విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌కు వచ్చిన చంద్రబాబు
కలెక్టరేట్ ఎదుట వందలాది వైద్యుల నిరసన
జీవో 85ను రద్దు చేయాలని డిమాండ్
జీవో రద్దు చేయాలని పట్టుబడితే కుదరదని హెచ్చరించిన సీఎం
సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్యలో ఇన్ సర్విస్ కోటా కుదింపును వ్యతిరేకిస్తూ పీహెచ్‌సీ వైద్యులు చేపట్టిన నిరసన సెగ సీఎం చంద్రబాబును తాకింది. బుధవారం విజయవాడలోని ఎన్డీఆర్ జిల్లా కలెక్టర్‌రేట్‌లో వరద బాధితులకు పరిహారం పంపిణీ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. దీంతో వందలాది పీహెచ్‌సీ వైద్యులు ఉదయాన్నే కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
ఇన్‌సర్విస్ కోటా కుదింపు జీవో 85ను రద్దు చేయడంతో పాటు, ఇతర సమస్యలను పరిష్కరించాలంటూ ఫ్ల కార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కలెక్టరేట్ పరిసరాల్లో నిరసన తెలపడానికి వీల్లేదని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని వైద్యులను పోలీసులు అడ్డుకున్నారు. సీఎంను కలిసి తమ సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లే వరకూ అక్కడి నుంచి వెళ్లేది లేదని వైద్యులు తెగేసి చెప్పారు.
సీఎంను కలవడానికి ఇంత మందిని అనుమతించబోమని, ఇద్దరు మాత్రమే రావాలని పోలీసులు చెప్పారు. పోలీసుల షరతుకు అంగీకరించి, ఇద్దరు వైద్యులే సీఎంను కలిశారు. మిగిలిన వైద్యులందరూ అక్కడే రోడ్డుపై గంటల తరబడి పడిగాపులు కాశారు.
జీవో రద్దు చేయం
వైద్యుల ప్రతినిధులు సీఎంను కలిసి జీవో 85 రద్దు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. అయితే, జీవో 85ను రద్దు చేయడం కుదరదని సీఎం తేల్చి చెప్పినట్టు తెలిసింది. జీవోలో సవరణకు ఇప్పటికే సానుకూలత తెలిపామని అన్నట్లు సమాచారం. జీవో రద్దుకు పట్టుబడితే కుదరదని సున్నితంగా హెచ్చరించినట్టు వైద్యులు చెప్పారు.
ఇన్‌సర్విస్ కోటా కుదించిన బాబు సర్కారు
పీజీ వైద్య విద్యలో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్)లుగా సేవలందించే ఎంబీబీఎస్ వైద్యులకు ఇన్‌సర్వీస్ రిజర్వేషన్ సౌకర్యం ఉంది. గత ప్రభుత్వం క్లినికల్ పీజీ కోర్సుల్లో 30 శాతం, నాన్–క్లినికల్ కోర్సుల్లో 50 శాతం రిజర్వేషన్ ఇచ్చింది.
చంద్రబాబు ప్రభుత్వం క్లినికల్‌లో ఎంపిక చేసిన స్పెషాలిటీల్లో 15 శాతం, నాన్–క్లినికల్ కోర్సుల్లో 30 శాతానికి ఈ కోటా కుదించింది. దీంతో 2023–24లో క్లినికల్‌లో 389, నాన్–క్లినికల్‌లో 164 పీజీ సీట్లు పొందిన వైద్యులు, ఇప్పుడు క్లినికల్‌లో 270, నాన్ క్లినికల్‌లో 66 చొప్పున సీట్లను కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 10 నుంచి వైద్యులు ఉద్యమం చేపట్టారు. 15వ తేదీ నుంచి పీహెచ్‌సీల్లో వైద్య సేవలకు సైతం దూరంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment