ఆన్‌లైన్లో ‘అమ్మ మాట’ | New startup momspresso | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్లో ‘అమ్మ మాట’

Published Sat, Apr 28 2018 1:27 AM | Last Updated on Sat, Apr 28 2018 1:27 AM

New startup momspresso - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కూతురు, భార్య, తల్లి.. దశలను బట్టి మహిళ పోషించే పాత్రలివి. ఒక్కో దశలో ఒక్కో రకమైన అనుభవాలు! మరి, వీటిని మరో పది మందితో పంచుకుంటే!!? ఒకరి అనుభవాలే మరొకరికి పాఠాలుగా మారతాయి. ఇదే ఉద్దేశంతో దీనికి ఆన్‌లైన్‌ వేదికను అభివృద్ధి చేసింది ‘మామ్స్‌ప్రెస్సో’.

గర్భం నుంచి మొదలుపెడితే సంతాన సంరక్షణ, బేబీ కేర్, టీనేజ్, బ్యూటీ, ఫ్యాషన్, హెల్త్‌కేర్‌ దాకా మహిళల అనుభవాలు, వీడియోలూ ఉంటాయిందులో! తెలుగుతో పాటూ ఇంగ్లిష్, మరాఠీ, హిందీ, బెంగాలీ, తమిళం భాషల్లో కంటెంట్‌ రాయొచ్చు. చదవొచ్చు కూడా. మరిన్ని వివరాలు మామ్స్‌ప్రెస్సో.కామ్‌ కో–ఫౌండర్‌ విశాల్‌ గుప్తా ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు.

‘‘ఐఐఎం బెంగుళూరులో గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక.. ఏషియన్‌ పెయింట్స్‌లో రెండున్నరేళ్లు, హెచ్‌యూఎల్‌లో ఆరేళ్లు.. ఆ తర్వాత ఆవివా లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో ఆరున్నరేళ్లు పనిచేశా. సహోద్యోగులైన ప్రశాంత్‌ సిన్హా, ఆసిఫ్‌ మహ్మద్‌తో కలిసి 2010లో రూ.45 లక్షల పెట్టుబడితో గుర్గావ్‌ కేంద్రంగా మామ్స్‌ప్రెసో.కామ్‌ను ప్రారంభించాం.

6 వేల మంది తల్లులు, 50 వేల బ్లాగ్స్‌..
ప్రస్తుతం మామ్స్‌ప్రెస్సోలో 6 వేల మంది తల్లులు, 7 ప్రాంతీయ భాషల్లో 50 వేల బ్లాగ్స్‌ నిర్వహిస్తున్నారు. రోజుకు 150 మంది బ్లాగర్ల ఆర్టికల్స్‌ యాడ్‌ అవుతున్నాయి. బ్లాగ్స్‌ నిర్వహణలో సెలబ్రిటీలూ ఉన్నారు. ప్రస్తుతం నెలకు లక్ష మంది మామ్స్‌ప్రెస్సో కంటెంట్‌ను చదువుతున్నారు.

400 మంది బ్లాగర్స్‌... మాతో ఒప్పందం ఉన్న బ్రాండ్లకు కంటెంట్, వీడియోలను అందిస్తున్నారు. దీంతో ఒక్కో బ్లాగర్స్‌ నెలకు రూ.20–40 వేల వరకూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మొత్తం 6 వేల బ్లాగర్స్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 720 మంది ఉన్నారు. వీరిలో 15 శాతం వరకూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నవారే. ఎక్కు ఆదాయాన్ని ఆర్జిస్తున్నది మాత్రం ఉత్తరాది వారే.

మూడేళ్లలో రూ.150 కోట్ల ఆదాయం..
మామ్స్‌ప్రెస్సోలోని బ్లాగర్లకు గైనకాలజిస్ట్, పిడీయాట్రిషియన్, కౌన్సిలర్, ఎడ్యుకేటర్, న్యూట్రీషన్‌ విభాగాల్లో సలహాలిచ్చేందుకు ఆ రంగాల్లోని 400 మంది నిపుణులతో ఒప్పందం చేసుకున్నాం. వారి కంటెంట్, వీడియోలు అందుబాటులో ఉంటాయి. మామ్స్‌ప్రెస్సోకు రెండు రకాల ఆదాయ మార్గాలున్నాయి.

1. స్త్రీలు, పిల్లలకు సంబంధించిన కంపెనీల ప్రకటనల ద్వారా. 2. ఆయా బ్రాండ్లకు వీడియో ఆధారిత ప్రకటనలు చేయడం ద్వారా. ప్రస్తుతం జాన్సన్‌ అండ్‌ జాన్సన్, నెస్లే, హార్లిక్స్, డవ్, డెటాల్‌ వంటి 75కి పైగా బ్రాండ్లతో ఒప్పందం చేసుకున్నాం. గతేడాది రూ.15 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. వచ్చే మూడేళ్లలో 200 బ్రాండ్లతో ఒప్పందం.. రూ.150 కోట్ల ఆదాయాన్ని చేరుకోవాలని లకి‡్ష్యంచాం.

నెల రోజుల్లో మామ్స్‌ప్రెస్సో రేడియో..
ఇటీవలే ప్రత్యేకంగా మహిళల కోసం మామ్స్‌ప్రెసో ఆన్‌లైన్‌ టీవీ చానల్‌ను ప్రారంభించాం. ప్రస్తుతం 500లకుపైగా వీడియోలున్నాయి. మరో నెల రోజుల్లో ఆన్‌లైన్‌ రేడియో చానల్‌ను ప్రారంభిస్తాం. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని మహిళలను చేరుకునేందుకు వీలుగా అన్ని ప్రాంతీయ భాషల్లోనూ వాయిస్‌ ఆధారిత కంటెంట్‌ను అభివృద్ధి చేస్తున్నాం.

ఇప్పటివరకు యువర్‌ నెస్ట్, సిడ్బీ వెంచర్‌ క్యాపిటల్‌ నుంచి రూ.20 కోట్ల నిధులను సమీకరించాం. ప్రస్తుతం మా సంస్థలో 56 మంది ఉద్యోగులున్నారు. మరో 15 మందిని నియమించుకోనున్నాం. ఈ ఏడాది ముగింపు నాటికి కన్నడ, మలయాళం, గుజరాతీ, ఉర్దూ భాషల్లోనూ కంటెంట్‌ను తీసుకురానున్నాం. వచ్చే ఏడాది ఇదే విభాగంలోని ఓ కంపెనీని కొనుగోలు చేస్తాం’’ అని విశాల్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement