
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 164 పరుగుల టార్గెట్‌ను ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలో చేధించింది.
ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 60 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఢిల్లీ రాహుల్ తన క్లాసీ నాక్‌తో విజయతీరాలకు చేర్చాడు. 53 బంతులు ఎదుర్కొన్న రాహుల్..7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 93 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
రాహుల్‌తో పాటు స్టబ్స్(38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్, స్టబ్స్ ఐదో వికెట్‌కు ఆజేయంగా 111 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఆర్సీబీ బౌలర్లు ఆరంభంలోనే వికెట్లు పడగొట్టినప్పటికి, ఆ తర్వాత మాత్రం తేలిపోయారు. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు, యశ్‌దయాల్, సుయాష్ శర్మ తలా వికెట్ సాధించారు.
డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్...
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఆర్సీబీ అద్బుతమైన ఆరంభం లభించినప్పటికి మిడిల్ ఓవర్లలో బ్యాటర్లు చేతులేత్తేశారు. ఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్(37) పరుగులతో మెరుపు ఆరంభం ఇవ్వగా..టిమ్ డేవిడ్(18 బంతుల్లో 32, 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆఖరిలో మెరుపులు మెరిపించాడు.
వీరిద్దరితో పాటు పాటిదార్(25), కోహ్లి(22) పర్వాలేదన్పించారు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ తలా వికెట్ సాధించారు.
చదవండి: IPL 2025: పృథ్వీ షాకు బంపరాఫర్.. ధోని టీమ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!?