వైద్యం, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం తదితర రంగాల్లో మనం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవు. ఎంఎస్‌ఎంఈ రంగంలో మనం చేస్తున్న కృషి కూడా మరే రాష్ట్రంలోనూ లేదు. ఎస్‌డీజీకి సంబంధించి మనం చాలా బాగా పని చేస్తున్నాం. దేశంలో తొలి స్థానంలో నిలబడ్డాం. మరిన్ని ఫలితాలు రావాలంటే సమర్థవంతమైన మానిటరింగ్ (పర్యవేక్షణ), రిపోర్టింగ్ (నివేదన) అవసరం అన్నది చాలా ముఖ్యం.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: నవరత్నాలతో రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు రూ.1.65 లక్షల కోట్లను డీబీటీ (నేరుగా నగదు బదిలీ) ద్వారా జమ చేసిందని, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. దేశంలో ఈ తరహా డీబీటీ విధానం ఎక్కడా లేదన్నారు. ప్రతి రంగంలోనూ ప్రస్ఫుటమైన మార్క్ (ముద్ర) వేయగల పథకాలు మన రాష్ట్రంలో ఉన్నాయని, ఇవన్నీ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో (ఎస్‌డీజీల్లో) ప్రతిబింబించేలా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ – సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్) సాధనపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్‌డీజీకి సంబంధించి కచ్చితంగా ఎస్‌ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) ఉండాలని, వాటిని నిరంతరం పాటించాలని స్పష్టం చేశారు. ఎస్‌డీజీకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అప్‌డేట్ చేయడంతో పాటు వివిధ పథకాల ద్వారా అందిస్తున్న ప్రయోజనాలను ఎప్పటికప్పుడు సమగ్రంగా రిపోర్ట్ చేయాలని మార్గ నిర్దేశం చేశారు. ఎస్‌డీజీల సాధనపై ఎన్ని రోజులకు సమావేశం కావాలన్న దానిపై నిర్ధిష్టమైన సమాచారం ఉండాలని, గతేడాది ఇది లోపించిందని.. ఇక నుంచి అలా జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. మూడు నెలల పాటు.. ప్రతి నెలా సీఎస్ ఆధ్వర్యంలో రెండు దఫాలుగా సమావేశం కావాలని ఆదేశించారు.
ఎస్‌డీజీ సమావేశాల్లో కార్యదర్శులు పాల్గొనాలని, కలెక్టర్లతోనూ మాట్లాడాలని సూచించారు. ఎస్‌డీజీ రిపోర్టింగ్ మానిటరింగ్ అనేది సక్రమంగా జరగనప్పుడు ఎంత బాగా పని చేసినా లాభం ఉండదని చెప్పారు. ఎస్‌డీజీల్లో ప్రస్తుతం జాతీయ స్థాయిలో పోటీ పడటం ద్వారా.. దేశంలో తొలి స్థానంలో నిలబడటానికి అవకాశం వచ్చిందని, గతంలో ఈ పరిస్థితి లేదన్నారు. విశాఖపట్నంలో అత్యాధునిక వసతులతో ఐటీ హబ్‌ను నిర్మించాలని, ఇందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
కలెక్టర్లు ఎస్‌డీజీ రిపోర్టును పర్యవేక్షించాలి
► ఏ పథకం ఎప్పుడు వస్తుందనేది ముందుగానే క్యాలెండర్ ప్రకటిస్తున్నాం. డీబీటీ ద్వారా బటన్ నొక్కిన వెంటనే నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకే డబ్బులు జమ అవుతున్నాయి. అవినీతి, వివక్షకు తావు లేకుండా శాచ్యురేషన్ మోడ్‌లో ఈ పథకాలు అందిస్తున్నాం.
► జిల్లాల్లో కలెక్టర్లు ప్రతి నెలా ఎస్‌డీజీ రిపోర్టును మానిటరింగ్ చేసే బాధ్యత తీసుకోవాలి. సచివాలయం నుంచి డేటా జిల్లా స్థాయికి చేరాలి. విభాగాధిపతుల పర్యవేక్షణ అవసరం. ఇది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ.
► ప్రతి సంవత్సరం మనం క్యాలెండర్ ఇచ్చి బటన్ నొక్కి ఎంఎస్‌ఎంఈలకు టైం ప్రకారం ఇన్సెంటివ్‌లు ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా ఇలా జరగడం లేదు. గతంలో రాష్ట్రంలో కూడా ఇది జరగలేదు. గత ప్రభుత్వ ఇన్సెంటివ్‌లకు సంబంధించిన బకాయిలు కూడా మనమే చెల్లించాం.
ఎస్‌డీజీల్లో అన్నీ ప్రతిబింబించాలి..
► జగనన్న అమ్మఒడి, టీఎంఎఫ్ (టాయ్‌లెట్ మెయింటెనెన్స్ ఫండ్), ఎస్‌ఎంఎఫ్ (స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్), సంపూర్ణ పోషణ, గోరుముద్దపై సరిగా రిపోర్ట్ చేయలేదు. విద్యా కానుక, విద్యా దీవెన, పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్, రూ.20 వేలు వసతి దీవెన గతంలో ఎప్పుడూ జరగలేదు. వీటన్నింటిపై ఎప్పటికప్పుడు సమాచారం అప్‌డేట్ చేయాలి.
► ఆరోగ్య రంగానికి సంబంధించి ఆరోగ్యశ్రీలో దాదాపు 3 వేల చికిత్సా విధానాలు, 16 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, నాడు–నేడుతో మొత్తం ఆస్పత్రుల పునర్ వ్యవస్థీకరణ, ఆరోగ్య ఆసరా ఇవేవీ గతంలో లేవు.
► మహిళా సాధికారతలో చేయూత, ఆసరా, అమ్మఒడి, సున్నా వడ్డీ, మహిళల పేరుపై ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ గతంలో ఎప్పుడూ జరగలేదు. ఒక్క బటన్ నొక్కి ప్రభుత్వం లబ్ధిదారులకు రూ.లక్షా 65 వేల కోట్లు డీబీటీ ద్వారా జమ చేసింది. దేశంలో ఈ తరహా డీబీటీ విధానం లేదు. ఇవన్నీ కచ్చితంగా ఎస్‌డీజీల్లో ప్రతిబింబించాలి.
► విద్యా శాఖలో నూటికి నూరు శాతం ఎస్‌డీజీ లక్ష్యాలను సాధించాలి. దాదాపు 7 నుంచి 8 రంగాలలో వైద్య ఆరోగ్య రంగం, విద్య, మహిళా సాధికారత, గృహ నిర్మాణ శాఖ, పంచాయతీ రాజ్, సోషల్ జస్టిస్, మున్సిపల్ శాఖ, పట్టణాభివృద్ధిలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఎస్‌డీజీల్లో ప్రతిబింబించాలి. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి.
► సమీక్షా సమావేశంలో సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కే వి రాజేంద్రనాథ్ రెడ్డి, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment