భారత్‌లో వైద్య విద్యకు అవినీతి జబ్బు
లండన్: నేడు భారత్‌లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన డాక్టర్లు ఉన్నారు. వారిలో కొంత మంది భారత్‌లోని ప్రతిష్టాత్మక వైద్య కళాశాలలో చదువుకున్న వాళ్లుకాగా, మరి కొందరు విదేశాల్లోని ప్రతిష్టాత్మక వైద్య కళాశాలల్లో చదువుకున్న వాళ్లు ఉన్నారు. దీనిబట్టి భారత్‌లో వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు అత్యుత్తమమైనవని భావిస్తే పొరపాటు పడినట్లే. దేశంలోని వైద్య విద్య, బోధనాస్పత్రుల పనితీరు ఏమాత్రం బాగా లేకపోవడమే కాకుండా రోజురోజుకు పరిస్థితి దిగజారిపోతుందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి.
దేశంలో వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు మొత్తం 579 ఉండగా, 2005 నుంచి 2014 వరకు దశాబ్దకాలంలో 579లో ఒక్కటంటే ఒక్క సంస్థ కూడా రిసెర్చ్ పేపర్లు సమర్పించకపోవడం ఆశ్చర్యకరం. వైద్య విద్యా విధానం ప్రమాణాలకు రిసెర్చ్ పేపర్లు సమర్పించడం ఒక్కటే ప్రమాణం కాకపోయినప్పటికీ, దేశంలోని ప్రైవేటు వైద్య కళాశాలలు వైద్య వృత్తిని కేవలం వ్యాపారం చేసుకున్నాయనే అనుమానాలకు ఈ రిసెర్చ్ పత్రాల అంశం బలం చేకూరుస్తోందని తాజా అధ్యయనంలో పాల్గొన్న ఢిల్లీకి చెందిన గ్యాస్ట్రోయింటెస్టైనల్ సర్జన్ సమీరన్ నుండి అభిప్రాయపడ్డారు.
2010 నుంచి భారత్‌లోని 69 వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాయని, ప్రవేశ పరీక్షల్లో రిగ్గింగ్‌కు పాల్పడడంగానీ లంచాలు తీసుకొని విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడంగానీ చేస్తున్నాయని రాయటర్స్ నిర్వహించిన దర్యాప్తులో వెల్లడైంది. దేశంలోని 398 వైద్య కళాశాలల్లో ప్రతి ఆరింటికి ఒకటి చొప్పున చీటింగ్‌కు పాల్పడినట్లు భారత ప్రభుత్వ గణాంకాలు, కోర్టు ఫైళ్లే తెలియజేస్తున్నాయి.
ప్రపంచంలో తీవ్ర అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్న భారత్‌లో వైద్యంతో తగ్గిపోయే డయేరియా, టీబీ, నిమోనియా లాంటి జబ్బులతో ఎక్కువ మంది మరణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యకళాశాలలను పట్టిపీడిస్తున్న అవినీతి జబ్బును నయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేడు దేశంలో ప్రాక్టీసు చేస్తున్న వైద్యుల్లో దాదాపు సగం మంది డాక్టర్లకు వైద్యవిద్యలో సరైన శిక్షణ లేదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంచనా వేసింది.
బల్వంత్ అరోరా అనే వైద్యాధికారిపై 2011లో దాఖలైన కోర్టు కేసు వైద్య విద్యలో చోటు చేసుకుంటున్న అక్రమాల తీవ్రతను సూచిస్తోంది. ఆయన వంద డాలర్లకు ఒకటి చొప్పున 50 వేల నకిలీ వైద్య పట్టాలను జారీచేసినట్లు అంగీకరించారు. దేశంలో తీవ్రమైన డాక్టర్ల కొరత ఉన్నందువల్ల వైద్యంలో ఏదోరకమైన అనుభవం ఉన్నవాళ్లకు తాను నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చినట్లు అరోరా సమర్థించుకున్నారు. 1980 దశకంలో వంద ప్రభుత్వ వైద్య కళాశాలలకుగాను 11 ప్రైవేటు వైద్య కళాశాలలు ఉండగా, నేడు 215 ప్రభుత్వ వైద్య కళాశాలలకుగాను 183 ప్రైవేటు వైద్య కళాశాలలు పనిచేస్తున్నాయి. వీటిలో ఎక్కువ ప్రైవేటు కళాశాలలను వైద్య వత్తితో ఎలాంటి సంబంధంలేని వ్యాపారవేత్తలే నిర్వహిస్తున్నారు.