Transport sector
-
గనులు, ఖనిజాలశాఖ, ఏపీఎండీసీ ఆదాయాలు గణనీయంగా పెరిగాయి: సీఎం జగన్
-
సమన్వయంతో ఆదాయార్జన
సాక్షి, అమరావతి: ఆదాయాన్ని ఆర్జించే విభాగాలు కలెక్టర్ల భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. క్రమం తప్పకుండా కలెక్టర్లతో సమీక్షలు నిర్వహించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే విధానాలపై దృష్టి సారించాలన్నారు. ఆర్థికశాఖ అధికారులు కలెక్టర్లతో నిరంతరం సంప్రదింపులు జరపడం ద్వారా ఆదాయాన్నిచ్చే శాఖలు మరింత బలోపేతమై ఎక్కడా చిల్లు పడకుండా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరుతుందన్నారు. ఆదాయార్జన శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 2023 – 24 తొలి త్రైమాసికంలో వివిధ విభాగాల పనితీరు, విభాగాల వారీగా రెవెన్యూ వసూళ్లను సమీక్షించి పలు సూచనలు చేశారు. వాహన కొనుగోలుదారులను ప్రోత్సహిస్తూ.. రవాణా రంగంలో సంస్కరణలపై దృష్టి సారించి ఇతర రాష్ట్రాల్లో విధానాలను పరిశీలించి అత్యుత్తమ పద్ధతులను అమలు చేయాలని సీఎం సూచించారు. వాహనాలపై పన్నుల విషయంలో కొత్త విధానాలను అన్వేషించాలని, అయితే అవి కొనుగోలు దారులను ప్రోత్సహించేలా ఉండాలని స్పష్టం చేశారు. నాటు సారా కుటుంబాలకు ప్రత్యామ్నాయం నాటుసారా తయారీలో నిమగ్నమైన కుటుంబాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను చూపాలని సీఎం ఆదేశించారు. ఆయా కుటుంబాలకు ఈ కార్యక్రమం కింద ఇప్పటికే రూ.16.17 కోట్లు పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొనగా ఈ కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని ముఖ్యమంత్రి సూచించారు. నాటుసారా తయారీదారుల్లో చైతన్యం కల్పించడంతోపాటు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను సమర్థంగా అమలు చేయాలని సూచించారు. పారదర్శకతతో పెరిగిన గనుల ఆదాయం భూగర్భ గనులు – ఖనిజాల శాఖ, ఏపీఎండీసీ ఆదాయానికి సంబంధించి గతంతో పోలిస్తే భారీ వ్యత్యాసం ఉందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఈ విభాగాల పరిధిలో ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. లీకేజీలను అరికట్టడంతోపాటు పారదర్శక విధానాలు, సంస్కరణలతో ఇది సాధ్యమైందని చెప్పారు. ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడేళ్లలో 32 శాతం సీఏజీఆర్ గనులు–ఖనిజాల శాఖలో గత మూడేళ్లలో 32 శాతం సీఏజీఆర్ (కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్) నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 2018–19లో కేవలం రూ.1,950 కోట్లు ఆదాయం సమకూరగా 2022–23 నాటికి రూ.4,756 కోట్లకు పెరిగినట్లు చెప్పారు. కార్యకలాపాలు నిలిచిపోయిన 2,724 మైనింగ్ లీజుల్లో 1,555 చోట్ల పునఃప్రారంభమైనట్లు తెలిపారు. మిగిలిన చోట్ల కూడా పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఏపీఎండీసీ ఆర్థికంగా పరిపుష్టం ఏపీఎండీసీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగు పడినట్లు అధికారులు తెలిపారు. 2020–21లో ఏపీఎండీసీ ఆదాయం రూ.502 కోట్లు కాగా 2022–23లో రూ.1,806 కోట్లకు పెరిగింది. 2023 – 24లో ఏపీఎండీసీ ఆదాయం రూ.4 వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. మంగంపేట బైరటీస్, సులియారీ బొగ్గు గనుల నుంచి ఏపీఎండీసీకి భారీగా ఆదాయం సమకూరుతోంది. సులియారీలో ఈ ఏడాది 5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుదల గతేడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి జూలై 15 వరకూ రూ.2,291.97 కోట్లు ఆదాయం రాగా ఈ ఏడాది అదే కాలానికి సంబంధించి రూ.2,793.7 కోట్లు ఆర్జించినట్లు చెప్పారు. భూముల రీ సర్వే పూర్తైన గ్రామాల్లో రిజిస్ట్రేషన్ సేవలు మొదలైనట్లు తెలిపారు. గ్రామ సచివాలయాల్లో దాదాపు 5 వేల రిజిస్ట్రేషన్ సేవలు జరిగాయని, వీటి ద్వారా రూ.8.03 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. సమీక్షలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, అటవీ పర్యావరణశాఖ స్పెషల్ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, మైనింగ్ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్ గుప్త, రోడ్డు రవాణా, భవనాలశాఖ కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న, రవాణాశాఖ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ కోటేశ్వరరావు, రిజిస్ట్రేషన్లు–స్టాంపుల శాఖ కమిషనర్ రామకృష్ణ, ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి.వాసుదేవరెడ్డి, మైన్స్ డైరెక్టర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ రయ్.. మద్యం డీలా! ► ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకు రూ.7,653.15 కోట్ల జీఎస్టీ పన్నుల వసూళ్లు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 23.74 శాతం పెరుగుదల నమోదు. ► గత సర్కారు హయాంతో పోలిస్తే గణనీయంగా తగ్గిన మద్యం విక్రయాలు. 2018–19లో లిక్కర్ అమ్మకాలు 384.36 లక్షల కేసులు కాగా 2022 – 23లో కేవలం 335.98 లక్షల కేసుల విక్రయాలు. ఇదే సమయానికి సంబంధించి గతంలో బీరు అమ్మకాలు 277.16 లక్షల కేసులు కాగా ఇప్పుడు 116.76 లక్షల కేసులు మాత్రమే విక్రయం. ► 2018–19 ఏప్రిల్, మే, జూన్‌తో పోలిస్తే 2023–24 తొలి త్రైమాసికంలో బీరు అమ్మకాలు మైనస్ 56.51 శాతం తక్కువగా, లిక్కర్ విక్రయాలు మైనస్ 5.28 శాతం తక్కువగా నమోదు కావడం గమనార్హం. -
పుంజుకుంటున్న రవాణా ఆదాయం
సాక్షి, అమరావతి: రవాణా రంగం ద్వారా వచ్చే ఆదాయం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో మెరుగుపడుతోంది. గత ఆర్థిక ఏడాది మొదటి 6 నెలల్లో (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్) వరకు రూ.1,531.29 కోట్ల ఆదాయం లభించగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు (6 నెలలు) రూ.2,130.92 కోట్ల మేర ఆదాయం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలలతో పోలిస్తే.. ఈ ఏడాది తొలి 6 నెలల్లో ఆదాయంలో 39.15 శాతం మేర వృద్ధి నమోదైంది. గత రెండేళ్లలో కోవిడ్–19 ప్రభావం రవాణా రంగం ఆదాయంపై తీవ్రంగా పడింది. 2019–20 రవాణా ఆదాయం గణనీయంగా పడిపోగా.. 2020–21లోనూ నేలచూపులు చూసింది. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఇప్పుడిప్పుడే ఆదాయం మెరుగుపడుతోంది. ద్విచక్ర వాహనాల విక్రయాలు మినహా అన్నిరకాల వాహనాల్లో ఈ ఏడాది తొలి 6 నెలల్లో వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు గత ఏడాది కంటే 6.52 శాతం తగ్గింది. అయితే, కార్ల అమ్మకాల్లో మాత్రం వృద్ది నమోదైంది. ప్రస్తుత ఆర్థిక ఏడాది తొలి 6 నెలల్లో కార్లు కొనుగోళ్లలో 8.27 శాతం, గూడ్స్ వాహనాల కొనుగోళ్లలో 22.67 శాతం మేర వృద్ధి నమోదు కాగా.. పాసెంజర్ వాహనాల కొనుగోళ్లలో 85.02 శాతం, ఆటోల కొనుగోళ్లలో 83.94 శాతం వృద్ధి నమోదైంది. -
పోర్టర్‌కు 5,000 ఈ–కార్గో వాహనాలు
ముంబై: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న ఒమెగా సీకి మొబిలిటీ భారీ ఆర్డర్‌ను అందుకుంది. ఇందులో భాగంగా సరుకు రవాణా రంగంలో ఉన్న పోర్టర్‌కు 5,000 ఎలక్ట్రిక్ కార్గో త్రిచక్ర వాహనాలను సరఫరా చేయనుంది. వచ్చే ఏడాది చివరినాటికి ఈ వెహికిల్స్‌ను డెలివరీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పోర్టర్ వద్ద 1,000 ఎలక్ట్రిక్ త్రీవీలర్లు ఉన్నాయి. ఈ–కామర్స్ కంపెనీల నుంచే కాకుండా ఎఫ్ఎంసీజీ, డెయిరీ, నిర్మాణ, వాహన విడిభాగాల వంటి రంగాల నుండి కూడా డిమాండ్ రావడంతో ట్రక్కుల అవసరం పెరిగిందని ఒమెగా సీకి మొబిలిటీ ఫౌండర్, చైర్మన్ ఉదయ్ నారంగ్ తెలిపారు. ‘2023లో ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహన విభాగంలో 200 శాతం వృద్ధి ఆశిస్తున్నాం. పోర్టర్‌తో భాగస్వామ్యం గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. ఇటువంటి డీల్స్ మరిన్ని కుదుర్చుకోనున్నాం. వచ్చే 2–3 ఏళ్లలో డీల్స్‌లో భాగంగా భాగస్వామ్య కంపెనీలకు 50,000 వెహికిల్స్ సరఫరా చేసే అవకాశం ఉంది’ అని వివరించారు. ఈ–కామర్స్ కంపెనీలు పండగల నెలలో రూ.96,170 కోట్ల విలువైన వ్యాపారం నమోదు చేసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. -
కదం తొక్కిన కార్మికులు
హిమాయత్‌నగర్: ఔట్ సోర్సింగ్ కార్మికుల ధర్నాతో గురువారం బల్దియా ప్రధాన కార్యాలయం దద్దరిల్లింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఔట్సోర్సింగ్ కార్మికులను ఎన్‌ఎంఆర్‌లుగా గుర్తించి పర్మనెంట్ చేయాలని, ఆరోగ్య భద్రతకు హెల్త్ కార్డు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని, బయోమెట్రిక్ మిషన్లను జీహెచ్ఎంసీనే నేరుగా కొనాలనే తదితర డిమాండ్లతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ (బీజేపీ) మజ్దూర్ సెల్ పిలుపు మేరకు ఉద్యోగ, పారిశుద్ధ్య, ఎంటమాలజీ, వెటర్నరీ, పార్క్ సెక్షన్, ట్రాన్స్పోర్ట్ సెక్షన్ విభాగాల కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు రెండు గంటల పాటు కార్యాలయం లోపల కార్మికులు బైఠాయించారు. అవుట్ సోర్సింగ్ కమిషనర్ లోకేష్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ట్రాన్స్పోర్ట్ సెక్షన్ నుంచి తీసేసిన 700 మందిని విచారణ జరిపి వారిని విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. బయోమెట్రిక్ కారణంగా కట్ అయిన డబ్బులు తిరిగి ఇస్తామన్నారు. ఎంటమాలజీ విభాగంలో ఉన్న ఖాళీలను నియమించేందుకు, తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ఉదిరి గోపాల్, ప్రధాన కార్యదర్శి నర్సింగ్ రావు, ఔట్ సోర్సింగ్ విభాగం అధ్యక్షుడు రాము తదితరులు పాల్గొన్నారు. (చదవండి: హైదరాబాద్‌కు పాడ్ కార్స్, రోప్‌వేస్) -
రవాణా ఆదాయం రయ్!
సాక్షి, అమరావతి: లాక్డౌన్ ఎత్తివేత అనంతరం రవాణా రంగం ఆదాయం పుంజుకుంది. గత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో కోవిడ్ కారణంగా లాక్డౌన్ విధించడంతో రవాణా రంగం ఆదాయం గణనీయంగా పడిపోయింది. లాడ్‌డౌన్ సడలింపుల సమయం రెండో త్రైమాసికంలో కొంతమేర పుంజుకుంది. మూడో త్రైమాసికం నుంచి వృద్ధిలోకి వచ్చింది. గత ఆర్ధిక ఏడాది తొలి త్రైమాసికంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు రవాణా ఆదాయం –53.03 శాతంతో తిరోగమనంలో ఉంది. రెండో త్రైమాసికంలో లాక్డౌన్ సడలింపులతో జూలై నుంచి సెప్టెంబర్ వరకు కొంత మేర పుంజుకుని –4.54 శాతం వృద్ది నమోదైంది. మూడో త్రైమాసికంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రవాణా రంగం ఆదాయంలో 7.07 శాతం వృద్ధి నమోదైంది. నాల్గో త్రైమాసికంలో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు ఏకంగా 21.71 శాతం వృద్ధి నమోదైంది. 2019 – 20లో రవాణా రంగం ఆదాయం రూ.3,175.45 కోట్లు ఉండగా 2020–21లో రూ.2,973.33 కోట్లు సమకూరింది. అంటే అంతకుముందు ఆర్ధిక ఏడాదితో పోల్చితే రవాణా రంగం ఆదాయం వృద్ధి –6.37 శాతంగా ఉంది. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే మెరుగు పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీలో రవాణా రంగం ఆదాయం మెరుగ్గానే ఉంది. తమిళనాడు, ఢిల్లీ, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ మన రాష్ట్రం కన్నా వెనుకబడి ఉన్నాయి. -
జనవరి నుంచి ‘రవాణా’ తనిఖీలు ముమ్మరం
సాక్షి, అమరావతి: రవాణా వాహనానికి సంబంధించి ఏ పత్రం లేకపోయినా కేసులు నమోదు చేసేందుకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం రవాణాశాఖకు ఆదేశాలిచ్చింది. కోవిడ్ కారణంగా రవాణా వాహనాల పర్మిట్లు, రిజిస్ట్రేషన్లు, లైసెన్సుల గడువు ఫిబ్రవరితో తీరిపోయినా.. ఈ ఏడాది డిసెంబర్ వరకు చెల్లుబాటయ్యేలా లాక్డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రం ఆదేశాల ప్రకారం రవాణాశాఖ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి ఆ మేరకు కేసుల నమోదులో వెసులుబాటు కల్పించింది. ఈ గడువు ఈనెలాఖరుతో ముగుస్తున్నందున వచ్చే ఏడాది ప్రారంభం నుంచి కఠినంగా రోడ్ సేఫ్టీ నిబంధనలు అమలు చేసేందుకు రవాణాశాఖ కింది స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చింది. దీంతో చెక్‌పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి మోటారు వాహన చట్టాన్ని కేంద్రం గత ఏడాది సెప్టెంబర్ నుంచి అమల్లోకి తెచ్చింది. దీన్ని అనుసరించి ఈ ఏడాది జరిమానాలను భారీగా పెంచుతూ మోటారు వాహన చట్టంలో సెక్షన్ 177 నుంచి 199 వరకు కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త ఏడాదిలో రోడ్ సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ ఉల్లంఘనుల భరతం పట్టనున్నారు. పన్నులు చెల్లించకుండా వాహనం తిప్పితే 200 శాతం జరిమానా రవాణా వాహనానికి పర్మిట్ లేకపోయినా, పన్నులు చెల్లించకుండా వాహనం నడిపినా 200 శాతం జరిమానా విధించనున్నారు. అంతర్రాష్ట్ర పర్మిట్లపైనా రవాణాశాఖ దృష్టి సారించనుంది. వచ్చే ఏడాది నుంచి రవాణా వాహనాలకు సంబంధించి పూర్తిస్థాయి తనిఖీలు చేపడతామని సుప్రీంకోర్టు రోడ్ సేఫ్టీ కమిటీకి ఇటీవలే రవాణాశాఖ నివేదించింది. లాక్డౌన్ సమయంలో రవాణా శాఖ సేవలు లాక్డౌన్ సమయంలో పలు సేవలందించినట్లు సుప్రీంకోర్టు రోడ్ సేఫ్టీ కమిటీకి రవాణాశాఖ తెలిపింది. డ్రైవర్లకు లక్ష శానిటైజర్ల కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రోడ్ సేఫ్టీ కమిటీ వలస కూలీల తరలింపులో ముఖ్యపాత్ర పోషించిందని, 3,252 ఆర్టీసీ బస్సుల ద్వారా 96,700 మంది వలస కార్మికులను రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు తరలించినట్లు వివరించింది. జాతీయ రహదారుల వెంబడి ప్రతి 20 కిలోమీటర్లకు ఒకటి వంతున 118 ఫుడ్ అండ్ రిలీఫ్ సెంటర్లు ఏర్పాటు చేసి వలస కార్మికులకు సేవలందించినట్లు తెలిపింది. 69 శ్రామిక్ రైళ్ల ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి 1,07,338 మంది కూలీలను పొరుగు రాష్ట్రాలకు తరలించినట్లు పేర్కొంది. కాలి నడకన వచ్చే 15 వేల మంది కూలీలను 464 ఆర్టీసీ బస్సుల్లో వారి స్వస్థలాలకు పంపినట్లు తెలిపింది. -
రవాణాశాఖలో ప్రారంభమైన బదిలీల ప్రక్రియ
సాక్షి, ఒంగోలు: రవాణాశాఖలో బదిలీల ప్రక్రియకు కసరత్తు ప్రారంభమైంది. రవాణాశాఖ ఉన్నతాధికారులు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సీనియర్ అసిస్టెంట్, హెడ్‌కానిస్టేబుల్ వరకు బదిలీలను జోనల్ స్థాయి ఉప రవాణాశాఖ కమిషనర్ నిర్వహిస్తారు. అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్, మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్, పరిపాలనాధికారి పోస్టులకు సంబంధించి బదిలీల ప్రక్రియను జోనల్ డీటీసీ స్థాయిలో పర్యవేక్షించి అభ్యర్థుల నుంచి ఆప్షన్ ఫారాలను తీసుకుని ప్రధాన కార్యాలయానికి పంపుతారు. వారు వాటిని పరిశీలించి బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తారు. అందులో భాగంగా శుక్రవారం జోన్ నెల్లూరు ఉప రవాణాశాఖ కమిషనర్ ఎన్.శివరామప్రసాద్ గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అధికారులు, సిబ్బందితో కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన కసరత్తును స్థానిక రవాణాశాఖ ఉప కమిషనర్ కార్యాలయంలో చేపట్టారు. ముందుగా రవాణాశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను వివరించారు. ఒకే ప్రాంతంలో 5 సంవత్సరాలు పనిచేసిన వారికి బదిలీలు తప్పనిసరి. కనీసం రెండు సంవత్సరాలు ఒకే ప్రాంతంలో పనిచేసినవారు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. స్పౌజ్ కేటగిరీ, దివ్యాంగులకు సంబంధించిన అంశాల్లో మినహాయింపులు వర్తిస్తాయని తెలిపారు. 2020 మార్చి 31 నాటికి రిటైరయ్యే వారికి బదిలీలు నిర్వహిస్తారన్నారు. ప్రతి విభాగంలోను సీనియార్టీ ప్రకారమే బదిలీలు ఉంటాయన్నారు. ఎవరైనా బదిలీకి అర్హులైన, ఆసక్తి ఉన్నవారు తాము పనిచేస్తున్న ప్రదేశం కాకుండా మరో మూడు ప్రాంతాలను ఎంచుకోవాలని సూచించారు. తమ ఆప్షన్లు పూర్తిచేసి సంబంధిత ఆప్షన్ ఫారంను అందజేస్తే ఉన్నతాధికారులకు త్వరగా పంపుతామని, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం జారీ చేసిన జూలై 5వ తేదీలోగా బదిలీలు పూర్తి చేస్తారని పేర్కొన్నారు. అయితే మూడు జిల్లాల్లో కలిపి 60 మంది వరకు బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా. సమావేశంలో జిల్లా ఉప రశాణాశాఖ కమిషనర్ సీహెచ్‌వీకే సుబ్బారావు, గుంటూరు ఉపరవాణాశాఖ కమిషనర్ రాజారత్నం, నరసరావుపేట ఆర్టీవో కెవి సుబ్బారావు, ఏపీ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్, గుంటూరు ఆర్టీవో వై.రామస్వామి హాజరయ్యారు. -
ఇం'ధన' మంట!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రవాణా రంగం సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇం‘ధన’మంట నేపథ్యంలో తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. అసలే నష్టాల ఊబిలో చిక్కుకుని విలవిల్లాడుతున్న ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీకి రోజురోజుకు పెరుగుతున్న డీజిల్ ధరలు అశనిపాతంలా మారాయి. వారం రోజులుగా పెరుగుతున్న డీజిల్ ధరలు సంస్థ ఆదాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ రెండు వారాల్లోనే లీటరుపై దాదాపుగా రూ.3.18లు పెరిగింది. దీంతో రోజుకు రూ.23 లక్షల భారాన్ని ఆర్టీసీ మోస్తోంది. మరోవైపు ప్రైవేటు రంగంలోని ప్రజా రవాణా వ్యవస్థ పరిస్థితీ ఇలానే ఉంది. ముఖ్యంగా ప్రైవేటు ట్రావెల్స్, లారీలు, క్యాబ్‌లు, ఆటోల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోకపోవడమే నేటి భారానికి కారణమని రవాణా రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. లారీ యజమానులకు కోలుకోలేని దెబ్బ పెరుగుతున్న పెట్రోల్ ధరలు రవాణా రంగానికి కీలకంగా ఉన్న లారీల యజమానులను కోలుకోని విధంగా దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతం అన్ సీజన్ కారణంగా లారీలకు గిరాకీ లేదు. దీనికితోడు పెరుగుతున్న డీజిల్ ధరలు వ్యాపారాన్ని మరింతగా దెబ్బతీస్తున్నాయని యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు పెద్దగా లేకపోవడంతో కేవలం బొగ్గు, సిమెంటు రవాణా లారీలు మాత్రమే నడుస్తున్నాయి. అవి కూడా వివిధ ప్రభుత్వ ప్రాజెక్టులకు మాత్రమే సరఫరా చేస్తున్నాయి. తాజా పరిస్థితులతో వ్యాపారం సరిగా సాగక.. యజమానులు వాయిదాలు కట్టలేకపోతున్నారు. రెండు వాయిదాలు దాటితే.. లారీలను ఫైనాన్స్ వ్యాపారులు లాక్కెళ్తున్నారని వ్యాపారులు వాపోతున్నారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కలగజేసుకోవాలని తెలంగాణ లారీల అసోషియేషన్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంటనే వ్యాట్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని మినహాయించి డీజిల్‌ను జీఎస్టీ పరిధిలో చేర్చాలని కోరారు. -
నేటి నుంచి అత్యవసరాల రవాణా బంద్
సాక్షి, అమరావతి: నాలుగు రోజులుగా కొనసాగుతున్న లారీల సమ్మె రవాణా రంగంపై తీవ్రప్రభావం చూపింది. ఎక్కడ లారీలు అక్కడే ఆగిపోయాయి. ఇప్పటి వరకు నిత్యావసర సరుకులు, పెట్రోలు, డీజిల్, మందులు, ఇతర అత్యవసర సరుకుల రవాణాకు మినహాయింపు నిచ్చారు. అయితే మంగళవారం నుంచి అత్యవసర సరుకుల రవాణాను సైతం నిలిపేసే విధంగా లారీల యజమానులు చర్చలు జరుపుతున్నారు. రాబోయే రెండు రోజుల్లో సమ్మెను మరింత ఉధృతం చేయాలని భావిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 5 లక్షలకు పైగా లారీలున్నాయి. ఏపీలో 3 లక్షల వరకు లారీలు ఉన్నాయి. 13 జిల్లాల్లో కలిపి గత నాలుగు రోజుల నుంచి 2.80 లక్షలు లారీలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. లారీల యజమానులు నిరవధిక బంద్ కొనసాగిస్తున్నా.. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏపీ వరకు బంద్ కారణంగా ప్రభుత్వానికి రోజుకు రూ.25 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా వేస్తున్నారు. లారీ యజమానులు రూ.30 నుంచి రూ.40 కోట్లు నష్టపోతున్నట్లు అంచనా. నాలుగు రోజుల నుంచి లారీల నిరవధిక బంద్‌తో ఏపీలో రూ.వెయ్యి కోట్ల లావాదేవీలు ఆగిపోయాయి. కృత్రిమ కొరత సృష్టించేందుకు వ్యాపారుల యత్నాలు లారీల సమ్మెతో నిత్యావసరల సరుకులపై ప్రభావం పడింది. వ్యాపారులు ముందుగానే పక్షం రోజులకు సరిపడా సరుకు దిగుమతి చేసుకుని నిల్వ చేసుకున్నారు. అయితే కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకునేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తగ్గిపోయిన డీజిల్ విక్రయాలు మరోవైపు లారీల సమ్మెతో డీజిల్ విక్రయాలు భారీగా పడిపోయాయి. బంద్‌కు ముందు రోజుకు 8,000 లీటర్ల డీజిల్ అమ్మే వారమని, లారీల బంద్ కారణంగా అమ్మకాలు 3,000 లీటర్లకు పడిపోయాయని గుంటూరుకు చెందిన పెట్రోల్ బంక్ యజమాని ఒకరు వాపోయారు. లారీల సమ్మె కారణంగా అమ్మకాలు 70 శాతం వరకు పడిపోయినట్లు ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం డీలర్స్ అంచనా వేస్తోంది. సాధారణంగా రాష్ట్రంలో రోజుకు 1.03 కోట్ల లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతుండగా ఈ సమ్మె కారణంగా అమ్మకాలు 30 లక్షల లీటర్లకు పడిపోయనట్లు అంచనా వేస్తున్నట్లు ఫెడరేషన్ పేర్కొంది. -
లారీ.. గుండె జారి!
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలతోపాటు ఇంధనం ధరలు కూడా మండుతున్నాయి. డీజిల్ ధరల మోత, టోల్ చార్జీల వాతలతో రోడ్డుపై పరుగులు తీయాల్సిన లారీలు షెడ్డులకు పరిమితమ వుతున్నాయి. రవాణా రంగానికి గుండెకాయ లాంటి విజయవాడలో తాజాగా రికార్డు స్థాయిలో లీటర్ డీజిల్ ధర రూ.71.73కి ఎగబాకటంతో పరిస్థితి మూలిగే నక్కమీద మీద తాటిపండు పడినట్లైంది. లీటరుకు రూ.2 చొప్పున కేంద్రం ఇస్తున్న మినహా యింపును రాష్ట్ర ప్రజలకు వర్తింపచేయకపో వటం, తాజాగా టోల్ చార్జీలూ అమాంతంగా పెరగటంతో పరిస్థితి దిగజారింది. రవాణా రంగానికి పిడుగుపాటు రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా డీజిల్ ధర రూ.71.73కు చేరుకోవడవంతో లారీ పరిశ్రమ పిడుగుపాటుకు గురైంది. మరోవైపు ఏప్రిల్ 1వతేదీ నుంచి టోల్ చార్జీలు కూడా 30 శాతం పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం కి.మీ.కు రూ.20.40 చొప్పున డీజిల్ వ్యయం అవుతోంది. ఇక కి.మీ.కు రూ.9 వరకు టోల్ ఛార్జీ చెల్లించాల్సి వస్తోంది. డ్రైవర్, సిబ్బంది జీతాలు, నిర్వహణ వ్యయం దీనికి అదనం. రాష్ట్ర సర్కారు బాదుడు లీటరుకు రూ.14 కేంద్ర ప్రభుత్వం 2016లో డీజిల్‌పై రూ.2 ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు కల్పించింది. ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని పేర్కొంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డీజిల్‌పై రూ.2 తగ్గించ లేదు. డీజిల్ «మీద రాష్ట్ర ప్రభుత్వం 22.25 శాతం చొప్పున పన్ను వసూలు చేస్తోంది. దీంతోపాటు అదనంగా లీటరుకు రూ.4 చొప్పున వ్యాట్ విధిస్తోంది. కేంద్రం డీజిల్‌పై మినహాయింపు ఇచ్చిన రూ.2 ఎక్సైజ్ డ్యూటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం వాహనదారుల నుంచి వసూలు చేసి ఖజానాకు మళ్లిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కంటే ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్ ధర అధికంగా ఉండటానికి ఇదే కారణం. ఫలితంగా లీటరు డీజిల్ కొనుగోలుపై లారీ యజమానులు, వాహనదారులు దాదాపు రూ.14 చొప్పున భారం భరించాల్సి వస్తోంది. ఇక పెట్రోల్ మీద 31 శాతం పన్ను, లీటర్‌కు రూ.4 వ్యాట్ చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోంది. 30 శాతం లారీలు షెడ్డుల్లోనే... డీజిల్ ధరలు, టోల్ చార్జీల పెరుగుదలతో సరుకు రవాణా రంగం బెంబేలెత్తిపోతోంది. రాష్ట్రంలో దాదాపు 3 లక్షల లారీలు ఉన్నాయి. సరుకు రవాణాకు కేంద్రస్థానంగా ఉన్న విజయవాడతోపాటు కృష్ణా జిల్లాలోనే 45 వేల లారీలు ఉండటం గమనార్హం. ఆర్థికభారంతో ఇప్పటికే దాదాపు 20 శాతం లారీలు షెడ్డులకే పరిమితమయ్యాయి. తాజాగా డీజిల్, టోల్ చార్జీల పెరుగుదలతో మరో 10 శాతం లారీలకు బ్రేకులు పడ్డాయి. సంక్షోభంలో రవాణా రంగం రాష్ట్రంలో సరకులను చేరవేసే లారీ రవాణా రంగంపై దాదాపు ఐదు లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. 30 శాతం లారీలు ఆగిపోవటంతో 1.50 లక్షల కుటుంబాల ఉపాధి ప్రమాదంలో పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే లారీ రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పన్ను మినహాయింపు ప్రజలకు అందించాలి ’కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న లీటరుకు రూ.2 పన్ను మినహాయింపును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రజలకు అందించాలి. డీజిల్ ధర రూ.62.50కి పరిమితం చేసేలా కేంద్ర ప్రభుత్వం తగిన విధానాన్ని రూపొందించాలి. టోల్ చార్జీలను తగ్గించడంతోపాటు ఏడాదికి ఒకసారి మాత్రమే చెల్లించే విధానాన్ని అమలు చేయాలి’ – ఈశ్వరరావు (రాష్ట్ర లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు) -
సైకిళ్ల నగరంలో షి'కారు'
సిటీ ఆఫ్ బైస్కిల్స్.. అంటే సైకిళ్ల నగరమని అర్థం.. ఎటు చూసినా సైకిళ్లే కనిపించడంతో ఒకప్పుడు మన భాగ్యనగరాన్ని అలా పిలిచేవారు.. మరి ఇప్పుడో...? రవాణా రంగ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది! రోడ్డెక్కి ఆటో కోసం, సిటీ బస్సు కోసం పడిగాపులు కాయాల్సిన పనిలేదు. ఆటోవాలాల ఆగడాలను భరించాల్సిన అవసరం లేదు. బెంబేలెత్తించే మీటర్ ట్యాంపరింగ్‌లు లేవు. అక్కడక్కడా ఒకట్రెండు ఘటనలు మినహా పూర్తిగా భద్రతతో కూడిన రవాణా సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అదీ ఆటోరిక్షా కంటే చౌకగా!! మొబైల్లో బుక్ చేస్తే క్యాబ్‌లు క్షణాల్లో ఇంటి ముందు వాలిపోతున్నాయి. సినిమాకు వెళ్లాలన్నా, షికారుకెళ్లాలన్నా, ఆసుపత్రికెళ్లాలన్నా, బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలకు ఎక్కడికి వెళ్లాలన్నా ఇప్పుడు సొంత వాహనాన్ని తలపించే క్యాబ్ ఉంది. ఉబెర్, ఓలా వంటి అంతర్జాతీయ సంస్థలతోపాటు మేరు, డాట్, గ్రీన్‌క్యాబ్స్, రేడియో క్యాబ్స్, షీ క్యాబ్స్ వంటి స్థానిక క్యాబ్ సంస్థలు ప్రయాణికులకు రవాణా సదుపాయం అందజేస్తున్నాయి. నగరంలో మారుతున్న రవాణా రంగ ముఖచిత్రంపై ఈ వారం ‘సాక్షి’ ఫోకస్.. – సాక్షి, హైదరాబాద్ నాటికి నేటికి ఎంత తేడా..? గుర్రపు బగ్గీలు, టాంగాలు, జట్కాలు మాత్రమే రవాణా సాధనాలుగా ఉన్న రోజుల్లో సైకిల్ దూసుకొచ్చింది. అదీ కొందరు సంపన్నుల వద్దే కనిపించేది. కాలక్రమంలో నగరపు రహదారులను సైకిళ్లు ముంచెత్తాయి. వాహనప్రియుల అభిరుచికి అనుగుణంగా రకరకాల మోడళ్లలో సైకిళ్లను రూపొందించి వినియోగంలోకి తెచ్చారు. 1930 నుంచి మొదలైన సైకిల్ ప్రస్థానం నాలుగైదు దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా సాగింది. సంపన్నులతో మొదలై నిరుపేదల వరకు సైకిల్‌ను వాడేవారు. అలా ఇంటింటికీ సైకిల్ వచ్చేసింది. దీనికి సమాంతరంగా సైకిల్ రిక్షాలు పరుగులు తీశాయి. 1980 నాటికి హైదరాబాద్‌లో సైకిల్ రిక్షాయే అతి ముఖ్యమైన రవాణా సాధనమైంది. నిజాం కాలం నుంచే సిటీ బస్సులు అందుబాటులో ఉన్నా పరిమితమైన రూట్లలోనే తిరిగేవి. 80వ దశాబ్దం నాటికి సిటీ బస్సుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగినా చిన్నచిన్న బస్తీలు, ఇరుకు గల్లీల్లోంచి గణగణ గంట మోగించుకొంటూ సైకిల్ రిక్షా దూసుకుపోయింది. ‘రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్...రిక్షావాలా జిందాబాద్.. మూడు చక్రములు గిరగిరా తిరిగితే మోటారు కారు బలాదూర్...’ అంటూ సైకిల్ రిక్షా హైదరాబాద్‌ను ఏలిన రోజులవి! ఎనభైల నాటికి సుమారు లక్ష వరకు సైకిల్ రిక్షాలు ఉండేవని అంచనా. అంతకు రెట్టింపు సంఖ్యలోనే సైకిళ్లు ఉండేవి. ఎనభయ్యో దశాబ్దం హైదరాబాద్ వాహనరంగాన్ని ఓ కుదుపు కుదిపింది. జట్కాలు, టాంగాలు, సైకిల్ రిక్షాల కంటే వేగంగా గమ్యాన్ని చేర్చే ఆటోరిక్షాలు వచ్చాయి. 1990 నాటికి సిటీ బస్సుతో పాటు ఆటోరిక్షాలు ప్రజా రవాణా రంగంలో అగ్రభాగంలో నిలిచాయి. సహజంగానే మొదట్లో ఉన్నత వర్గాలే వీటిని వినియోగించినా క్రమంగా ప్రతి ఒక్కరు ఆటోను వినియోగించే స్థాయికి వీటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. పోటెత్తిన వ్యక్తిగత వాహనాలు నగరం విస్తరిస్తున్నట్లుగానే అందుకు అనుగుణంగా వాహనాల సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతోంది. రవాణా శాఖ లెక్కల ప్రకారం 1970లో వ్యక్తిగత వాహనాలు కేవలం 9789. ప్రజా రవాణా వాహనాలు 5083 మాత్రమే ఉండేవి. 1980 నాటికి వ్యక్తిగత వాహనాల సంఖ్య 27,819కు, ప్రజా రవాణా వాహనాల సంఖ్య 10,437కు చేరింది. 1990లో సుమారు 2.22 లక్షల వాహనాలు నమోదయ్యాయి. ఆ తర్వాత వాహనాల వినియోగంలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. సైకిళ్లు, సైకిల్ రిక్షాలు, ఆటోలు తదితర వాహనాల కంటే బైక్‌ల సంఖ్య భారీగా పెరిగింది. ఇదే సమయంలో కార్ల వినియోగం ఎక్కువైంది. ఈ అభివృద్ధి మరింత వేగంగా కొనసాగింది. 2012 నాటికి అన్ని రకాల వాహనాలు కలిపి 36.72 లక్షలకు చేరాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 50 లక్షలకు చేరింది. అంటే సుమారు కోటి జనాభా ఉన్న నగరంలో అరకోటి వాహనాలు ఉన్నాయన్నమాట! ప్రతి మనిషికీ ఓ బైక్ అన్నట్టుగా వాహన రంగం విస్తరించింది. మధ్య తరగతి, వేతన జీవుల ఆదాయానికి అనుగుణంగా కార్ల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 35 లక్షలకు పైగా ద్విచక్రవాహనాలు ఉంటే 10 లక్షలకు పైగా కార్లున్నాయి. మిగతావి రవాణా రంగానికి చెందినవి. క్యాబ్ వైపే మొగ్గు ఎందుకు? - సికింద్రాబాద్ నుంచి హైటెక్‌సిటీకి వెళ్లేందుకు ఆటోరిక్షాలో కనీస చార్జీ రూ.20. ఆ తర్వాత ప్రతి కిలోమీటర్‌కు రూ.11 చొప్పున కనీసం రూ.500 వరకు చార్జీ అవుతుంది. కానీ అంతే దూరానికి క్యాబ్‌లు రూ.300 నుంచి రూ.350 వరకే లభిస్తున్నాయి. - పైగా నేరుగా ఇంటి నుంచే బయలుదేరి గమ్యానికి చేరుకొనే సదుపాయం ఉండడంతో ప్రతి ఒక్కరు క్యాబ్ వైపు మొగ్గుతున్నారు. - మూడేళ్ల క్రితం వరకు నగరంలో సుమారు 1.3 లక్షల ఆటోరిక్షాల్లో ప్రతి రోజు 15 లక్షల మంది పయనించగా ఇప్పుడు ఆ సంఖ్య 8 లక్షల నుంచి 10 లక్షల మధ్య ఉంది. - నగరంలో 3,550 సిటీ బస్సుల్లో రోజుకు 33 లక్షల మంది తిరుగుతున్నట్లు అంచనా. కానీ క్యాబ్‌లు, ఇతర ప్రైవేట్ వాహనాల పోటీ కారణంగా ఈ సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఒకప్పుడు 72 శాతం ఉన్న సిటీ బస్సు ఆక్యుపెన్సీ రేషియో ఇప్పుడు ఏకంగా 65 శాతానికి పడిపోయింది. - నగరంలో ప్రతిరోజు 121 ఎంఎంటీఎస్ సర్వీసుల్లో రోజుకు 1.4 లక్షల మంది పయనిస్తున్నారు. ట్రైన్ దిగిన ప్రయాణికులు తిరిగి క్యాబ్‌లను వినియోగిస్తుండటం గమనార్హం. క్షణాల్లో బుకింగ్‌లు.. నిమిషాల్లో పరుగులు.. శరవేగంగా దూసుకొచ్చిన క్యాబ్ సర్వీసులతో ఆటోరిక్షాలు, సిటీ బస్సుల గ్రాఫ్ క్రమంగా పడిపోయింది. గ్రేటర్లో సుమారు 2 లక్షల క్యాబ్‌లు ప్రతిరోజు 20 లక్షల మందికి పైగా రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ఒక్క శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికే ప్రతిరోజు సుమారు 10 వేల క్యాబ్‌లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఉబెర్, ఓలా మొబైల్ యాప్‌ల నుంచి రోజూ సుమారు 15 లక్షల మంది తమ గమ్యస్థానాలను బుక్ చేసుకుంటున్నట్లు అంచనా. మరో 5 లక్షల మంది మిగతా క్యాబ్‌లను వినియోగిస్తున్నారు. ఇందులో ఇండికా, ఆల్టో వంటి చిన్న కార్ల నుంచి ఇన్నోవా, స్విఫ్ట్ డిజైర్ వంటి లగ్జరీ వాహనాల వరకు అందుబాటులో ఉన్నాయి. ఓలా సంస్థ మరో అడుగు ముందుకేసి ఆటోరిక్షా సర్వీసులను కూడా అందజేస్తోంది. మరోవైపు మోటో పేరుతో ఉబెర్ బైక్‌లు అందుబాటులోకి వచ్చాయి. హైటెక్‌సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ కారణంగా ఇబ్బందులకు గురయ్యే ఐటీ ఉద్యోగులు, ఇతర వర్గాలు క్షణాల్లో కార్యాలయాలకు చేరుకొనేందుకు ఉబెర్ బైక్‌లను వినియోగిస్తున్నారు. ఓలా క్యాబ్‌లలో కేవలం రూ.36ల కనీస చార్జీలతో మొదలై ఒక కిలోమీటర్‌కు రూ.6 చొప్పున రవాణా సదుపాయం అందజేసే మైక్రో, మినీ వాహనాల నుంచి రూ.80ల కనీస చార్జీలతో సేవలందజేసే ప్రైమ్ వాహనాలున్నాయి. ఉబెర్ పూల్, ఉబెర్ ఎక్స్, ఉబెర్ గో, కేటగిరీలలో ప్రయాణికులకు రవాణా సదుపాయాలు అందుతున్నాయి. ట్యాక్సీ గిరాకీ దెబ్బతిన్నది ఇరవై ఏళ్ల నుంచి ట్యాక్సీ నడుపుతున్నా. క్యాబ్ పోటీకి తట్టుకోలేకపోతు న్నారు. క్యా బ్లు వచ్చిన తర్వాత గిరాకీ మొత్తం పడిపోయింది. క్యాబ్ తరహాలో మేం ఎక్కడికంటే అక్కడకు వెళ్ల లేం. చార్జీలు కూడా ట్యాక్సీలో ఎక్కువగానే ఉంటాయి. సికింద్రా బాద్ నుంచి బేగంపేట్‌కు వెళ్లాలంటే ట్యాక్సీ చార్జీ రూ.300 వరకు ఉంటుం ది. అదే క్యాబ్‌లో అయితే చాలా తక్కువ. ఏం చేయాలో అర్థం కావడం లేదు. రాత్రింబవళ్లు కష్టపడ్డా పెట్రోల్, డీజిల్ ఖర్చులు కూడా రావడం లేదు. – సయ్యద్ అఫ్సర్, ట్యాక్సీ డ్రైవర్ ఆటో ఎక్కడమే మరిచాను ఒకప్పుడు ఆటో ఎక్కువగా వినియోగించే వాణ్ని. రెండేళ్ల నుంచి పూర్తిగా మానేశాను. నాలుగైదు కిలోమీటర్లయినా సరే క్యాబ్లే ఎంతో సౌకర్యంగా ఉన్నాయి. ఎక్కడికంటే అక్కడికి వస్తారు. బేరమాడాల్సిన పనిలేదు. పైగా ఆటో కంటే తక్కువ చార్జీ. ఏసీ సదుపాయం ఉంటుంది. అనుకున్న చోటుకు అనుకున్న సమయానికి చేరుకోవచ్చు. ఒక ప్రయాణికుడికి ఇంతకంటే ఏం కావాలి? – హరీష్, ప్రైవేట్ ఉద్యోగి ట్రైన్ దిగగానే క్యాబ్ రెడీగా ఉంది కొద్దిక్షణాల్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో దిగు తామనగా క్యాబ్ బుక్ చేసుకున్నాం. స్టేషన్ బయటకు వచ్చే వరకు క్యాబ్ రెడీగా ఉంది. ఎలాంటి బేరసారాలు లేవు. డ్రైవ ర్ ఫొటో, బండి నంబర్, ఫోన్ నంబర్, సికింద్రాబాద్ నుంచి మల్కాజిగిరి వరకు అయ్యే రూ.135 చార్జీ వివరాలు అన్నీ ముందే ఫోన్లో నమోదయ్యాయి. నిశ్చిం తంగా బయలుదేరాం. క్యాబ్ సదుపాయం చాలా బాగుంది. – కుమారి మిగతా వాటి కన్నా క్యాబే బెటర్ బస్సు కోసం, ఆటో కోసం ఎదురు చూసే రోజులు పోయాయి. ప్రయాణానికి క్యాబ్ ఒక నిర్వచనంగా మారింది. మహిళలకు భద్రతాపరమైన కొన్ని ఇబ్బందులు ఉన్నమాట నిజమే కానీ, మిగతా ట్రాన్స్పోర్ట్ కంటే ఇది బెటర్ కదా. – రవి, శరణ్య దంపతులు మాకు కష్టంగానే ఉంది ఆటోలకు గిరాకీ లేదు. గతంలో రోజుకు రూ.1,200 వస్తే ఇప్పుడు రూ.800 కూడా రావడం లేదు. చాలా కష్టంగా ఉంది. ఆటో కిరాయి రూ.300, ఎల్పీజీ ఖర్చు రూ.250 మినహాయిస్తే ఒక రోజుకు రూ.200 కూడా గిట్టుబాటు కావడం లేదు. క్యాబ్‌ల వల్ల పోటీ బాగా పెరిగింది. – మహ్మద్ అబ్దుల్లా, ఆటో డ్రైవర్ ఆదాయం అంతంతే ఓలా, ఉబెర్, క్యాబ్‌ల వల్ల ప్రయాణికులకు బాగానే ఉన్నా ఈ రంగంలో పెరిగిన పోటీ కారణంగా ఆదాయం బాగా పడిపోయింది. రోజుకు 18 గంటలు కష్టపడితే తప్ప రూ.1000 లభించడంలేదు. గతంలో వారానికి రూ.1,500 ప్రోత్సాహకంగా ఇచ్చేవారు. ఇప్పుడు పూర్తిగా తగ్గించారు. కమీషన్లు, ట్యాక్స్‌లు చెల్లిస్తే మాకు దక్కేది కూడా తక్కువే. – బాబర్, క్యాబ్ డ్రైవర్ -
హైదరాబాద్‌లో రేపు లాజిస్టిక్స్ సదస్సు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రవాణా రంగంలో తెలంగాణలో ఉన్న వ్యాపార అవకాశాలను తెలియజేసేందుకు జూలై 14న హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో స్మార్ట్ లాజిస్టిక్స్ సమ్మిట్ జరుగనుంది. తెలంగాణలో ఇటువంటి కార్యక్రమం జరగనుండడం ఇదే తొలిసారి. దిగుమతి, ఎగుమతిదారులు, రిటైలర్లు, తయారీ కంపెనీలు, రవాణా సంస్థలు, టెక్నాలజీ కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయి. మారిటైమ్ గేట్‌వే మీడియా దీనిని నిర్వహిస్తోంది. -
రేపు విజయవాడలో రవాణా కార్మికుల బంద్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రవాణా రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లపై సర్కారు నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 28న విజయవాడలో బంద్ నిర్వహించనున్నట్లు ఆటో యూనియన్లు, కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ప్రకటించాయి. విజయవాడలో మంగళవారం రవాణా ఎగుమతులు, దిగుమతులు ఉండవని ఏపీ లారీ అసోసియేషన్ ఆదివారం తెలిపింది. పెద్ద నోట్ల రద్దుతో రవాణా రంగం కుదేలవడమే కాక, చలానా ఫీజులు భారీగా పెంచడంపై రాష్ట్రంలోని డ్రైవర్లు, వాహన యజమానులు ఆందోళనలో ఉన్నారు. ఫైనాన్స్ ఎండార్స్మెంట్ రూ. 100 నుంచి ఏకంగా రూ. 3 వేలకు పెంచడం, ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఆలస్యమైతే అదనంగా రోజుకు రూ. 50 వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
28న నగరంలో ఆటోల బంద్
అన్ని వర్గాలు సహకరించాలి ఆటో కార్మిక సంఘాల జేఏసీ పిలుపు గాంధీనగర్(విజయవాడ) : రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపనున్న జీవో 894ను రద్దు చేయాలని కోరుతూ ఈనెల 28న నిర్వహించనున్న ఆటోల బంద్‌ను విజయవంతం చేయాలని ఆటో కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. హనుమాన్‌పేటలోని దాసరి భవన్లో ఆటో కార్మిక సంఘాల జేఏసీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ సంక్షోభంలో చిక్కుకున్న రవాణా రంగానికి జీవోతో ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. అటువంటి తరుణంలో ఫీజులు, చార్జీలు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడం దుర్మార్గమన్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్లు, లైసెన్సుల రెన్యువల్స్, రిజిస్ట్రేషన్లు వంటి వాటి ఫీజులు భారీగా పెంచడం ఆటో కార్మికులకు ఉపాధిని దూరం చేసే కుట్రలో భాగమేనన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతూ మరోపక్క డిమాండ్‌కు తగ్గట్లుగా సీఎన్జీ సరఫరా చేయలేని ప్రభుత్వాలు ఇటువంటి నిరంకుశ జీవోలు తెచ్చి కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు, తక్షణమే జీవోను రద్దు చేయాలని కోరారు. సీపీఎం సిటీ కో ఆర్డినేటర్ దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ ఆటో కార్మికులకు సంక్షేమానికి బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చలానాలు, అపరాధ రుసుం పేరుతో లక్షలాది రూపాయలు గుంజుతూ ఆటో కార్మికులను అధికారులు వేధిస్తున్నారన్నారు. సమావేశంలో జేఏసీ నాయకులు మాగం ఆత్మారాము, పటేల్ శ్రీనివాసరెడ్డి, ఎల్.కుటుంబరావు, రూబెన్, దుర్గారావు, కరీముల్లా, ఇఫ్టూ నాయకులు దాడి శ్రీను, వైఎస్సార్ టీయూ నాయకులు కొండలరావు, రమేష్, ఏఐసీసీటీయూ నాయకులు కిషోర్ పాల్గొన్నారు. -
రవాణా బంద్
నేటి నుంచి నిరవధిక సమ్మె బంకుల వద్ద బారులు తీరిన వాహనాలు సమ్మెకు జిల్లాలోని పెట్రోల్ బంకులు దూరం! {పత్యామ్నాయ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష విశాఖపట్నం : రవాణా రంగం స్తంభించనుంది. ప్రైవేటురవాణారంగంలో కీలకమైన లారీలు, ట్రక్కులు, ట్యాంకర్లు ఎక్కడికక్కడ నిలిచిపోనుండడంతో సామాన్యులపై పెనుభారం చూపనుంది. ఈ ప్రభావంతో ఇప్పటికే ఆకాశానికి ఎగబాకిన నిత్యాసరాలు రవాణా సమ్మెతో చుక్కలనంటే అవకాశం ఉంది. అఖిల భారత మోటార్ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ పిలుపు మేరకు గురువారం నుంచి లారీ యజమానులు నిరవధిక సమ్మె చేపడుతున్నారు.ఆల్ గూడ్స్ వెహికల్స్ యూనియన్స్‌తో ఏర్పాటైన జేఏసీ ఇప్పటికే పలుదఫాలు సమావేశమై ఏర్పాట్లను పర్యవేక్షించింది. జిల్లాలో గూడ్స్ రవాణా చేసే వాహనాలు 25,617 ఉన్నాయి. వీటిలో లారీలు, ట్రక్కులు, ట్యాంకర్లు, టిప్పర్లు, వ్యాన్లు ప్రధానమైనవి. ఇప్పటికే చాలా వాహనాలు నిలిచిపోగా..మిగిలిన వాహనాలు గురువారం తెల్లవారుజామున ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. రవాణా సమ్మె వల్ల ఒక్క విశాఖ జిల్లాలోనే ప్రతీ రోజూ ప్రభుత్వానికి పన్నుల రూపం లో రావాల్సిన రూ.8 కోట్లకు పైగా ఆదాయానికి గండిపడనుంది. ఇకవాహనాలు రోడ్డెక్కే పరిస్థితి లేకపోవడం వలన ఎగుమతి.. దిగుమతుల లావాదేవీలు స్తంభించి పోనున్నాయి. వీటివిలువ మరో రూ.25 కోట్ల వరకు ఉంటుందని అంచనా. రవాణా సమ్మె వల్ల మన జిల్లా పరిధిలోనే మోటారు కార్మికులతో పాటు రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షమందికి పైగా కార్మికులకు ఉపాధి కరువయ్యే పరిస్థితి ఏర్పడనుంది. రాష్ర్టవ్యాప్తంగా బుధవారం అర్ధరాత్రి నుంచే పెట్రోల్ బంకు యజమానులు లారీ యజమానులతో కలిసి సమ్మెబాట పడుతున్నప్పటికీ విశాఖ జిల్లా పరిధిలోని బంక్ యజమానుల్లో మాత్రం బంద్‌లో పాల్గొనే విషయంపై స్పష్టత లేదు. జిల్లా పరిధిలో సుమారు 210 బంకులుండగా, వాటిలో 20 బంకులు నేరుగా హెచ్‌పీసీఎల్ నిర్విహ స్తోంది. హెచ్‌పీసీఎల్ బంకులు మినహా మిగిలిన ప్రైవేటు బంకులన్నీ సమ్మెబాట పట్టనున్నాయన్న వార్తల నేపథ్యంలో విశాఖ నగరంతో పాటు రూరల్ ప్రాంతంలోని బంకుల్లో వాహనదారులు బుధవారం మధ్యాహ్నం నుంచి బారులు తీరారు. ప్రతీ బంకు వద్ద భారీ క్యూలు దర్శనమిచ్చాయి. ముందు జాగ్రత్తగా క్యాన్లలో భారీగా పెట్రోల్, డీజిల్ నిల్వచేసుకుని తీసుకెళ్తున్న దృశ్యాలు బంకుల వద్ద కన్పించాయి. కాగా, జిల్లా పరిధిలో పెట్రోల్ బంకు యజమానులు లారీలు, ట్యాంకర్ల సమ్మెలో పాల్గొనడం లేదని విశాఖ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ కార్యదర్శి నారాయణరెడ్డి సాక్షికి తెలిపారు. మరొక పక్క నిత్యావసరాలు, కూర గాయల రవాణాకు ఆటంకం కలుగకుండా ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. నిత్యావసరాలకు ఆటంకం రానివ్వకండి: కలెక్టర్ లారీలు, ట్యాంకర్ల నిరవధిక సమ్మె నేపథ్యంలో జిల్లాలో నిత్యావసరాల సరఫరాకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ వెల్లడించారు. సమ్మెకాలంలో పాలు, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాలు, కూరగాయల రవాణాకు ఆటంకం కగలకుండా లారీ యజమానులు సహకరించేందుకు అంగీకరించాయని చెప్పారు. సమ్మె కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కలెక్టర్ యువరాజ్ బుధవారం రాత్రి రవాణాశాఖాధికారులు, లారీయజమానలు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షించారు. పెట్రోల్ బంకులన్నింటిలోనూ కనీసం నాలుగైదు రోజులకు సరిపడేలా ఆయిల్ నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో కూరగాయలు రవాణా చేసేందుకు అనుమతించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. నిత్యావసరాలు రవాణా చేసే వాహనాలను ఎవరైనా అడ్డగిస్తే పోలీసులు తగిన చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జేసీ జె.నివాస్, డీటీసీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
30న దేశ వ్యాప్త రవాణా సమ్మె
హైదరాబాద్: కేంద్రప్రభుత్వం తీసుకువస్తున్న రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ సేఫ్టీ బిల్లు-2015ను తిప్పి కొట్టాలని పలు ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి. రవాణా రంగ రక్షణ కోసం జాతీయ ఫెడరేషన్స్, అసోసియేషన్స్, స్వతంత్ర సంఘాలు ఉమ్మడిగా ఈ నెల 30న రోడ్ ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త రవాణా సమ్మె చేస్తున్నట్లు ప్రకటించాయి. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా సమావేశం జరిగింది. దేశ రవాణా వ్యవస్థను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువస్తుందని విమర్శించారు. సేప్టీ బిల్లు రూపంలో తీసుకువస్తున్న ఈ బిల్లు పూర్తిగా వాహన చోదకులకు బారంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ నేత రవిశంకర్, హెచ్ఎంఎస్ నాయకులు నర్సింహా, రాజిరెడ్డి, సీఐటీయూ నాయకులు భూపాల్, వీఎస్ రావు, ఐఎఫ్టీయూ నాయకులు తదితరులు పాల్గొన్నారు.