విజయవాడలో వలంటీర్ల వినూత్న నిరసన
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడసెంట్రల్)/కపిలేశ్వరపురం/అయినవిల్లి : ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే బుద్ధి, జ్ఞానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రసాదించాలని కోరుతూ వలంటీర్లు ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఏపీ వలంటీర్ అసోసియేషన్, ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సింగ్‌నగర్ కృష్ణా హోటల్ సెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద గురువారం వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ వలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు మాట్లాడుతూ.. చంద్రబాబు 2024 ఎన్నికలకు ముందు వలంటీర్లను కొనసాగిస్తామని, వారికి నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని, అన్ని విధాలా న్యాయం చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇటీవల విజయవాడలో బుడమేరు వరదల సమయంలో కూడా వలంటీర్లతో సేవలు చేయించుకొని, సచివాలయాల్లో కనీసం అటెండెన్స్ వేసుకునే అవకాశాన్ని కూడా కల్పించకుండా వివక్ష చూపుతోందన్నారు.
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా బకాయి పడ్డ గౌరవ వేతనం చెల్లించలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు తగిన జ్ఞానాన్ని, బుద్ధిని ప్రసాదించి వలంటీర్లకు న్యాయం చేసేలా చూడాలని కోరుతూ ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మమత, దమ్ము రమేష్, నరేష్, కల్యాణ్, షేక్ సైదాబీ, భాను, తేజస్విని, స్వప్న, షైనీ, రాజ్ కుమార్, సీపీఐ నాయకుడు కె.వి.భాస్కరరావు, ఏఐటీయూసీ, ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
ఎన్నికల హామీని అమలు చేయాలి గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసి, తమను విధుల్లోకి తీసుకోవాలని వలంటీర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఏడు నెలలుగా తమకు జీత భత్యాలు ఇవ్వడం లేదని ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపారు.
కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదారిలంక, అయినవిల్లి మండలం వీరవల్లిపాలెంలోని పంచాయతీ కార్యాలయాల్లో ఈ మేరకు గురువారం వారు వినతిపత్రాలు అందజేశారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో వలంటీర్లు తమ సమస్యలపై సచివాలయంలో వినతిపత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment