సాక్షి, అమరావతి: న్యాయ వివాదాల కారణంగా పేదలకు ఇళ్ల పట్టాల మంజూరులో జాప్యం జరగకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. కోర్టు కేసుల పరిష్కారంలో జాప్యమయ్యే చోట పేదలకు ప్రత్యామ్నాయ ఇళ్ల స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. కోర్టు వివాదాల్లో ఉన్న ఇళ్ల స్థలాలపై వెంటనే ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. గృహ నిర్మాణాలపై సీఎం సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
విశాఖలో 1.43 లక్షల మందికి ఇళ్ల పట్టాలు
కోర్టు వివాదాలు తొలగిపోవడంతో ఏప్రిల్ 28వతేదీన విశాఖలో 1.43 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. పట్టాల పంపిణీ పూర్తి కాగానే ఇళ్ల నిర్మాణ పనులు జూన్ నాటికి ప్రారంభమవుతాయని వివరించారు. దాదాపు 63 లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణం కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. భూమిని చదును చేయడంతో పాటు అప్రోచ్ రోడ్ల నిర్మాణం, లే అవుట్లలో నీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఐదువేలకు పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతున్న చోట సామగ్రి భద్రపరిచేందుకు వీలుగా గోడౌన్ల నిర్మాణం చేపడుతున్నామని అధికారులు చెప్పారు. 66 గోడౌన్లకుగానూ 47 గోదాముల నిర్మాణం ప్రారంభమైనట్లు తెలిపారు.
గృహ నిర్మాణాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
నాణ్యతలో తేడా వస్తే కఠిన చర్యలు
పేదల ఇళ్లకు ఇచ్చే విద్యుత్తు ఉపకరణాలు అత్యంత నాణ్యతతో ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. బల్బులు, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు తదితరాలన్నీ నాణ్యమైనవే ఉండాలన్నారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
► ప్రజా ప్రతినిధులకు సత్కారం పేదల ఇళ్ల నిర్మాణంలో చురుగ్గా పాలు పంచుకుంటున్న ప్రజాప్రతినిధులను సత్కరించాలని సమావేశంలో నిర్ణయించారు. వారు చొరవ చూపిన చోట నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. మండలానికి ఒక సర్పంచ్, మున్సిపాల్టీకి ఒక కౌన్సిలర్, జిల్లాకు ఒక ఎంపీపీ, జడ్పీటీసీకి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు.
ఇళ్లు పూర్తయ్యే నాటికి కనీస సదుపాయాలు
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యే నాటికి తాగునీరు, విద్యుత్తు లాంటి ప్రాథమిక అవసరాలను కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అనంతరం కాలనీలకు సామాజిక, మౌలిక సదుపాయాలను వేగంగా సమకూరుస్తూ ముందుకు సాగాలని నిర్దేశించారు. సమగ్ర ప్రణాళికను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా క్రమంలో కాలనీల్లో పనులు చేపట్టి ముందుకు సాగాలన్నారు. ఆయా విభాగాలన్నీ సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. జగనన్న కాలనీల్లో అభివృద్ధి పనులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు మరింత వేగంగా కొనసాగేలా మున్సిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని సూచించారు. ఇళ్ల నిర్మాణాల్లో ప్రగతి ఆధారంగా వారి పనితీరును మదింపు చేస్తామని స్పష్టంచేశారు. ఇకపై ఈ సమీక్షలో మున్సిపల్ కమిషనర్లు కూడా పాల్గొనాలని సూచించారు.
సంపూర్ణ గృహహక్కుపై..
జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపైనా ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఇప్పటివరకూ పథకాన్ని 10.2 లక్షల మంది వినియోగించుకున్నారని, 6.15 లక్షల మంది రిజిస్ట్రేషన్లు పూర్తైనట్లు అధికారులు వివరించారు. మిగిలినవారికి కూడా వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రక్రియ ముందుకు సాగుతున్న కొద్దీ మరింత మంది ముందుకు వస్తారన్నారు.
టిడ్కో ఇళ్ల నిర్వహణపై మార్గదర్శకాలు
టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. టిడ్కో ఇళ్లు అత్యంత పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, దీనికోసం మార్గదర్శకాలు రూపొందించాలని సూచించారు.
ఆదర్శంగా ఎంఐజీ లే అవుట్లు
మధ్య తరగతికి ఎంఐజీ ప్లాట్ల పథకంపై కూడా ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. పట్టణాలు, నగరాలున్న 116 నియోజకవర్గాల్లో ఎంఐజీ ప్లాట్ల పథకానికి తొలుత ప్రాధాన్యత ఇవ్వాలని, మిగిలిన చోట్ల కూడా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే 41 నియోజకవర్గాల్లో 4127.5 ఎకరాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వివాదాలు, చిక్కులు లేనివిధంగా క్లియర్ టైటిల్‌తో సరసమైన ధరలకు ఈ ప్లాట్లు అందచేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలకు సంబంధించి లే అవుట్లలో అన్నిరకాల ప్రమాణాలను పాటిస్తూ ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఇతర లే అవుట్లకు మార్గదర్శకంగా ప్రభుత్వ ఎంఐజీ లే అవుట్లు ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. సమావేశంలో ఇంధన, అటవీ, పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, గృహ నిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై. శ్రీలక్ష్మి, ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ ఏడాది ఇళ్ల నిర్మాణానికి రూ.13,105 కోట్లు
ఇళ్ల పట్టాలు కాకుండా కేవలం గృహ నిర్మాణం కోసమే గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.3,600 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.13,105 కోట్లు గృహ నిర్మాణం కోసం వ్యయం చేయనుంది. ఈ ఏడాది 35 లక్షల టన్నుల సిమెంటు, 3.46 లక్షల టన్నుల స్టీల్‌ను ఇళ్ల నిర్మాణం కోసం వినియోగించనుంది. తొలి దశలో భాగంగా దాదాపు 15.60 లక్షల ఇళ్లను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment