
సాక్షి, అమరావతి: నాలుగు రోజులుగా కొనసాగుతున్న లారీల సమ్మె రవాణా రంగంపై తీవ్రప్రభావం చూపింది. ఎక్కడ లారీలు అక్కడే ఆగిపోయాయి. ఇప్పటి వరకు నిత్యావసర సరుకులు, పెట్రోలు, డీజిల్, మందులు, ఇతర అత్యవసర సరుకుల రవాణాకు మినహాయింపు నిచ్చారు. అయితే మంగళవారం నుంచి అత్యవసర సరుకుల రవాణాను సైతం నిలిపేసే విధంగా లారీల యజమానులు చర్చలు జరుపుతున్నారు. రాబోయే రెండు రోజుల్లో సమ్మెను మరింత ఉధృతం చేయాలని భావిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 5 లక్షలకు పైగా లారీలున్నాయి. ఏపీలో 3 లక్షల వరకు లారీలు ఉన్నాయి. 13 జిల్లాల్లో కలిపి గత నాలుగు రోజుల నుంచి 2.80 లక్షలు లారీలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. లారీల యజమానులు నిరవధిక బంద్ కొనసాగిస్తున్నా.. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏపీ వరకు బంద్ కారణంగా ప్రభుత్వానికి రోజుకు రూ.25 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా వేస్తున్నారు. లారీ యజమానులు రూ.30 నుంచి రూ.40 కోట్లు నష్టపోతున్నట్లు అంచనా. నాలుగు రోజుల నుంచి లారీల నిరవధిక బంద్‌తో ఏపీలో రూ.వెయ్యి కోట్ల లావాదేవీలు ఆగిపోయాయి.
కృత్రిమ కొరత సృష్టించేందుకు వ్యాపారుల యత్నాలు
లారీల సమ్మెతో నిత్యావసరల సరుకులపై ప్రభావం పడింది. వ్యాపారులు ముందుగానే పక్షం రోజులకు సరిపడా సరుకు దిగుమతి చేసుకుని నిల్వ చేసుకున్నారు. అయితే కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకునేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తగ్గిపోయిన డీజిల్ విక్రయాలు
మరోవైపు లారీల సమ్మెతో డీజిల్ విక్రయాలు భారీగా పడిపోయాయి. బంద్‌కు ముందు రోజుకు 8,000 లీటర్ల డీజిల్ అమ్మే వారమని, లారీల బంద్ కారణంగా అమ్మకాలు 3,000 లీటర్లకు పడిపోయాయని గుంటూరుకు చెందిన పెట్రోల్ బంక్ యజమాని ఒకరు వాపోయారు. లారీల సమ్మె కారణంగా అమ్మకాలు 70 శాతం వరకు పడిపోయినట్లు ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం డీలర్స్ అంచనా వేస్తోంది. సాధారణంగా రాష్ట్రంలో రోజుకు 1.03 కోట్ల లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతుండగా ఈ సమ్మె కారణంగా అమ్మకాలు 30 లక్షల లీటర్లకు పడిపోయనట్లు అంచనా వేస్తున్నట్లు ఫెడరేషన్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment