇందులో ఎంసీయూ ఇంటిగ్రేషన్ వంటి ఆధునిక టెక్నాలజీ కూడా ఉంది. ఐపీ67 సరి్టఫైడ్ బ్యాటరీలు ఉన్నాయి. ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ సిరీస్ 2.5 కిలోవాట్ హవర్(కేడబ్ల్యూహెచ్) 3.5 కేడబ్ల్యూహెచ్, 4.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్‌లో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.84,999, రూ.94,999, రూ.1,04,999గా ఉన్నాయి. కాగా, ఎక్స్‌ప్లస్ సిరిస్‌లో 4.5కేడబ్ల్యూహెచ్ బైక్ ధర రూ.1,14,999 లక్షలు ఉండగా, 9.1కేడబ్ల్యూహెచ్ బైక్ ధర రూ.1,84,999గా ఉంది.