
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్ ఎత్తివేత అనంతరం రవాణా రంగం ఆదాయం పుంజుకుంది. గత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో కోవిడ్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో రవాణా రంగం ఆదాయం గణనీయంగా పడిపోయింది. లాడ్‌డౌన్ సడలింపుల సమయం రెండో త్రైమాసికంలో కొంతమేర పుంజుకుంది. మూడో త్రైమాసికం నుంచి వృద్ధిలోకి వచ్చింది. గత ఆర్ధిక ఏడాది తొలి త్రైమాసికంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు రవాణా ఆదాయం –53.03 శాతంతో తిరోగమనంలో ఉంది.
రెండో త్రైమాసికంలో లాక్‌డౌన్ సడలింపులతో జూలై నుంచి సెప్టెంబర్ వరకు కొంత మేర పుంజుకుని –4.54 శాతం వృద్ది నమోదైంది. మూడో త్రైమాసికంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రవాణా రంగం ఆదాయంలో 7.07 శాతం వృద్ధి నమోదైంది. నాల్గో త్రైమాసికంలో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు ఏకంగా 21.71 శాతం వృద్ధి నమోదైంది. 2019 – 20లో రవాణా రంగం ఆదాయం రూ.3,175.45 కోట్లు ఉండగా 2020–21లో రూ.2,973.33 కోట్లు సమకూరింది. అంటే అంతకుముందు ఆర్ధిక ఏడాదితో పోల్చితే రవాణా రంగం ఆదాయం వృద్ధి –6.37 శాతంగా ఉంది.
పొరుగు రాష్ట్రాలతో పోల్చితే మెరుగు
పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీలో రవాణా రంగం ఆదాయం మెరుగ్గానే ఉంది. తమిళనాడు, ఢిల్లీ, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ మన రాష్ట్రం కన్నా వెనుకబడి ఉన్నాయి.