డ్రైనేజీ.. కరెంట్‌.. నీళ్లు  | CM Jagan high-level review on Navaratnalu Houses For Poor People | Sakshi
Sakshi News home page

డ్రైనేజీ.. కరెంట్‌.. నీళ్లు 

Published Fri, Sep 23 2022 3:33 AM | Last Updated on Fri, Sep 23 2022 7:40 AM

CM Jagan high-level review on Navaratnalu Houses For Poor People - Sakshi

క్యాంప్‌ కార్యాలయంలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇప్పటిదాకా మొత్తం 21.25 లక్షల ఇళ్లను మంజూరు చేశాం. ఆ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. ప్రాధాన్యత పనులపై ప్రధానంగా దృష్టి సారించి, ప్రణాళిక మేరకు పనులు చేపట్టాలి. చాలా చోట్ల కాలనీలు కాదు.. ఏకంగా పట్టణాలనే నిర్మిస్తున్నందున మౌలిక సదుపాయాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా శ్రద్ధ పెట్టాలి. 
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌   

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు పక్కా గృహాలు నిర్మించి ఇచ్చే ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రధానంగా డ్రైనేజీ, కరెంట్, తాగు నీటిపై దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు మరింత కృషి చేయాలని, పనులు వేగంగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’పై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో గురువారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా గత సమీక్షలో సీఎం జారీ చేసిన ఆదేశాల అమలు తీరును అధికారులు వివరించారు. ఈ పథకం కింద 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.4,318 కోట్ల విలువైన పనులు చేశామని తెలిపారు. తొలి దశలో 15.6 లక్షలు, రెండో దశలో 5.65 లక్షలు.. మొత్తంగా 21.25 లక్షల ఇళ్లను ఇప్పటి వరకు మంజూరు చేశామన్నారు. ఇన్నాళ్లూ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగాయని, ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో మందకొడిగా సాగుతున్నాయని తెలిపారు. వర్షాలు తగ్గగానే మళ్లీ పనులు ఊపందుకుంటాయన్నారు.

అక్టోబర్‌ నుంచి వారానికి 70 వేల ఇళ్ల చొప్పున ఒక దశ నుంచి వేరే దశకు నిర్మాణం మారేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఇంటిని ప్రభుత్వమే నిర్మించి ఇచ్చే ఆప్షన్‌–3 ఎంపిక చేసుకున్న ఇళ్ల పనులు కూడా వేగవంతంగా చేపడుతున్నామని చెప్పారు. ఆప్షన్‌–3 ఇళ్లు నిర్మించే కాంట్రాక్టర్లతో వారం వారం పనుల పురోగతిపై సమీక్ష చేస్తున్నామని తెలిపారు. పనులు పూర్తయిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పజెబుతున్నామని చెప్పారు. ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న 96.8 వేల మందికి పట్టాలు ఇచ్చామన్నారు. మరో 1.07 లక్షల మందికి పట్టాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నామని చెప్పారు. ఈ క్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..  
 
ఏజెన్సీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి 
► పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోండి. గృహ నిర్మాణంలో వెనకబడ్డ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.  

► ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే సరికి వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో డ్రైనేజీ, కరెంటు, తాగు నీరు వంటి కనీస మౌలిక వసతులు కల్పించాలి. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడొద్దు. ప్రాధాన్యత పనులపై స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకుని, ఆ మేరకు అడుగులు ముందుకు వేయాలి. మరో వైపు ఇళ్ల నిర్వహణపైనా ప్రత్యేక దృష్టి పెట్టండి. లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు త్వరగా మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలి.    

► ఆప్షన్‌–3 ఇళ్ల నిర్మాణాలను వేగంగా చేపట్టండి. స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) ప్రకారం కాంట్రాక్ట్‌ సంస్థలు లే అవుట్‌లలో బ్రిక్స్‌ ప్లాంట్‌ల ఏర్పాటు, ఇతర చర్యలు చేపట్టాయో లేదో పరిశీలించాలి. నిర్మాణమైన ఇళ్లలో సమకూర్చే ఫ్యాన్లు, బల్బులు, ట్యూబ్‌ లైట్లు నాణ్యమైనవిగా ఉండాలి. కాలనీల రూపంలో కొన్ని చోట్ల ఏకంగా మున్సిపాలిటీలే వెలుస్తున్నాయి. అలాంటి చోట్ల మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పౌర సేవలు తదితర అంశాలపై ప్రత్యేక ప్రణాళిక ఉండాలి. 

► ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి అన్ని టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించాలి. ఈ ఇళ్లలో మౌలిక సదుపాయాల కల్పన పనులను అత్యంత నాణ్యతతో చేపట్టాలి. 
ఈ సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీఎస్‌ సాయి ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ డాక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా, టిడ్కో ఎండీ శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement