క్లాస్ బయటా... టీచర్తో టచ్లో! | Startup Diary special story for blinder | Sakshi
Sakshi News home page

క్లాస్ బయటా... టీచర్తో టచ్లో!

Published Sat, Mar 12 2016 12:17 AM | Last Updated on Wed, Apr 3 2019 4:04 PM

క్లాస్ బయటా... టీచర్తో టచ్లో! - Sakshi

క్లాస్ బయటా... టీచర్తో టచ్లో!

లెర్నింగ్ సొల్యూషన్‌ను అందిస్తున్న బ్లైండర్
యాప్‌తో విద్యార్థులు, టీచర్లకు డిజిటల్ సేవలు  త్వరలో రూ.1.65 కోట్ల సమీకరణ
‘సాక్షి స్టార్టప్ డైరీ’తో బ్లైండర్ కో-ఫౌండర్ సతీష్ నాంపల్లి

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్లైండర్...! ఈ పేరు వింటే అంధుల కోసమో... మరొకటో అనిపిస్తుంది. కానీ నిజానికిది టీచర్లకు, విద్యార్థులకు వెలుగు దారి చూపిస్తుంది. అదెలాగంటే... ‘‘తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠం పూర్తవగానే వెళ్లిపోతాడు. తర్వాత ఆ పాఠాన్ని విద్యార్థి రివిజన్ చేస్తున్నప్పుడు ఏదైనా సందేహం తలెత్తితే పరిస్థితేంటి? తెల్లారి మళ్లీ క్లాస్ రూమ్‌కు వస్తే గానీ టీచర్‌ను అడిగే అవకాశం ఉండదు. అదే సందేహం వచ్చిన వెంటనే సెల్‌ఫోన్‌లో పోస్ట్ చేస్తే! వెంటనే అటు నుంచి టీచర్ స్పందించి జవాబిస్తే!!.  అంతేకాదు..! క్లాస్‌రూంలో రేపు ఏ అంశం మీద పాఠం ఉంటుందో ఉపాధ్యాయుడు ముందే బ్లైండర్‌లో పోస్ట్ చేయొచ్చు. అటు టీచర్, ఇటు స్టూడెంట్స్ ఇద్దరూ బాగా ప్రిపేరయి సదరు పాఠంపై లోతైన విశ్లేషణ సాగించొచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే ఇవే బ్లైండర్ ప్రత్యేకతలు. సంస్థ ప్రత్యేకతల్ని, విస్తరణ ప్రణాళికల్ని బ్లైండర్ సహ వ్యవస్థాపకుడు సతీష్ నాంపల్లి ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే...

 బ్లైండర్ ప్రారంభం గురించి చెప్పాలంటే ముందు మా గురించి కొంత చెప్పాలి. కాగ్నిజెంట్ ఐటీ కంపెనీకి అమెరికా, ఇండియాలో సీనియర్ డెలివరీ మేనేజర్‌గా 15 ఏళ్లు పనిచేశా. ప్రవీణ్, జోసెఫ్ ఫ్రీడ్, మార్క్ గార్బేడియన్ ముగ్గురూ నా సహోద్యోగులు. ప్రవీణ్ సోదరి ప్రశాంతి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్. ఓ రోజు తన సోదరి నుంచి ఫోన్ వచ్చింది. క్లాస్ రూం బయటకు రాగానే విద్యార్థులకు, టీచర్లకు మధ్య ఏర్పడుతున్న దూరం, అవాంతరాలు చాలా ప్రమాదకరమని... ఇప్పటివరకు దేశంలో విద్యార్థులు, టీచర్లు, విద్యా సంస్థల్ని ఒకే ప్లాట్‌ఫామ్ మీదికి ఎవ్వరూ తీసుకురాలేదని, టెక్నాలజీ ఆధారంగా పరిష్కారం చూపించాలనేది ఆ ఫోన్ సారాంశం.

అప్పటికే టెక్నాలజీ విభాగంలో మాకు పట్టుండటంతో క్లౌడ్ ఆధారిత సొల్యూషన్‌ను రూపొందించాం. ఇండియాలో ప్రారంభించే ముం దు దాన్ని అమెరికాలో పరీక్షించాలనుకున్నాం. అదే సమయంలో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో స్టార్టప్ పోటీలు జరుగుతుండటంతో పాల్గొన్నాం. అందులో బ్లైండర్‌కు బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డ్ దక్కింది. 20 వేల డాలర్ల నగదు బహుమతిగా అందుకున్నాం. మరో  రూ.70 లక్షల పెట్టుబడి తో బ్లైండర్‌ను ప్రారంభించాం. గతేడాది మార్చిలో అమెరికా, హైదరాబాద్‌లో బ్లైండర్ సేవలు ప్రారంభమయ్యాయి.

 టీచర్లు, విద్యార్థులు ఒకే వేదికపై..
దేశంలో విద్యా వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్, అకడమిక్ అనే రెండు విభాగాలుగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్‌లో ఫీజులు, అటెండెన్స్, హెచ్‌ఆర్ వంటి విభాగాలుంటే.. అకడమిక్‌లో పేపర్లు, పరీక్షలు, ఫలితాలు, గ్రేడ్ల వంటివి ఉంటాయి. అయితే అడ్మినిస్ట్రేషన్ పనిని సులువుగా చేసే టెక్నాలజీ అందుబాటులో ఉంది కానీ, అకడమిక్ విభాగంలో అంతగా లేవు. ఉన్న కొద్ది కంపెనీలు కూడా పాఠ్యాంశాలన్నిటినీ డిజిటైజ్ చేయటం, టెక్నాలజీ ద్వారా విద్యార్థులకు క్లాస్ రూం అవసరం లేకుండా చూడటమో చేస్తున్నాయి. నిజానికి విద్యార్థుల్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దేది నాలుగు గోడల మధ్య సాగే తరగతి గదే. ఓవైపు క్లాస్ రూంలో పాఠాలు సాగుతూనే.. సమయం పూర్తయ్యాక కూడా టెక్నాలజీ ఆధారంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల్ని టెక్నాలజీతోనే అనుసంధానం చేయాలి. ఇదే బ్లైండర్ పని. అంటే క్లౌడ్ ఆధారంగా పనిచేసే లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్. దీన్ని ఇంటర్నెట్ సాయంతో కంప్యూటర్, మొబైల్, ల్యాప్‌టాప్ ఇలా ఏ డివైజ్‌లోనైనా వినియోగించుకోవచ్చు.

రూ.1.65 కోట్ల నిధులు...
ఈ ఏడాది ముగిసే నాటికి కనీసం మూడు నాలుగు నగరాలకు విస్తరిస్తాం. బెంగళూరు, పుణె నగరాల్లోని పలు కళాశాలతో చర్చిస్తున్నాం. విస్తరణ నిమిత్తం తొలిసారిగా నిధులు సమీకరిస్తున్నాం. అమెరికాలోని పలువురు ప్రైవేట్ పెట్టుబడిదారులతో చర్చలు చివరి దశలో ఉన్నాయి. లీగల్ పేపర్ వర్క్ నడుస్తోంది. సుమారుగా రూ.1.65 కోట్ల (2.50 లక్షల డాలర్లు) నిధులను సమీకరించనున్నాం.

మొదటి 6 నెలలు ఉచితం...
ప్రస్తుతం మా సేవలను గుంటూరులోని వీవీఐటీ, జనగాంలోని సీజేఐటీఎస్‌లతో పాటుగా హైదరాబాద్‌లోని శ్రీనిధి, వర్ధమాన్, మల్లారెడ్డి గ్రూప్, వీబీఐటీ, సీవీఎస్‌ఆర్ వంటి సుమారు 33 కళాశాలలు వినియోగించుకుంటున్నాయి. చార్జీల విషయానికొస్తే.. మొదటి ఆరు నెలలు ఉచితంగా అందిస్తున్నాం. ఆ తర్వాత ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.500 ఫీజు తీసుకుంటాం. గూగుల్ ప్లేస్టోర్ నుంచి బ్లైండర్ ఆండ్రాయిడ్ యాప్‌ను కూడా డౌన్‌లోడ్  చేసుకోవచ్చు.

అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే
startups@sakshi.com కు మెయిల్ చేయండి...

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement