సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లక్షలాది మంది నిరుపేదలు తమ సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు నిర్మాణ పనుల్లో వేగం పెంచారు. వాస్తవానికి ఈ ఏడాది వర్షాలు అధికంగా కురవడంతో నిర్మాణ పనుల్లో కొంత జాప్యం జరిగింది. కొద్ది రోజులుగా వర్షాలకు తెరపివ్వడంతో పనులు మళ్లీ ఊపందుకున్నాయి. నిర్మాణం మధ్యలో ఆపేసిన వారు తిరిగి పనులు మొదలు పెట్టారు. రాష్ట్రంలో 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను అందజేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఆ స్థలాల్లో వారికి రెండు దశల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఇళ్లు కట్టించి ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆహ్లాదకర వాతావరణంలో సరికొత్తగా కాలనీలు, ఊర్లు రూపుదిద్దుకుంటున్నాయి.
ఆయా లేఅవుట్లలో గృహాలను నిర్మించుకునేందుకు అవసరమైన మెటీరియల్‌ను అధికారులు ఇప్పటికే అందుబాటులో ఉంచారు. చాలా కాలనీలకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. మరికొన్ని కాలనీల్లో ఈ పని ముమ్మరమైంది. అంతర్గత రోడ్లు నిర్మించి, నీటి వసతికి ఇబ్బంది లేకుండా బోర్లు వేశారు. దీంతో లబ్ధిదారులు ఉత్సాహంగా గృహాలను నిర్మించుకోవడంలో బిజీ అయ్యారు. గృహ నిర్మాణాలకు సంబంధించి బిల్లులను అప్‌లోడ్ చేసిన కొద్ది రోజులకే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నారు. దీంతో గృహ నిర్మాణాల్లో వేగం పెరుగుతోంది.
ఆయా లే అవుట్లలో లబ్ధిదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మౌలిక వసతుల పనుల్లో వేగం పెంచింది. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న రూ.1.80 లక్షలకు తోడు లబ్ధిదారులైన మహిళలకు రూ.35 వేల చొప్పున పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తోంది. నిర్మాణాల్లో వేగం పెరగడానికి ఇది బాగా దోహదం చేస్తోంది.
అందుబాటులో మెటీరియల్
గృహ నిర్మాణాలకు అవసరమైన ఇసుక, స్టీల్, సిమెంట్‌ను ఎప్పటికప్పుడు అవసరాల నిమిత్తం లబ్ధిదారులకు అందించేందుకు అన్ని జిల్లాల్లో అధికారులు సిద్ధంగా ఉంచారు. ఆయా ప్రాంతాల్లోని గోడౌన్లకు స్టీల్, సిమెంట్‌ను ఇప్పటికే చేరవేశారు. అన్ని జిల్లాల్లోని జగనన్న కాలనీల్లో విద్యుత్, తాగునీరు, డ్రెయినేజీల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. లేఅవుట్లలో విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఉచితంగానే చేస్తున్నారు.
నిర్మాణం పూర్తయిన వెంటనే ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నారు. వీధుల్లో స్తంభాలు, వైర్లు, ఇళ్లకు విద్యుత్ బోర్డులు, వైర్లు, మీటరు ఉచితంగా ఇస్తున్నారు. ఒక్కో కనెక్షన్‌కు దాదాపు రూ.6 వేల వరకు వ్యయం అవుతుండగా మొత్తం ప్రభుత్వమే భరిస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకున్న వారికి కూడా ఉచితంగానే విద్యుత్ కనెక్షన్స్ ఇస్తున్నారు. దీంతో వేలాదిగా కొత్త ఊర్లు, కాలనీలు రూపుదిద్దుకుంటున్నాయి.
నిర్మాణాల్లో మరింత వేగం పెరగాలి
నిరుపేదలు, దిగువ మధ్య తరగతి ప్రజల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాలు తగ్గినందున నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. గృహ నిర్మాణం, టిడ్కో ఇళ్ల ప్రగతిపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో ఇప్పటి దాకా చేపట్టిన గృహ నిర్మాణాల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు.
టిడ్కో ఇళ్లలో ఇప్పటికే 40,576 యూనిట్లను లబ్ధిదారులకు అప్పగించామని చెప్పారు. దీనిపై సీఎం మాట్లాడుతూ.. డిసెంబర్ కల్లా 1,10,672 ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించాలని, వచ్చే మార్చి నాటికి మరో 1,10,968 ఇళ్లు అప్పగించాలని ఆదేశించారు. వర్షాలు తగ్గినందున నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, విశాఖలో మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాల పైనా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
ఆయా కాలనీల్లో మౌలిక సదుపాయాలు, విద్యుదీకరణ పనులు సమాంతరంగా చేపట్టాలని ఆదేశించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో గృహ నిర్మాణం కోసం రూ.5,005 కోట్లు ఖర్చు చేసినట్టు అధికారులు సీఎంకు వివరిచారు. టిడ్కో ఇళ్లు ఫేజ్–1కు సంబంధించి దాదాపుగా రిజి్రస్టేషన్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇచ్చే 30 లక్షల ఇళ్ల ప్రగతి గురించి కూడా వారు సీఎంకు వివరించారు.
రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు..
పట్టణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్ల నిర్వహణకు ఆయా ప్రాంతాల నివాసితులతో సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. వేయి ఇళ్లకు పైగా ఉన్న చోట్ల రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇళ్ల నిర్వహణపై వారికి అవగాహన కల్పించడంతో పాటు, మార్గదర్శకాలు సూచించాలన్నారు. టిడ్కో ఇళ్ల నిర్వహణ బాగుండాలని, వాటిని పట్టించుకోకపోతే మళ్లీ మురికివాడలుగా మారే ప్రమాదం ఉంటుందని సీఎం హెచ్చరించారు.
ఆయా నివాసాలను ఏ రకంగా నిర్వహించుకోవాలన్న దానిపై అసోసియేషన్లకు అధికారులు బాసటగా నిలవాలని సూచించారు. ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉంచడం, శానిటేషన్, విద్యుత్ దీపాల నిర్వహణ, వీధి లైట్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్వహణ తదితర అంశాలపై అసోసియేషన్లకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో ఈ నెల 22న పంపిణీ చేసిన టిడ్కో ఇళ్లలో గృహ ప్రవేశాల తీరుపై అధికారులు సీఎంకు ప్రత్యేకంగా వివరించారు.
ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ చైర్మన్ దవులూరి దొరబాబు, ఏపీ టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయి ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, సీసీఎల్‌ఏ సెక్రటరీ ఏఎండీ ఇంతియాజ్, గృహ నిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే, టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ డాక్టర్ లక్ష్మీశ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జోరుగా ఇళ్ల నిర్మాణం
Published Thu, Oct 27 2022 2:53 AM | Last Updated on Thu, Oct 27 2022 10:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment