ఉత్తమ మహిళా క్రికెటర్‌గా అనాబెల్
ఆస్ట్రేలియా వార్షిక అవార్డులు
మెల్‌బోర్న్: ఆ్రస్టేలియా క్రికెట్ బోర్డు (సీఏ) తమ ఆటగాళ్ల అత్యుత్తమ ప్రదర్శనకు ఇచ్చే వార్షిక అవార్డులను ప్రకటించింది. పురుషుల విభాగంలో ఉత్తమ ఆటగాడిగా ట్రవిస్ హెడ్ ఎంపికయ్యాడు. గత ఏడాది కాలంలో ఆసీస్‌కు కీలక విజయాలు అందించిన హెడ్ ‘అలెన్ బోర్డర్ మెడల్’ను గెలుచుకున్నాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 1427 పరుగులు సాధించిన హెడ్... అవార్డు కోసం జరిగిన ఓటింగ్‌లో 208 ఓట్లతో అగ్ర స్థానంలో నిలవగా, హాజల్‌వుడ్‌కు రెండో స్థానం (158) దక్కింది.
బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్‌లో భారత్‌తో జరిగిన రెండో టెస్టులో 141 బంతుల్లో 140 పరుగులు చేసిన హెడ్ ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది. వన్డేల్లో అత్యుత్తమ ఆటగాడి అవార్డు కూడా హెడ్‌కే దక్కడం విశేషం. ఉత్తమ టెస్టు క్రికెటర్‌గా హాజల్‌వుడ్, ఉత్తమ టి20 క్రికెటర్‌గా ఆడమ్ జంపా నిలిచారు. ‘బ్రాడ్‌మన్ యంగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా స్యామ్ కొన్‌స్టాస్ ఎంపికయ్యాడు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న కారణంగా ఆస్ట్రేలియా జట్టు పురుషుల క్రికెటర్లు ఎవరూ ఈ అవార్డులను అందుకోలేకపోయారు.
మహిళల విభాగంలో అత్యుత్తమ క్రికెటర్‌గా అనాబెల్ సదర్లాండ్ నిలిచింది. ఓటింగ్‌లో యాష్లీ గార్డ్‌నర్ (143 పాయింట్లు)ను వెనక్కి నెట్టిన సదర్లాండ్ (168) ప్రతిష్టాత్మక ‘బెలిండా క్లార్క్ అవార్డు’కు ఎంపికైంది. గత ఏడాదిలో దక్షిణాఫ్రికాతో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన అనాబెల్... ఎంసీజీలో టెస్టు సెంచరీ బాదిన (ఇంగ్లండ్‌పై) తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. మహిళల వన్డేల్లో ఉత్తమ క్రికెటర్ అవార్డు యాష్లీ గార్డ్‌నర్ గెలుచుకోగా, ఉత్తమ టి20 ప్లేయర్ పురస్కారం బెత్ మూనీకి దక్కింది. ఆ్రస్టేలియా క్రికెట్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో మైకేల్ క్లార్క్, మైకేల్ బెవాన్, క్రిస్టీనా మాథ్యూస్ చోటు దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment