ఆన్‌లైన్‌లో బొమ్మల కొలువు! | fun station giving rental for logo sets | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో బొమ్మల కొలువు!

Published Sat, Feb 4 2017 1:12 AM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM

ఆన్‌లైన్‌లో బొమ్మల కొలువు!

ఆన్‌లైన్‌లో బొమ్మల కొలువు!

లెగో సెట్స్‌ను అద్దెకిస్తున్న ఫన్‌ స్టేషన్‌
ప్రస్తుతం 200 సెట్స్‌ అందుబాటు
గతేడాది 400 లెగో సెట్స్‌ అద్దెకు; రూ.10 లక్షల టర్నోవర్‌
మార్చి నుంచి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో సేవల విస్తరణ
రూ.4–5 కోట్ల సమీకరణపై దృష్టి
‘స్టార్టప్‌ డైరీ’తో ఫన్‌స్టేషన్‌ ఫౌండర్‌ కశ్యప్‌ షా  


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: లెగో సెట్స్‌ (బిల్డింగ్‌ బ్లాక్స్‌).. గురించి పిల్లలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. వీటితో భవనాలు, కార్లు, బొమ్మలు వంటి రకరకాల రూపాలు తయారు చేస్తుంటారు. అందుకే లెగో సెట్స్‌తో పిల్లలు ఆడుకోవటం కాదు.. నేర్చుకుంటారు అనంటారు. ఇంకా చెప్పాలంటే లెగో సెట్స్‌ గేమ్‌... మెదడుకు మేతలాంటిది. అయితే ఈ సెట్స్‌ను అందరూ కొనలేరు. ఎందుకంటే వీటి ప్రారంభ ధరే రూ.13 వేల నుంచి ఉంటుంది. మరి, అంత డబ్బు పెట్టి పిల్లలకు లెగో సెట్స్‌ను కొనివ్వటం అందరి తల్లిదండ్రులతో అయ్యేపనేనా?

ఇదిగో దీనికి పరిష్కారం చూపిస్తోంది ఫన్‌స్టేషన్‌! కేవలం లెగో సెట్స్‌ను మాత్రమే అద్దెకివ్వటం దీని ప్రత్యేకత. రూ.10 లక్షల పెట్టుబడితో ముంబై కేంద్రంగా 2015 మార్చిలో ప్రారంభమైంది ఫన్‌స్టేషన్‌.ఇన్‌. మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్‌ కశ్యప్‌ షా ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు.

అందుబాటులో 200 లెగో సెట్స్‌..
ప్రస్తుతం ఫన్‌స్టేషన్‌లో 200 లెగో సెట్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఫన్‌ ప్లాన్, ఫన్‌ స్క్వేర్‌ ప్లాన్, ఫన్‌ క్యూబ్‌ ప్లాన్‌ అని 3 రకాలుగా లెగో సెట్స్‌ను అద్దెకిస్తాం. వీటి అద్దె ధరలు 28 రోజులకు రూ.400 నుంచి రూ.4,500 వరకుంటాయి. డిపాజిట్స్‌గా రూ.1,500–3,500 ఉంటుంది. ఇది రిఫండబుల్‌. మొత్తం 500 మంది రిజిస్టర్‌ కస్టమర్లున్నారు. ఇందులో హైదరాబాద్‌ నుంచి 150 మంది యూజర్లుంటారు. నెలకు 50–80 సెట్స్‌ అద్దెకు తీసుకుంటున్నారు.

ఫన్‌స్టేషన్‌కే అద్దెకివ్వొచ్చు..
ప్రస్తుతమున్న లెగో సెట్స్‌లో 90 శాతం మా సొంతం. మిగిలినవి కస్టమర్ల నుంచి సమీకరించినవి. అంటే ఫన్‌ కిడ్స్‌ప్రెన్యూర్‌ వేదికగా పిల్లలు తమ వద్ద ఉన్న లెగో సెట్స్‌ను ఫన్‌స్టేషన్‌కు అద్దెకివ్వొచ్చు. అయితే ఒక్కసారి రిజిస్టరయ్యాక 10 సార్లు అద్దెకిచ్చే వరకూ రిటర్న్‌ తీసుకునే అవకాశం లేదు. ఆ తర్వాత కావాలంటే తీసుకోవచ్చు. ఫన్‌స్టేషన్‌కు అద్దె ద్వారా వచ్చే సొమ్ములో 15 శాతం నేరుగా కస్టమర్‌ ఖాతాలో జమ అవుతుంది.

రూ.40 లక్షల ఆదాయం లక్ష్యం..
గతేడాది 400 లెగో సెట్స్‌ అద్దెకిచ్చాం. రూ.10 లక్షల ఆదాయాన్ని చేరుకున్నాం. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి రూ.2 లక్షల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది రూ.1,500 లెగో సెట్స్‌ అద్దె టార్గెట్‌గా పెట్టుకున్నాం. సుమారు రూ.40 లక్షల టర్నోవర్‌ లక్ష్యించాం. లెగో సెట్స్‌ పికప్, డ్రాప్‌ కోసం ఫెడెక్స్‌ కొరియర్‌ కంపెనీతో ఒప్పందం చేసుకున్నాం. 5 పీసెస్‌ లెగో సెట్స్‌ పోగొట్టినా ఎలాంటి పెనాల్టీ ఉండదు. ఆపైన పోగొడితే మాత్రం ప్రతి ఒక్క పీస్‌కు రూ.40 చార్జీ పెనాల్టీ ఉంటుంది.

నిధుల సమీకరణపై దృష్టి..
ప్రస్తుతం దేశంలోని మెట్రో నగరాల్లో మాత్రమే అద్దె సేవలందిస్తున్నాం. ఈ ఏడాది ముగింపు నాటికి ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు విస్తరించాలని లక్ష్యించాం. తొలి దశలో వచ్చే నెలలో కోయంబత్తూర్, లూధియానా, నాగ్‌పూర్‌ పట్టణాల్లో సేవలను ప్రారంభించనున్నాం. విస్తరణ నిమిత్తం తొలిసారిగా నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించాం. రూ.4–5 కోట్ల పెట్టుబడుల కోసం ఒకరిద్దరు ఏంజిల్‌ ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నాం.

అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.comకు మెయిల్‌ చేయండి...

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement