Startup Diary
-
ప్రాక్టీస్ కోసం.. ఇంటర్వ్యూ బడ్డీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్! ఇదో నానుడే కాదు. వ్యాపార సూత్రం కూడా. ఇంటర్వ్యూబడ్డీ చేసేదిదే!!. దేశ, విదేశాల్లోని బహుళ జాతి కంపెనీల వైస్ ప్రెసిడెంట్స్, హెచ్ఆర్ ప్రతినిధులతో పాటూ రిటైర్డ్ ఐఏఎస్ వంటి ఉన్నతాధికారులతో ఒప్పందం చేసుకుంది. మన దేశంతో పాటూ అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా దేశాల్లో మాక్ ఇంటర్వ్యూ సేవలందిస్తున్న ఇంటర్వ్యూ బడ్డీ గురించి మరిన్ని వివరాలు ఫౌండర్ ఉజ్వల్ సూరంపల్లి ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది విశాఖపట్నం. ఆంధ్రా యూనివర్సిటీలో ఎంటెక్ పూర్తయ్యాక.. జర్మనీలో మాస్టర్స్ కోసం వెళ్లా. చదువుకుంటూ జాబ్స్ కోసం ప్రయత్నించా. ప్రాక్టీస్ లేకపోవటంతో ఒకటిరెండు ఇంటర్వ్యూల్లో ఫెయిలయ్యా. అప్పుడే అనిపించింది. క్రీడలకు ఉన్నట్టే ఇంటర్వ్యూలకూ ప్రత్యక్షంగా ప్రాక్టీస్ ఉంటే బాగుండునని. అంతే! చదువును మధ్యలోనే ఆపేసి.. విశాఖపట్నం కేంద్రంగా జూలై 2017లో ఇంటర్వ్యూబడ్డీ.ఇన్ను ప్రారంభించాం. విద్యార్థులు, కంపెనీలకూ ఇంటర్వ్యూలు.. విద్యార్హతలు, ఉద్యోగ ఎంపికలతో అకౌంట్‌ను నమోదు చేసుకున్నాక.. హెచ్ఆర్, టెక్నికల్, స్పెషలైజేషన్ విభాగాల్లో కావాల్సిన ఆప్షన్‌ను ఎంచుకుంటే చాలు ఇంటర్వ్యూ మొదలువుతుంది. ఇంటర్వ్యూబడ్డీతో ప్రెషర్స్‌కు ఇంటర్వ్యూలంటే ఉండే తొందరపాటు, ఒత్తిడి తగ్గుతుంది. విశ్వాసం పెరుగుతుంది. ప్రొఫైల్ ప్రిపరేషన్, వెబ్ ఆర్టికల్స్, ఇంటర్వ్యూ వీడియోలతో పాటూ నైపుణ్య ప్రదర్శన, బలహీనతలతో కూడిన సమగ్ర నివేదికను అందిస్తాం. ఒక్క సెషన్ ప్రారంభ ధర రూ.1,099. ఇటీవలే కంపెనీల కోసం ప్రత్యేకంగా ‘ఇంటర్వ్యూ బడ్డీ వైట్ లేబుల్’ అనే వేదికను ప్రారంభించాం. ఇది.. కంపెనీలకు ఇంటర్వ్యూలను, అభ్యర్థుల జాబితా సేవలను అందిస్తుంది. ప్రస్తుతం అప్రాటిక్స్ వంటి మూడు కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. త్వరలోనే మరో 5 కంపెనీలను జోడించనున్నాం. అమెరికా, బ్రెజిల్‌లోనూ యూజర్లు.. 15 వేల మంది రిజిస్టర్ యూజర్లున్నారు. మన దేశంతో పాటూ అమెరికా, మెక్సికో, అర్జెంటీనా నుంచి కూడా యూజర్లున్నారు. ఇప్పటివరకు 5 వేల ఇంటర్వ్యూలను నిర్వహించాం. ప్రస్తుతం నెలకు 200 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. ఐటీ, ఇంజనీరింగ్, హ్యుమానిటీస్, మిషన్ లెర్నింగ్, బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటి అన్ని రంగాల్లో మాక్ ఇంటర్వ్యూలుంటాయి. ఆయా రంగాల్లో కనీసం పదేళ్ల అనుభవం ఉన్న ఇండియా, అమెరికాలకు చెందిన 220 మంది ఇంటర్వ్యూ ప్యానెలిస్ట్‌లతో ఒప్పందం చేసుకున్నాం. వీరికి ప్రతి ఇంటర్వ్యూ మీద 25–75 శాతం వరకు కమీషన్ ఉంటుంది. వర్సిటీలు, ఐఐటీ, ఐఐఎంలతో ఒప్పందం గతేడాది రూ.30 లక్షల ఆదాయాన్ని ఆర్జించాం. వచ్చే ఐదేళ్లలో 20 కోట్ల ఆదాయాన్ని, 15 లక్షల ఇంటర్వ్యూలను లకి‡్ష్యంచాం. జనవరి నుంచి ఉత్తర అమెరికాలో సేవలను ప్రారంభిస్తాం. స్థానికంగా ఉన్న పలు వర్సిటీల్లోని విద్యార్థులకు ప్రాక్టీస్ క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాం. మన దేశంలోని ఐఐటీ–రూర్కీ, ఎఫ్ఎంఎస్–ఢిల్లీ, ఐఐఎం–రూటక్, ఢిల్లీ–అంబేడ్కర్ యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకోనున్నాం. రూ.15 కోట్ల నిధుల సమీకరణ ప్రస్తుతం 9 మంది ఉద్యోగులున్నారు. ఇటీవలే వైజాగ్‌కు చెందిన ఏంజిల్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ ఆల్కోవ్ పార్టనర్స్ రూ.75 లక్షల పెట్టుబడి పెట్టింది. జనవరిలో సీడ్ ఫండింగ్‌లో భాగంగా యూపీకి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ నుంచి రూ.5 కోట్ల నిధులను సమీకరించనున్నాం. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఫిన్‌ల్యాండ్‌కు చెందిన ఓ ఇన్వెస్టర్ నుంచి రూ.15 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్నాం’’ అని ఉజ్వల్ వివరించారు. -
కోలం, పొన్ను, చిట్టి ముత్యాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కిరాణా సరుకులను కూడా ఆన్లైన్లో కొనే రోజులివి. కానీ ఏ గ్రాసరీ స్టార్టప్స్‌లోనైనా ఉప్పులు, పప్పుల వంటి వాటిల్లో లభ్యమయ్యేన్ని బ్రాండ్లు బియ్యంలో దొరకవు! ఇది చూశాక హైదరాబాద్‌కు చెందిన విక్రమ్ చక్రవర్తి... బియ్యాన్ని మాత్రమే విక్రయించే ‘ఓన్లీ రైస్.కామ్’ను ప్రారంభించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే... ప్రస్తుతం మేం కోలం, పొన్ను, జై శ్రీరామ్, చిట్టి ముత్యాలు, సోనా మసూరీ, సాంబ మసూరీ, ఇడ్లీ రైస్, దోశ రైస్, బాస్మతీ, హెచ్ఎంటీ వంటి 18 రకాల బియ్యం బ్రాండ్లు విక్రయిసు ్తన్నాం. ఇవి మిర్యాలగూడ, కర్నూల్, కర్ణాటక నుంచి దిగుమతవుతాయి. ఆర్గానిక్ డయాబెటిక్ పేటెంట్ రైస్‌తో ప్రత్యేక ఒప్పందం ఉంది. వీటిని మైసూర్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ప్రసుతం నెలకు 1,200–1,500 బస్తాలు విక్రయిస్తున్నాం. వీటి విలువ రూ.15 లక్షల వరకూ ఉంటుంది. కిలో బియ్యం ధర రూ.32 నుంచి రూ.120 వరకూ ఉంది. కిలో బియ్యం కూడా డెలివరీ చేస్తాం. రూ.500 కంటే ఎక్కువ ఆర్డరైతే డెలివరీ ఉచితం. అంతకంటే తక్కువైతే రూ.45 డెలివరీ చార్జీ ఉంటుంది. హోటల్స్‌కు రూ.లక్ష వరకు రుణం... రిటైల్, హోల్‌సేల్ వంటి బీ2బీ వర్తకులకు, గృహ కస్టమర్లకు (బీ2సీ) రుణాలందించేందుకు ఒక ఎన్‌బీఎఫ్‌సీతో ఒప్పందం చేసుకున్నాం. దీనిప్రకారం హోటళ్లు, రెస్టారెంట్లకు 30 రోజుల కాల పరిమితితో రూ.లక్ష వరకు రుణమిస్తాం. ఇక, బీ2సీలకు 14 రోజుల పాటు రూ.10 వేల క్రెడిట్ ఉం టుంది. ఆధార్, పాన్, ఈ–మెయిల్, ఫోన్ నంబర్ వంటి వివరాలు సమర్పిస్తే చాలు నిమిషం వ్యవధిలోపే రుణం జమ అవుతుంది. ప్రస్తుతం బీ2బీలో 40, బీ2సీ 4 వేల మంది కస్టమర్లున్నారు. ఉచితంగా ఓన్లీ రైస్ ఫ్రాంచైజీ కూడా.. ఓన్లీ రైస్‌కు హైదరాబాద్‌లో నాలుగు సొంత ఔట్‌లెట్లున్నాయి. ఏడాదిలో 500కి చేర్చాలన్నది లక్ష్యం. అందుకే ఫ్రాంచైజీ ఇస్తున్నాం. రైస్ మర్చంట్స్‌కు, ఇతర దుకాణాదారులకు ఉచితంగా ఫ్రాంచైజీ ఇస్తున్నాం. ప్రతి బస్తా అమ్మకంపై 5 శాతం కమీషన్ తీసుకుంటాం. ప్రతి నెలా 50 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేస్తున్నాం. వచ్చే ఏడాది నాటికి రూ.50 కోట్ల ఆదాయాన్ని లకి‡్ష్యంచాం. ఫిబ్రవరికి బెంగళూరు, చెన్నై నగరాల్లో సేవలను విస్తరిస్తాం. ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ రూ.7 కోట్ల పెట్టుబడి పెట్టింది. త్వరలో రూ.25 కోట్లు సమీకరిస్తాం’’ అని చక్రవర్తి వివరించారు. -
ప్రకటనలు.. ప్రచారం ఒక్క చోటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏ ఉత్పత్తయినా లకి‡్ష్యంచిన కొనుగోలుదారులకు చేరాలంటే నాణ్యతతో పాటూ బ్రాండ్ ఇమేజ్ తప్పనిసరి! దీనికోసం సెలబ్రిటీల ఎంపిక, ప్రకటనలు, ప్రచారం... ఇవన్నీ పెద్ద టాస్కే. కానీ, విజయవాడకు చెందిన రీసెర్చ్ మీడియా గ్రూప్ దీన్ని సులభతరం చేసింది. సెలబ్రిటీల ఎంపిక కోసం సెలబ్రిటీ హబ్, ప్రకటనల కోసం న్యూవేవ్ అడ్వర్టయిజింగ్, ప్రొడక్షన్ హౌస్ సేవల కోసం రీసెర్చ్ మీడియా ఎంటర్టైన్మెంట్, ఈవెంట్ల నిర్వహణ కోసం మ్యాజిక్ మంత్ర... ఇలా అన్ని సేవలనూ అందిస్తున్న రీసెర్చ్ మీడియా గ్రూప్. మరిన్ని వివరాలు సంస్థ చైర్మన్ జే చైతన్య ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. చిన్న ప్రకటనల సంస్థగా మా ప్రస్థానం మొదలైంది. ఇపుడు కార్పొరేట్ ఈవెంట్స్, సెలబ్రిటీ మేనేజ్మెంట్ స్థాయికి చేరాం. ప్రస్తుతం రీసెర్చ్ మీడియా గ్రూప్‌లో సెలబ్రిటీ హబ్, మేజిక్ మంత్ర, న్యూవేవ్ అడ్వర్టయిజింగ్, రీసెర్చ్ మీడియా గ్రూప్ ఎంటర్టైన్మెంట్స్, పింక్ పీఆర్ లైన్స్, కీ హైట్స్ అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. ఇప్పటివరకు రీసెర్చ్ మీడియా గ్రూప్‌కు 18 వేల మంది కార్పొరేట్స్ క్లయింట్లున్నారు. వీటిలో రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి కార్పొరేట్ ఆసుపత్రులు, ఉత్పత్తుల తయారీ కంపెనీల వరకూ అన్నీ ఉన్నాయి. త్వరలోనే కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ), కామినేని, కేర్ ఆసుపత్రులు, ప్రక్రియ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మా క్లయింట్ల జాబితాలో చేరనున్నాయి. ఇదీ... మా కంపెనీల తీరు సెలబ్రిటీ హబ్: 2014లో విజయవాడ కేంద్రంగా ప్రారంభమైంది. దీనికి విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై, గోవా, బెంగళూరు, ముంబైలో బ్రాంచీలున్నాయి. సెలబ్రిటీల ఎంపిక కోసం ముంబైకి చెందిన సిమ్కామ్ మోడల్, చిరాక్ మేనేజ్మెంట్స్, జాకీ ఫెర్నాండెస్, పినాకిల్ రూడ్జ్, ది క్వీన్స్, ఎవాన్ ఎంటర్టైన్మెంట్స్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతం సెలబ్రిటీ హబ్‌లో 40 వేల మంది సినీ ప్రముఖులున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, దుబాయ్, మలేషియా, బ్యాంకాక్, శ్రీలంక వంటి దేశాల్లోని కార్యక్రమాలకూ తారలను అందించాం. మ్యాజిక్ మంత్ర: 2012లో ప్రారంభమైన ఈ సంస్థ కార్పొరేట్, వ్యక్తిగత ఈవెంట్లను నిర్వహిస్తుంది. గతేడాది రూ.40 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నాం. న్యూవేవ్: విజువల్ యాడ్స్ రూపకల్పన కోసం న్యూవేవ్ అడ్వర్టయిజింగ్ పనిచేస్తుంది. టీవీ సీరియల్స్, సినిమాల చిత్రీకరణ కోసం అవసరమైన ప్రొడక్షన్ హౌస్ సేవల కోసం రీసెర్చ్ మీడియా ఎంటర్టైన్మెంట్ పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు 16 టీవీ సీరియల్స్‌కు సేవలందించాం. రూ.100 కోట్లు లక్ష్యం.. ప్రస్తుతం రీసెర్చ్ మీడియా గ్రూప్‌లో 300 మంది ఉద్యోగులున్నారు. గతేడాది రూ.60 కోట్ల వ్యాపారాన్ని చేరుకున్నాం. ఈ ఏడాది రూ.100 కోట్లు లకి‡్ష్యంచాం. త్వరలోనే సొంత బ్యానర్‌పై తెలుగు, హిందీ చిత్రాల నిర్మాణంతో పాటూ జాతీయ స్థాయిలో మిస్ ఇండియా పోటీలను నిర్వహించనున్నాం’’ అని చైతన్య వివరించారు. -
2 గంటల్లో ముంగిట్లోకి ‘ఖట్టా మీఠా’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నచ్చిన స్వీట్స్ కోసం కొన్ని షాపులకే వెళతాం. అక్కడికెళ్లే అవకాశం లేకపోతే ఫుడ్ అగ్రిగేటర్ల ద్వారా ఆన్లైన్లో ఆర్డరివ్వొచ్చు. కానీ అవి నిర్దేశిత పరిధి వరకే డెలివరీ చేస్తాయి. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ ‘ఖట్టా మీఠా’ ఒక అడుగు ముందుకేసింది. వినియోగదారులు సిటీలో ఏ మూలనున్నా టాప్ దుకాణాల నుంచి రెండు గంటల్లో డెలివరీ చేస్తోంది. స్వీట్స్, నమ్కీన్స్, డ్రై ఫ్రూట్స్, పచ్చళ్లు ఆర్డర్లు తీసుకుంటోంది. హైదరాబాద్‌కే కాదు.. ప్రపంచంలో ఎక్కడున్నా 10–15 శాతం తక్కువ ధరకే సరఫరా చేస్తామంటున్నారు ‘ఖట్టా మీఠా’ను ప్రమోట్ చేస్తున్న ఫ్రెస్కో సర్వీసెస్ సీఈవో సందీప్ మారెళ్ల, సీవోవో శ్రీధర్ మహంకాళి. దీని గురించి స్టార్టప్ డైరీకి వారు చెప్పిన వివరాలివీ.. టాప్ స్వీట్ షాప్స్ నుంచే.. హైదరాబాద్‌లో ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని స్వీట్స్, నమ్కీన్స్ మాత్రమే డెలివరీ చేసే కంపె నీ మాదే. దాదూస్, ఆల్మండ్ హౌస్, మిఠాయివాలా, ఆలివ్, ఆగ్రా స్వీట్స్ బంజారా, కేసరియాస్, ఆగ్రావాలా, గంగారామ్స్ వంటి 40 ప్రముఖ బ్రాండ్ల స్వీట్లు, నమ్కీన్స్, పచ్చళ్లు, టీ పొడులు మా పోర్టల్‌లో ఉన్నాయి. ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజా మాదిరి ముంబై, బెంగాల్, అగ్రా, ఢిల్లీ, కేరళ తదితర ప్రాంతాల్లో పేరున్న దుకాణాల్లో లభించే పాపులర్ వెరైటీలను త్వరలో ప్రవేశపెడతాం. సంక్రాంతి నుంచి హోమ్ మేడ్ స్వీట్స్ సరఫరా చేస్తాం. విదేశాలకు అయిదు రోజుల్లో.. ప్రస్తుతం ఖట్టామీఠా.ఇన్ పోర్టల్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్నాం. దీపావళికల్లా యాప్ సిద్ధమవుతుంది. 10–15 శాతం తక్కువ ధరకే ఉత్పత్తుల్ని సరఫరా చేస్తున్నాం. ఇక భాగ్యనగరిలో రెండు గంటల్లో డెలివరీ ఇస్తాం. డెలివరీకి రూ.40 చార్జీ తీసుకుంటున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 48 గంటల్లో కస్టమర్‌కు చేరతాయి. విదేశాలకు 5–7 రోజుల సమయం పడుతుంది. ఇతర సంస్థలతో పోలిస్తే విదేశాలకు సరఫరాకు డెలివరీ చార్జీలు 50 శాతం కంటే తక్కువే వసూలు చేస్తున్నాం. స్వీట్ కంపెనీలు మాకిచ్చే డిస్కౌంట్ ప్రయోజనాలను కస్టమర్లకే అందజేస్తున్నాం. స్నేహితులు రవీందర్ పల్లెర్ల, నరేశ్ కుమార్ బుద్ధాతో కలిసి ఈ ఏడాది మొదట్లో దీన్ని ఆరంభించాం. 10 మంది మార్కెటింగ్ సిబ్బంది ఉన్నారు. డెలివరీకి క్వికర్ సేవల్ని వినియోగించుకుంటున్నాం. కార్పొరేట్ ఆర్డర్లూ స్వీకరిస్తున్నాం. యూఏఈ, మలేషియా, సింగపూర్, యూఎస్ నుంచి ఇప్పటికే ఎంక్వైరీలు వస్తున్నాయి. -
డిజిటల్ మార్కెటింగ్ అడ్డా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం విద్య, వైద్యం, వినోదం ఏ రంగంలోనైనా సరే డిజిటల్ మార్కెటింగ్ ప్రధానంగా మారింది. కంపెనీ అభివృద్ధి, ఉత్పత్తుల ప్రచారంలో ఇతర మాధ్యమాల మార్కెటింగ్ కంటే డిజిటల్ మార్కెటింగ్ ముందున్నదనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అందుకే దీన్ని వ్యాపార వేదికగా ఎంచుకుంది ‘డిజిటల్ అకాడమీ 360’. కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఈ సంస్థ గురించి మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్ యోగేష్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. బెంగళూరులో మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తయ్యాక.. జిఫ్పీ ఎస్ఎంఎస్ కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా చేరా. మూడేళ్లు పనిచేశాక.. సొంతంగా బల్క్ ఎస్ఎంఎస్ కంపెనీ పెట్టా. ఆ తర్వాత అడ్వర్టయిజింగ్ ఏజెన్సీని కూడా! ఐదేళ్ల తర్వాత మార్కెటింగ్ రంగంలోని మార్పులు గమనించి.. దీన్నే వ్యాపార వేదికగా మార్చుకోవాలని నిర్ణయించుకొని నవంబర్ 2015లో రూ.10 లక్షల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా డిజిటల్ అకాడమీ 360ని ప్రారంభించా. త్వరలోనే 10 రకాల కోర్సులు.. ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ రైటింగ్ రెండు రకాల కోర్సులున్నాయి. వీటిల్లో 30కి పైగా సబ్జెక్స్ ఉంటాయి. ధర ఒక్క కోర్సుకు రూ.41 వేలు. ఇప్పటివరకు 20 వేలకు పైగా విద్యార్థులు శిక్షణ పొందారు. వచ్చే ఏడాది కాలంలో 60 వేల మందికి చేరుకోవాలన్నది లక్ష్యం. ఈ ఏడాది ముగిసే నాటికి ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మిషన్ లెర్నింగ్, యూఐయూఎక్స్, మొబైల్ డెవలప్మెంట్ వంటి 10 రకాల కోర్సులను ప్రారంభించనున్నాం. ప్రస్తుతం ఆయా సబ్జెక్ట్స్‌లో మెటీరియల్ ప్రిపరేషన్ జరుగుతోంది. ఉద్యోగ అవకాశాల కోసం అమెజాన్, పేటీఎం, యాహూ, కేపీఎంజీ వంటి కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. 6 నెలల్లో తెలుగు రాష్ట్రాల్లోకి.. ప్రస్తుతం బెంగళూరు, పుణే, మైసూర్, ఢిల్లీ, నోయిడా, చెన్నై నగరాల్లో 21 శిక్షణ కేంద్రాలున్నాయి. 6 నెలల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో సెంటర్లను ప్రారంభించనున్నాం. ఆస్ట్రేలియా, దుబాయ్ దేశాల్లోనూ డిజిటల్ అకాడమీ 360 సెంటర్లను ఏర్పాటు చేయనున్నాం. ఆయా దేశాల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. స్థానికంగా ఒకటిరెండు ఫ్రాంచైజీ శిక్షణ సంస్థలతో కలిసి సెంటర్లను ప్రారంభించనున్నాం. మొత్తంగా ఏడాదిన్నరలో 50 సెంటర్లకు చేరుకోవాలన్నది మా లక్ష్యం. ఫ్రాంచైజీ రూ.25 లక్షలు.. స్టడీ మెటీరియల్స్, పరీక్ష పత్రాల తయారీ, శిక్షణ కోసం 60 మంది ట్రైనర్లున్నారు. ఏడాదిలో 200 మందికి చేరుకుంటాం. ప్రతి నగరంలో ఒక్క సెంటర్ మాత్రమే డిజిటల్ అకాడమీ 360ది ఉంటుంది. మిగిలినవి ఫ్రాంచైజీ రూపంలో ఉంటాయి. ఒక్క సెంటర్ ఫ్రాంచైజీ వ్యయం రూ.25 లక్షలు. ఇందులో శిక్షకుల సరఫరా, మార్కెటింగ్, మెటీరియల్ సప్లయి వంటివన్నీ కంపెనీయే చూసుకుంటుంది. ఫ్రాంచైజర్ స్థానికంగా ఉంటూ అకాడమీని నడిపిస్తే చాలు. మొదటి 3 నెలల పాటు రాయల్టీ ఉండదు. ఆ తర్వాత 12 నెలల వరకు నెలకు రూ.50 వేలు ఫీజు ఉంటుంది. ఆ తర్వాత ఆదాయంలో 12–25 శాతం వరకు వాటా ఉంటుంది. రూ.40 కోట్ల నిధుల సమీకరణ.. గతేడాది రూ.5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. ఈ ఏడాది రూ.9 కోట్లు లక్షి్యంచాం. డిజిటల్ అకాడమీ 360 కేంద్ర ప్రభుత్వం నుంచి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ), గూగుల్ నుంచి డిజిటల్ మార్కెటింగ్ ధ్రువీకరణ పత్రాన్ని పొందింది. ప్రస్తుతం మా కంపెనీలో 80 మంది ఉద్యోగులున్నారు. ఈ డిసెంబర్ ముగింపు నాటికి రూ.40 కోట్ల నిధులను సమీకరించనున్నాం. పలువురు ఏంజిల్ ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి’’ అని యోగేష్ తెలిపారు. -
రుణం ఇవ్వొచ్చు.. తీసుకోవచ్చు!
సాక్షి, హైదరాబాద్: ‘‘శ్రీనివాస్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. నెలాఖర్లో వాళ్ల అమ్మాయి మొదటి పుట్టిన రోజొచ్చింది. పార్టీ ఏర్పాట్లకు చేతిలో డబ్బు లేదు. తెలిసిన వాళ్లని అప్పు అడగటానికి మనసొప్పలేదు. పోనీ, బ్యాంక్ లోన్ కోసం వెళదామా అంటే... అదో పెద్ద ప్రక్రియ. సిబిల్ స్కోరు... వగైరాలు చూసి మంజూరు చేయటానికి బోలెడంత సమయం పట్టేస్తుంది. మరేం చేయాలి?’’ ‘‘వెంకటేశ్ ఓ ప్రభుత్వ ఉద్యోగి. కొంత కాలం నుంచి పొదుపు చేసిన సొమ్ము రూ.3 లక్షల వరకు చేతిలో ఉంది. బ్యాంక్‌లో వేద్దామంటే వడ్డీ రేటు తక్కువ. పోనీ, తెలిసిన వాళ్లకెవరికైనా అప్పుగా ఇద్దామంటే తిరిగి వసూలు చేయడం కొంత రిస్కే’’.. పై రెండు సందర్భాలు వేర్వేరు. ఒకరికేమో డబ్బు అవసరం, మరొకరికేమో అదే డబ్బుపై రాబడి కావాలి. వీళ్లద్దరి అవసరాలను ఒకే వేదికగా తీరుస్తోంది లెన్‌డెన్‌క్లబ్! సింపుల్‌గా చెప్పాలంటే? రుణదాతలు, గ్రహీతలను కలిపే ‘పీర్ టు పీర్’ లెండింగ్ వేదికన్న మాట. ఇన్నాళ్లూ ఉద్యోగులకే రుణాలిచ్చిన లెన్‌డెన్‌క్లబ్.. త్వరలో దుకాణదారులకూ రుణాలిచ్చేందుకు సిద్ధమైంది. మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్, సీఈఓ భవీన్ పాటిల్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘2015లో రూ.80 లక్షల పెట్టుబడితో గుర్గావ్ కేంద్రంగా లెన్డెన్క్లబ్ను ప్రారంభించాం. ప్రస్తుతం లెన్డెన్క్లబ్లో 40,880 మంది రుణ గ్రహీతలు, 9,982 మంది రుణదాతలు నమోదయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు మాత్రమే రుణాలిస్తున్నాం. కేవైసీ పూర్తి చేసిన 3 గంటల్లో రుణాన్నిస్తాం. రూ.40 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. వార్షిక వడ్డీ రేటు 12.5 నుంచి 35 శాతం వరకుంటుంది. రుణ వాయిదాలను 18–36 నెలల్లో తిరిగి చెల్లించేయాలి. రూ.5 లక్షల కేటగిరీలో 5 శాతం కస్టమర్లుంటారు. తెలంగాణలో నెలకు 150 మందికి.. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో సేవలందిస్తున్నాం. ఇప్పటివరకు 60 వేల మందికి రూ.40 కోట్ల రుణాలిచ్చాం. ప్రస్తుతం నెలకు వెయ్యి మందికి రూ.4 కోట్ల వరకు రుణాలందిస్తున్నాం. తెలంగాణ నుంచి నెలకు 150 రుణ గ్రహీతలకు రూ.70 లక్షల వరకు రుణాలిస్తున్నాం. డిసెంబర్ నాటికి నెలకు వెయ్యి మందికి రుణాలను అందించాలనేది లక్ష్యం. 6 నెలల్లో మరో 3 నగరాలకు విస్తరించనున్నాం. త్వరలో ఏపీలో సేవలను ప్రారంభిస్తాం. రూ.2.5 కోట్ల ఆదాయం లక్ష్యం.. రుణ గ్రహీతలు చెల్లించే నెలసరి వాయిదా నేరుగా రుణదాతల బ్యాంక్ ఖాతాలో జమవుతాయి. లెన్‌డెన్‌క్లబ్ రుణదాత నుంచి 1.5%, రుణగ్రహీత నుంచి 4% నిర్వహణ రుసుము కింద వసూలు చేస్తుంది. గతేడాది రూ.55 లక్షల ఆదాయాన్ని ఆర్జించాం. ఈ ఏడాది రూ.2.5 కోట్ల ఆదాయాన్ని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం ఎన్పీఏ 3.92 శాతంగా ఉంది. త్వరలోనే దుకాణదారులకు అర్హతలను బట్టి రూ.20 వేల నుంచి లక్ష రూపా యల వరకు రుణాలను అందించనున్నాం. కాల వ్యవధి 6 నెలలు. వార్షిక వడ్డీ 15 నుంచి 22% ఉంటుంది. రూ.10 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం కంపెనీలో 45 మంది ఉద్యోగులున్నారు. త్వరలోనే హోమ్ రెనోవేషన్, ఫ్యామిలీ ఫంక్షన్స్ వంటి వాటికి రుణాలిచ్చేందుకు ప్రణాళిక చేస్తున్నాం. ఇటీవలే వెంచర్ క్యాటలిస్ట్, అనిరుధ్ దమానీ, ఇండియన్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ నుంచి రూ.5 కోట్ల నిధులను సమీకరించాం. వచ్చే 3 నెలల్లో రూ.10 కోట్ల వరకు నిధులను సమీకరించనున్నాం. పాత ఇన్వెస్టర్లతో పాటూ ఒకటిరెండు వీసీ సంస్థలతో చర్చలు జరుపుతున్నాం’’ అని భవీన్ వివరించారు. -
వైద్యులు... ఇక్కడ విద్యార్థులు!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ‘నిరంతర విద్యార్థి’.. ఇది వైద్యులకు పక్కాగా వర్తిస్తుంది. ఎందుకంటే? వైద్య రంగంలో వస్తున్న మార్పులు, అధునాతన శస్త్ర చికిత్స విధానాలు, మెడికల్ టెక్నాలజీ, వ్యాధులు, చికిత్స మార్గాలు వంటివి నేర్చుకుంటూ ఉండాలి. మరి డాక్టర్లు వృత్తిని వదిలి.. పుస్తకాలు పట్టుకొని రోజూ శిక్షణ తరగతులకు వెళ్లాలా? అవసరమే లేదంటోంది బెంగళూరుకు చెందిన మెడినిట్. జస్ట్! వైద్యులు మెడినిట్‌లో నమోదైతే చాలు.. ప్రపంచంలోని ప్రముఖ డాక్టర్లు, వైద్య వర్సిటీలు, మెడికల్ అసోసియేషన్స్ ప్రచురించే జర్నల్స్, వైద్య కోర్సుల కంటెంట్, ఆడియో, వీడియో వంటివన్నీ పొందొచ్చు. డాక్టర్లకే శిక్షణ ఇస్తున్న మెడినిట్ గురించి మరిన్ని వివరాలు ఫౌండర్ డాక్టర్ భాస్కర్ రాజ్ కుమార్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. 2010లో రష్యాలో రేడియాలజీలో ఎండీ పూర్తయ్యాక.. బెంగళూరులోని పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరా. ఆ తర్వాత ఓ ప్రముఖ హెల్త్‌కేర్ టెక్నాలజీ కంపెనీలో ఆరేళ్లు పనిచేశా. మెడికల్ టెక్నాలజీ మీద శిక్షణ నిమిత్తం వందలాది డాక్టర్లను కలిసేవాణ్ణి. అప్పుడు తెలిసిందేంటంటే.. నేర్చుకునే సమయం, సరైన వేదిక రెండూ లేకపోవటంతో చాలా మంది డాక్టర్లు సంపాదనకే వృత్తిని అంకితం చేస్తున్నారని!. ఇదే మెడినిట్కు బీజం వేసింది. స్నేహితుడు సురేందర్ పరుసురామన్తో కలిసి 2016లో రూ.45 లక్షల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా మెడినిట్ను ప్రారంభించాం. ప్రపంచంలోని ప్రముఖ డాక్టర్లు, సంఘాలు, వర్సిటీలు రూపొందించే వైద్య కోర్సులు, వెలువరించే జర్నల్స్, కంటెంట్, రకారకాల వ్యాధులు, చికిత్స మార్గాలకు సంబంధించిన వీడియోలు వంటివి మెడినిట్‌లో పొందే వీలుండటమే మా ప్రత్యేకత. ప్రస్తుతం 28; ఏడాదిలో 65 కోర్సులు.. ప్రస్తుతం మెడినిట్‌లో 28 రకాల వైద్య కోర్సులున్నాయి. డిప్లొమా ఇన్ మినిమల్ యాక్సెస్ సర్జరీ, ఫెలోషిప్ ఇన్ మినిమల్ యాక్సెస్ సర్జరీ, ఏఏఎస్ స్కిల్ కోర్స్ బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ ఆర్థోస్కోపిక్ సర్జరీ: నీ అండ్ షోల్డర్, ఫెలోషిప్ ఇన్ డయాబెటిక్ ఫుట్ మేనేజ్మెంట్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ డిమోన్టియా వంటివి వీటిల్లో కొన్ని. రిజిస్టర్ చేసుకున్న డాక్టర్స్ అభ్యర్థులు ఆయా కోర్సుల ఆడియో, వీడియో కంటెంట్‌తో పాటూ వైద్య సంఘాల లెక్చర్స్, సెమినార్స్ పొందవచ్చు. కోర్సుల కాల పరిమితి 3 వారాల నుంచి ఏడాది వరకుంటుంది. కోర్సు, కాలపరిమితిని బట్టి ధరలు రూ.5 వేల నుంచి రూ.1.5 లక్షల వరకుంటాయి. వచ్చే ఏడాది 65 కోర్సులను అందుబాటులోకి తీసుకురావటంతో పాటూ అగ్మెంటెడ్ రియాలిటీ(ఏఆర్), వర్చువల్ రియాలిటీ(వీఆర్) టెక్నాలజీ ఆధారిత కంటెంట్‌నూ అందుబాటులోకి తీసుకురానున్నాం. వర్సిటీలు, సంఘాలు, ఆసుపత్రులతో జట్టు కోర్సుల రూపకల్పన, వ్యాధుల రకాలు, నివారణ, టెక్నాలజీ వంటి వాటిపై శిక్షణ కోసం మన దేశంతో పాటూ సింగపూర్, ఫిలిప్పీన్స్, మలేషియా, ఆస్ట్రేలియా దేశాల్లోని ప్రముఖ మెడికల్ యూనివర్సిటీలు, వైద్య సంఘాలతో ఒప్పందం చేసుకున్నాం. మన దేశంలో జీఈఎం టెలివర్సీటీ, కాలేజ్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ మినిమల్ యాక్సెస్ సర్జన్స్ ఆఫ్ ఇండియా, డిమెన్షియా అకాడమీ, ఇండియన్ నేషనల్ అసోసియేషన్ ఫర్ లివర్ (ఐఎన్ఏఎస్ఎల్), ఇంటర్నేషనల్ హిపాటో పాన్క్రీటో బిలియరీ అసోసియేషన్ (ఐహెచ్‌పీబీఏ), ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డర్మటాలజిస్ట్, వెనిరోలాజిస్ట్ అండ్ లెప్రోలాజిస్ట్, ఇండియన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్(ఐఆర్‌ఐఏ), అసోసియేషన్ ఆఫ్ ఓరల్ అండ్ మాక్సిలోఫేసియల్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఏఓఎంఎస్ఐ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ వంటి సంఘాలున్నాయి. రూ.20 కోట్ల ఆదాయం.. ప్రస్తుతం మెడినిట్‌లో 65 వేల మంది వైద్యులు నమోదయ్యారు. వీరిలో 2,500 మంది వార్షిక సబ్స్క్రిప్షన్ డాక్టర్స్. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 7 వేల మంది వైద్యులుంటారు. గ్లోబల్, కేర్, కిమ్స్, ఏసియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వంటి ఆసుపత్రులతో పాటూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ గ్యాస్ట్రోటెస్టినల్ ఎండ్రో సర్జన్స్ (ఐఏజీఈఎస్), సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అసోసియేషన్ వంటి సంఘాలతో ఒప్పందాలున్నాయి. ఏడాది కాలంలో 2 లక్షల మంది వైద్యుల నమోదు, మరో 30 సంఘాలను జత చేయాలన్నది టార్గెట్. 2 నెలల్లో రూ.72 కోట్ల నిధుల సమీకరణ.. గతేడాది రూ.3 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. వచ్చే ఏడాది రూ.20 కోట్లు లకి‡్ష్యంచాం. త్వరలోనే మధ్య ప్రాచ్యం, దుబాయ్, అబుదాబి దేశాల్లో సేవలందించనున్నాం. ఆ తర్వాత అమెరికా, యూకేలకు విస్తరిస్తాం. ‘‘ప్రస్తుతం కంపెనీలో 41 మంది ఉద్యోగులున్నారు. జూన్‌కి మరో 100 మందిని నియమించుకోనున్నాం. ఇప్పటివరకు ఏంజిల్ ఇన్వెస్టర్ల నుంచి రూ.3 కోట్లను సమీకరించాం. 2 నెలల్లో రూ.72 కోట్లను సమీకరించనున్నాం. మన దేశంతో పాటూ విదేశాల్లోని వీసీ ఇన్వెస్టర్లతో చర్చ లు జరుగుతున్నాయని’’ భాస్కర్ వివరించారు. వైజాగ్‌లో శిక్షణ కేంద్రం.. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీలో స్థానిక వైద్య సంఘాలతో కలిసి ఆఫ్‌లైన్‌లో శిక్షణ కేంద్రాలున్నాయి. తొలిసారిగా సొంతంగా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇటీవలే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో చర్చిం చాం. ఏపీ ప్రభుత్వంతో కలిసి విశాఖపట్నం లోని మెడ్‌టెక్ జోన్లో రూ.50 కోట్ల పెట్టుబడులతో సిమ్యులేషన్ జోన్‌ను ఏర్పాటు చేయనున్నాం. జనవరి నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. మౌలిక వసతులు, రాయితీలు కల్పిస్తే తెలంగాణలోనూ ఏర్పాటు చేస్తాం. -
టెక్నాలజీని అద్దెకిస్తాం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇల్లు, కార్ల లాగే టెక్నాలజీనీ అద్దెకు తీసుకోవచ్చు. అది కూడా హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ ఆన్‌గో ఫ్రేమ్ వర్క్‌లో! మన దేశంతో పాటూ దుబాయ్, మధ్య ప్రాచ్య వంటి దేశాల్లోని కంపెనీలూ కస్టమర్లుగా ఉన్నాయి. జస్ట్, 30 నిమిషాల్లోనే డిజిటల్ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించే వీలుండటమే ఆన్‌గో ఫ్రేమ్ వర్క్ ప్రత్యేకత! అందుబాటు ధరల్లో ఎంటర్ప్రైజ్లకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) కంపెనీలకు టెక్నాలజీలను అద్దెకిస్తున్న ఆన్‌గో ఫ్రేమ్ వర్క్ గురించి మరిన్ని వివరాలు కంపెనీ ఫౌండర్ రామకృష్ణ కుప్పా ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. మాది హైదరాబాద్. ఆచార్య నాగార్జున వర్సిటీలో ఎంఎస్ పూర్తయ్యాక.. బెంగళూరులో ఒకట్రెండు స్థానిక ఐటీ కంపెనీలో ఉద్యోగంలో చేరా. తర్వాత అక్కడి నుంచి మైండ్‌ట్రీ టెక్నాలజీ డెవలప్మెంట్ బృందంలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేరా. తర్వాత మోటరోలాలో సీనియర్ ఇంజనీర్‌గా చేరా. 2009లో ఎస్ఎంఈలకు మొబిలిటీ సొల్యూషన్స్ అందించే క్రియేటివ్ ఎక్స్పర్ట్స్ కన్సల్టింగ్ అనే ఐటీ కంపెనీని ప్రారంభించాం. ఈ సమయంలో తెలిసిన విషయమేంటంటే.. టెక్నాలజీ అభివృద్ధి కోసం అయ్యే వ్యయం ఎక్కువగా ఉన్నందువల్లే పె ద్ద కంపెనీలు సైతం డిజిటల్ వైపు మళ్లటం లేదని! అభివృద్ధి వ్యయాన్ని తగ్గించాలంటే ముందుగా సమయాన్ని, నిర్వహణ ఖర్చును తగ్గిస్తే సరిపోతుందని తెలిసి.. రకరకాల టెక్నాలజీలను అద్దెకు ఇస్తే సరిపోతుందని నిర్ణయించుకున్నాం. అలా 2015లో నా భార్య అను అఖిలతో కలిసి రూ.1.2 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్ కేంద్రంగా ఆన్‌గో ఫ్రేమ్ వర్క్ కంపెనీని ప్రారంభించాం. ఏపీ, తెలంగాణ నుంచి 400 కంపెనీలు.. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (ఏఐ), మిషన్ లెర్నింగ్, కాగ్నెటివ్ కంప్యూటింగ్, క్లౌడ్ టెక్నాలజీ, ఆటోమేషన్, ఈఆర్పీ, వాలెట్ ప్రోగ్రామింగ్ వంటి అన్ని రకాల టెక్నాలజీలు ఉంటాయి. ప్రస్తుతం ఆర్ధిక, వ్యవసాయ, రియల్ ఎస్టేట్, బీమా, వైద్యం, ఫుడ్ టెక్ రంగాల్లో ఎంటర్ప్రైజ్, ఎంఎస్ఈ రెండు విభాగాల్లో కలిపి 900 కంపెనీలు మా టెక్నాలజీని అద్దెకు తీసుకున్నాయి. వీటిల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన సుమారు 400 కంపెనీలుంటాయి. దుబాయ్, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన సుమారు 20 కంపెనీలు కూడా ఉన్నాయి. దుబాయ్‌కు చెందిన ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ, నిర్మాణ కంపెనీలు వీటిల్లో కొన్ని. ఇక, లోకల్ కంపెనీల్లో ఈ–సహాయ్, పేవైస్, లోహిత, బెల్ రైస్ వంటివి ఉన్నాయి. 2020 నాటికి రూ.70 కోట్ల టర్నోవర్.. ప్రస్తుతం నెలకు 10 ఎంటర్ప్రైజ్లకు, 300 ఎస్ఎంఈలకు ఫ్రేమ్ వర్క్ ఫీచర్స్, ప్రొడక్ట్ ఫీచర్స్, మొబైల్ యాప్, వెబ్ యాప్ డెవలప్మెంట్, డిజిటల్ ట్రాన్సాఫర్మేషన్, ఎంటర్ప్రైజ్ మొబిలిటీ సేవలందిస్తున్నాం. టెక్నాలజీని బట్టి నెల అద్దె రూ.2 వేల నుంచి రూ.7 లక్షల వరకున్నాయి. గతేడాది రూ.3 కోట్ల టర్నోవర్‌ను సాధించాం. ఈ ఏడాది ఇప్పటికే రూ.7 కోట్ల వ్యాపారాన్ని చేరుకున్నాం. ఈ ఏడాది ముగింపు నాటికి మరో రూ.7 కోట్లకు చేరుకుంటాం. 2020 నాటికి రూ.70 కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలన్నది మా లక్ష్యం. వచ్చే ఏడాది కాలంలో 10 వేల ఎస్ఎంఈ కస్టమర్లను చేరుకోవాలన్నది టార్గెట్. త్వరలోనే అమెరికాలోని పలు టెలికం కంపెనీలతో టెక్నాలజీ సేవల ఒప్పందం చేసుకోనున్నాం. త్వరలోనే రూ.35 కోట్ల సమీకరణ.. ప్రస్తుతం మా కంపెనీలో 94 మంది ఉద్యోగులున్నారు. మార్చి నాటికి ఈ సంఖ్యను 160కి చేర్చనున్నాం. ఇప్పటివరకు రెండు రౌండ్లలో కలిపి రూ.10 కోట్ల నిధులను సమీకరించాం. స్విట్జర్లాండ్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ క్రెడిట్ సూస్ డైరెక్టర్ పారస్ పరేఖ్, విర్టుసా ఐటీ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిషీ చౌహాన్ వంటి ఐదారుగురు ఇన్వెస్టర్లుగా ఉన్నారు. ఈ ఏడాది ముగింపు లోగా మరో రూ.35 కోట్ల నిధులను సమీకరించనున్నాం. ముంబైకి చెందిన పలువురు వీసీ ఇన్వెస్టర్లతో చ ర్చలు జరుగుతున్నాయి. ‘‘ మా టెక్నాలజీ మీద శిక్షణ, డిజిటల్ మార్కెటింగ్ తదితర అంశాలపై అ వగాహన కల్పించడం కోసం హైదరాబాద్‌కు చెం దిన డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ హాకీస్టిక్ మీడి యా అనే స్టార్టప్‌ను కొనుగోలు చేశాం. ఎస్ఎంఈ కంపెనీలతో పనిచేసే మరో స్టార్టప్‌ను కొనుగోలు కు ఆసక్తిగా ఉన్నామని’’ రామకృష్ణ వివరించారు. -
హోల్‌సేల్ బట్టల దుకాణం ‘టెక్స్‌ఫై’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శ్రీనివాస్‌కు వరంగల్‌లో ఒక బట్టల దుకాణం ఉంది. చీరలు, డ్రెస్‌ల కోసం సూరత్, అహ్మదాబాద్, కోల్‌కతా వంటి ప్రాంతాలకు వెళ్లి హోల్‌సేల్‌గా కొంటుంటాడు. వెళ్లడం నుంచి ఉత్పత్తుల ఎంపిక, లాజిస్టిక్, లావాదేవీలు.. ప్రతిదీ ఇబ్బందే! కానీ, ఇప్పుడు శ్రీనివాస్.. జస్ట్ తన షాపులో కూర్చొని వేరే రాష్ట్రాల్లోని ఉత్పత్తులను కొంటున్నాడు. అదే... టెక్స్‌ఫై.కామ్ ప్రత్యేకత. టెక్స్‌ఫైలో వివిధ రాష్ట్రాలకు చెందిన 300కు పైగా గార్మెంట్స్ తయారీ సంస్థలు.. 15 వేలకు పైగా ఉత్పత్తులు ఉన్నాయి. విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న టెక్స్‌ఫై గురించి మరిన్ని వివరాలు ఫౌండర్ రఘునాథ్ పెనుమూర్తి ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది పశ్చిమ గోదావరి జిల్లా అల్లంపురం. డిగ్రీ పూర్తయ్యాక.. హైదరాబాద్‌లో ఓ స్టార్టప్ కంపెనీలో చేరా. నా రూమ్మేట్కు భీమవరంలో ఓ బట్టల షాపుంది. వాళ్ల నాన్న నెలకోసారి హైదరాబాద్‌కు వచ్చి హోల్‌సేల్‌గా చీరలు, పిల్లల బట్టలు వంటివి కొనుక్కెళ్లేవాడు. ప్రతిసారి లాజిస్టిక్ ఇబ్బందిగా ఉండేది. ఇదే విషయాన్ని ఓరోజు నాతో చర్చించాడు. అప్పుడే అనిపించింది గార్మెంట్స్ తయారీ సంస్థలను, రిటైలర్లను కలిపే కంపెనీ పెడితే బాగుంటుందని!! అదే టెక్స్‌ఫై.కామ్‌కు పునాది. రూ.30 లక్షల పెట్టుబడితో గతేడాది ఆగస్టులో విశాఖపట్నంలో దీన్ని ఆరంభించాం. 400 తయారీ సంస్థలు, 3 వేల రిటైలర్లు.. ప్రస్తుతం టెక్స్‌ఫైలో 300 తయారీ సంస్థలు నమోదయ్యాయి. సూరత్, అహ్మదాబాద్, జైపూర్, లుథియానా, ముంబై, తిర్పూర్, కోల్‌కతా, చెన్నై వంటి ప్రాంతాల నుంచి ఉన్నారు. ఏపీ, తెలంగాణ నుంచి ఉప్పాడ, పోచంపల్లి, కలంకారి వంటి చేనేత వస్త్ర తయారీ సంస్థలున్నాయి. ప్రతి నెలా కొత్తగా 40 సంస్థలు రిజిస్టరవుతున్నాయి. ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల నుంచి సుమారు 3 వేల మంది రిటైలర్లు నమోదయ్యారు. ప్రస్తుతం టెక్స్‌ఫైలో 15 వేల పైగా ఉత్పత్తులు లిస్టయ్యాయి. నెలకు రూ.10 లక్షల ఆర్డర్లు.. టెక్స్‌ఫై యాప్, వెబ్సైట్... ఎక్కడి నుంచైనా ఆర్డర్ ఇవ్వొచ్చు. ప్రస్తుతం నెలకు రూ.10 లక్షల విలువ చేసే 130 ఆర్డర్లు వస్తున్నాయి. కనీస ఆర్డర్ విలువ రూ.1,600. ఉత్పత్తుల డెలివరీ కోసం డెలివర్హీ, ఫెడెక్స్, అరామెక్స్, బ్లూడార్ట్ వంటి ఆరు కొరియర్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఆర్డర్ వచ్చిన వారం రోజుల్లోగా డెలివరీ పూర్తవుతుంది. గత నెలలో టెక్స్‌ఫై ఈ–డిస్ట్రిబ్యూషన్‌ను ప్రారంభించాం. గోడౌన్, లాజిస్టిక్, ఉత్పత్తుల నిర్వహణ అన్నీ కంపెనీయే చూసుకుంటుంది. జస్ట్.. స్థానికంగా ఉన్న రిటైలర్ల నుంచి ఆర్డర్లు తీసుకొస్తే చాలు.. టర్నోవర్‌లో 3 శాతం కమీషన్ ఉంటుంది. ఇప్పటివరకు విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కర్నాటకలో 6 ఈ–డిస్ట్రిబ్యూషన్లు ఇచ్చాం. ఏడాదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 300 మందికి ఈ–డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలన్నది లక్ష్యం. త్వరలోనే బజాజ్ ఫైనాన్స్ వంటి పలు ఎన్బీఎఫ్సీ సంస్థలతో ఒప్పందం చేసుకోనున్నాం. దీంతో రిటైలర్లకు 45 రోజుల క్రెడిట్ మీద ఉత్పత్తులను కొనుగోలు చేసే వీలుంటుంది. 2 నెలల్లో రూ.50 లక్షల సమీకరణ.. ఏడాది కాలంలో అన్ని దక్షిణాది రాష్ట్రాలకు విస్తరణతో పాటూ రూ.25 కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలని లకి‡్ష్యంచాం. వచ్చే ఏడాది ముగింపు నాటికి టెక్స్‌ఫైలో రిటైలర్ల సంఖ్యను 10 వేలకు, తయారీ సంస్థలను వెయ్యికి చేర్చాలన్నది మా లక్ష్యం. ప్రస్తుతం మా సంస్థలో 16 మంది ఉద్యోగులున్నారు. 2 నెలల్లో రూ.50 లక్షల నిధులను సమీకరించనున్నాం. త్వరలోనే డీల్‌ను క్లోజ్ చేస్తాం’’ అని రఘునాథ్ వివరించారు. -
కోళ్ల పరిశ్రమకు డిజిటల్ టచ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోళ్ల పరిశ్రమ అనగానే సీజనల్ బిజినెస్ అంటారు. గుడ్ల నుంచి మొదలుపెడితే కోడి పిల్లల పెంపకం, ఫీడింగ్, కోల్డ్ స్టోరేజ్, ఫుడ్ ప్రాసెసింగ్.. ఇలా ప్రతి దశలోనూ ఉష్ణోగ్రత, స్థానిక వాతావరణ ప్రభావితం చేస్తుంటాయి. ఏ మాత్రం తేడా వచ్చినా నష్టాలే. టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లోనూ కోళ్ల పరిశ్రమలో ఇలాంటి పరిస్థితి ఎందుకా అనిపించింది హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్–అర్చన దంపతులకు. అప్పటికే చేస్తున్న ఐటీ ఉద్యోగాలకు గుడ్‌బై కొట్టేసి ఎంఎల్‌ఐటీని ప్రారంభించారు. ఇదేంటంటే.. పొదుగు, కోడి పిల్లల ఉత్పత్తి, ఆహారం, శీతలీకరణ కేంద్రం, ఫుడ్ ప్రాసెసింగ్.. ఇలా కోళ్ల పరిశ్రమలో ప్రతి దశలోనూ టెక్నాలజీ అందిస్తుంది. మరిన్ని వివరాలు ఎంఎల్ఐటీ కో–ఫౌండర్ అర్చన ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది హైదరాబాద్. కస్తూర్బాలో ఎంఎస్సీ పూర్తయింది. పెళ్లయ్యాక ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డాం. ఏడేళ్ల తర్వాత తిరిగి ఇండియాకి వచ్చి కుటుంబ వ్యాపారమైన ఇండస్ట్రియల్ పరికరాల తయారీలో భాగస్వామినయ్యా. నట్లు, బోల్ట్‌ల వంటి ప్రతి ఉత్పత్తి తయారీని ప్రత్యక్షంగా పరిశీలించాల్సిన అవసరం లేకుండా ఉత్పత్తుల తయారీ, నియంత్రణ, నిర్వహణ సులువుగా ఉండేలా ఐఓటీ ఆధారిత పరికరాన్ని అభివృద్ధి చేశా. ఈ ఐవోటీ పరికరం... ఉత్పత్తుల తయారీ సమయంలో ఉష్ణోగ్రత, ఒత్తిడి, వాతావరణ పరిస్థితులను నియంత్రిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. క్వాలిటీ మేనేజర్ పనంతా ఈ ఐఓటీ పరికరమే చేసేస్తుందన్నమాట! ఓ రోజు మా కస్టమర్‌తో మాట్లాడుతున్నప్పుడు వాళ్లకు సంబంధించిన ఓ హేచరీస్ ఇంక్యుబేటర్‌లో ఉష్ణోగ్రత పెరిగి గుడ్లు పాడైపోయాయని ఫోన్ వచ్చింది. దీన్ని మాతో చెబుతు నట్లు, బోట్ల తయారీలో ఉష్ణోగ్రతలను నియంత్రించినట్లే పౌల్ట్రీ పరిశ్రమలోనూ ఉంటే బాగుండనని అన్నారాయన. అలా ఎంఎల్ఐటీ కంపెనీకి పునాది పడింది. 2016లో రూ.60 లక్షల పెట్టుబడితో టీ–హబ్ కేంద్రంగా ప్రారంభించాం. కన్‌సైట్, పౌల్ట్రీమాన్ రెండు పరికరాలు.. ప్రస్తుతం ఎంఎల్ఐటీ నుంచి రెండు ఉత్పత్తులున్నాయి. మొదటిది కన్‌సైట్. దీన్ని బిగ్ డేటా, క్లౌడ్ టెక్నాలజీ ఆధారంగా అభివృద్ధి చేశాం. కోళ్ల పరిశ్రమలో ఉష్ణోగ్రతల నియంత్రణతో పాటు ఫామ్ నిర్వహణ, విశ్లేషణ సేవలందించడం దీని ప్రత్యేకత. ఒకేసారి వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న అన్ని ఫామ్‌లను రియల్ టైమ్‌లో నిర్వహించుకునే వీలుంటుంది. ధర రూ.60 వేలు. రెండోది పౌల్ట్రీమాన్. సెన్సార్లు, క్లౌడ్ టెక్నాలజీ అనుసంధానిత పరికరమిది. దీన్ని హేచరీలో అనుసంధానం చేస్తాం. మొబైల్ అప్లికేషన్స్‌తో ఎప్పటికప్పుడు ఇంక్యుబేటర్‌లోని ఉష్ణోగ్రత నివేదికలను చూడొచ్చు. ఏమాత్రం తేడా వచ్చిన అలెర్ట్ చేస్తుంది. ఏ దశలో సమస్య ఉందో కరెక్ట్ లొకేషన్ చూపిస్తుంది. దీంతో నేరుగా సమస్యను పరిష్కరించవచ్చు. ధర రూ.15 వేలు. వార్షిక నిర్వహణ రుసుము 12 శాతం. పౌల్ట్రీమాన్‌కు పేటెంట్ ఉంది. సెప్టెంబర్ నుంచి సుగుణలో సేవలు.. ప్రస్తుతానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సేవలందిస్తున్నాం. దాదాపు 10 సంస్థలు మా సేవలు వినియోగించుకుంటున్నాయి. వీటిల్లో వంద వరకు ఇంక్యుబేషన్స్ ఉంటాయి. పెద్ద కంపెనీలతో మాట్లాడుతున్నాం. సుగుణ కంపెనీలో అన్ని విభాగాల్లోనూ పౌల్ట్రీమాన్, కన్‌సైట్ నిర్వహణ సేవలు సెప్టెంబర్ రెండో వారం నుంచి ప్రారంభిస్తున్నాం. వచ్చే ఏడాది కాలంలో బెంగళూరు, కోయంబత్తూరు, కోల్‌కతాలకు విస్తరించనున్నాం. గతేడాది రూ.12 లక్షల ఆదాయాన్ని ఆర్జించాం. వచ్చే ఏడాది రూ.5 కోట్ల ఆదాయాన్ని, పౌల్ట్రీ పరిశ్రమలో 30 శాతం మార్కెట్ వాటాను లకి‡్ష్యంచాం. మా సంస్థలో ప్రస్తుతం 8 మంది ఉద్యోగులున్నారు. టెక్నాలజీ, సేల్స్ విభాగంలో మరో నలుగురిని తీసుకుంటున్నాం. దేశంలోని ప్రముఖ అగ్రిటెక్ వెంచర్ క్యాప్టలిస్ట్ నుంచి రూ.7 కోట్ల నిధులను సమీకరించనున్నాం. డీల్ 2 నెలల్లో పూర్తవుతుంది’’ అని అర్చన వివరించారు. -
అద్దెకు పురుషుల ‘ఫ్యాషన్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బట్టలు కొనాలంటే మనం ఏం చేస్తాం. షోరూమ్‌కు వెళ్లి నచ్చిన బట్టలను ఎంచుకొని.. సరిపోతాయో లేదోనని ట్రయల్ వేసుకొని కొంటాం! సేమ్.. క్యాండిడ్ నాట్స్లోనూ అంతే. కాకపోతే ఇక్కడ కొనాల్సిన పనిలేదు. అద్దెకు తీసుకుంటే చాలు! అంతేకాదు దుస్తులే కాదు టైలు, బెల్టులు, కళ్లద్దాలు, పర్సులు పురుషులకు సంబంధించిన ప్రతి ఒక్క ఫ్యాషన్ ఉత్పత్తులనూ అద్దెకివ్వటమే దీని ప్రత్యేకత. మరిన్ని వివరాలు క్యాండిడ్నాట్స్.కామ్ ఫౌండర్ శ్వేత పొద్దార్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. మాది తమిళనాడు. వీఐటీలో ఇంజనీరింగ్ పూర్తయ్యాక.. అకామాయ్ టెక్నాలజీస్, హెచ్ఎస్బీసీ వంటి కంపెనీల్లో పనిచేశా. కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తుండటంతో మీటింగ్ లేక పార్టీ ఇతరత్రా ప్రత్యేక సందర్భాలు కామన్‌గా జరుగుతుండేవి. ప్రతిసారీ ఖరీదైన బట్టలు కొనాలంటే ఇబ్బంది. దీంతో స్థానికంగా అద్దెకు తీసుకునేదాన్ని. ఇదే పరిస్థితి నా తోటి సహోద్యోగులదీనూ. కాకపోతే పురుషుల ఫ్యాషన్స్ అద్దెకు దొరకటం చాలా తక్కువ. ఇదే క్యాండిడ్నాట్స్ స్టార్టప్‌కు బీజం వేసింది. 2016 ఆగస్టులో రూ.10 లక్షల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా క్యాండిడ్నాట్స్ను ప్రారంభించా. 8 కేటగిరీలు; వెయ్యి ఉత్పత్తులు.. జోధ్‌పురీ సూట్స్, బ్లేజర్స్, జాకెట్స్, కుర్తా అండ్ పైజామా, శేర్వాణీ, వెస్ట్రన్, డిజైనర్ అండ్ ఎత్నిక్ వేర్ దుస్తులుంటాయి. వీటితో పాటు టై, బెల్ట్‌లు, పాదరక్షలు, కళ్లద్దాలు, గడియారాలు, పర్సులు వంటి పురుషుల ఫ్యాషన్‌కు సంబంధించిన అన్ని రకాల యాక్ససరీలుంటాయి. సంజయ్ షానీ, సోలా ఫ్యాషన్స్, మాక్రో ఇటలీ వంటి 6 డిజైనర్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఆయా డిజైనర్ దుస్తులను అద్దెకిస్తాం. మొత్తంగా 8 కేటగిరీల్లో 1,000 రకాల ఉత్పత్తులుంటాయి. ఏడాది కాలంలో 2 వేల ఉత్పత్తులకు చేర్చాలన్నది లక్ష్యం. 2 నెలల్లో హైదరాబాద్‌లో.. ప్రస్తుతం బెంగళూరులో సేవలందిస్తున్నాం. ఇప్పటివరకు 12 వేల మంది కస్టమర్లు మా యాక్ససరీలను అద్దెకు తీసుకున్నారు. ప్రస్తుతం నెలకు 800 ఆర్డర్లు వస్తున్నాయి. సూట్లు ఎక్కువగా అద్దెకు తీసుకుంటున్నారు. ఉత్పత్తుల గరిష్ట చిల్లర ధర (ఎంఆర్పీ)లో 10–15% అద్దె ఉంటుంది. కనీస ఆర్డర్ విలువ రూ.1,500. ఏటా రూ.80 లక్షల ఆదాయం వస్తుంది. 2 నెలల్లో హైదరాబాద్‌లో సేవలను ప్రారంభించనున్నాం. ఏడాదిలో ఆఫ్‌లైన్ స్టోర్‌ను ఏర్పాటు చేస్తాం. 2020 నాటికి ఢిల్లీ, ముంబై, పుణే నగరాలకు విస్తరించాలన్నది లక్ష్యం. రూ.2 కోట్ల నిధుల సమీకరణ.. పెళ్లి ఫొటో షూట్స్, ఫ్యాషన్ షోలు, మీటింగ్స్, సమావేశాలు, ఇంటర్వ్యూలు, కార్పొరేట్ ఈవెంట్లకు, కాలేజ్ ఫేర్వెల్, కాన్వొకేషన్స్, వార్షికోత్సవాలకు అద్దెకు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మా సంస్థలో 12 మంది ఉద్యోగులున్నారు. 4 నెలల్లో రెట్టింపు ఉద్యోగులను తీసుకుంటాం. ఏడాదిలో రూ.2 కోట్ల ఆదాయం లక్ష్యం. క్యాండిడ్ నాట్స్‌కు సొంత డెలివరీ, లాజిస్టిక్ వ్యవస్థ ఉంది. త్వరలోనే రూ.2 కోట్ల నిధులను సమీకరించనున్నాం. వీటితో మహిళలు, పిల్లల దుస్తులు, యాక్ససరీల అద్దె విభాగంలోకి విస్తరిస్తామని శ్వేత వివరించారు. -
గ్రామాల్లో ‘నయాగాడీ’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టూవీలరైతే ఓకే!! కానీ ట్రాక్టర్ల వంటి భారీ వాహనాల షోరూమ్‌లు ప్రతి గ్రామంలోనూ ఉండాలంటే కష్టమే. స్థలం... పెట్టుబడి... మార్జిన్లు... ఇలాంటివన్నీ దీనిపై ప్రభావం చూపిస్తాయి. ఇదిగో... ఇలాంటి సమస్యలకు చిత్తూరు జిల్లా నగరి కుర్రాడు బాలాజీ చూపించిన పరిష్కారమే... ‘నయాగాడీ’! కైశెట్టి బాలాజీది రైతు కుటుంబం. వ్యవసాయం కోసం ట్రాక్టర్ కొందామనుకున్నాడు. అడ్వాన్సు పట్టుకుని బయలుదేరాడు. అప్పుడు తెలిసింది.. వాళ్ల ఊళ్లో ట్రాక్టర్ షోరూమ్ లేదని! చిత్తూరుకు వెళ్లి కొనాలి. కంపెనీ రేటొకటైతే స్థానిక డీలర్ చెప్పేది మరొకటి!!. అవసరం మనది కనక చేసేదేమీ ఉండదు. డీలర్లే కాదు! వాహన రుణాలిచ్చే బ్యాంక్‌లు, బీమా కంపెనీలు, నిర్వహణ కేంద్రాలు అన్నింటికీ సమస్యే. దీనికి టెక్నాలజీతో బాలాజీ చెప్పిన సమాధానమే ‘‘నయాగాడీ’’ ఆవిష్కరించింది. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. చిత్తూరులో డిప్లొమా పూర్తయ్యాక.. బెంగళూరులోని ఆటోమొబైల్ డిజైన్, సప్లయి కంపెనీ ఆస్పెక్ట్‌లో చేరా. అక్కడి నుంచి విప్రో, హెచ్‌పీ, ఐబీఎం వంటి కంపెనీల్లోనూ పనిచేశా. బహుళ జాతి ఆటో మొబైల్ కంపెనీల్లో 10 ఏళ్ల అనుభవం ఉంది. దీంతో 2015 సెప్టెంబర్‌లో రూ.25 లక్షల పెట్టుబడితో బెంగళూర్‌లో ‘నయాగాడీ.కామ్’ను ప్రారంభించా. స్థానికంగా ఉండే అన్ని రకాల వాహన డీలర్లతో ఒప్పందం చేసుకొని గ్రామాల్లో నయాగాడీ ఎక్స్పీరియన్స్ కేంద్రాలు, ఏజెంట్లను ఏర్పాటు చేసి వాహనాలను విక్రయించడమే మా ప్రత్యేకత. రూ.4 కోట్లు; 80 వాహనాలు.. నయాగాడీలో బైక్‌లు, ఆటోలు, కార్లు, జీపులు, ట్రాక్టర్ల వంటి అన్ని రకాల వాహనాలతో పాటూ ఎలక్ట్రిక్ వాహనాలనూ కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం బెంగళూరు, ఒడిశా నగరాల్లో సేవలందిస్తున్నాం. 120 మంది వాహన డీలర్లతో ఒప్పందం చేసుకున్నాం. రుణాల కోసం క్యాపిటల్ ఫస్ట్, కొటక్, బీమా కోసం పాలసీబజార్, రెన్యూ, గోడిజిట్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. నయాగాడీ మల్టీ ఎక్స్పీరియన్స్ సెంటర్లలో వాహనాలకు సంబంధించిన బ్రోచర్లు, ఫొటోలు, ధరలు, రుణం, బీమా వంటి అన్ని రకాల సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇప్పటివరకు నయాగాడీ వేదికగా రూ.4 కోట్ల విలువ చేసే 80 వాహనాలను విక్రయించాం. డీలర్ ధర కంటే నయాగాడీలో రూ.1,000–10,000 వరకు ధర తక్కువే ఉంటుంది. పైగా విడిభాగాలు, ఇతరత్రా ఉపకరణాలపై 20% కమీషన్ కూడా ఉంటుంది. నెల రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి... నెల రోజుల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖ, గుంటూరుల్లో నయాగాడీ కేంద్రాలను ప్రారంభించనున్నాం. ఆయా ప్రాంతాల్లో 100 మంది డీలర్లతో డీల్ చేసుకున్నాం. ఏడాదిలో చెన్నై, కోచి, భువనేశ్వర్, కటక్ ప్రాంతాల్లో నయాగాడీ సెంటర్లను ప్రారంభిస్తాం. ఏడాదిన్నరలో దేశంలోని 30 ప్రాంతాలకు విస్తరించాలన్నది మా లక్ష్యం. రూ. 3 కోట్ల ఆర్డర్ బుక్.. ప్రతి వాహనం విక్రయంపై డీలర్ నుంచి 1 శాతం, బ్యాంక్ రుణం పొందితే బ్యాంక్ నుంచి 1–1.50 శాతం, బీమా కంపెనీ నుంచి 10–20 శాతం వరకు కమీషన్ వస్తుంది. ప్రస్తుతం రూ.3 కోట్ల ఆర్డర్ బుక్ చేతిలో ఉంది. 3 నెలల్లో టీవీఎస్, నిస్సాన్, రెనాల్ట్, మహీంద్రా వాహన సంస్థలతో ఒప్పందాలు పూర్తవుతాయి. దీంతో డీలర్లతో పాటూ నేరుగా నయాగాడీలోనూ విక్రయాలుంటాయి. రూ.5 కోట్ల నిధుల సమీకరణ.. గతేడాది కర్నాటక ప్రభుత్వ ఎలైట్ 100 పోటీలో విజేతగా నిలిచాం. దీంతో రూ.10 లక్షలు గ్రాంట్‌గా లభించింది. ప్రస్తుతం మా కంపెనీలో 11 మంది ఉద్యోగులున్నారు. త్వరలో ఈ సంఖ్యను 25కి చేర్చనున్నాం. గతేడాది రూ.2.5 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నాం. వచ్చే ఏడాది కాలంలో రూ.50 కోట్ల టర్నోవర్‌ను చేరుకోవాలి లకి‡్ష్యంచాం. పలువురు హెచ్ఎన్ఐలు, ఏంజిల్ ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే రూ.5 కోట్ల నిధులను సమీకరిస్తాం. -
రీల్స్ ఆన్ వీల్స్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తిండి.. బట్ట.. ఇల్లు. ఈ మూడింటి తర్వాత మనిషికి కావాల్సింది వినోదమే!!. అందులో ముందుండేది సినిమానే!. కాకపోతే ఈ రంగంలో పెద్ద కంపెనీలదే హవా. ఇక్కడ చిన్న కంపెనీలు రాణించాలంటే వినూత్న ఆలోచన కావాలి.పిక్చర్ టైమ్ చేసిందిదే!!. గ్రామీణ ప్రాంతాల వారికి మల్టీప్లెక్స్ సినిమా అనుభూతిని కల్పించాలనుకుంది. దీనికోసం ప్రత్యేకంగా వాహనాలకు అభివృద్ధి చేసి సినిమాలను ప్రదర్శిస్తోంది. గోవా కేంద్రంగా 2015 అక్టోబర్‌లో ప్రారంభమైన ‘పిక్చర్ టైమ్’ సేవల గురించి మరిన్ని వివరాలు ఫౌండర్ సుశీల్ చౌధురి ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో ఒప్పందం.. 25 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, గ్రామాల్లో పిక్చర్ టైమ్ సేవలందిస్తున్నాం. కొత్త సినిమాల రిలీజ్ కోసం స్థానిక డిస్ట్రిబ్యూటర్లతో పాటు శోభు యార్లగడ్డ, శీతల్ భాటియా వంటి నిర్మాతలు, యశ్ రాజ్ ఫిల్మ్స్ (వైఆర్ఎఫ్), రెడ్ చిల్లీస్ వంటి నిర్మాణ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. త్వరలో ఫాక్స్ స్టార్, డిస్నీ, సోనీ పిక్చర్స్ వంటి సంస్థలతోనూ ఒప్పందం చేసుకోనున్నాం. కార్పొరేట్ ప్రకటనలు, ప్రభుత్వ పథకాలు, ప్రైవేట్ ప్రదర్శనలు, బ్రాండింగ్, సినిమా టికెట్ల అమ్మకం వంటి మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతోంది. గత సంవత్సరం రూ.8 లక్షల టర్నోవర్‌ను నమోదు చేశాం. ప్రకటనల ధరలు డీఏవీపీ నిర్దేశించినట్లే ఉంటాయి. వచ్చే నెలాఖరుకు తెలుగు రాష్ట్రాల్లోకి... ప్రస్తుతం ఒరిస్సా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో పిక్చర్ టైమ్ సేవలందిస్తోంది. ఆ రాష్ట్రాల్లో ఇప్పటివరకు 50కి పైగా సినిమాలను ప్రదర్శించాం. రేస్–3, సంజు, బాహుబలి–2 సినిమాలు నేరుగా పిక్చర్ టైమ్‌లో రిలీజయ్యాయి. వచ్చే నెలాఖరుకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎంట్రీ ఇస్తాం. స్థానికంగా ఒకరిద్దరితో జట్టుకట్టాం. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుతో పాటూ హిందీ సినిమాలనూ ప్రదర్శిస్తాం. 10 మొబైల్ సినిమా ట్రక్స్.. సినిమాలను ప్రదర్శించేందుకు, ప్రేక్షకులు కూర్చునేందుకు వీలుగా పోర్టబుల్ మొబైల్ డిజిటల్ మూవీ థియేటర్‌ను ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం అన్ని వాతావరణ పరిస్థితులనూ తట్టుకునేలా ట్రక్‌లను ఆధునీకరిస్తాం. ఏసీ, హెచ్డీ స్క్రీన్, 5.1 డోల్బీ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం. థియేటర్లో 120–150 సీట్లుంటాయి. ప్రస్తుతం పిక్చర్ టైమ్‌లో 10 మొబైల్ సినిమా ట్రక్‌లున్నాయి. ట్రక్ వెలుపలి భాగంలో ఫుడ్ కోర్ట్, ఎంటర్టైన్మెంట్, గేమింగ్ జోన్లు, వై–ఫై హాట్‌స్పాట్స్, మైక్రో ఏటీఎం వంటి ఏర్పాట్లుంటాయి. టికెట్ ధరలు రూ.30–50. ఆక్యుపెన్సీ 60% ఉంటుంది. 6 నెలల్లో రూ.100 కోట్ల సమీకరణ.. ప్రస్తుతం 60 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది చివరికి 3 వేల పోర్టబుల్ మొబైల్ డిజిటల్ మూవీ థియేటర్లను ఏర్పాటు చేస్తాం. ఇటీవలే ప్రీ–సిరీస్ రౌండ్లో భాగంగా రూ.25 కోట్ల నిధులు సమీకరించాం. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సీఎక్స్ పార్టనర్స్ కో–ఫౌండర్ అజయ్ రిలాన్ ఈ పెట్టుబడి పెట్టారు. వచ్చే 6 నెలల్లో మరో రౌండ్లో రూ.100 కోట్ల పెట్టుబడులు సమీకరిస్తాం. 2021 నాటికి ఎస్ఎంఈ వేదికగా ఐపీవోకి వెళ్లాలని లకి‡్ష్యంచాం. -
ఇడ్లీ దోశ వడ..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టార్టప్స్‌కు నిధులను సమీకరించడం పెద్ద సవాలే. వినూత్న ఆలోచన, భవిష్యత్తు మార్కెట్ అవకాశాలుంటే తప్ప అంత త్వరగా పెట్టుబడులు రావు. అలాంటిది ఇడ్లీ, దోశ, వడ పిండిలను విక్రయించే సంస్థలో దిగ్గజ పారిశ్రామికవేత్త, విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ పెట్టుబడి పెట్టడమంటే మామూలు మాట కాదు. రెడీ టు కుక్ రంగంలో తనదైన ముద్రవేసిన బెంగళూరు కంపెనీ ‘ఐడీ ఫ్రెష్ ఫుడ్స్’ మన దేశంలోనే కాదు! విదేశాల్లోనూ ఇడ్లీ, దోశ ఉత్పత్తులను విక్రయిస్తోంది. రోజుకు రూ.20 కోట్ల వ్యాపారం చేస్తున్న ఐడీ ఫ్రెష్ ఫుడ్స్ వ్యవస్థాపక సీఈఓ పీసీ ముస్తఫా ఓ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ‘స్టార్టప్ డైరీ’తో మాట్లాడారు. ఆయనేమంటారంటే.. ‘‘మాది కేరళలోని చెన్నాలోడె అనే మారుమూల గ్రామం. నిరుపేద కుటుంబం కావటంతో మూడు పూట్లా తిండే కష్టం. ఇక పొద్దున్నే టిఫిన్స్ అంటే లగ్జరీనే. చదువే దారి చూపిస్తుందని కష్టపడి కోల్‌కతాలోని ఆర్ఈసీ నుంచి కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశా. ఆ తర్వాత మోటరోలా, సిటీ బ్యాంక్, ఇంటెల్ సంస్థల్లో ఇండియాతో పాటు యూరప్, మధ్యప్రాచ్య దేశాల్లో పనిచేశా. తర్వాత ఐఐఎం బెంగళూర్‌లో ఎంబీఏ కూడా పూర్తి చేశా. ఓసారి బెంగళూరులోని మా కజిన్ వాళ్లింటికి వెళ్లా. వాళ్లకు ఇంద్రానగర్‌లో ఓ చిన్న కిరాణా షాపుంది. రోజూ అక్కడ లోకల్ బ్రాండ్ ఇడ్లీ, దోశ ప్యాకెట్స్ బోలెడన్ని అమ్మకాలుండేవి. ఓసారి షాపులో కూర్చున్న నాకు.. ఇది ఆశ్యర్యం కలిగించింది. నాణ్యత, దినుసుల ఎంపిక వంటివేవీ పట్టించుకోకుండా ప్యాకేజ్డ్ ఫుడ్‌కు ఇంత మార్కెట్ ఉందా అని! దీన్నే తాజాగా, అందుబాటు ధరల్లో అందిస్తే ఎలా ఉంటుందనుకున్నా!! మా కజిన్‌తో కలిసి రూ.50 వేల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా ఐడీ ఫ్రెష్ ఫుడ్‌ను ప్రారంభించాం. వండుకునేందుకు సిద్ధమైన రెడీ టు కుక్ ప్యాకెట్స్.. అది కూడా ప్రతి రోజూ తాజా ఉత్పత్తులు, వినూత్న ప్యాకేజింగ్, అందుబాటు ధర ఇదీ ఐడీ ఫ్రెష్ ఫుడ్స్ ప్రత్యేకత. 8 ఉత్పత్తులు.. ప్రస్తుతం ఐడీ ఫ్రెష్ నుంచి ఇడ్లీ, దోశ, వడ, రాగి ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, మలబార్ పరాఠా, గోధుమ పరాఠా, పన్నీర్ పిండి 8 రకాల ఉత్పత్తులున్నాయి. త్వరలోనే ఫిల్టర్ కాఫీ డికాక్షన్, టమాట, కొబ్బరి చట్నీలను తెస్తున్నాం. వచ్చే రెండేళ్లలో 15 ఉత్పత్తులను విపణిలోకి తీసుకురావాలన్నది మా లక్ష్యం. ప్రస్తుతం బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్, దుబాయ్‌లో 6 తయారీ కేంద్రాలున్నాయి. ఆయా ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 15 లక్షల ఇడ్లీలు. త్వరలోనే బెంగళూరులో మరో భారీ ప్లాంట్‌ను నిర్మించనున్నాం. దీంతో సామర్థ్యం రోజుకు కోటి ఇడ్లీలకు చేరుతుంది. పిండి రుబ్బడానికి అమెరికా సంస్థతో కలిసి సొంతంగా మిషన్లను అభివృద్ధి చేశాం. ఈ మిషన్ గంటకు 1,500 కిలోల పిండి రుబ్బుతుంది. 20 వేల స్టోర్లు; రోజుకు 20 కోట్ల వ్యాపారం.. మన దేశంతో పాటు దుబాయ్‌లోనూ ఐడీ ఫ్రెష్ ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. మొత్తం 20 వేల స్టోర్లున్నాయి. హైదరాబాద్‌లో 2,200, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరుల్లో 1,200 స్టోర్లున్నాయి. వచ్చే ఏడాది కాలంలో హైదరాబాద్‌లో 3 వేల స్టోర్లతో పాటు వరంగల్, కర్నూల్ వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరించాలని లకి‡్ష్యం చాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజుకు రూ.20 కోట్ల వ్యాపారం చేస్తున్నాం. హైదరాబాద్‌లో రోజు కు రూ.2 కోట్లు, ఏపీలో రూ.80 లక్షల వ్యాపారం ఉంది. మొత్తం ఆదాయంలో బెంగళూరు నుంచి 40%, హైదరాబాద్ నుంచి 16% వాటా వస్తోంది. ఐదేళ్లలో వెయ్యి కోట్లు లక్ష్యం.. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.275 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. అంతక్రితం ఏడాది ఇది రూ.182 కోట్లు. వచ్చే ఐదేళ్లలో వెయ్యి కోట్ల టర్నోవర్‌ను లకి‡్ష్యంచాం. త్వరలోనే ఒమన్, సౌదీ దేశాలకు ఆ తర్వాత సింగపూర్, శ్రీలంక, అమెరికా వంటి దేశాలకు విస్తరించనున్నాం. ప్రస్తుతం కంపెనీలో 1,600 మంది ఉద్యోగులున్నారు. త్వరలో ఈ సంఖ్యను 2 వేలకు చేరుస్తాం. ఇప్పటివరకు రెండు రౌండ్లలో రూ.185 కోట్ల నిధులను సమీకరించాం. హీలియన్ వెంచర్ పార్టనర్స్ రూ.35 కోట్లు, అజీజ్ ప్రేమ్‌జీ రూ.150 కోట్లు పెట్టుబడులు పెట్టారు... అని ముస్తఫా వివరించారు. -
స్పెషల్ కిడ్స్‌కు ‘పినాకిల్ బ్లూమ్స్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మానసికంగా సరైన ఎదుగుదల లేని పిల్లలే... స్పెషల్ కిడ్స్. దేశంలో ఇలాంటివారి సంఖ్య 5 లక్షలకుపైనే. సరిపల్లి కోటిరెడ్డి కుమారుడికీ ఇలాంటి సమస్యే వచ్చింది. వైద్యుల దగ్గరికి తీసుకెళితే ఆటిజం (బుద్ధి మాంద్యం) అని చెప్పారు. అయితే కోటిరెడ్డి దానిపై పూర్తిస్థాయిలో శోధించారు. రుగ్మతేంటో తెలుసుకున్నారు. చికిత్సతో కొంతవరకూ నయం చేయగలిగారు. అలాగని అక్కడితో ఆగిపోలేదు!! అలాంటి పిల్లలకు తగిన విద్య, ఇతర సేవలు అందించడానికి ‘పినాకిల్ బ్లూమ్స్’ను ఏర్పాటు చేశారు. ఇపుడు దాన్ని విస్తరించే పనిలో పడ్డారు. కంపెనీ గురించి ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్న విషయాలు ఆయన మాటల్లోనే... ‘‘మా బాబుకి 20 నెలలున్నప్పుడు ఆటిజం అని డాక్టర్ చెప్పారు. ఆ బాధ నుంచి కొద్ది రోజుల్లోనే తేరుకుని నిజంగా ఆటిజం ఉందా అని అధ్యయనం చేశాను. చివరకది సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ (వినికిడి సమస్య) అని తేలింది. పిల్లాడికి కాక్లియర్ ఇంప్లాంట్స్ సర్జరీ చేయించాం. ఇప్పటికీ బాబుకి ప్రత్యేక శ్రద్ధ అవసరం. అయితే ఆటిజం, డాల్ ఫేస్, మానసిక రుగ్మత, ప్రవర్తన సమస్యలతో దేశంలో 5 లక్షల పైచిలుకు మంది పిల్లలు బాధపడుతున్నారు. పిల్లలు పెరిగేంత వరకు సమస్య బయటపడదు. వీరికోసం ఏదో ఒకటి చెయ్యాలనిపించింది. పరిశోధన ఆధారంగా.. స్పెషల్ కిడ్స్‌కు ఎటువంటి థెరపీ ఇవ్వాలో లోతైన అధ్యయనం చేశాం. ఇందుకు రూ.4 కోట్ల వరకు ఖర్చయింది. సెంటర్ల ఏర్పాటు, కంపెనీ ఏర్పాటుకు రూ.1.5 కోట్లు వెచ్చించాం. మా సెంటర్ల ద్వారా స్పెషల్ కిడ్స్‌కు స్పీచ్, స్పెషల్ ఎడ్యుకేషన్, సైకాలజీ, ఆడియాలజీ సేవలు అందిస్తున్నాం. ఇందుకు తొలిసారిగా మెషీన్ లెర్నింగ్, బిగ్ డేటా టెక్నాలజీని ఆసరాగా చేసుకున్నాం. ఆడియాలజిస్ట్, సైకాలజిస్ట్, స్పీచ్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్, లాంగ్వేజ్ పాత్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఫిజియోథెరపిస్టులతో కూడిన 40 మంది నిపు ణులు ప్రస్తుతం పూర్తిస్థాయి సేవలందిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హార్వర్డ్ గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్తో కలిసి సైకాలజీలో పరిశోధన చేస్తున్నాం. కేంద్రీకృత వ్యవస్థ ద్వారా.. పిల్లలు, తల్లిదండ్రులు, సిబ్బందిపై కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ పర్యవేక్షణ ఉంటుంది. బాబు, పాప తల్లిదండ్రులకు ప్రతిరోజు 45 నిమిషాల పాటు కౌన్సెలింగ్ ఉంటుంది. ప్రతి సెషన్లో పిల్లలకు అందిన సేవలపై తల్లిదండ్రులు పినాకిల్ కనెక్ట్ యాప్‌లో రేటింగ్ ద్వారా తమ స్పందనను తెలియజేయాలి. ఇంట్లో పిల్లల ప్రవర్తన సమాచారాన్ని పొందుపరచాలి. ఈ అంశాల ఆధారంగా థెరపీలో మార్పు ఉంటుంది. అలాగే బాబు, పాప గురించి, వారితో ఎలా మెలగాలో నిపుణులు యాప్ ద్వారా చెప్తారు. సమస్య స్థాయినిబట్టి 3 నెలల నుంచి 2 ఏళ్ల వరకు థెరపీ అవసరం. విదేశాల్లోనూ అడుగుపెడతాం.. హైదరాబాద్‌లో కూకట్పల్లి, మాదాపూర్, సుచిత్ర, వెస్ట్ మారేడ్‌పల్లిలో పినాకిల్ బ్లూమ్స్ కేంద్రాలున్నాయి. రెండు నెలల్లో హైదరాబాద్‌లోనే మరో 7 కేంద్రాలు వస్తున్నాయి. విస్తరణకు రూ.9 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఏపీలో ఫ్రాంచైజీ విధానంలో 30 సెంటర్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. భారత్‌లో అన్ని రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ విస్తరిస్తాం. ఫ్రాంచైజీకి ప్లే స్కూళ్లు, చిల్డ్రన్ హాస్పిటల్స్, న్యూరాలజిస్టులకు ప్రాధాన్యమిస్తాం. 1,500 చదరపు అడుగుల విస్తీర్ణం, రూ.2–3 లక్షల పెట్టుబడి అవసరం. ప్రభుత్వం అనుమతిస్తే ప్రతి జిల్లా కేంద్రంలో ఏదైనా గవర్నమెంటు స్కూల్లో పినాకిల్ బ్లూమ్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధం. ఈ సెంటర్లలో ఉచితంగా సేవలు అందిస్తాం, -
బార్కోడ్లో రెజ్యూమ్! వీడియోలో ఇంటర్వ్యూ!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఓలా, ఉబర్ వంటి రెంటల్ కార్ల బుకింగ్ ఎలా చేయాలో మనకందరికీ తెలిసిందే! అచ్చం అలాగే కంపెనీల ఉద్యోగ నియామకాలూ ఉంటే! ఖాళీగా ఉన్న జాబ్స్ వివరాలు అభ్యర్థులకు.. అలాగే విద్యార్హతలతో కూడిన అభ్యర్థుల వివరాలు కంపెనీలకూ గూగుల్ మ్యాప్స్‌లో దర్శనమిస్తుంటే? ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం. బెంగళూరుకు చెందిన హలోజాబ్స్ అనే స్టార్టప్ ఈ నియామక టెక్నాలజీని రూపొందించింది. ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉందని, ఏడాదిలో విపణిలోకి విడుదల చేస్తామని ధీమా వ్యక్తం చేశారు హలోజాబ్స్ ఫౌండర్ శ్రీనివాస్ వరాహగిరి. మరిన్ని వివరాలను ఆయన ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది తూర్పు గోదావరి జిల్లా చింతలపల్లి గ్రామం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తయ్యాక... పలు ప్రైవేట్ కంపెనీల్లో హెచ్ఆర్, ఫైనాన్స్ విభాగంలో కీలక స్థాయిల్లో పనిచేశా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడిని కూడా. హెచ్ఆర్లో పని చేయటం వల్లే కావొచ్చు... ఉద్యోగ నియామక ప్రక్రియలోని సమస్యలను క్షుణ్నంగా తెలుసుకునే వీలు కలిగింది. టెక్నాలజీతో మానవ వనరుల విభాగం అవసరాలను సులభతరం చేయాలని నిర్ణయించుకొని.. రూ.25 లక్షల పెట్టుబడితో 2016 ఆగస్టులో బెంగళూరు కేంద్రంగా హలోజాబ్స్ను ప్రారంభించా. బార్కోడ్లో రెజ్యూమ్.. సాధారణంగా ఉద్యోగ నియామక ప్రక్రియ ఎలా ఉంటుందంటే.. పేజీలకు పేజీలు రెజ్యూమ్‌లు చేతపట్టుకొని కంపెనీల చుట్టూ తిరిగే అభ్యర్థులు ఒకవైపు. నియామకాల్లో ఎంపికైన అభ్యర్థుల వ్యక్తిగత సమాచారం, సర్టిఫికెట్స్ ధ్రువీకరణ కోసం కంపెనీలు మరోవైపు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా హలోజాబ్స్లో నమోదు చేసుకున్న అభ్యర్థులకు ఏటీఎం కార్డు తరహాలో ఉచితంగా క్యూఆర్ కోడ్‌తో విజువల్ రెజ్యూమ్ (వీఆర్) గుర్తింపు కార్డును అందిస్తాం. ఇందులో అభ్యర్థి విద్యా సంబంధమైన వివరాలతో పాటు, నైపుణ్యం, అనుభవం వంటి కీలక సమాచారాన్ని సులువుగా గుర్తించేలా ప్రత్యేక ఏర్పాట్లుంటాయి. పైగా అభ్యర్థుల సర్టిఫికెట్స్, వ్యక్తిగత వివరాలు ధ్రువీకరణ ప్రక్రియ అంతా హలోజాబ్స్ చేసి బార్కోడ్లో నిక్షిప్తం చేస్తాం. కంపెనీలు తమ మొబైల్ ఫోన్‌తో ఈ బార్‌కోడ్‌ను స్కాన్ చేసినా లేదా ఫొటో తీసినా సరే వెంటనే అభ్యర్థి రెజ్యూమ్ ఫోన్ లేదా డెస్క్‌టాప్‌లోకి వచ్చేస్తుంది. అంతేకాకుండా ఎంపికైన అభ్యర్థి గురించి మళ్లీ కంపెనీ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరముండదు. వీడియోలోనే ఇంటర్వ్యూలు.. విజువల్ రెజ్యూమ్‌తో పాటూ వీడియో ఇంటర్వ్యూ సిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేశాం. త్వరలోనే విపణిలోకి విడుదల చేయనున్నాం. ఇదేంటంటే... అభ్యర్థులు ఎక్కడున్నా ఆన్లైన్ ద్వారా నేరుగా ఇంటర్వ్యూ కు హాజరయ్యే అవకాశముంటుంది. ప్రస్తుతం బెంగళూరు, చెన్నైల్లో సేవలందిస్తున్నాం. ఈ ఏడాది ముగింపు నాటికి హైదరాబాద్, విశాఖపట్నం, ఢిల్లీ, ముంబై, పుణె, అహ్మదాబాద్ నగరాలకు విస్తరించనున్నాం. ప్రస్తుతం హలోజాబ్స్లో 3 లక్షల మంది అభ్యర్థులు, 140 కంపెనీలు నమోదయ్యాయి. వీటిలో ప్రణవ హెల్త్‌కేర్, కాన్కార్డ్ ఆటోమేషన్, డిజిటల్ అకాడమీ వంటివి కొన్ని. ఏపీ, తెలంగాణ నుంచి 40 వేల అభ్యర్థులుంటారు. ఇప్పటివరకు హలోజాబ్స్ వేదికగా 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలొచ్చాయి. రూ.5 కోట్ల ఆదాయం లక్ష్యం.. మా ఆదాయ మార్గం రెండు విధాలుగా ఉంటుంది. ఒక ఉద్యోగ నియామక ప్రకటనకు రూ.250 ఉంటుంది. అలా కాకుండా నమోదైన అభ్యర్థుల డేటాబేస్ పొందాలంటే లక్ష రూపాయల వరకు ఉంటుంది. డేటాబేస్‌తో కంపెనీలు వాళ్లకు కావాల్సిన అభ్యర్థిని ఎంచుకునే వీలుంటుంది. కంపెనీల తరఫున ఇంటర్వ్యూ హలోజాబ్స్ చేసి పెడుతుంది. ఎంపికైన అభ్యర్థికిచ్చే ప్యాకేజ్‌లో 5–8.3 శాతం కంపెనీ నుంచి కమీషన్ రూపంలో తీసుకుంటాం. ప్రస్తుతం నెలకు 5 వేల మంది అభ్యర్థులు నమోదవుతున్నారు. 2,500 జాబ్ పోస్టింగ్స్ అవుతున్నాయి. సుమారు 100 ఇంటర్వ్యూలు చేస్తున్నాం. రూ.25 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం నెలకు రూ.15 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాం. 15% వృద్ధిని నమోదు చేస్తున్నాం. ఈ ఆర్ధిక సంవత్సరం ముగింపు నాటికి రూ.5 కోట్ల టర్నోవర్, 2020 నాటికి రూ.20 కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలన్నది మా లక్ష్యం. వచ్చే ఏడాది కాలంలో 25 లక్షల మంది అభ్యర్థులకు, సింగపూర్, మలేషియా దేశాలకు విస్తరించాలన్నది లక్ష్యం. ప్రస్తుతం మా కంపెనీలో 36 మంది ఉద్యోగులున్నారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రూ.25 కోట్ల నిధులను సమీకరిస్తామని’’ శ్రీనివాస్ వివరించారు. -
పార్టీ మీది.. ఏర్పాట్లు మావి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పుట్టిన రోజు, పెళ్లి రోజు వంటి ప్రత్యేక సందర్భాలు కావచ్చు... హాలిడే ట్రిప్స్, బ్యాచ్‌లర్, వీకెండ్ పార్టీలు కావచ్చు.. ఈవెంట్ ఏదైనా సరే అరేంజ్మెంట్స్ చేయడం పెద్ద పని. పోనీ, ఏ హోటల్లోనో కానిచ్చేద్దామంటే బడ్జెట్ భారమవుతుంది. పార్టీకయ్యే ఖర్చుకంటే ఏర్పాట్ల ఖర్చే తడిసిమోపెడవుతుంది. అలాకాకుండా కారు అద్దెకు తీసుకున్నట్టు పార్టీకి అవసరమైన ఉత్పత్తులనూ అద్దెకు తీసుకుంటే? ఇదే వ్యాపార సూత్రంగా మలచుకుంది బెంగళూరుకు చెందిన రెంట్‌షేర్. మన దేశంతో పాటూ దుబాయ్, షార్జా, అబుదాబిల్లోనూ తక్కువ ఖర్చుతో పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. మరిన్ని వివరాలు రెంట్‌షేర్ ఫౌండర్ అండ్ సీఈఓ హార్ష్ దండ్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘ఐఐటీ ఢిల్లీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేశాక.. ఐబీఎం రీసెర్చ్‌లో ఉద్యోగంలో చేరా. కొత్త కంపెనీ ప్రారంభించాలనే ఆలోచనతో 2008లో ఆక్స్‌వర్డ్ వర్సిటీ నుంచి ఎంబీఏ చేశా. అక్కడ చూసిన రెంటింగ్ ట్రెండ్ మన దేశంలోనూ ప్రారంభించాలని నిర్ణయించుకొని 2015 అక్టోబర్‌లో బెంగళూరు కేంద్రంగా రెంట్‌షేర్ స్టార్టప్‌ను ప్రారంభించా. ఆఫ్‌లైన్‌లో దొరికే ప్రతి వస్తువూ ఆన్లైన్లో అద్దెకివ్వాలన్నదే రెంట్‌షేర్ లక్ష్యం. 40 కేటగిరీలు.. 12 వేల ఉత్పత్తులు.. ప్రొజెక్టర్స్, ఎల్ఈడీ స్క్రీన్స్, స్పీకర్స్, బార్బిక్యూ గ్రిల్స్, హుక్కా సెట్స్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, మెడికల్ ఉత్పత్తులు ఇలా 40 కేటగిరీల్లో సుమారు 12 వేల ఉత్పత్తులున్నాయి. వీటిని గంటలు, రోజులు, వారం లెక్కన అద్దెకు తీసుకోవచ్చు. కనీస ఆర్డర్ విలువ రూ.వెయ్యి. ఉత్పత్తుల డెలివరీ, పికప్ బాధ్యత వెండర్‌దే. ఉత్పత్తుల అద్దె కోసం స్థానికంగా ఉండే వెండర్లతో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతం 600 మంది వెండర్లున్నారు. హైదరాబాద్ నుంచి 55 మంది ఉన్నారు. ఐపీఎల్, ఫీఫా వరల్డ్ కప్ సమయంలో ఎల్ఈడీ వాల్స్‌కు, స్పీకర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కర్ణాటక ఎలక్షన్ సమయంలో ఎల్ఈడీ వాల్స్ అద్దెకు తీసుకున్నారు. దీని ధర రోజుకు రూ.11 వేలు. హాబీస్, ట్రావెల్స్లోకి విస్తరణ.. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాలతో పాటూ దుబాయ్, అబుదాబి, షార్జాలల్లో సేవలందిస్తున్నాం. వీకెండ్స్, సమ్మర్ పార్టీలు, పెళ్లి, బర్త్‌డే పార్టీలు దుబాయ్‌లో ఎక్కువగా జరుగుతుంటాయి. అందుకే విదేశాల్లో మొదటగా దుబాయ్‌లో ప్రారంభించాం. వచ్చే నెలాఖరు నాటికి పుణే, కోచి, చండీగఢ్ నగరాలకు విస్తరించనున్నాం. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో వంద మంది వెండర్లతో ఒప్పందం చేసుకున్నాం. రెండు వారాల్లో హాబీస్, ట్రావెల్ విభాగంలోకి విస్తరించనున్నాం. అంటే డ్రోన్ కెమెరాలు, ఐస్ బాక్స్‌లు, డిస్కో లైట్లు, స్నో మిషన్స్, బీన్ బ్యాగ్స్ వంటి ఉత్పత్తులను అద్దెకిస్తాం. హైదరాబాద్ వాటా 20 శాతం... ప్రస్తుతం నెలకు 10 వేల ఉత్పత్తుల అద్దె ఆర్డర్లు వస్తున్నాయి. ఇందులో ఈవెంట్స్, పార్టీ ఉత్పత్తుల అద్దెలే 40% వరకుంటాయి. హైదరాబాద్ నుంచి నెలకు 1,200 ఉత్పత్తులు అద్దెకు తీసుకుంటున్నారు. గత రెండేళ్లలో 60 వేల మంది కస్టమర్లు మా సేవలను వినియోగించుకున్నారు. సుమారు 10 లక్షల ఉత్పత్తులను అద్దెకు అందించాం. మెడికల్ కేటగిరీలో వీల్ చెయిర్స్, ఆక్సిజన్ కిట్స్ వంటి వాటికి గిరాకీ పెరుగుతోంది. ప్రస్తుతం ఏటా రూ. 20 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాం. మా మొత్తం వ్యాపారంలో హైదరాబాద్ వాటా 20% వరకూ ఉంది. రూ.30 కోట్ల సమీకరణ.. ప్రస్తుతం కంపెనీలో 20 మంది ఉద్యోగులున్నారు. నెలాఖరు నాటికి టెక్నికల్ టీమ్‌లో మరో ఐదుగురిని తీసుకోనున్నాం. వచ్చే ఏడాది ముగింపు నాటికి 2 వేల మంది వెండర్లకు, రూ.60 కోట్ల ఆదాయానికి చేరుకోవాలని లకి‡్ష్యంచాం. ఇప్పటివరకు రూ.10 కోట్లు సమీకరించాం. ఐఐటీ–ఢిల్లీ, ఆక్స్‌వర్డ్ స్నేహితులతో పాటు దుబాయ్‌కు చెందిన ఇన్వెస్టర్లు ఈ పెట్టుబడి పెట్టారు. ఈ ఏడాది ముగింపులోగా మరో రూ.30 కోట్ల నిధులను సమీకరించనున్నాం. సౌదీకి చెందిన పలువురు ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నాం. -
చిట్టీలుంటే.. రుణాలిస్తాం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యక్తిగత అవసరం కావొచ్చు.. సంస్థ కోసం కావచ్చు.. ప్రతి నెలా చిట్టీలు వేయటం మనకు తెలిసిందే. అవసరానికి డబ్బులొస్తాయనో లేక పొదుపు చేస్తే వడ్డీ కలిసొస్తుందనో చిట్ఫండ్లలో సభ్యులుగా చేరతాం. మరి, నెలనెలా మీరు వేసే చిట్టీలే మీకు రుణాన్నిస్తే? చిట్టీ కాలం ముగిసే లోపు నెల వాయిదాతో పాటూ అసలూ తీరిపోతే? ఇదే వ్యాపారసూత్రంగా ఎంచుకుంది హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ క్రెడ్‌రైట్. దేశంలోని చిట్‌ఫండ్ కంపెనీలతో ఒప్పందం చేసుకొని సభ్యులకు ఎలాంటి తనఖా లేకుండా రూ.35 లక్షల వరకూ రుణాన్నిస్తోంది. మరిన్ని వివరాలను క్రెడ్‌రైట్ కో–ఫౌండర్ నీరజ్ భన్సాల్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ చిట్‌ఫండ్స్ జనరల్ సెక్రటరీ టీఎస్ శివరామకృష్ణన్‌తో కలిసి 2014లో రూ.1.5 కోట్ల పెట్టుబడితో క్రెడ్‌రైట్‌ను ప్రారంభించాం. అమెరికాలోని రొటేటింగ్ సేవింగ్స్ అండ్ క్రెడిట్ అసోసియేషన్ (రోస్కా) తరహాలోనే చిట్‌ఫండ్స్‌తో ఒప్పందం చేసుకున్నాం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ), కిరాణా షాపులు, ఇతరత్రా వ్యాపారస్తులకు డేటా ఆధారిత రుణాన్నివ్వటమే మా ప్రత్యేకత. చిట్ విలువలో 80% రుణం.. ప్రస్తుతం ఢిల్లీకి చెందిన బలుస్సెరీ, చెన్నైకి చెందిన మాయావరం, బెంగళూరుకు చెందిన ఇందిరానగర్, హైదరాబాద్‌కు చెందిన సప్తవందన చిట్‌ఫండ్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. వీటికి ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రోల్లో వందల బ్రాంచీలున్నాయి. లక్ష నుంచి రూ.35 లక్షల వరకు రుణాలిస్తాం. చిట్ విలువలో 80 శాతం వరకూ రుణం వస్తుంది. ప్రతి నెలా కేవలం వడ్డీ మాత్రమే ఉంటుంది. చిట్ పాడుకున్నపుడు అసలును కట్టాల్సి ఉంటుంది. ఏడాదికి 18% వడ్డీ ఉంటుంది. రూ.10 కోట్ల రుణాల మంజూరు.. పేరు, చిరునామా, చిట్‌ఫండ్ వివరాలు, ఇతరత్రా డాక్యుమెంట్ల పరిశీలన పూర్తయ్యాక.. 24 గంటల్లో రుణం మంజూరు చేస్తాం. ఇప్పటివరకు 150 మంది చిట్‌ఫండ్ దారులకు రూ.10 కోట్ల రుణా లిచ్చాం. రూ.10 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్నవాళ్లు 35% ఉంటారు. ఈ ఏడాది ముగిసేలోగా రూ.100 కోట్ల రుణాలను మంజూరు చేయాలని లక్ష్యించాం. రుణగ్రహీత నుంచి రుణంలో 1–2% ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. 2 నెలల్లో కేరళ, ఏపీలకు విస్తరణ.. ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ నగరాల్లో సేవలందిస్తున్నాం. మా మొత్తం ఆదాయంలో తెలంగాణ వాటా 15 శాతం. కర్ణాటక, మహారాష్ట్రల వాటా 35 శాతం. రెండు నెలల్లో కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సేవలను ప్రారంభిస్తున్నాం. ఆయా రాష్ట్రాల్లో 5 చిట్‌ఫండ్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటున్నాం. మార్గదర్శి, కపిల్ చిట్ఫండ్లతో చర్చిస్తున్నాం. ఈ ఏడాది ముగింపులోగా ఒప్పందం పూర్తవుతుంది. రూ.9 కోట్ల నిధుల సమీకరణ..: 2017–18లో రూ. కోటి ఆదాయాన్ని చేరుకున్నాం. ఈ ఏడాది రూ.10 కోట్లకు చేరాన్నది లక్ష్యం. ‘‘ప్రస్తుతం కంపెనీలో ఏడుగురు ఉద్యోగులున్నారు. త్వరలోనే దీన్ని 30కి చేర్చనున్నాం. ఇటీవలే యువర్నెస్ట్, ఆసియాన్ వెంచర్‌ల్యాబ్స్ ద్వారా రూ.9 కోట్లు సమీకరించాం’’ అని నీరజ్ వివరించారు. -
సౌర విద్యుత్‌ను విస్తరిద్దాం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సౌర విద్యుత్.. పేరు వినడానికి సింపుల్‌గానే అనిపిస్తుంది. ప్రాక్టికల్‌గానే కాసింత కష్టం. కారణం.. ఇన్స్టలేషన్, నిర్వహణ, పనిచేసే విధానం అంత సులువుగా అర్థం కావు! ఈ రంగంలోని బడా కంపెనీలేమో మెట్రోలకే పరిమితమయ్యాయి. గ్రామీణ, ఎంఎస్ఎంఈలకు సౌర వెలుగులు అందటంలేదు. దీనికి పరిష్కారం కనుగొంది హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ ఫ్రెయర్ ఎనర్జీ. ‘సన్ ప్రో’ యాప్ ఆధారంగా కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా సౌర ఏర్పాట్లు చేస్తోంది. దీంతో కంపెనీలకు ఎలాంటి పెట్టుబడి లేకుండానే గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించినట్టవుతుంది. పైగా బ్యాంక్‌లతో ఒప్పందం చేసుకొని కస్టమర్లకు రుణాలనూ అందిస్తుంది. మరిన్ని వివరాలను ‘ఫ్రెయర్’ కో–ఫౌండర్ రాధిక చౌదరి ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది హైదరాబాద్. ఉస్మానియాలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తయ్యాక.. అమెరికాలో న్యూక్లియర్ ఎనర్జీలో మాస్టర్స్ చేశా. తర్వాత జీఈ కంపెనీలో పవన విద్యుత్ విభాగంలో చేరా. అక్కడి నుంచి ఎస్కేఎఫ్ బేరింగ్స్‌లో చేరా. పెళ్లయి, పిల్లలు పుట్టడంతో 2008లో ఇండియాకు తిరిగి వచ్చేశా. హైదరాబాద్‌లో ల్యాంకో ఇన్ఫ్రాలో సోలార్ విభాగ డీజీఎంగా చేరా. ఆర్థిక సంక్షోభంతో కంపెనీ ఢిల్లీకి మారింది. ఢిల్లీకి వెళ్లటం ఇష్టం లేక నేను హైదరాబాద్‌లోనే ఉన్నా. అప్పుడే మరో మిత్రుడు సౌరభ్ మర్ధాతో కలిసి రూ.కోటి పెట్టుబడితో 2014లో ఫ్రెయర్ ఎనర్జీని ఆరంభించాం. నెలకు రూ.5 కోట్ల ఆర్డర్లు.. రూఫ్ టాప్స్, బోర్‌వెల్స్, పెంట్రోల్ బంక్‌లు, మైక్రో గ్రిడ్ నాలుగు విభాగాల్లో సౌర విద్యుత్‌ను అందిస్తున్నాం. రూ.5 కోట్ల విలువైన ఆర్డర్లు వస్తున్నాయి. ప్రతి ఆర్డర్‌పై మాకు 10 శాతం లాభం ఉంటుంది. ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్ వంటి విద్యుత్ విభాగాలతో పాటు యాక్సిస్ బ్యాంక్ వంటి పలు కమర్షియల్ ప్రాజెక్ట్‌లనూ నిర్వహిస్తున్నాం. త్వరలోనే తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సౌర విద్యుత్ ఏర్పాట్లకు ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. మా మొత్తం సౌర విద్యుత్ నిర్వహణలో ఎంఎస్ఎంఈ 40 శాతం, రూఫ్ టాప్ 20 శాతం వరకూ ఉంది. 14 రాష్ట్రాలు, విదేశాల్లోనూ సేవలు.. ప్రస్తుతం ఫ్రెయర్ ఎనర్జీతో 10 వేల మంది చానల్ పార్టనర్స్ ఒప్పందం చేసుకున్నారు. ఇందులో 500 మంది యాక్టివ్‌గా ఉంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, చంఢీగఢ్, ఢిల్లీ వంటి 14 రాష్ట్రాల్లో 900 పైగా సోలార్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేశాం. ప్రస్తుతం 6 మెగావాట్ల సౌర విద్యుత్‌ను నిర్వహిస్తున్నాం. మన దేశంతో పాటూ ఆఫ్రికా దేశాల్లోనూ చానల్ పార్టనర్స్ ఉన్నారు. వచ్చే రెండేళ్లలో 15 దేశాలకు విస్తరణ, 8 మెగావాట్ల సోలార్ విద్యుత్ నిర్వహణకు చేరాలని లకి‡్ష్యంచాం. 2 నెలల్లో రూ.20 కోట్ల సమీకరణ.. గత ఆర్ధిక సంవత్సరంలో రూ.12 కోట్లు ఆర్జించాం. వచ్చే ఏడాది రూ.80 కోట్ల ఆదాయాన్ని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం మా సంస్థలో 40 మంది ఉద్యోగులున్నారు. త్వరలోనే టెక్నాలజీ విభాగంలో మరో 15 మందిని తీసుకోనున్నాం. గత 18 నెలల్లో పలువురు సంస్థాగత ఇన్వెస్టర్లు, విదేశీ ఇన్వెస్టర్లు మా సంస్థలో రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టారు. రాబోయే 2 నెలల్లో 3 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించనున్నాం. యూరప్, సింగపూర్‌లకు చెందిన ఇన్వెస్టర్లతో చర్చలు ముగిశాయి’’ అని రాధిక వివరించారు. -
రూ.66కే ఆన్లైన్ దుకాణం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : రాత్రికి రాత్రే మీ ఆఫ్‌లైన్ దుకాణం ఆన్‌లైన్‌లోకి మారిపోవాలంటే? వెబ్సైట్ అభివృద్ధి, నిర్వహణ కోసం టెక్నాలజీ సంస్థలతో.. ఉత్పత్తుల సరఫరా కోసం లాజిస్టిక్స్‌తో.. నగదు లావాదేవీల కోసం పేమెంట్ గేట్వేలతో ఒప్పందం చేసుకోవాలి. నిజానికిది రాత్రికి రాత్రే జరిగే పనేం కాదు. కానీ షాప్మాటిక్తో ఒప్పందం చేసుకుంటే చాలు!! జస్ట్.. 15 నిమిషాల్లో మీ ఆఫ్‌లైన్ స్టోర్ కాస్త ఈ–కామర్స్ స్టోర్‌గా మారిపోతుంది. అంతే! వెబ్సైట్ అభివృద్ధి నుంచి మొదలుపెడితే నిర్వహణ, ప్యాకింగ్, లాజిస్టిక్, పేమెంట్ గేట్‌వే అన్ని రకాల సేవలూ ఒకే వేదికగా అందించడమే దీని ప్రత్యేకత. దీనికయ్యే ఖర్చు 3 నెలలకు రూ.66. ఇదే షాప్‌మాటిక్ సక్సెస్ మంత్రమంటున్నారు హైదరాబాద్‌కు చెందిన అనురాగ్ ఆవుల. మరిన్ని వివరాలు ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారాయన. ‘‘మాది కూకట్పల్లి. నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తయ్యాక.. మణిపాల్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశా. ఆ తర్వాత స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్, ఎన్సీఆర్ కార్పొరేషన్లో కొన్నాళ్లు పనిచేశా. అక్కడి నుంచి ఫిన్‌టెక్ కంపెనీ పేపాల్‌లో సింగపూర్‌లో చేరా. వృత్తిరీత్యా ఈ–కామర్స్ కంపెనీలతో పనిచేయాల్సి ఉండటంతో మన దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలు (ఎంఎస్ఎంఈ), ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ–కామర్స్ వ్యాపారం ప్రారంభించేందుకు ఎంత వ్యయ ప్రయాసలు పడుతున్నారో తెలిసింది. సులువుగా, అందుబాటు ధరలో దీనికి పరిష్కారం చూపాలని నిర్ణయించుకొని పేపాల్లోని మరో ఇద్దరు సహోద్యోగులు క్రిస్ చెన్, యెన్లీతో కలిసి రూ.2 కోట్ల పెట్టుబడితో 2015 అక్టోబర్‌లో బెంగళూరు కేంద్రంగా షాప్‌మాటిక్.కామ్‌ను ప్రారంభించాం. 15 నిమిషాల్లో ఈ–కామర్స్ స్టోర్.. ప్రస్తుతం 60కి పైగా ఉచిత స్టోర్ డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి. షాప్మాటిక్తో ఒప్పందమైన 15 నిమిషాల్లో ఆన్లైన్ వ్యాపారం ప్రారంభించవచ్చు. ఈ–కామర్స్ నిర్వహణ సేవలతో పాటూ ప్రమోషన్స్, ఆఫర్లు, డిస్కౌంట్లు, ఉత్పత్తుల రికమండేషన్స్ అన్ని ఉచితంగా పొందవచ్చు. ప్రస్తుతం షాప్మాటిక్కు 1.5 లక్షల మంది కస్టమర్లున్నారు. వీరిలో 45 శాతం కస్టమర్లు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల వారే. అత్యధిక కస్టమర్లు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ఉన్నారు. ఏపీ, తెలంగాణ వాటా 13 శాతం వరకూ ఉంటుంది. 3, 6, 12 నెలల వారీగా సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. 3 నెలలకు రూ.66. నెల రోజుల్లో యూఈఏకి విస్తరణ.. ప్రస్తుతం మన దేశంతో పాటూ సింగపూర్, తైవాన్, హాంకాంగ్ దేశాల్లో సేవలందిస్తున్నాం. నెల రోజుల్లో యూఏఈకి విస్తరించనున్నాం. ఈ ఏడాది ముగిసేలోగా ఇండోనేషియా, ఫిలిప్పిన్స్ దేశాలకు విస్తరించాలని, వచ్చే ఏడాది కాలంలో కస్టమర్ల సంఖ్యను 3 లక్షలకు చేర్చాలని లకి‡్ష్యంచాం. ఉత్పత్తుల డెలివరీ కోసం డెల్హివరీ, ఫెడెక్స్, డీహెచ్ఎల్ వంటి అన్ని కొరియర్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. రూ.70 కోట్ల నిధుల సమీకరణ.. ఏటా 310 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 70 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది ముగింపు నాటికి మరో 25 మందిని నియమించుకోనున్నాం. గతేడాది ఏసీపీ వెంచర్స్, స్ప్రింగ్స్ సీడ్ క్యాపిటల్ సంస్థలు రూ.25 కోట్ల పెట్టుబడి పెట్టాయి. మరో 2 నెలల్లో రూ.70 కోట్ల నిధులను సమీకరించనున్నాం. ఈ రౌండ్లో పాత ఇన్వెస్టర్లతో పాటూ కొత్తవాళ్లూ ఉంటారు’’ అని అనురాగ్ వివరించారు. -
కాజా.. పేట.. పల్లీపట్టీ.. రసగుల్లా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులు, ఆగ్రా పేట, నాగ్‌పూర్ రసగుల్లా, లూనావాలా పల్లీపట్టీ... ఇవన్నీ ఆయా ప్రాంతాల్లో ఫేమస్ స్వీట్స్! నిజం చెప్పాలంటే వీటివల్లే ఆయా ప్రాంతాలకు గుర్తింపు వచ్చింది కూడా. వీటిని టేస్ట్ చేయాలంటే? ఐతే ఆయా ప్రాంతాల్లో తెలిసిన వాళ్లెవరైనా ఉంటే పంపించమని చెప్పాలి లేకపోతే మనమో అటువైపు వెళ్లినప్పుడు కొనుక్కోవాలి. ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లోనూ అంత ఖర్మెందుకనుకున్నాడు అహ్మదాబాద్ కుర్రాడు విశ్వ విజయ్ సింగ్. అంతే!! చేస్తున్న ఉద్యోగానికీ గుడ్ బై చెప్పేసి.. సేల్భాయ్ని ప్రారంభించేశాడు. మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ విక్రయాలతో జోరు మీదున్న సేల్‌భాయ్ విశేషాలను ‘స్టార్టప్ డైరీ’కి వివరించారాయన. గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తయ్యాక.. ఎయిర్టెల్, నెరోల్యాక్, ఐసీఐసీఐ వంటి సంస్థల్లో 15 ఏళ్ల పాటు పనిచేశా. 2012–13లో ఇంటర్నెట్ బూమ్‌తో ఈ–కామర్స్ హవా మొదలైంది. అప్పటివరకు మొబైల్స్, అపెరల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి ఉత్పత్తులనే ఆన్లైన్లో అమ్మారు. మనకంటూ ప్రత్యేకత ఉండాలనే ఉద్దేశంతో ఆయా ప్రాంతాల్లో పేరొందిన ఫుడ్, బేకరీ ఐటమ్స్, ఇతరత్రా ఉత్పత్తులను విక్రయించాలనుకుని ఇద్దరు స్నేహితులు పూర్భ, ప్రమోద్‌లతో కలిసి అహ్మదాబాద్ కేంద్రంగా 2015 సెప్టెంబర్‌లో కోటి రూపాయల పెట్టుబడితో సేల్‌భాయ్.కామ్‌ను ప్రారంభించాం. 400 మంది వర్తకులు; 8 వేల ఉత్పత్తులు.. ప్రస్తుతం 400 మంది వర్తకులతో ఒప్పందం చేసుకున్నాం. స్నాక్స్, బేకరీ ఐటమ్స్, స్వీట్స్‌తో పాటూ హస్త కళలు, పూజా సామగ్రి, డెకరేటివ్, హెర్బల్ కేటగిరీలో సుమారు 10 వేల రకాల ఉత్పత్తులుంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 20 మంది వర్తకులుంటారు. చార్మినార్ గాజులు, కొండపల్లి బొమ్మలు, గద్వాల్ చీరలు వంటివి వీటిల్లో కొన్ని. ఉత్పత్తులను విక్రయించడమే కాకుండా.. వర్తకులు ఎవరు? ఉత్పత్తి ప్రత్యేకత ఏంటి? ఎలా తయారు చేస్తారు? ఎందుకింత ప్రత్యేకత వంటి వివరాలను ఫొటోగ్రాఫులతో పాటూ పొందుపరుస్తాం. దీంతో కస్టమర్ కొనుగోలు చేయకముందే ఉత్పత్తి విశేషాలను తెలుసుకునే వీలుంటుంది. హైదరాబాద్, రాయలసీమ కీలకం.. కస్టమర్ ఆర్డర్ బుక్ చేయగానే సంబంధిత వర్తకుడికి మెసేజ్, ఈ–మెయిల్ రూపంలో సందేశం వెళుతుంది. దీన్ని ఓకే చేయగానే ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. వెంటనే ఆ సమాచారం దగ్గర్లోని లాజిస్టిక్ కేంద్రానికి వెళుతుంది. కొరియర్ బాయ్ వర్తకుడి షాపుకెళ్లేలోపు వర్తకుడు ఆయా ఉత్పత్తిని సేల్‌భాయ్ ప్యాకేజింగ్‌లో ప్యాక్ చేసి పెడతాడంతే! ఫెడెక్స్, బ్లూడార్ట్, డెలివర్హీ వంటి అన్ని కొరియర్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతం 1.6 లక్షల మంది కస్టమర్లు నమోదయ్యారు. నెలకు 15 వేల ఆర్డర్లు బుక్ అవుతున్నాయి. ప్రతి ఉత్పత్తిపై వర్తకుని దగ్గర్నుంచి 22–45 శాతం వరకు కమీషన్ తీసుకుంటాం. మా వ్యాపారంలో రాయలసీమ, హైదరాబాద్ కీలకం. ఆర్డర్లు, వర్తకుల వారీగా ఇక్కడి నుంచే ఎక్కువగా ఉంటాయి. ఈ ఏడాది ఇతర ప్రాంతాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏడాదిలో కనీసం 50 మంది వర్తకులతో ఒప్పందం చేసుకుంటాం. వచ్చే ఏడాది కాలంలో నెలకు 50 వేల ఆర్డర్లకు చేర్చాలని లక్ష్యించాం. 3 నెలల్లో రూ.25 కోట్ల నిధుల సమీకరణ.. గతేడాది మా ఒప్పందం వర్తకులకు రూ.5 కోట్ల గ్రాస్ మర్తండైజ్ వ్యాల్యూ (జీఎంవీ) వ్యాపారం చేసిచ్చాం. ఇందులో రూ.1.7 కోట్లు లాభం వచ్చింది. ఈ ఏడాది రూ.10 కోట్లు జీఎంవీ, రూ.4 కోట్ల లాభం లక్ష్యించాం. మా లాభంలో 10 శాతం హైదరాబాద్ నుంచి ఉంటుంది. ప్రస్తుతం మా కంపెనీలో 38 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటి వరకు రూ.13 కోట్ల నిధులను సమీకరించాం. టైమ్స్ ఆఫ్ ఇండియా, బ్రాండ్ క్యాపిటల్, పలువురు హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్లున్నారు. త్వరలోనే రూ.25 కోట్ల నిధులను సమీకరించనున్నాం. పాత ఇన్వెస్టర్లతో పాటూ వీసీ ఫండ్లతో చర్చిస్తున్నాం. 3 నెలల్లో డీల్‌ను క్లోజ్ చేస్తాం... అని సింగ్ వివరించారు. -
ఆన్లైన్లో ‘అమ్మ మాట’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కూతురు, భార్య, తల్లి.. దశలను బట్టి మహిళ పోషించే పాత్రలివి. ఒక్కో దశలో ఒక్కో రకమైన అనుభవాలు! మరి, వీటిని మరో పది మందితో పంచుకుంటే!!? ఒకరి అనుభవాలే మరొకరికి పాఠాలుగా మారతాయి. ఇదే ఉద్దేశంతో దీనికి ఆన్లైన్ వేదికను అభివృద్ధి చేసింది ‘మామ్స్ప్రెస్సో’. గర్భం నుంచి మొదలుపెడితే సంతాన సంరక్షణ, బేబీ కేర్, టీనేజ్, బ్యూటీ, ఫ్యాషన్, హెల్త్‌కేర్ దాకా మహిళల అనుభవాలు, వీడియోలూ ఉంటాయిందులో! తెలుగుతో పాటూ ఇంగ్లిష్, మరాఠీ, హిందీ, బెంగాలీ, తమిళం భాషల్లో కంటెంట్ రాయొచ్చు. చదవొచ్చు కూడా. మరిన్ని వివరాలు మామ్స్ప్రెస్సో.కామ్ కో–ఫౌండర్ విశాల్ గుప్తా ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘ఐఐఎం బెంగుళూరులో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక.. ఏషియన్ పెయింట్స్‌లో రెండున్నరేళ్లు, హెచ్‌యూఎల్‌లో ఆరేళ్లు.. ఆ తర్వాత ఆవివా లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఆరున్నరేళ్లు పనిచేశా. సహోద్యోగులైన ప్రశాంత్ సిన్హా, ఆసిఫ్ మహ్మద్‌తో కలిసి 2010లో రూ.45 లక్షల పెట్టుబడితో గుర్గావ్ కేంద్రంగా మామ్స్ప్రెసో.కామ్‌ను ప్రారంభించాం. 6 వేల మంది తల్లులు, 50 వేల బ్లాగ్స్.. ప్రస్తుతం మామ్స్ప్రెస్సోలో 6 వేల మంది తల్లులు, 7 ప్రాంతీయ భాషల్లో 50 వేల బ్లాగ్స్ నిర్వహిస్తున్నారు. రోజుకు 150 మంది బ్లాగర్ల ఆర్టికల్స్ యాడ్ అవుతున్నాయి. బ్లాగ్స్ నిర్వహణలో సెలబ్రిటీలూ ఉన్నారు. ప్రస్తుతం నెలకు లక్ష మంది మామ్స్ప్రెస్సో కంటెంట్‌ను చదువుతున్నారు. 400 మంది బ్లాగర్స్... మాతో ఒప్పందం ఉన్న బ్రాండ్లకు కంటెంట్, వీడియోలను అందిస్తున్నారు. దీంతో ఒక్కో బ్లాగర్స్ నెలకు రూ.20–40 వేల వరకూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మొత్తం 6 వేల బ్లాగర్స్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 720 మంది ఉన్నారు. వీరిలో 15 శాతం వరకూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నవారే. ఎక్కు ఆదాయాన్ని ఆర్జిస్తున్నది మాత్రం ఉత్తరాది వారే. మూడేళ్లలో రూ.150 కోట్ల ఆదాయం.. మామ్స్ప్రెస్సోలోని బ్లాగర్లకు గైనకాలజిస్ట్, పిడీయాట్రిషియన్, కౌన్సిలర్, ఎడ్యుకేటర్, న్యూట్రీషన్ విభాగాల్లో సలహాలిచ్చేందుకు ఆ రంగాల్లోని 400 మంది నిపుణులతో ఒప్పందం చేసుకున్నాం. వారి కంటెంట్, వీడియోలు అందుబాటులో ఉంటాయి. మామ్స్ప్రెస్సోకు రెండు రకాల ఆదాయ మార్గాలున్నాయి. 1. స్త్రీలు, పిల్లలకు సంబంధించిన కంపెనీల ప్రకటనల ద్వారా. 2. ఆయా బ్రాండ్లకు వీడియో ఆధారిత ప్రకటనలు చేయడం ద్వారా. ప్రస్తుతం జాన్సన్ అండ్ జాన్సన్, నెస్లే, హార్లిక్స్, డవ్, డెటాల్ వంటి 75కి పైగా బ్రాండ్లతో ఒప్పందం చేసుకున్నాం. గతేడాది రూ.15 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. వచ్చే మూడేళ్లలో 200 బ్రాండ్లతో ఒప్పందం.. రూ.150 కోట్ల ఆదాయాన్ని చేరుకోవాలని లకి‡్ష్యంచాం. నెల రోజుల్లో మామ్స్ప్రెస్సో రేడియో.. ఇటీవలే ప్రత్యేకంగా మహిళల కోసం మామ్స్ప్రెసో ఆన్లైన్ టీవీ చానల్‌ను ప్రారంభించాం. ప్రస్తుతం 500లకుపైగా వీడియోలున్నాయి. మరో నెల రోజుల్లో ఆన్లైన్ రేడియో చానల్‌ను ప్రారంభిస్తాం. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని మహిళలను చేరుకునేందుకు వీలుగా అన్ని ప్రాంతీయ భాషల్లోనూ వాయిస్ ఆధారిత కంటెంట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటివరకు యువర్ నెస్ట్, సిడ్బీ వెంచర్ క్యాపిటల్ నుంచి రూ.20 కోట్ల నిధులను సమీకరించాం. ప్రస్తుతం మా సంస్థలో 56 మంది ఉద్యోగులున్నారు. మరో 15 మందిని నియమించుకోనున్నాం. ఈ ఏడాది ముగింపు నాటికి కన్నడ, మలయాళం, గుజరాతీ, ఉర్దూ భాషల్లోనూ కంటెంట్‌ను తీసుకురానున్నాం. వచ్చే ఏడాది ఇదే విభాగంలోని ఓ కంపెనీని కొనుగోలు చేస్తాం’’ అని విశాల్ తెలిపారు. -
ఇన్వాయిస్లపై రుణాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎస్ఎంఈ) ఎదుర్కొనే ప్రధాన సమస్య ‘నిధులు’. ఇవి చాలవన్నట్లు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఎస్ఎంఈలకు అందించే ఇన్వాయిస్ బిల్లులు సమయానికి క్లియర్ కాక మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఒక్క ఇన్వాయిస్ క్లియర్ కావాలంటే కనీసం 60–90 రోజుల సమయం పడుతుంది. ఎస్ఎంఈల ఇన్వాయిస్ సమస్యలకూ చెక్ చెప్పేస్తోంది ఇన్‌డిఫై టెక్నాలజీస్. ఇన్వాయిస్లను తనఖాగా పెట్టుకొని రూ.15–50 లక్షల వరకూ రుణాలివ్వటమే దీని ప్రత్యేకత. బిల్ క్లియర్ కాగానే వెంటనే రుణం తీర్చేయాలి సుమీ! ఇందుకు నెలకు 1.5 శాతం వడ్డీ. ఇప్పటివరకు ఇన్వాయిస్ల మీద 100 మందికి రూ.20 కోట్ల రుణాలందించామని ఇన్‌డిఫై కో–ఫౌండర్ సిద్ధార్థ్ మహనోత్ ‘స్టార్టప్ డైరీ’తో చెప్పారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. ఐఐటీ ఘజియాబాద్ నుంచి ఎంబీఏ పూర్తయ్యాక.. ఐసీఐసీఐ, సిటీ, ఇండియాబుల్స్, ఎడిల్వైజ్ వంటి సంస్థల్లో పనిచేశా. రెండు దశాబ్ధాల బ్యాంకింగ్ రంగ అనుభవంలో ఎంతో మంది కస్టమర్లు లోన్ కోసం రావటం ఒట్టి చేతులతో వెనక్కి వెళ్లడం గమనించాం. వీరందరి సమస్యకు పరిష్కారం చూపించాలని నిర్ణయించుకొని.. ఇంటర్నేషనల్ వీసీ ఫండ్స్ నుంచి రూ.32 కోట్ల నిధుల సమీకరణతో 2015 మేలో ఇన్‌డిఫై టెక్నాలజీస్‌ను ప్రారంభించాం. కిరాణా స్టోర్లు, చిన్న చిన్న హోటళ్లు, రెస్టారెంట్లకు రుణాలు అందటం చాలా కష్టం. తనఖా పెట్టందే బ్యాంకులు రుణాలివ్వవు. ప్రైవేట్ రుణాలు తీసుకుందామంటే వడ్డీ వాయింపు. నిజం చెప్పాలంటే కార్పొరేట్లకు రుణాలిచ్చి చేతులు కాల్చుకునే బదులు తిరిగి చెల్లించే సామర్థ్యం, వ్యాపార విధానం బాగుండే ఇలాంటి చిన్న వ్యాపారస్తులకు ఇవ్వటమే బెటర్. 10కిపైగా బ్యాంకులతో ఒప్పందం.. మేక్‌మై ట్రిప్, ఫుడ్‌పాండా, స్విగ్గీ, పేటీఎం, ట్రావెల్ బొటిక్యూ, ఓలా క్యాబ్స్, షాప్‌క్లూజ్, టీబో గ్రూప్, గోఐబిబో, రియా, యాత్రా, పిన్‌ల్యాబ్స్, ఆఫ్‌బిజినెస్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఆయా సంస్థలతో వ్యాపారం నిర్వహిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్ ఏజెన్సీలు, రిటైల్, ఈ–కామర్స్ సంస్థలకు, వ్యక్తిగత వ్యాపారస్తులకూ ఇన్‌డిఫై రుణాలందిస్తుంది. లోన్ల కోసం యెస్ బ్యాంక్, ఆర్బీఎల్, ఐడీఎఫ్సీ బ్యాంక్‌లతో, ఎడిల్వైజ్, ఇండియాఇన్ఫోలైన్, క్యాపిటల్ ఫస్ట్, ఆదిత్య బిర్లా, ఇన్‌క్రెడ్, లెండింగ్‌కార్ట్ వంటి 10కి పైగా బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. రూ.50 లక్షల వరకూ రుణం.. సిబిల్ స్కోర్, బ్యాంక్ స్టేట్మెంట్స్, బిజినెస్ డాటా, సోషల్ మీడియా యాక్టివిటీ వంటి మాధ్యమాల ద్వారా రుణ గ్రహీత డేటాను సేకరించి.. మా వ్యక్తిగత బృందం స్వయంగా తనిఖీ చేసిన తర్వాత రుణాన్ని మంజూరు చేస్తాం. ఇప్పటివరకు 5 వేల మంది రుణ గ్రహీతలకు సుమారు రూ.300 కోట్ల రుణాలను అందించాం. హైదరాబాద్ నుంచి 5 శాతం రుణ గ్రహీతలుంటారు. వడ్డీ నెలకు 1.5 నుంచి 2 శాతంగా ఉంటుంది. రూ.50 వేల నుంచి రూ.50 లక్షల వరకు రుణాలందిస్తాం. ప్రతినెలా 100 శాతం వృద్ధిని నమోదు చేశాం. రూ.300 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం 300 పట్టణాల్లో సేవలందిస్తున్నాం. వచ్చే ఏడాది కాలంలో 500 పట్టణాలకు, రుణగ్రహీతల సంఖ్యను 8 వేలకు చేర్చాలని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం మా సంస్థలో 130 మంది ఉద్యోగులున్నారు. వ్యాపార విస్తరణలో భాగంగా నెలకు నలుగురిని కొత్తవాళ్లను తీసుకుంటున్నాం. ఇప్పటివరకు రూ.100 కోట్ల నిధులను సమీకరించాం. యాక్సెల్ పార్టనర్స్, ఎలివార్ ఈక్విటీ, ఒమిడ్యార్ నెట్‌వర్క్‌లతో పాటూ ఒకరిద్దరు వ్యక్తిగత ఇన్వెస్టర్లు ఈ పెట్టుబడులు పెట్టారు. ఇదే రంగంలో వినూత్న వ్యాపార విధానమున్న స్టార్టప్స్ ముందుకొస్తే కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సిద్ధార్థ్ తెలిపారు. -
ఆన్లైన్... జస్ట్ 5 నిమిషాల్లో!!
వెబ్సైట్, యాప్ అభివృద్ధి సేవలందిస్తున్న నౌఫ్లోట్స్ ► 50 దేశాల్లో 2.5 లక్షల ఎస్ఎంఈ కస్టమర్లు ► ఇప్పటివరకు రూ.76 కోట్ల సమీకరణ ► ‘స్టార్టప్ డైరీ’తో నౌఫ్లోట్స్ కో–ఫౌండర్ జస్మిందర్ సింగ్ గులాటీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆఫ్‌లైన్ సంస్థలు ఆన్లైన్ వ్యాపారంలోకి రావాలంటే వెబ్సైటో లేక యాపో కావాలి. అలాగని చిన్న, మధ్య స్థాయి కంపెనీలు (ఎస్ఎంఈలు) వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేయటం, నిర్వహించటం కష్టం. మరెలా? దీనికి పరిష్కారం చూపిస్తోంది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న నౌఫ్లోట్స్.కామ్. మన దేశంలోనే కాదు ఆస్ట్రేలియా, కెనడా వంటి 50 దేశాల్లో 2.5 లక్షల ఎస్ఎంఈల వెబ్సైట్లను నిర్వహిస్తోందీ సంస్థ. మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్ జస్మిందర్ సింగ్ గులాటీ మాటల్లోనే.. స్నేహితులు రోనక్ కుమార్ సమంత్రాయ్, నీరజ్ సబర్వాల్, నితిన్ జైన్‌తో కలిసి 2012లో రూ.80 లక్షల పెట్టుబడితో ‘నౌఫ్లోట్స్’ను ప్రారంభించాం. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ చాలెంజ్ అవార్డు గ్రాంట్‌ను రూ.15 లక్షలు గెలుచుకున్నాం. ఇదే నౌఫ్లోట్స్కు ప్రారంభ పెట్టుబడి. 11 పేటెంట్ల కోసం దరఖాస్తు.. చిన్న, మధ్యతరహా సంస్థలు, కూరగాయల షాపు, కిరాణా, మందుల దుకాణాలు వంటి చిన్న చిన్న షాపులు కూడా వారి వ్యాపారాన్ని ఆన్లైన్లో నిర్వహించుకునేందుకు వీలుగా వెబ్సైట్, యాప్‌లను అభివృద్ధి చేసి నిర్వహిస్తాం. వీటితో పాటు మార్కెటింగ్, పేమెంట్ గేట్‌వే కూడా అందిస్తాం. అంటే ఎస్ఎంఈల తరుఫున ఆన్లైన్ వ్యాపారాన్ని నౌఫ్లోట్సే చేస్తుందన్న మాట. అంతేకాక కస్టమర్లు ఆన్లైన్లో షాపింగ్ కోసం వెతికినప్పుడు వారి తాలుకు సర్వే వివరాలను, సామాజిక మాధ్యమాల రిపోర్ట్‌లను కూడా ఎస్ఎంఈలకు అందిస్తాం. బిగ్ డేటా ఆల్గోరిథం, ప్రాంప్టింగ్ వంటి 11 టెక్నాలజీల్లో పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకున్నాం. 50 దేశాలు.. 2.5 లక్షల ఎస్ఎంఈలు.. వెబ్సైట్, యాప్ అభివృద్ధికి 5 నిమిషాల సమయం పడుతుంది. ఏడాదికి వార్షిక ఫీజు రూ.25 వేలు. మన దేశంతో పాటూ ఆస్ట్రేలియా, కెనడా, దుబాయ్, ఫిలిప్పీన్స్, టర్కీ వంటి 50 దేశాల్లో 2.5 లక్షల ఎస్ఎంఈల వెబ్సైట్లను నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం దేశంలో 7 లక్షల ఎస్ఎంఈ వెబ్‌సైట్లుండగా.. వీటిలో 1.4 లక్షల వెబ్సైట్లను మేమే నిర్వహిస్తున్నాం. తయారీ, రిటైల్, వైద్య రంగంలో ఎక్కువ కస్టమర్లున్నారు. మరో నెల రోజుల్లో సిమ్లా, పుదుచ్చేరి, విశాఖపట్నం, హంపి వంటి టూరిస్ట్ హబ్స్‌లో నౌఫ్లోట్స్ సేవలను విస్తరిస్తున్నాం. 6 నెలల్లో రూ.5 కోట్ల సమీకరణ.. 2016–17 ఆర్ధిక సంవత్సరంలో రూ.20 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నాం. ఈ ఏడాది రూ.50 కోట్ల వ్యాపారాన్ని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం మాకు దేశంలో 65 కార్యాలయాలు, 900 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు ఐరన్ పిల్లర్ అండ్ ఐఐఎఫ్ఎల్, ఓమిడయ్యర్, బ్లూమీ వెంచర్స్, హైదరాబాద్, ముంబై ఏంజిల్స్ నుంచి రూ.76 కోట్ల నిధులను సమీకరించాం. మరో 6 నెలల్లో రూ.5 కోట్ల నిధులను సమీకరిస్తాం. -
సినిమా చూశాకే టికెట్ కొనండి!
► పీవీఆర్‌తో ఒప్పందం చేసుకున్న ఈపే లేటర్ ► క్రెడిట్‌పై రైలు టికెట్ల బుకింగ్ కోసం ఆర్సీటీసీతో కూడా ► నగదు చెల్లింపులకు 14 రోజుల గడువు; డీఫాల్టయితే నెలకు 3% పెనాల్టీ ► ఏడాదిలో బస్సు, విమాన టికెట్లు కొనుగోలు సౌకర్యం కూడా.. ► ఇప్పటివరకు రూ.13 కోట్ల నిధుల సమీకరణ ► ‘స్టార్టప్ డైరీ’తో ఈపే లేటర్ కో–ఫౌండర్ భట్టాచార్య హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మనకు తెలిసిందల్లా సినిమాకెళ్లాలంటే ఆన్లైన్లోనో లేక థియేటర్ కౌంటర్‌లోనో టికెట్ కొని వెళ్లడం. కానీ, ఇపుడు మరో కొత్త సౌకర్యమూ అందుబాటులోకి వచ్చిందండోయ్!! టికెట్ అవసరం లేకుండా ముందైతే సినిమా చూసేయండి.. ఆ తర్వాతే టికెట్ ధర చెల్లించమంటోంది ‘ఈపే లేటర్’ సంస్థ. ఒక్క సినిమానే కాదు... రైలు ప్రయాణం, గ్రాసరీ, షాపింగ్, టూరిజం ట్రావెల్ ఇలా అన్ని రకాల సేవలకూ ఇదే మంత్రమంటోంది. దీనికోసం ఐఆర్సీటీసీ, పీవీఆర్, ఇండియామార్ట్, జాప్‌నౌ, గుడ్‌బాక్స్, ఈట్రావెల్ స్మార్ట్, ఆక్సిజన్, పేవరల్డ్ వంటి 5 వేల ఆన్లైన్, ఆఫ్‌లైన్ సంస్థలతో ఒప్పందం చేసుకుంది కూడా. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్ ఆర్కో భట్టాచార్య మాటల్లోనే... ఈపే లేటర్ గురించి చెప్పే ముందు అసలు మన దేశంలో ఈ–కామర్స్ సంస్థల క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ) విభాగం గురించి చెప్పాలి. ఎందుకంటే ఈ విభాగాన్ని లక్ష్యంగా చేసుకొనే ఈపే లేటర్ ఆరంభమైంది గనక. దేశీ ఈ– కామర్స్ సంస్థల లావాదేవీల్లో 67% వాటా సీఓడీదే.కారణం మనం కొనే వస్తువుల్ని ప్రత్యక్షంగా చూస్తే తప్ప చెల్లింపులు చేయం. అలా అని ఆర్డరిచ్చిన ఉత్పత్తులు డెలివరీ కాగానే క్యాష్ ఇస్తే సరిపోదు. ఇక్కడ కూడా చెల్లింపుల ను కూడా మరింత సులువుగా, సౌకర్యవంతంగా చేయాలనే లక్ష్యంతోనే 2015 డిసెంబర్లో ముంబై కేంద్రం గా.. స్నేహితులు అక్షయ్ సక్సే నా, ఉదయ్ సోమయాజులుతో కలిసి ఈపే లేటర్‌ను ప్రారం భించాం. ‘‘ముందైతే సేవలందుకోండి. తర్వాతే నగదును చెల్లించండి’’ ఇదే మా వ్యాపార సూత్రం. డేటా సైన్స్, అనలిటిక్స్‌తో కస్టమర్ల ఎంపిక.. ఈపే లేటర్ సేవలను వినియోగించుకోవాలంటే ముందు ఈ–మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఆధార్, పాన్ కార్డు వివరాలు వెల్లడించాలి. అలా ఇచ్చిన కస్టమర్ల పాత లావాదేవీల చరిత్ర, సామాజిక మాధ్యమాల్లో ప్రవర్తించే తీరు, ఇతరత్రా మార్గాల ద్వారా తనిఖీ చేస్తాం. డేటా సైన్స్, అనలిటిక్స్ ద్వారా వారి చరిత్రను విశ్లేషిస్తాం. ఎంపికైన కస్టమర్ల మొబైల్‌కు వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. తర్వాతి నుంచి ఈపే లేటర్‌తో ఒప్పందం చేసుకున్న ఆన్లైన్, ఆఫ్‌లైన్ సంస్థల సేవలను క్రెడిట్ రూపంలో వినియోగించుకునే వీలుంటుంది. త్వరలో బస్సు, విమాన టికెట్లు కూడా.. ప్రస్తుతం 5 వేల ఆన్లైన్, ఆఫ్‌లైన్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఏడాదిలో 1.50 లక్షల సంస్థలకు చేరుకోవాలన్నది లక్ష్యం. ఆయా సంస్థల సేవలను వినియోగించుకున్నాక 14 రోజులలోగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించకపోతే నెలకు 3 శాతం పెనాల్టీ ఉంటుంది. బీ2బీ కంపెనీల్లో కనిష్ట లావాదేవీ రూ.25 వేలు, బీ2సీ కంపెనీల్లో కనిష్ట లావాదేవీ రూ.2,500. క్రెడిట్‌పై గ్రాసరీ, షాపింగ్ వంటి సంస్థల సేవలే కాదు. రైల్వే టికెట్లనూ కొనొచ్చు. ఇందుకోసం ఐఆర్సీటీసీతో ఒప్పందం చేసుకున్నాం. త్వరలో బస్సు, విమాన టికెట్లనూ అందుబాటులోకి తెస్తాం. ఏపీ, తెలంగాణ వాటా 15 శాతం.. ప్రస్తుతం 30 మంది ఉద్యోగులు, 50 లక్షల మంది కస్టమర్లున్నారు. రోజుకు 2,500–3,000 లావాదేవీలు జరుగుతున్నాయి. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా 45%, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాటా 15%. ఈపే లేటర్ ద్వారా జరిగే ప్రతి లావాదేవీ మీద మా ఒప్పంద సంస్థ నుంచి 2–2.5 శాతం వరకు కమీషన్ తీసుకుంటాం. ప్రతి నెలా 30 శాతం వ్యాపార వృద్ధిని సాధిస్తున్నాం. గతంలో సీడ్ రౌండ్లో భాగంగా దేశీయంగా ముగ్గురు ఇన్వెస్టర్ల నుంచి రూ.13.3 కోట్లు సమీకరించాం. ఏడాదిలో మరో విడత నిధులను సమీకరిస్తాం.