AP CM YS Jagan 3 New Paediatric Car Centres To Prepare For COVID-19 Third Wave - Sakshi
Sakshi News home page

YS Jagan: 3 ప్రాంతాల్లో చిన్నారులకు.. అత్యుత్తమ ఆస్పత్రులు

Published Tue, Jun 8 2021 3:08 AM | Last Updated on Tue, Jun 8 2021 1:54 PM

CM YS Jagan Mandate as part of Covid preparations - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ముప్పునైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా రాష్ట్రంలో ప్రత్యేకంగా చిన్నారుల కోసం మూడు చోట్ల అత్యాధునిక సదుపాయాలతో కొత్త ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. విశాఖపట్నం, తిరుపతితోపాటు కృష్ణా–గుంటూరు ప్రాంతంలో మూడు అత్యుత్తమ పీడియాట్రిక్‌ కేర్‌ సెంటర్లను నెలకొల్పాలని సూచించారు. చిన్న పిల్లల కోసం ఏర్పాటయ్యే పీడియాట్రిక్‌ కేర్‌ సెంటర్లను ఒక్కొక్కటి రూ.180 కోట్లతో నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కోవిడ్‌ థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు అందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో చిన్నారులను భద్రంగా కాపాడుకునేందుకు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్షలో సమగ్రంగా చర్చించారు. థర్డ్‌వేవ్‌పై అనాలసిస్, డేటాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. థర్డ్‌ వేవ్‌ వస్తుందా? లేదా? అన్నదానిపై శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదన్నారు. చిన్నారులకు టీకాల కార్యక్రమం సక్రమంగా కొనసాగేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. థర్డ్‌వేవ్‌పై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలని, పిల్లలకు పౌష్టికాహార పంపిణీ సవ్యంగా కొనసాగేలా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ..
కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

గుర్తించేందుకు ఆశా, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ
ఒకవేళ కోవిడ్‌ థర్డ్‌వేవ్‌ కనుక వస్తే పిల్లల్లో దాని ప్రభావం ఎలా ఉంటుంది? తీవ్రత ఏ రకంగా ఉంటుందన్న దానిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. పీడియాట్రిక్‌ సింప్టమ్స్‌ (పిల్లల్లో కోవిడ్‌ లక్షణాలు) గుర్తించేందుకు ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలి. ఈమేరకు ఇప్పటి నుంచే శిక్షణ ఇచ్చేలా అధికారులు చర్యలు చేపట్టాలి.

టీచింగ్‌ ఆస్పత్రుల్లో పీడియాట్రిక్‌ వార్డులు
అన్ని టీచింగ్‌ ఆస్పత్రుల్లో పీడియాట్రిక్‌ వార్డులు ఏర్పాటు చేయాలి. పిల్లలకు అత్యుత్తమ వైద్యం అందించేలా వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి. జాతీయ ప్రమాణాలను అనుసరించి పీడియాట్రిక్‌ వార్డులను ఏర్పాటు చేయాలి. పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులను పరిశీలించి అవకాశం ఉన్నచోట పిల్లలకు చికిత్స అందించేందుకు ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించాలి.
 

అన్నీ సమకూర్చుకుని సిద్ధంగా ఉండాలి
థర్డ్‌వేవ్‌ వస్తుందనే అనుకుని కావాల్సిన మందులను సిద్ధం చేసుకోండి. అప్పటికప్పుడు మందులు కావాలంటే దొరకవు. ముందుగానే కావాల్సిన నాణ్యమైన మందులను తెచ్చుకోవాలి. డాక్టర్లను గుర్తించడంతో పాటు అవసరమైతే రిక్రూట్‌ చేయడానికి చర్యలు తీసుకోవాలి.

పౌష్టికాహారంపై పర్యవేక్షణ
ప్రస్తుతం సంపూర్ణ పోషణ కింద డ్రై రేషన్‌ సవ్యంగా ఇస్తున్నామా? లేదా? గోరుముద్ద కింద కూడా డ్రై రేషన్‌ సవ్యంగా ఇస్తున్నామా? లేదా? అన్నదానిపై పర్యవేక్షణ చేయాలి. ఇవన్నీ సక్రమంగా చేసుకుంటూ వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకుంటూ ముందుకు వెళ్తే మనం ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉంటాం. పిల్లలకు వైద్యం అందించాల్సిన ఆస్పత్రులను ముందుగానే ఎం ప్యానెల్‌ కోసం గుర్తించాలి. ప్రైవేట్‌ టీచింగ్‌ ఆస్పత్రులకు కూడా థర్డ్‌వేవ్‌పై సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలి. ఆస్పత్రుల వారీగా ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లపై కూడా దృష్టి పెట్టాలి. వీటికి సంబంధించి జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు నివేదించాలి.
– సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం.టీ.కృష్ణబాబు, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్, వ్యాక్సినేషన్‌) ఎం.రవిచంద్ర, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, 104 కాల్‌ సెంటర్‌ ఇన్‌ఛార్జ్‌ ఏ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్‌ ఏ.మల్లిఖార్జున్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు, ఏపీ హెల్త్‌ సిస్టం స్ట్రెంగ్తనింగ్‌ ప్రాజెక్టు (ఏపీహెచ్‌ఎస్‌ఎస్‌పి) ప్రాజెక్టు డైరెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్, ఆయుష్‌ కమిషనర్‌ వి.రాములు తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement