అనారోగ్య కేంద్రం | Unhealthy Center | Sakshi
Sakshi News home page

అనారోగ్య కేంద్రం

Published Wed, Dec 18 2013 4:15 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM

Unhealthy Center

కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందని ద్రాక్షగా మారుతోంది. జ్వరం వచ్చినా పట్టణాల వైపు పరుగులు తీయాల్సి వస్తోంది. ‘‘పల్లె ప్రజలకు వైద్యం అందిస్తాం.. వారికి ఊపిరి పోస్తాం’’ అని వాగ్దానం చేస్తున్న జూనియర్ వైద్యులు ఆ తర్వాత విస్మరిస్తున్నారు. లక్షలాది రూపాయల ప్రభుత్వ సొమ్ముతో వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థులు గ్రామాలకు వెళ్లేందుకు సాహసించని పరిస్థితి నెలకొంది. అరకొర ఆసుపత్రుల్లోనూ సమస్యలు తాండవిస్తున్నాయి. పర్యవేక్షణ లోపించడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 13 తాలూకా ఆసుపత్రులు ఉన్నాయి. ఇందులో 24 గంటల పాటు సేవలందించే ఆసుపత్రులు 48. వీటితో పాటు నాలుగు ఏరియా ఆసుపత్రులు, నంద్యాలలో జిల్లా ఆసుపత్రి, కర్నూలులో సర్వజన వైద్యశాల ఏర్పాటయ్యాయి. పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు 16 అర్బన్‌హెల్త్ సెంటర్లు స్వచ్ఛంద సంస్థలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
 
 అయితే జిల్లాలో నాలుగు సివిల్ సర్జన్ పోస్టులకు గాను ఒకటి, ఆరు సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల్లో ఐదు, 20 డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టుల్లో 4..  208 సివిల్ అసిస్టెంట్ పోస్టుల్లో 80.. 14 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల్లో ఒకటి ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని పోస్టుల భర్తీలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పెరుగుతున్నా.. ఆ మేరకు వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది పోస్టులు పెరగడం లేదు. 128 మంది వైద్యులతో పాటు 38 మంది వైద్యులను కాంట్రాక్టు పద్ధతిపై నియమించారు.
 
 వైద్యుల్లో అధిక శాతం పీజీ ప్రవేశ పరీక్షపై దృష్టి సారించి విధులకు ఎగనామం పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్వహించాల్సి ఉంది. కానీ చాలాచోట్ల వైద్యులు ఉదయం 10 గంటల తర్వాత ఆసుపత్రికి వచ్చి.. ఒంటి గంటకే తిరిగి వెళ్తున్నారు. వీరిని చూసి కింది స్థాయి సిబ్బంది సైతం విధులకు చుట్టపుచూపుగా హాజరవుతున్నారు.
 మందుల తరలింపునకు డబ్బుల్లేవు: జిల్లాలోని ప్రతి ఆరోగ్య కేంద్రానికి అక్కడి జనాభాను బట్టి యేడాదికి రూ.5లక్షల నుంచి రూ.6లక్షల వరకు మందులు, రూ.1లక్ష నుంచి రూ.1.50లక్షల వరకు సర్జికల్ బడ్జెట్‌ను కేటాయిస్తారు. తాలూకా ఆసుపత్రులకు రూ.8లక్షల నుంచి రూ.9లక్షల వరకు బడ్జెట్ ఉంటుంది.
 
 ఈ మందులన్నింటినీ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌కు ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఇక్కడ నుంచి ఆరోగ్య కేంద్రాలకు మందులను సరఫరా చేసే ప్రక్రియ సక్రమంగా సాగడం లేదు. మందులను పీహెచ్‌సీలకు తరలించేందుకు అవసరమైన బడ్జెట్‌ను ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఒక్కోసారి ఉద్యోగులే సొంత ఖర్చులతో వీటిని తీసుకెళ్లాల్సి వస్తోంది. ఈ కారణంగా జిల్లాలోని అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వాటికి కేటాయించిన బడ్జెట్ కంటే చాలా తక్కువగా మందులు, సర్జికల్స్ తీసుకెళ్తున్నారు. ఈ మేరకు మరుసటి సంవత్సరం ఆయా ఆరోగ్య కేంద్రాలకు ప్రభుత్వం బడ్జెట్ తగ్గిస్తుండటంతో మొదటికే మోసం వస్తోంది.
 
 జిల్లాలో ఇదీ పరిస్థితి
  ఆదోని పట్టణంలోని మెటర్నిటీ సెంటర్‌లో 12 ఏళ్లుగా వైద్యాధికారి లేడు. నాలుగు ఏఎన్‌ఎం పోస్టులు ఐదేళ్ల నుంచి ఖాళీగా ఉన్నాయి.
 
  ఆళ్లగడ్డ మండలం అహోబిలంలోని 24 గంటల పీహెచ్‌సీలో మంగళవారం ఫార్మసిస్ట్ ఒక్కరే విధులకు హాజరయ్యారు. సాయంత్రం 5 గంటలకే ఆసుపత్రి మూతపడింది.
  బనగానపల్లి ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్ రోగులకు ఆరు పడకలు ఏర్పాటు చేయాల్సి ఉండగా వార్డుల కొరతతో మూడింటితో సరిపెట్టారు. ఇక్కడ చీఫ్ మెడికల్ ఆఫిసర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ స్థానికంగా నివాసం ఉండకపోవడంతో రోగుల సంఖ్య తక్కువగా ఉంటోంది.
 
  హర్ధగేరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఇద్దరు వైద్యులు బదిలీపై వెళ్లారు. గతేడాదిగా కమ్మరచేడు పీహెచ్‌సీలో పనిచేస్తున్న వైద్యాధికారి చంద్రకాంత్‌ను ఇక్కడ ఇన్‌చార్జిగా నియమించారు. ఆయన వారంలో రెండు రోజులు మాత్రమే విధులకు హాజరవుతున్నారు.
 
  పత్తికొండ మండలంలోని పుచ్చకాయలమాడ పీహెచ్‌సీలో వైద్యధికారిని నియమించకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. టీబీ కిట్లు, ఇన్సులిన్, మూర్చ వ్యాదికి కావల్సిన మందులు లేక రోగులు ఇబ్బందులకు లోనవుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement