కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న నెల్లూరు జోన్ రవాణాశాఖ ఉప కమిషనర్ శివరామప్రసాద్
సాక్షి, ఒంగోలు: రవాణాశాఖలో బదిలీల ప్రక్రియకు కసరత్తు ప్రారంభమైంది. రవాణాశాఖ ఉన్నతాధికారులు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సీనియర్ అసిస్టెంట్, హెడ్‌కానిస్టేబుల్ వరకు బదిలీలను జోనల్ స్థాయి ఉప రవాణాశాఖ కమిషనర్ నిర్వహిస్తారు. అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్, మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్, పరిపాలనాధికారి పోస్టులకు సంబంధించి బదిలీల ప్రక్రియను జోనల్ డీటీసీ స్థాయిలో పర్యవేక్షించి అభ్యర్థుల నుంచి ఆప్షన్ ఫారాలను తీసుకుని ప్రధాన కార్యాలయానికి పంపుతారు. వారు వాటిని పరిశీలించి బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తారు. అందులో భాగంగా శుక్రవారం జోన్ నెల్లూరు ఉప రవాణాశాఖ కమిషనర్ ఎన్.శివరామప్రసాద్ గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అధికారులు, సిబ్బందితో కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన కసరత్తును స్థానిక రవాణాశాఖ ఉప కమిషనర్ కార్యాలయంలో చేపట్టారు. ముందుగా రవాణాశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను వివరించారు.
ఒకే ప్రాంతంలో 5 సంవత్సరాలు పనిచేసిన వారికి బదిలీలు తప్పనిసరి. కనీసం రెండు సంవత్సరాలు ఒకే ప్రాంతంలో పనిచేసినవారు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. స్పౌజ్ కేటగిరీ, దివ్యాంగులకు సంబంధించిన అంశాల్లో మినహాయింపులు వర్తిస్తాయని తెలిపారు. 2020 మార్చి 31 నాటికి రిటైరయ్యే వారికి బదిలీలు నిర్వహిస్తారన్నారు. ప్రతి విభాగంలోను సీనియార్టీ ప్రకారమే బదిలీలు ఉంటాయన్నారు. ఎవరైనా బదిలీకి అర్హులైన, ఆసక్తి ఉన్నవారు తాము పనిచేస్తున్న ప్రదేశం కాకుండా మరో మూడు ప్రాంతాలను ఎంచుకోవాలని సూచించారు. తమ ఆప్షన్లు పూర్తిచేసి సంబంధిత ఆప్షన్ ఫారంను అందజేస్తే ఉన్నతాధికారులకు త్వరగా పంపుతామని, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం జారీ చేసిన జూలై 5వ తేదీలోగా బదిలీలు పూర్తి చేస్తారని పేర్కొన్నారు. అయితే మూడు జిల్లాల్లో కలిపి 60 మంది వరకు బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా. సమావేశంలో జిల్లా ఉప రశాణాశాఖ కమిషనర్ సీహెచ్‌వీకే సుబ్బారావు, గుంటూరు ఉపరవాణాశాఖ కమిషనర్ రాజారత్నం, నరసరావుపేట ఆర్‌టీవో కెవి సుబ్బారావు, ఏపీ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్, గుంటూరు ఆర్‌టీవో వై.రామస్వామి హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment