ముంబై : వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రజలకు ఉపశమనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ధరల తగ్గింపు ఎలా అనే సాధ్యాసాధ్యాలపై తీవ్ర కసరత్తు ప్రారంభించింది. ఇంధనంపై ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే, త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు 4 రూపాయల నుంచి 5 రూపాయల మేర కిందకి దిగిరానున్నాయి. ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన అనంతరం, ఆ ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించేందుకు రాష్ట్రాలను సైతం వాల్యు యాడెడ్ ట్యాక్స్(వ్యాట్)ను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించబోతోంది. ఈ క్రమంలోనే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా విక్రయాలపై వారి కమిషన్ తగ్గించుకోనున్నాయి.
మోదీ ప్రభుత్వంలో ఓ సీనియర్ ఉన్నతాధికారి పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు ప్లాన్ వివరాల గురించి హిందూస్తాన్ టైమ్స్‌కు చెప్పారు. ఉన్నతాధికారి ఇచ్చిన సమాచారం మేరకు.. ఇంధన ధరలు పెరగడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళనలో ఉందని, త్వరలోనే ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు ఉంటుందని తెలిసింది. కానీ రేట్ల తగ్గింపులో రాష్ట్రాలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ముఖ్య పాత్ర పోషించాలని పేర్కొన్నారు. కేవలం కేంద్రం ఒక్కటే ఈ భారాన్ని మోసలేదని, రాష్ట్రాలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలన్నీ సహకరిస్తే, ఇంధన ధరలపై వినియోగదారులకు ఉపశమనం కల్పించవచ్చని తెలిపారు. మరోవైపు లెఫ్ట్ పాలన నడుస్తున్న కేరళలో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్క రూపాయి తగ్గాయి. ఇంధనంపై విక్రయ పన్నును తగ్గించి తాము, పెట్రోల్, డీజిల్ ధరలను రూపాయి మేర తగ్గిస్తున్నట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది.
గ్లోబల్‌గా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండటంతో, దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరాయంగా పెరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. 2016-17లో దేశీయ బాస్కెట్‌లో బ్యారల్‌కు 47.56 డాలర్లు పలికిన క్రూడ్ ధర, 2017-18 నాటికి 56.43 డాలర్లకు పెరిగింది. మార్చి నాటికి ఇది 63.80 డాలర్లకు, ఏప్రిల్ నాటికి మరింత ఎగిసి 69.30 డాలర్లుగా నమోదైంది. ప్రస్తుతం బ్యారల్ క్రూడ్ ధర 75 డాలర్లుగా ఉంది. ఇది గతవారం అత్యధిక స్థాయిలో 80 డాలర్లుగా నమోదైన సంగతి తెలిసిందే. దేశీయంగా కూడా వరుసగా 16 రోజుల పాటు గరిష్ట స్థాయిలను నమోదు చేసిన ఇంధన ధరలు, నిన్నటి నుంచి పైసల్లో తగ్గుముఖం పట్టాయి. నేడు(గురువారం) దేశీయంగా లీటరు పెట్రోల్‌పై 7 పైసలు, లీటరు డీజిల్‌పై 5 పైసలు ధర తగ్గింది. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.78.42 నుంచి రూ.78.35కు దిగొచ్చింది. అదేవిధంగా డీజిల్ ధర కూడా లీటరు రూ.69.25గా నమోదైంది.
పెట్రోల్, డీజిల్ ధరలు స్కై రాకెట్‌లా దూసుకుపోతుండటంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ ధరలు పెరగడంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కూడా చెలరేగాయి. ఇంధన ధరలపై విధించే పన్నుల్లో కేంద్రం 25 శాతం, రాష్ట్రాలు విధించే పన్నులు 21.2 శాతం, డీలర్ మార్జిన్లు 4.7 శాతం ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment