సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలతోపాటు ఇంధనం ధరలు కూడా మండుతున్నాయి. డీజిల్ ధరల మోత, టోల్ చార్జీల వాతలతో రోడ్డుపై పరుగులు తీయాల్సిన లారీలు షెడ్డులకు పరిమితమ వుతున్నాయి. రవాణా రంగానికి గుండెకాయ లాంటి విజయవాడలో తాజాగా రికార్డు స్థాయిలో లీటర్ డీజిల్ ధర రూ.71.73కి ఎగబాకటంతో పరిస్థితి మూలిగే నక్కమీద మీద తాటిపండు పడినట్‌లైంది. లీటరుకు రూ.2 చొప్పున కేంద్రం ఇస్తున్న మినహా యింపును రాష్ట్ర ప్రజలకు వర్తింపచేయకపో వటం, తాజాగా టోల్ చార్జీలూ అమాంతంగా పెరగటంతో పరిస్థితి దిగజారింది.
రవాణా రంగానికి పిడుగుపాటు
రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా డీజిల్ ధర రూ.71.73కు చేరుకోవడవంతో లారీ పరిశ్రమ పిడుగుపాటుకు గురైంది. మరోవైపు ఏప్రిల్ 1వతేదీ నుంచి టోల్ చార్జీలు కూడా 30 శాతం పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం కి.మీ.కు రూ.20.40 చొప్పున డీజిల్ వ్యయం అవుతోంది. ఇక కి.మీ.కు రూ.9 వరకు టోల్ ఛార్జీ చెల్లించాల్సి వస్తోంది. డ్రైవర్, సిబ్బంది జీతాలు, నిర్వహణ వ్యయం దీనికి అదనం.
రాష్ట్ర సర్కారు బాదుడు లీటరుకు రూ.14
కేంద్ర ప్రభుత్వం 2016లో డీజిల్‌పై రూ.2
ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు కల్పించింది. ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని పేర్కొంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డీజిల్‌పై రూ.2 తగ్గించ లేదు. డీజిల్ «మీద రాష్ట్ర ప్రభుత్వం 22.25 శాతం చొప్పున పన్ను వసూలు చేస్తోంది. దీంతోపాటు అదనంగా లీటరుకు రూ.4 చొప్పున వ్యాట్ విధిస్తోంది. కేంద్రం డీజిల్‌పై మినహాయింపు ఇచ్చిన రూ.2 ఎక్సైజ్ డ్యూటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం వాహనదారుల నుంచి వసూలు చేసి ఖజానాకు మళ్లిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కంటే ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్ ధర అధికంగా ఉండటానికి ఇదే కారణం. ఫలితంగా లీటరు డీజిల్ కొనుగోలుపై లారీ యజమానులు, వాహనదారులు దాదాపు రూ.14 చొప్పున భారం భరించాల్సి వస్తోంది. ఇక పెట్రోల్ మీద 31 శాతం పన్ను, లీటర్‌కు రూ.4 వ్యాట్ చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోంది.
30 శాతం లారీలు షెడ్డుల్లోనే...
డీజిల్ ధరలు, టోల్ చార్జీల పెరుగుదలతో సరుకు రవాణా రంగం బెంబేలెత్తిపోతోంది. రాష్ట్రంలో దాదాపు 3 లక్షల లారీలు ఉన్నాయి. సరుకు రవాణాకు కేంద్రస్థానంగా ఉన్న విజయవాడతోపాటు కృష్ణా జిల్లాలోనే 45 వేల లారీలు ఉండటం గమనార్హం. ఆర్థికభారంతో ఇప్పటికే దాదాపు 20 శాతం లారీలు షెడ్డులకే పరిమితమయ్యాయి. తాజాగా డీజిల్, టోల్ చార్జీల పెరుగుదలతో మరో 10 శాతం లారీలకు బ్రేకులు పడ్డాయి.
సంక్షోభంలో రవాణా రంగం
రాష్ట్రంలో సరకులను చేరవేసే లారీ రవాణా రంగంపై దాదాపు ఐదు లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. 30 శాతం లారీలు ఆగిపోవటంతో 1.50 లక్షల కుటుంబాల ఉపాధి ప్రమాదంలో పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే లారీ రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
పన్ను మినహాయింపు ప్రజలకు అందించాలి
’కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న లీటరుకు రూ.2 పన్ను మినహాయింపును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రజలకు అందించాలి. డీజిల్ ధర రూ.62.50కి పరిమితం చేసేలా కేంద్ర ప్రభుత్వం తగిన విధానాన్ని రూపొందించాలి. టోల్ చార్జీలను తగ్గించడంతోపాటు ఏడాదికి ఒకసారి మాత్రమే చెల్లించే విధానాన్ని అమలు చేయాలి’
– ఈశ్వరరావు (రాష్ట్ర లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు)
లారీ.. గుండె జారి!
Published Wed, Apr 4 2018 3:41 AM | Last Updated on Fri, Sep 28 2018 3:22 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment