ప్రాక్టీస్‌ కోసం.. ఇంటర్వ్యూ బడ్డీ! | Interviewer founder Ujwal with Startup Diary | Sakshi
Sakshi News home page

ప్రాక్టీస్‌ కోసం.. ఇంటర్వ్యూ బడ్డీ!

Published Sat, Dec 29 2018 2:30 AM | Last Updated on Sat, Dec 29 2018 2:30 AM

Interviewer founder Ujwal with Startup Diary - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రాక్టీస్‌ మేక్స్‌ పర్‌ఫెక్ట్‌! ఇదో నానుడే కాదు. వ్యాపార సూత్రం కూడా. ఇంటర్వ్యూబడ్డీ చేసేదిదే!!. దేశ, విదేశాల్లోని బహుళ జాతి కంపెనీల వైస్‌ ప్రెసిడెంట్స్, హెచ్‌ఆర్‌ ప్రతినిధులతో పాటూ రిటైర్డ్‌ ఐఏఎస్‌ వంటి ఉన్నతాధికారులతో ఒప్పందం చేసుకుంది. మన దేశంతో పాటూ అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా దేశాల్లో మాక్‌ ఇంటర్వ్యూ సేవలందిస్తున్న ఇంటర్వ్యూ బడ్డీ గురించి మరిన్ని వివరాలు ఫౌండర్‌ ఉజ్వల్‌ సూరంపల్లి ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది విశాఖపట్నం. ఆంధ్రా యూనివర్సిటీలో ఎంటెక్‌ పూర్తయ్యాక.. జర్మనీలో మాస్టర్స్‌ కోసం వెళ్లా. చదువుకుంటూ జాబ్స్‌ కోసం ప్రయత్నించా. ప్రాక్టీస్‌ లేకపోవటంతో ఒకటిరెండు ఇంటర్వ్యూల్లో ఫెయిలయ్యా. అప్పుడే అనిపించింది. క్రీడలకు ఉన్నట్టే ఇంటర్వ్యూలకూ ప్రత్యక్షంగా ప్రాక్టీస్‌ ఉంటే బాగుండునని. అంతే! చదువును మధ్యలోనే ఆపేసి.. విశాఖపట్నం కేంద్రంగా జూలై 2017లో ఇంటర్వ్యూబడ్డీ.ఇన్‌ను ప్రారంభించాం.
 
విద్యార్థులు, కంపెనీలకూ ఇంటర్వ్యూలు.
విద్యార్హతలు, ఉద్యోగ ఎంపికలతో అకౌంట్‌ను నమోదు చేసుకున్నాక.. హెచ్‌ఆర్, టెక్నికల్, స్పెషలైజేషన్‌ విభాగాల్లో కావాల్సిన ఆప్షన్‌ను ఎంచుకుంటే చాలు ఇంటర్వ్యూ మొదలువుతుంది. ఇంటర్వ్యూబడ్డీతో ప్రెషర్స్‌కు ఇంటర్వ్యూలంటే ఉండే తొందరపాటు, ఒత్తిడి తగ్గుతుంది. విశ్వాసం పెరుగుతుంది. ప్రొఫైల్‌ ప్రిపరేషన్, వెబ్‌ ఆర్టికల్స్, ఇంటర్వ్యూ వీడియోలతో పాటూ నైపుణ్య ప్రదర్శన, బలహీనతలతో కూడిన సమగ్ర నివేదికను అందిస్తాం. ఒక్క సెషన్‌ ప్రారంభ ధర రూ.1,099. ఇటీవలే కంపెనీల కోసం ప్రత్యేకంగా ‘ఇంటర్వ్యూ బడ్డీ వైట్‌ లేబుల్‌’ అనే వేదికను ప్రారంభించాం. ఇది.. కంపెనీలకు ఇంటర్వ్యూలను, అభ్యర్థుల జాబితా సేవలను అందిస్తుంది. ప్రస్తుతం అప్రాటిక్స్‌ వంటి మూడు కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. త్వరలోనే మరో 5 కంపెనీలను జోడించనున్నాం. 

అమెరికా, బ్రెజిల్‌లోనూ యూజర్లు.. 
15 వేల మంది రిజిస్టర్‌ యూజర్లున్నారు. మన దేశంతో పాటూ అమెరికా, మెక్సికో, అర్జెంటీనా నుంచి కూడా యూజర్లున్నారు. ఇప్పటివరకు 5 వేల ఇంటర్వ్యూలను నిర్వహించాం. ప్రస్తుతం నెలకు 200 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. ఐటీ, ఇంజనీరింగ్, హ్యుమానిటీస్, మిషన్‌ లెర్నింగ్, బిగ్‌ డేటా, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి అన్ని రంగాల్లో మాక్‌ ఇంటర్వ్యూలుంటాయి. ఆయా రంగాల్లో కనీసం పదేళ్ల అనుభవం ఉన్న ఇండియా, అమెరికాలకు చెందిన 220 మంది ఇంటర్వ్యూ ప్యానెలిస్ట్‌లతో ఒప్పందం చేసుకున్నాం. వీరికి ప్రతి ఇంటర్వ్యూ మీద 25–75 శాతం వరకు కమీషన్‌ ఉంటుంది. 
వర్సిటీలు, ఐఐటీ, ఐఐఎంలతో ఒప్పందం 
గతేడాది రూ.30 లక్షల ఆదాయాన్ని ఆర్జించాం. వచ్చే ఐదేళ్లలో 20 కోట్ల ఆదాయాన్ని, 15 లక్షల ఇంటర్వ్యూలను లకి‡్ష్యంచాం. జనవరి నుంచి ఉత్తర అమెరికాలో సేవలను ప్రారంభిస్తాం. స్థానికంగా ఉన్న పలు వర్సిటీల్లోని విద్యార్థులకు ప్రాక్టీస్‌ క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాం. మన దేశంలోని ఐఐటీ–రూర్కీ, ఎఫ్‌ఎంఎస్‌–ఢిల్లీ, ఐఐఎం–రూటక్, ఢిల్లీ–అంబేడ్కర్‌ యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకోనున్నాం.

రూ.15 కోట్ల నిధుల సమీకరణ 
ప్రస్తుతం 9 మంది ఉద్యోగులున్నారు. ఇటీవలే వైజాగ్‌కు చెందిన ఏంజిల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రూప్‌ ఆల్కోవ్‌ పార్టనర్స్‌ రూ.75 లక్షల పెట్టుబడి పెట్టింది. జనవరిలో సీడ్‌ ఫండింగ్‌లో భాగంగా యూపీకి చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ నుంచి రూ.5 కోట్ల నిధులను సమీకరించనున్నాం. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఫిన్‌ల్యాండ్‌కు చెందిన ఓ ఇన్వెస్టర్‌ నుంచి రూ.15 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్నాం’’ అని ఉజ్వల్‌ వివరించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement