ఖట్టా మీఠా సహ వ్యవస్థాపకులు సందీప్, శ్రీధర్ (కుడి)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నచ్చిన స్వీట్స్ కోసం కొన్ని షాపులకే వెళతాం. అక్కడికెళ్లే అవకాశం లేకపోతే ఫుడ్ అగ్రిగేటర్ల ద్వారా ఆన్‌లైన్లో ఆర్డరివ్వొచ్చు. కానీ అవి నిర్దేశిత పరిధి వరకే డెలివరీ చేస్తాయి. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ ‘ఖట్టా మీఠా’ ఒక అడుగు ముందుకేసింది.
వినియోగదారులు సిటీలో ఏ మూలనున్నా టాప్ దుకాణాల నుంచి రెండు గంటల్లో డెలివరీ చేస్తోంది. స్వీట్స్, నమ్‌కీన్స్, డ్రై ఫ్రూట్స్, పచ్చళ్లు ఆర్డర్లు తీసుకుంటోంది. హైదరాబాద్‌కే కాదు.. ప్రపంచంలో ఎక్కడున్నా 10–15 శాతం తక్కువ ధరకే సరఫరా చేస్తామంటున్నారు ‘ఖట్టా మీఠా’ను ప్రమోట్ చేస్తున్న ఫ్రెస్కో సర్వీసెస్ సీఈవో సందీప్ మారెళ్ల, సీవోవో శ్రీధర్ మహంకాళి. దీని గురించి స్టార్టప్ డైరీకి వారు చెప్పిన వివరాలివీ..
టాప్ స్వీట్ షాప్స్ నుంచే..
హైదరాబాద్‌లో ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకుని స్వీట్స్, నమ్‌కీన్స్ మాత్రమే డెలివరీ చేసే కంపె నీ మాదే. దాదూస్, ఆల్మండ్ హౌస్, మిఠాయివాలా, ఆలివ్, ఆగ్రా స్వీట్స్ బంజారా, కేసరియాస్, ఆగ్రావాలా, గంగారామ్స్ వంటి 40 ప్రముఖ బ్రాండ్ల స్వీట్లు, నమ్‌కీన్స్, పచ్చళ్లు, టీ పొడులు మా పోర్టల్‌లో ఉన్నాయి. ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజా మాదిరి ముంబై, బెంగాల్, అగ్రా, ఢిల్లీ, కేరళ తదితర ప్రాంతాల్లో పేరున్న దుకాణాల్లో లభించే పాపులర్ వెరైటీలను త్వరలో ప్రవేశపెడతాం. సంక్రాంతి నుంచి హోమ్ మేడ్ స్వీట్స్ సరఫరా చేస్తాం.
విదేశాలకు అయిదు రోజుల్లో..
ప్రస్తుతం ఖట్టామీఠా.ఇన్ పోర్టల్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్నాం. దీపావళికల్లా యాప్ సిద్ధమవుతుంది. 10–15 శాతం తక్కువ ధరకే ఉత్పత్తుల్ని సరఫరా చేస్తున్నాం. ఇక భాగ్యనగరిలో రెండు గంటల్లో డెలివరీ ఇస్తాం. డెలివరీకి రూ.40 చార్జీ తీసుకుంటున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 48 గంటల్లో కస్టమర్‌కు చేరతాయి. విదేశాలకు 5–7 రోజుల సమయం పడుతుంది. ఇతర సంస్థలతో పోలిస్తే విదేశాలకు సరఫరాకు డెలివరీ చార్జీలు 50 శాతం కంటే తక్కువే వసూలు చేస్తున్నాం.
స్వీట్ కంపెనీలు మాకిచ్చే డిస్కౌంట్ ప్రయోజనాలను కస్టమర్లకే అందజేస్తున్నాం. స్నేహితులు రవీందర్ పల్లెర్ల, నరేశ్ కుమార్ బుద్ధాతో కలిసి ఈ ఏడాది మొదట్లో దీన్ని ఆరంభించాం. 10 మంది మార్కెటింగ్ సిబ్బంది ఉన్నారు. డెలివరీకి క్వికర్ సేవల్ని వినియోగించుకుంటున్నాం. కార్పొరేట్ ఆర్డర్లూ స్వీకరిస్తున్నాం. యూఏఈ, మలేషియా, సింగపూర్, యూఎస్ నుంచి ఇప్పటికే ఎంక్వైరీలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment