28న నగరంలో ఆటోల బంద్
- అన్ని వర్గాలు సహకరించాలి
- ఆటో కార్మిక సంఘాల జేఏసీ పిలుపు
గాంధీనగర్(విజయవాడ) : రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపనున్న జీవో 894ను రద్దు చేయాలని కోరుతూ ఈనెల 28న నిర్వహించనున్న ఆటోల బంద్‌ను విజయవంతం చేయాలని ఆటో కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. హనుమాన్‌పేటలోని దాసరి భవన్‌లో ఆటో కార్మిక సంఘాల జేఏసీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ సంక్షోభంలో చిక్కుకున్న రవాణా రంగానికి జీవోతో ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. అటువంటి తరుణంలో ఫీజులు, చార్జీలు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడం దుర్మార్గమన్నారు.
ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, లైసెన్సుల రెన్యువల్స్, రిజిస్ట్రేషన్లు వంటి వాటి ఫీజులు భారీగా పెంచడం ఆటో కార్మికులకు ఉపాధిని దూరం చేసే కుట్రలో భాగమేనన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతూ మరోపక్క డిమాండ్‌కు తగ్గట్లుగా సీఎన్‌జీ సరఫరా చేయలేని ప్రభుత్వాలు ఇటువంటి నిరంకుశ జీవోలు తెచ్చి కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు, తక్షణమే జీవోను రద్దు చేయాలని కోరారు. సీపీఎం సిటీ కో ఆర్డినేటర్ దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ ఆటో కార్మికులకు సంక్షేమానికి బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చలానాలు, అపరాధ రుసుం పేరుతో లక్షలాది రూపాయలు గుంజుతూ ఆటో కార్మికులను అధికారులు వేధిస్తున్నారన్నారు. సమావేశంలో జేఏసీ నాయకులు మాగం ఆత్మారాము, పటేల్ శ్రీనివాసరెడ్డి, ఎల్.కుటుంబరావు, రూబెన్, దుర్గారావు, కరీముల్లా, ఇఫ్టూ నాయకులు దాడి శ్రీను, వైఎస్సార్ టీయూ నాయకులు కొండలరావు, రమేష్, ఏఐసీసీటీయూ నాయకులు కిషోర్ పాల్గొన్నారు.