
ఇండియన్ మార్కెట్లో బీఎండబ్ల్యూ మోటోరాడ్ (BMW Motorrad) ఎప్పటికప్పుడు కొత్త బైకులను లాంచ్ చేస్తూ.. అధిక ప్రజాదరణ పొందుతోంది. అయితే కంపెనీ ఇప్పుడు భారతదేశంలో తన G 310 GS & G 310 R బైకులను నిలిపివేసింది. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వకపోవడం, అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండటం వల్ల కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నిజానికి కంపెనీ ఈ బైకుల డెలివరీలను 2025 జనవరి నుంచే నిలిపివేసింది. సుమారు ఏడు సంవత్సరాలు ఇండియాలో అమ్మకానికి ఉన్న అత్యంత సరసమైన ఈ బీఎండబ్ల్యూ బైకులను కంపెనీ దాని లైనప్ నుంచి తీసివేసింది. దీనిపై బీఎండబ్ల్యూ మోటోరాడ్ అధికారికంగా స్పందించలేదు.
బీఎండబ్ల్యూ G 310 GS & G 310 R బైకులు 313 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ద్వారా 34 Bhp పవర్, 28 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ను పొందుతుంది. జీ 310 జీఎస్ 145 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. జీ 310 ఆర్ బైక్ టాప్ స్పీడ్ 143 కిమీ/గం.
ఇదీ చదవండి: 2025 మార్చిలో ఎక్కువమంది కొన్న కారు ఏదో తెలుసా?
బీఎండబ్ల్యూ కంపెనీ ఈ రెండు బైకులను నిలిపివేయడానికి.. సరైన అమ్మకాలు లేకపోవడం మాత్రమే కాదు, పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌కు మార్గం సుగమం చేసుకోవడానికి అని తెలుస్తోంది. బహుశా రాబోయే రోజుల్లో కొత్త బైకులు మార్కెట్లోకి లాంచ్ అయ్యే అవకాశం ఉందని, నిలిపివేసిన బైకుల స్థానాన్ని అవి భర్తీ చేస్తాయని తెలుస్తోంది.