
ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా (Kunal Kamra) ఇటీవల ముంబైలో నిర్వహించిన షో వివాదాస్పదమైంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను అవమానించారంటూ ఆయన మద్దతుదారులు కునాల్‌పై విరుచుకుపడుతున్నారు. కునాల్ షో నిర్వహించిన ముంబైలోని యూనికాంటినెంటల్ హోటల్ హాబిటాట్ స్టూడియోపై షిండే వర్గీయులు దాడికి పాల్పడ్డారు. కునాల్ కమ్రాపై పోలీసులు కేసు నమోదు చేశారు. షిండేపై అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు కునాల్ క్షమాపణ చెప్పాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేశారు. తాను క్షమాపణ చెప్పబోనని, తనపై పెట్టిన కేసులను చట్టపరంగా ఎదుర్కొంటానని కునాల్ స్పష్టం చేశారు.
ఇదిలావుంటే తన షోలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, అజిత్ పవార్ (Ajit Pawar) సహా పలువురు ప్రముఖులపై కునాల్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. వ్యాపార ప్రముఖులను కూడా ఆయన వదల్లేదు. ముఖ్యంగా ఓలా సీఈవో భవిశ్ అగర్వాల్‌పై వేసిన సెటైర్లు బాగా పేలాయి. గతంలో వీరిద్దరి మధ్య ట్విటర్‌లో మాటల యుద్ధం నడిచింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు సరైన సర్వీసు అందించడం లేదని వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను భవిశ్ దృష్టికి తీసుకురాగా, ఆయన వెటకారంగా స్పందించారు. తమ సర్వీసు సెంటర్‌కు వచ్చి పనిచేస్తే, ఫ్లాప్ షోకు వచ్చిన దానికంటే ఎక్కువ డబ్బు ఇస్తానని కునాల్‌ను భవిశ్ అగర్వాల్ వెటకరించాడు. ఈ నేపథ్యంలో కునాల్ తాజా షోలో భవిశ్‌పై సెటైర్లు వేశాడు.
‘భారత వ్యాపారవేత్తలు తాము తప్పు చేసినప్పుడు కూడా ఒప్పుకోరు. ఉదాహరణకు, ఓలా వ్యక్తిని తీసుకోండి. నేను ఏమి చెప్పినా అతడికి ఎందుకు కోపం వచ్చేస్తుంది? వారు ద్విచక్ర వాహనాలను తయారు చేస్తారు, కానీ వారి చక్రాలు రెండూ పనిచేయవు. అయినప్పటికీ, 'మాతో కలిసి పని చేయండి, మనమంతా కలిసి భారతదేశాన్ని నిర్మిద్దాం' అని అతడు నాతో అంటాడు. ఈ వ్యాపారవేత్తలందరికీ ఈ కోరిక ఎందుకు కలిగిందో? మీరు మంచి బైక్‌ను తయారు చేయలేరు కానీ, మొత్తం దేశాన్ని నిర్మించాలనుకుంటున్నారా? మీ ఆకాంక్షలను అదుపులో ఉంచుకోండి. సమస్యను పరిష్కరించడానికి బదులుగా, అతను కొత్త బైక్ రంగులను ప్రారంభించాడు. బహుశా వేరే రంగు సమస్యను అద్భుతంగా పరిష్కరిస్తుంది కాబోలు. డీటాక్స్ అవసరమైన చోట, వారు బోటాక్స్ అందిస్తున్నారు. నాకు డబ్బు ఇస్తానని అతడు అన్నాడు. అదేదో మీ కంపెనీ నుంచి రిఫండ్ కోసం వెయిట్ చేస్తున్న వారికి ఇవ్వొచ్చుగా.
ఓలా (Ola) గురించి ట్వీట్ చేయడం మానేశాను. ఎందుకంటే నా కారణంగానే ఓలా షేర్లు పతనమవుతున్నాయని జనాలు నిందిస్తున్నారు. నేను నా ట్వీట్లు రాశాను, అతడు తన ట్వీట్లు రాశాడు. నేను ఎప్పుడూ ఓలాలో ఉద్యోగాన్ని అంగీకరించలేదు. ఓలా సీఈఓతో గొడవ తర్వాత కస్టమర్లు నాకు ట్యాగ్ చేయడంతో పాటు నేరుగా మెసేజ్‌లు కూడా పంపించారు. వినియోగదారుల రక్షణ కోసం ఉద్దేశించిన ప్రభుత్వం సంస్థలు శక్తిహీనంగా మారాయి. బాధితులు ఓలా యజమాని దగ్గరకు వెళతారు, అతడు మోదీ జీతో ఫోటో చూపిస్తాడు, వారు వెనక్కి తిరిగి వెళ్లిపోతారు! నేనేం చేయాలి?” అని కునాల్ కమ్రా చమత్కరించారు. కాగా, ఇన్ఫోసిస్ సుధామూర్తి, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాపైనా కునాల్ సెటైర్లు వేశారు.
చదవండి: చట్టం అందరికీ సమానమేనా?.. స్టూడియో విధ్వంసంపై కునాల్ కమ్రా