వైద్యులు... ఇక్కడ విద్యార్థులు!! | New startup diary mediknit | Sakshi
Sakshi News home page

వైద్యులు... ఇక్కడ విద్యార్థులు!!

Published Sat, Sep 29 2018 1:04 AM | Last Updated on Sat, Sep 29 2018 1:04 AM

New startup diary mediknit - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో :  ‘నిరంతర విద్యార్థి’.. ఇది వైద్యులకు పక్కాగా వర్తిస్తుంది. ఎందుకంటే? వైద్య రంగంలో వస్తున్న మార్పులు, అధునాతన శస్త్ర చికిత్స విధానాలు, మెడికల్‌ టెక్నాలజీ, వ్యాధులు, చికిత్స మార్గాలు వంటివి నేర్చుకుంటూ ఉండాలి. మరి డాక్టర్లు వృత్తిని వదిలి.. పుస్తకాలు పట్టుకొని రోజూ శిక్షణ తరగతులకు వెళ్లాలా? అవసరమే లేదంటోంది బెంగళూరుకు చెందిన మెడినిట్‌. జస్ట్‌! వైద్యులు మెడినిట్‌లో నమోదైతే చాలు.. ప్రపంచంలోని ప్రముఖ డాక్టర్లు, వైద్య వర్సిటీలు, మెడికల్‌ అసోసియేషన్స్‌ ప్రచురించే జర్నల్స్, వైద్య కోర్సుల కంటెంట్, ఆడియో, వీడియో వంటివన్నీ పొందొచ్చు. డాక్టర్లకే శిక్షణ ఇస్తున్న మెడినిట్‌ గురించి మరిన్ని వివరాలు ఫౌండర్‌ డాక్టర్‌ భాస్కర్‌ రాజ్‌ కుమార్‌ ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు.

2010లో రష్యాలో రేడియాలజీలో ఎండీ పూర్తయ్యాక.. బెంగళూరులోని పలు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చేరా. ఆ తర్వాత ఓ ప్రముఖ హెల్త్‌కేర్‌ టెక్నాలజీ కంపెనీలో ఆరేళ్లు పనిచేశా. మెడికల్‌ టెక్నాలజీ మీద శిక్షణ నిమిత్తం వందలాది డాక్టర్లను కలిసేవాణ్ణి. అప్పుడు తెలిసిందేంటంటే.. నేర్చుకునే సమయం, సరైన వేదిక రెండూ లేకపోవటంతో చాలా మంది డాక్టర్లు సంపాదనకే వృత్తిని అంకితం చేస్తున్నారని!. ఇదే మెడినిట్‌కు బీజం వేసింది.

స్నేహితుడు సురేందర్‌ పరుసురామన్‌తో కలిసి 2016లో రూ.45 లక్షల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా మెడినిట్‌ను ప్రారంభించాం. ప్రపంచంలోని ప్రముఖ డాక్టర్లు, సంఘాలు, వర్సిటీలు రూపొందించే వైద్య కోర్సులు, వెలువరించే జర్నల్స్, కంటెంట్, రకారకాల వ్యాధులు, చికిత్స మార్గాలకు సంబంధించిన వీడియోలు వంటివి మెడినిట్‌లో పొందే వీలుండటమే మా ప్రత్యేకత.

ప్రస్తుతం 28; ఏడాదిలో 65 కోర్సులు..
ప్రస్తుతం మెడినిట్‌లో 28 రకాల వైద్య కోర్సులున్నాయి. డిప్లొమా ఇన్‌ మినిమల్‌ యాక్సెస్‌ సర్జరీ, ఫెలోషిప్‌ ఇన్‌ మినిమల్‌ యాక్సెస్‌ సర్జరీ, ఏఏఎస్‌ స్కిల్‌ కోర్స్‌ బేసిక్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ ఆర్థోస్కోపిక్‌ సర్జరీ: నీ అండ్‌ షోల్డర్, ఫెలోషిప్‌ ఇన్‌ డయాబెటిక్‌ ఫుట్‌ మేనేజ్‌మెంట్, సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ డిమోన్‌టియా వంటివి వీటిల్లో కొన్ని.

రిజిస్టర్‌ చేసుకున్న డాక్టర్స్‌ అభ్యర్థులు ఆయా కోర్సుల ఆడియో, వీడియో కంటెంట్‌తో పాటూ వైద్య సంఘాల లెక్చర్స్, సెమినార్స్‌ పొందవచ్చు. కోర్సుల కాల పరిమితి 3 వారాల నుంచి ఏడాది వరకుంటుంది. కోర్సు, కాలపరిమితిని బట్టి ధరలు రూ.5 వేల నుంచి రూ.1.5 లక్షల వరకుంటాయి. వచ్చే ఏడాది 65 కోర్సులను అందుబాటులోకి తీసుకురావటంతో పాటూ అగ్‌మెంటెడ్‌ రియాలిటీ(ఏఆర్‌), వర్చువల్‌ రియాలిటీ(వీఆర్‌) టెక్నాలజీ ఆధారిత కంటెంట్‌నూ అందుబాటులోకి తీసుకురానున్నాం.

వర్సిటీలు, సంఘాలు, ఆసుపత్రులతో జట్టు
కోర్సుల రూపకల్పన, వ్యాధుల రకాలు, నివారణ, టెక్నాలజీ వంటి వాటిపై శిక్షణ కోసం మన దేశంతో పాటూ సింగపూర్, ఫిలిప్పీన్స్, మలేషియా, ఆస్ట్రేలియా దేశాల్లోని ప్రముఖ మెడికల్‌ యూనివర్సిటీలు, వైద్య సంఘాలతో ఒప్పందం చేసుకున్నాం.

మన దేశంలో జీఈఎం టెలివర్సీటీ, కాలేజ్‌ ఆఫ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ మినిమల్‌ యాక్సెస్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇండియా, డిమెన్షియా అకాడమీ, ఇండియన్‌ నేషనల్‌ అసోసియేషన్‌ ఫర్‌ లివర్‌ (ఐఎన్‌ఏఎస్‌ఎల్‌), ఇంటర్నేషనల్‌ హిపాటో పాన్‌క్రీటో బిలియరీ అసోసియేషన్‌ (ఐహెచ్‌పీబీఏ), ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డర్మటాలజిస్ట్, వెనిరోలాజిస్ట్‌ అండ్‌ లెప్రోలాజిస్ట్, ఇండియన్‌ రేడియాలజీ అండ్‌ ఇమేజింగ్‌ అసోసియేషన్‌(ఐఆర్‌ఐఏ), అసోసియేషన్‌ ఆఫ్‌ ఓరల్‌ అండ్‌ మాక్సిలోఫేసియల్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఏఓఎంఎస్‌ఐ), ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ వంటి సంఘాలున్నాయి.

రూ.20 కోట్ల ఆదాయం..
ప్రస్తుతం మెడినిట్‌లో 65 వేల మంది వైద్యులు నమోదయ్యారు. వీరిలో 2,500 మంది వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ డాక్టర్స్‌. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 7 వేల మంది వైద్యులుంటారు. గ్లోబల్, కేర్, కిమ్స్, ఏసియన్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్‌ వంటి ఆసుపత్రులతో పాటూ ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోటెస్టినల్‌ ఎండ్రో సర్జన్స్‌ (ఐఏజీఈఎస్‌), సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్‌ అసోసియేషన్‌ వంటి సంఘాలతో ఒప్పందాలున్నాయి. ఏడాది కాలంలో 2 లక్షల మంది వైద్యుల నమోదు, మరో 30 సంఘాలను జత చేయాలన్నది టార్గెట్‌.

2 నెలల్లో రూ.72 కోట్ల నిధుల సమీకరణ..
గతేడాది రూ.3 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. వచ్చే ఏడాది రూ.20 కోట్లు లకి‡్ష్యంచాం. త్వరలోనే మధ్య ప్రాచ్యం, దుబాయ్, అబుదాబి దేశాల్లో సేవలందించనున్నాం. ఆ తర్వాత అమెరికా, యూకేలకు విస్తరిస్తాం. ‘‘ప్రస్తుతం కంపెనీలో 41 మంది ఉద్యోగులున్నారు. జూన్‌కి మరో 100 మందిని నియమించుకోనున్నాం. ఇప్పటివరకు ఏంజిల్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.3 కోట్లను సమీకరించాం. 2 నెలల్లో రూ.72 కోట్లను సమీకరించనున్నాం. మన దేశంతో పాటూ విదేశాల్లోని వీసీ ఇన్వెస్టర్లతో చర్చ లు జరుగుతున్నాయని’’ భాస్కర్‌ వివరించారు.

వైజాగ్‌లో శిక్షణ కేంద్రం..
ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీలో స్థానిక వైద్య సంఘాలతో కలిసి ఆఫ్‌లైన్‌లో శిక్షణ కేంద్రాలున్నాయి. తొలిసారిగా సొంతంగా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇటీవలే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో చర్చిం చాం. ఏపీ ప్రభుత్వంతో కలిసి విశాఖపట్నం లోని మెడ్‌టెక్‌ జోన్‌లో రూ.50 కోట్ల పెట్టుబడులతో సిమ్యులేషన్‌ జోన్‌ను ఏర్పాటు చేయనున్నాం. జనవరి నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. మౌలిక  వసతులు, రాయితీలు కల్పిస్తే తెలంగాణలోనూ ఏర్పాటు చేస్తాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement