కాలేజీలో ఘర్షణ: ప్రాణాపాయ స్థితిలో విద్యార్థి
హైదరాబాద్: విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం ఓ ఇంటర్ విద్యార్థి ప్రాణాలమీదకొచ్చింది! స్వల్ప వాగ్వాదం పెద్ద ఘర్షణకు దారి తీసింది. ముగ్గురు విద్యార్థులు కలసి మరో విద్యార్థిపై దాడి చేయడంతో అతడు తీవ్ర గాయలపాలై ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. శుక్రవారం హైదరాబాద్‌లోని అంబర్‌పేట పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉప్పల్ ఫీర్జాదీగూడకు చెందిన నోముల అంజిరెడ్డి కుమారుడు విజయవర్ధన్‌రెడ్డి బాగ్ అంబర్‌పేట డీడీ కాలనీలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్టియర్(ఎంపీసీ) చదువుతున్నాడు. శుక్రవారం కాలేజీలో భోజనం అనంతరం వరండాలో నడుచుకుంటూ వెళ్తున్న విజయవర్ధన్‌రెడ్డిని వేరే సెక్షన్‌కు చెందిన ముగ్గురు ఫస్టియర్ విద్యార్థులు వెనుక నుంచి తలపై చిన్నగా కొట్టారు. ఎవరు కొట్టారని వెనక్కి తిరిగి ప్రశ్నిస్తుండగానే.. ఆ ముగ్గురు విజయవర్ధన్‌రెడ్డిని మళ్లీ తలపై బలంగా కొట్టారు. దీంతో విజయవర్ధన్ అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు.
కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం..
తీవ్రంగా గాయపడ్డ విజయవర్ధన్‌ను కాలేజీ యాజమాన్యం వెంటనే తీసుకువెళ్లకుండా తండ్రికి ఫోన్ చేసింది. ఆ సమయంలో ఆయన ఫోన్ ఎత్తకపోవడంతో గాయపడ్డ విద్యార్థిని కాలేజీలో అలాగే ఉంచారు. సమాచారం అందుకున్న విద్యార్థి పెదనాన్న నర్సిరెడ్డి కాలేజీకి ఫోన్ చేయగా.. ‘మీ కుమారుడే ఇతర విద్యార్థులతో గొడవపడ్డాడు..’ అని సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన కళాశాల వచ్చి విజయవర్ధన్‌ను వెంటనే చికిత్స కోసం ఉప్పల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు గాయం పెద్దదని మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో నాగోల్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు.
అక్కడ పరీక్షించిన వైద్యులు తలలో రక్తం గడ్డ కట్టిందని, ఈ చికిత్స తమ వద్ద అందుబాటులో లేదనడంతో హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఇంత జరిగినా కాలేజీ యాజమాన్యం పత్తా లేకుండా పోరుుంది. ఆస్పత్రిలో చేర్చిన అనంతరం విద్యార్థి పెదనాన్న అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అప్పుడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం విజయవర్ధన్ అపస్మారకస్థితిలో ఉన్నాడని, పరిస్థితి విషమంగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నారుు. దాడి చేసిన విద్యార్థులను మధ్యాహ్నమే ఇంటికి పంపించి వేసిన యాజమాన్యం... గాయపడ్డ విద్యార్థిని మాత్రం కుటుంబ సభ్యులు వచ్చేదాకా కాలేజీలోనే ఉంచుకోవడం గ మనార్హం.
పోలీసులపై ఒత్తిడి!
దాడి చేసిన ముగ్గురు విద్యార్థుల్లో ఒకరిని కేసు నుంచి తప్పించాలని అంబర్‌పేట పోలీసులపై ఒత్తిడి వస్తున్నట్లు తెలిసింది. పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ముగ్గురు విద్యార్థుల్లో ఒకరిని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.