జగనన్న కాలనీల్లో.. 3 రోజుల్లో 3 లక్షల ఇళ్లు | Measures to construction of one lakh houses per day on July 1 and 3,4 | Sakshi
Sakshi News home page

Jagananna Colonies: 3 రోజుల్లో 3 లక్షల ఇళ్లు

Published Mon, Jun 28 2021 3:22 AM | Last Updated on Mon, Jun 28 2021 8:45 PM

Measures to construction of one lakh houses per day on July 1 and 3,4 - Sakshi

గుంటూరు జిల్లా బాపట్లలో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీ

సాక్షి, అమరావతి: పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కంకణం కట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం తొలి దశలో చేపట్టే ఇళ్ల నిర్మాణాలను వీలైనంత త్వరగా ప్రారంభించి.. వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో యంత్రాంగాన్ని సన్నద్ధం చేసింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృఢ సంకల్పాన్ని ఆచరణలో పెట్టేందుకు అధికార యంత్రాంగం సమష్టి చర్యలు చేపడుతోంది. మూడు రోజుల పాటు మెగా గ్రౌండింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముహూర్తాలను సైతం ఖరారు చేసింది.

మెగా వ్యాక్సినేషన్‌ స్ఫూర్తితో రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు మొత్తం యంత్రాంగం భాగస్వామ్యంతో రోజుకు లక్ష చొప్పున మూడు రోజుల్లో మూడు లక్షల పేదల ఇళ్లను గ్రౌండింగ్‌ చేసేలా కార్యక్రమాన్ని రూపొందించారు. జూలై 1, 3, 4 తేదీల్లో యజ్ఞంలా నిర్మాణాలను ప్రారంభించేలా సీఎం కార్యాలయం, గృహ నిర్మాణ శాఖ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశాయి. ఈ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తిచేసేందుకు మునుపెన్నడూ లేని రీతిలో జిల్లాకో జాయింట్‌ కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా నియమించారు.   



వివిధ స్థాయిల్లో అధికారుల పర్యవేక్షణ
ఈ కార్యక్రమంలో ప్రధానంగా గృహ నిర్మాణ, రెవెన్యూ, గ్రామ, వార్డు సచివాలయాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం, మునిసిపల్‌ పట్టణాభివృద్ధి విభాగం, రవాణా, ఇంధన శాఖలు పూర్తిగా భాగస్వామ్యం కానున్నాయి. ఇందుకోసం ప్రతి మండలం, మునిసిపాలిటీలకు జిల్లాస్థాయి ప్రత్యేక అధికారులను నియమిస్తున్నారు. అలాగే ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి వార్డుకు డివిజనల్, మునిసిపల్, మండల స్థాయి అధికారులను ప్రత్యేకంగా నియమిస్తున్నారు. ప్రతి లే–అవుట్‌కు గ్రామ, వార్డు సచివాలయ స్థాయి అధికారులను ప్రత్యేకంగా నియమిస్తున్నారు.

వలంటీర్లను పూర్తి స్థాయిలో భాగస్వామ్యం చేస్తున్నారు. సోమవారం మండల, నియోజకవర్గ స్థాయి అధికారులకు ఈ కార్యక్రమంపై శిక్షణ ఇవ్వనున్నారు. 29వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ స్థాయి ఉద్యోగులు, వలంటీర్లకు శిక్షణ ఇస్తారు. 30వ తేదీన వలంటీర్లు తమ పరిధిలోని ఇళ్ల లబ్ధిదారులతో సమావేశమై మెగా గ్రౌండింగ్‌కు వారిని సమాయత్తం చేస్తారు. మూడు రోజులపాటు జరిగే ఇళ్ల మెగా గ్రౌండింగ్‌ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎక్కడికక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వాములవుతారు.

లే–అవుట్లలో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఇసుకను సిద్ధంగా ఉంచేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. లే–అవుట్లు దూరంగా ఉంటే.. సిమెంట్, ఇసుక అక్కడికి తరలించేలా లబ్ధిదారులకు వాహనాలు సమకూరుస్తారు. లే–అవుట్లలో ఇళ్ల గ్రౌండింగ్‌కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేసేలా ఇంజనీరింగ్‌ అసిస్టెంట్, డిజిటల్‌ అసిస్టెంట్, వలంటీర్లు ఫొటోలు ఏర్పాట్లు చేశారు. 

రికార్డు స్థాయిలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం: అజయ్‌ జైన్‌
గతంలో ఏడాదికి లక్షన్నరకు మించి ఇళ్ల నిర్మాణాలు జరగలేదని, ఇప్పుడు పేదల కోసం రికార్డు స్థాయిలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్‌ అజయ్‌జైన్‌ చెప్పారు. ముఖ్యమంత్రి నిర్ధేశించిన సమయంలోగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం ఉద్యమ స్ఫూర్తితో పని చేస్తోందన్నారు. వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించడంతో పాటు వాటిని పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం మొత్తాన్ని భాగస్వామ్యం చేస్తూ మూడు రోజుల పాటు మెగా గ్రౌండింగ్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వివరించారు.

ఇందుకోసం లే–అవుట్ల వద్దకే ఇసుక, సిమెంట్‌ సమకూరుస్తున్నామని చెప్పారు. మెగా గ్రౌండింగ్‌కు సంబంధించిన వివరాలను ప్రత్యేకంగా డాష్‌ బోర్డులో ఎప్పటికప్పుడు నమోదు చేస్తామన్నారు. దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత పెద్దఎత్తున ఒకేసారి పేదల కోసం ఇన్ని లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదన్నారు. ముఖ్యమంత్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు అధికార యంత్రాంగమంతా సమష్టి కృషితో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తుందన్నారు.
చదవండి: మూడు నెలల్లో వైఎస్సార్‌ ఈఎంసీ ప్రారంభం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement