సమన్వయంతో ఆదాయార్జన | CM Jagan direction in review of revenue departments Andhra Pradesh | Sakshi
Sakshi News home page

సమన్వయంతో ఆదాయార్జన

Jul 18 2023 3:39 AM | Updated on Jul 18 2023 9:24 AM

CM Jagan direction in review of revenue departments Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఆదాయాన్ని ఆర్జించే విభాగాలు కలెక్టర్ల భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. క్రమం తప్పకుండా కలెక్టర్లతో సమీక్షలు నిర్వహించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే విధానాలపై దృష్టి సారించాలన్నారు. ఆర్థికశాఖ అధికారులు కలెక్టర్లతో నిరంతరం సంప్రదింపులు జరపడం ద్వారా ఆదాయాన్నిచ్చే శాఖలు మరింత బలోపేతమై ఎక్కడా చిల్లు పడకుండా ప్రభుత్వ ఖజా­నాకు ఆదాయం సమకూరుతుందన్నారు. ఆదాయా­ర్జన శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 2023 – 24 తొలి త్రైమాసికంలో వివిధ విభాగాల పనితీరు, విభాగాల వారీగా రెవెన్యూ వసూళ్లను సమీక్షించి పలు సూచనలు చేశారు.

వాహన కొనుగోలుదారులను ప్రోత్సహిస్తూ..
రవాణా రంగంలో సంస్కరణలపై దృష్టి సారించి ఇతర రాష్ట్రాల్లో విధానాలను పరిశీలించి అత్యుత్తమ పద్ధతులను అమలు చేయాలని సీఎం సూచించారు. వాహనాలపై పన్నుల విషయంలో కొత్త విధానాలను అన్వేషించాలని, అయితే అవి కొనుగోలు దారులను ప్రోత్సహించేలా ఉండాలని స్పష్టం చేశారు. 

నాటు సారా కుటుంబాలకు ప్రత్యామ్నాయం
నాటుసారా తయారీలో నిమగ్నమైన కుటుంబాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను చూపాలని సీఎం ఆదేశించారు. ఆయా కుటుంబాలకు ఈ కార్యక్రమం కింద ఇప్పటికే రూ.16.17 కోట్లు పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొనగా ఈ కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని ముఖ్యమంత్రి సూచించారు. నాటుసారా తయారీదారుల్లో చైతన్యం కల్పించడంతోపాటు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను సమర్థంగా అమలు చేయాలని సూచించారు.

పారదర్శకతతో పెరిగిన గనుల ఆదాయం 
భూగర్భ గనులు – ఖనిజాల శాఖ, ఏపీఎండీసీ ఆదాయానికి సంబంధించి గతంతో పోలిస్తే భారీ వ్యత్యాసం ఉందని ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. ఈ విభాగాల పరిధిలో ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. లీకేజీలను అరికట్టడంతోపాటు పారదర్శక విధానాలు, సంస్కరణలతో ఇది సాధ్యమైందని చెప్పారు.
ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  

మూడేళ్లలో 32 శాతం సీఏజీఆర్‌
గనులు–ఖనిజాల శాఖలో గత మూడేళ్లలో 32 శాతం సీఏజీఆర్‌ (కాంపౌండ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌) నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 2018–19లో కేవలం రూ.1,950 కోట్లు ఆదాయం సమకూరగా 2022–23 నాటికి రూ.4,756 కోట్లకు పెరిగినట్లు చెప్పారు. కార్యకలాపాలు నిలిచిపోయిన 2,724 మైనింగ్‌ లీజుల్లో 1,555 చోట్ల పునఃప్రారంభమైనట్లు తెలిపారు. మిగిలిన చోట్ల కూడా పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఏపీఎండీసీ ఆర్థికంగా పరిపుష్టం
ఏపీఎండీసీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగు పడినట్లు అధికారులు తెలిపారు. 2020–21లో ఏపీఎండీసీ ఆదాయం రూ.502 కోట్లు కాగా 2022–23లో రూ.1,806 కోట్లకు పెరిగింది. 2023 – 24లో ఏపీఎండీసీ ఆదాయం రూ.4 వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. మంగంపేట బైరటీస్, సులియారీ బొగ్గు గనుల నుంచి ఏపీఎండీసీకి భారీగా ఆదాయం సమకూరుతోంది. సులియారీలో ఈ ఏడాది 5 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుదల
గతేడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి జూలై 15 వరకూ రూ.2,291.97 కోట్లు ఆదాయం రాగా ఈ ఏడాది అదే కాలానికి సంబంధించి రూ.2,793.7 కోట్లు ఆర్జించినట్లు చెప్పారు. భూముల రీ సర్వే పూర్తైన గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు మొదలైనట్లు తెలిపారు. గ్రామ సచివాలయాల్లో దాదాపు 5 వేల రిజిస్ట్రేషన్‌ సేవలు జరిగాయని, వీటి ద్వారా రూ.8.03 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు.

సమీక్షలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, అటవీ పర్యావరణశాఖ స్పెషల్‌ సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, ఎక్సైజ్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ఆర్థికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ఎస్‌ రావత్, మైనింగ్‌ స్పెషల్‌ సీఎస్‌ గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్‌ గుప్త, రోడ్డు రవాణా, భవనాలశాఖ కార్యదర్శి పీఎస్‌ ప్రద్యుమ్న, రవాణాశాఖ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్, రాష్ట్ర పన్నుల చీఫ్‌ కమిషనర్‌ ఎం.గిరిజాశంకర్, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ వివేక్‌ యాదవ్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ కోటేశ్వరరావు, రిజిస్ట్రేషన్లు–స్టాంపుల శాఖ కమిషనర్‌ రామకృష్ణ, ఏపీ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ డి.వాసుదేవరెడ్డి, మైన్స్‌ డైరెక్టర్‌ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

జీఎస్టీ రయ్‌.. మద్యం డీలా!
► ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్‌ వరకు రూ.7,653.15 కోట్ల జీఎస్టీ పన్నుల వసూళ్లు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 23.74 శాతం పెరుగుదల నమోదు. 
► గత సర్కారు హయాంతో పోలిస్తే గణనీయంగా తగ్గిన మద్యం విక్రయాలు. 2018–19లో లిక్కర్‌ అమ్మకాలు 384.36 లక్షల కేసులు కాగా 2022 – 23లో కేవలం 335.98 లక్షల కేసుల విక్రయాలు. ఇదే సమయానికి సంబంధించి గతంలో బీరు అమ్మకాలు 277.16 లక్షల కేసులు కాగా ఇప్పుడు 116.76 లక్షల కేసులు మాత్రమే విక్రయం.
► 2018–19 ఏప్రిల్, మే, జూన్‌తో పోలిస్తే  2023–24 తొలి త్రైమాసికంలో బీరు అమ్మకాలు మైనస్‌ 56.51 శాతం తక్కువగా, లిక్కర్‌ విక్రయాలు మైనస్‌ 5.28 శాతం తక్కువగా నమోదు కావడం గమనార్హం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement