అర్ధరాత్రి... హలో పిల్లల డాక్టర్!!
► ఆన్‌లైన్ కన్సల్టేషన్ సేవలందిస్తున్న డాక్స్ యాప్
► 40% కన్సల్టేషన్స్ తృతీయ శ్రేణి పట్టణాల నుంచే
► 15 విభాగాల్లో.. 1,500 మంది వైద్యుల నమోదు
► నెలకు 50 వేల కన్సల్టేషన్స్; 22–25% ఆదాయ వృద్ధి
► ‘స్టార్టప్ డైరీ’తో సీఈఓ అండ్ కో–ఫౌండర్ సతీశ్ కన్నన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న పిల్లలు అర్ధరాత్రి ఏడిస్తే...? ఎందుకు ఏడుస్తున్నారన్నది తల్లిదండ్రులకు అర్థంకాదు! ఓదార్చడానికి ప్రయత్నించినా విఫలమవుతుంటారు. పోనీ, పిల్లల డాక్టర్‌ను సంప్రదిద్దామంటే అర్ధరాత్రి డాక్టర్లెవరూ అందుబాటులో ఉండరు. దీనికి పరిష్కారం చూపిస్తోంది డాక్స్‌యాప్. దేశంలోనే తొలిసారిగా రాత్రిపూట పీడియాట్రిషన్ సేవలందిస్తోంది. 10 నిమిషాల్లోపే వైద్యులతో మాట్లాడే వీలు కల్పిస్తోందీ సంస్థ. మరిన్ని వివరాలు డాక్స్‌యాప్ కో–ఫౌండర్ అండ్ సీఈఓ సతీశ్ కన్నన్ మాటల్లోనే...
ఐఐటీ మద్రాస్ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశాక ఫిలిప్స్ హెల్త్‌కేర్ విభాగంలో, స్నేహితుడు ఎన్బశేఖర్ దీనదయాళ్ మరో హెల్త్‌కేర్‌లో జాబ్స్‌లో చేరాం. ఆ సమయంలో మేం గమనించిందేంటంటే.. స్పెషలిస్ట్ వైద్యులు మెట్రో నగరాలకే పరిమితమవుతున్నారు. దీంతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని పేషెంట్లకు మెరుగైన చికిత్స అందట్లేదని! వీరు కూడా స్పెషలిస్ట్ వైద్యుల చికిత్సను పొందాలంటే ఇంటర్నెట్‌ను వేదికగా తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. 2015లో డాక్స్‌యాప్‌కు శ్రీకారం చుట్టాం. డాక్స్‌యాప్ అనేది చాట్ లేదా కాల్ ఆధారిత ఆరోగ్య వేదిక. ఎవరైనా సరే దేశంలోని ఏ డాక్టర్‌నైనా 30 నిమిషాల్లోపే సంప్రదించవచ్చు. మాకొస్తున్న కాల్స్‌లో 35–40% కాల్స్ పిల్లల గురించే ఉంటున్నాయి. అవీ రాత్రి 10–12 మధ్యే ఎక్కువ. అందుకే ఇటీవలే రాత్రి సమయాల్లో పీడియాట్రిషన్ సేవలు మొదలుపెట్టాం.
15 విభాగాల్లో.. 1,500 మంది వైద్యులు..: గైనకాలజీ, సైకియాట్రిక్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కార్డియాలజీ, అంకాలజీ, న్యూరాలజీ, ఇన్ఫెర్టిలిటీ, పీడియాట్రిషన్, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, న్యూరోసర్జరీ వంటి 15 విభాగాల్లో 1,500 మంది వైద్యులున్నారు. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి 150 మంది డాక్టర్లు నమోదయ్యారు. ప్రస్తుతం 10 లక్షల మంది యూజర్లున్నారు.
డాక్టర్ కన్సల్టేషన్ నుంచి మందుల డెలివరీ వరకూ..
డాక్స్‌యాప్ ప్రధానంగా 3 రకాల సేవలందిస్తుంది. కన్సల్టేషన్, మందుల డెలివరీ, ఇంటి వద్దనే ల్యాబ్ టెస్ట్‌లు. సేవలను బట్టి 20–30% వరకు కమీషన్ తీసుకుంటాం. ప్రస్తుతం నెలకు 50 వేల మంది పేషెంట్లు డాక్టర్ కన్సల్టేషన్ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇందులో ఏపీ, తెలంగాణ వాటా 10%. మెడిసిన్ డెలివరీ, ల్యాబ్ టెస్ట్ సేవలను నెలకు 10 వేల వరకు వినియోగించుకుంటున్నారు. ఇందులో 15% వాటా తెలుగు రాష్ట్రాలదే. కాకినాడ, భువనగిరి, బాన్స్‌వాడ వంటి పట్టణాల నుంచి పేషెంట్లు హైదరాబాద్, ముంబై, ఢిల్లీలోని వైద్యులతో మాట్లాడుతున్నారు.
రూ.14 కోట్ల నిధుల సమీకరణ..
ఇప్పటివరకు రూ.14 కోట్ల నిధులను సమీకరించాం. మరో 7 నెలల్లో మరో రౌండ్ నిధులను సమీకరిస్తాం. ఫేస్‌బుక్‌లో ఏంజిల్ ఇన్వెస్టరైన ఆనంద్ రాజమన్, వెంకీ హరినారాయణన్, జపాన్‌కు చెందిన రీబ్రైట్ పార్టనర్స్, పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, షాదీ.కామ్ సీఈఓ అనుపమ్ మిట్టల్‌లు ఈ పెట్టుబడులు పెట్టారు. ‘మా సంస్థలో 70 మంది ఉద్యోగులున్నారు. 6 నెలల్లో రెట్టింపు చేస్తాం. నెలకు 3 లక్షల కన్సల్టేషన్లను అందించాలని లకి‡్ష్యంచాం. ప్రతి నెలా 22–25% ఆదాయ వృద్ధి ఉంది. గైనకాలజీ వంటి స్త్రీ ఆరోగ్య సేవలనూ అర్ధరాత్రి సమయాల్లో అందిస్తాం’ అని సతీష్ తెలిపారు.