2025 ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డ్స్ విజేతల వివరాలను క్రికెట్ ఆస్ట్రేలియా ఇవాళ (ఫిబ్రవరి 3) ప్రకటించింది. ట్రవిస్ హెడ్, జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, ఆష్లే గార్డ్‌నర్, బెత్ మూనీ వివిధ ఫార్మాట్లకు సంబంధించిన అవార్డులు గెలుచుకున్నారు. విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్ తొలిసారి అలెన్ బోర్డర్ మెడల్‌ను గెలుచుకున్నాడు. ఈ మెడల్ కోసం జోష్ హాజిల్‌వుడ్, పాట్ కమిన్స్ హెడ్‌తో పోటీపడ్డారు. ఔ
హెడ్‌కు మొత్తం 208 ఓట్లు వచ్చాయి. హాజిల్‌వుడ్ కంటే 50 ఓట్లు, కమిన్స్ కంటే 61 ఓట్లు ఎక్కువ పోలయ్యాయి. గతేడాది ఫార్మాట్లకతీతంగా రాణించినందుకు హెడ్‌కు అలెన్ బోర్డర్ మెడల్ దక్కింది. హెడ్ 2024లో మూడు ఫార్మాట్లలో 1427 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. హెడ్.. అలెన్ బోర్డర్ మెడల్‌తో పాటు మెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ అవార్డు కోసం అలెక్స్ క్యారీ హెడ్‌తో పోటీపడ్డాడు.
హాజిల్‌వుడ్‌కు టెస్ట్ ప్లేయర్, జంపాకు టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు
గతేడాది టెస్ట్‌ల్లో ఇరగదీసిన జోష్ హాజిల్‌వుడ్‌కు షేన్ వార్న్ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. హాజిల్‌వుడ్ 2024లో 13.17 సగటున 30 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శన కారణంగా హాజిల్‌వుడ్‌కు టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. గతేడాది పొట్టి ఫార్మాట్‌లో విశేషంగా రాణించిన ఆడమ్ జంపాకు మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది.
మహిళల విభాగానికి వస్తే.. అన్నాబెల్ సదర్‌ల్యాండ్ తొలిసారి బెలిండా క్లార్క్ అవార్డు గెలుచుకుంది. సదర్‌ల్యాండ్ గతవారం యాషెస్ సిరీస్ ఏకైక టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై సెంచరీ సాధించింది. గత సీజన్ చివర్లో సదర్‌ల్యాండ్ సౌతాఫ్రికాపై టెస్ట్‌ల్లో డబుల్ సెంచరీ (210) చేసింది. సదర్‌ల్యాండ్ గతేడాది మూడు ఫార్మాట్లలో 46.94 సగటున 798 పరుగులు చేసి 34 వికెట్లు పడగొట్టింది.
గార్డ్‌నర్‌కు వన్డే, మూనీకి టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు
ఆష్లే గార్డ్‌నర్ 2024 ఆస్ట్రేలియా మహిళల వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకుంది. గార్డ్‌నర్ గతేడాది వన్డేల్లో 385 పరుగులు చేసి 23 వికెట్లు పడగొట్టింది. బెత్ మూనీ ఆస్ట్రేలియా మహిళల టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకుంది. మూనీ గతేడాది టీ20ల్లో 47.53 సగటున, 129.83 స్ట్రయిక్‌రేట్‌తో 618 పరుగులు చేసింది.
మ్యాక్స్‌వెల్, పెర్రీలకు బిగ్‌బాష్ లీగ్ అవార్డులు
ఆల్‌రౌండర్లు గ్లెన్ మ్యాక్స్‌వెల్, కూపర్ కన్నోలీ జాయింట్‌గా మెన్స్ బిగ్‌బాష్ లీగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకున్నారు. ఎల్లిస్ పెర్రీ, జెస్ జొన్నాసెన్ జాయింట్‌గా మహిళల బిగ్‌బాష్ లీగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment