
వరుసగా రెండో బడ్జెట్‌లోనూ కేటాయింపుల్లేవు
దీంతో 2.66 లక్షల మంది కుటుంబాలు వీధిపాలు
టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే వీరికి వేతనాలు బంద్
తొమ్మిది నెలలుగా ఆందోళన చేస్తున్నా స్పందించని సర్కారు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పైరవీలు, పక్షపాతానికి తావులేకుండా ఐదేళ్ల పాటు లబ్దిదారుల ఇళ్ల వద్దనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి దేశవ్యాప్తంగా ప్రశంసలందుకున్న వలంటీర్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం అటకెక్కించేసింది. గత ఏడాది ఎన్నికల ముందు.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం, వారి గౌరవ వేతనం రెట్టింపు చేస్తామని ఊరూవాడా హోరెత్తించిన కూటమి పెద్దలు అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థను చిదిమేశారు. తాజాగా.. ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లోనూ నిధులు కేటాయించకపోవడంతో 2.66 లక్షల మంది వలంటీర్ల కుటుంబాలు రోడ్డునపడినట్లయింది.
నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉపాధి..
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరకు విజయవంతంగా కొనసాగిన వలంటీర్ల వ్యవస్థ ద్వారా పేద నిరుద్యోగ యువత పెద్దఎత్తున ఉపాధి పొందారు. అప్పట్లో 20–25 ఏళ్ల మధ్య వయస్సు వారు 27 శాతం మంది, 26–30 ఏళ్ల మధ్య వారు 36 శాతం, 31–35 ఏళ్ల మధ్య వారు 28 శాతం కలిపి మొత్తం 91 శాతం మంది 35 ఏళ్లలోపు వారే ‘వలంటీర్’గా ఉపాధి పొందారు.
మరోవైపు.. వలంటీర్లుగా అప్పటి ప్రభుత్వం నియమించిన వారిలో 49 శాతం మంది బీసీలు, 27 శాతం మంది ఎస్సీలు, ఏడు శాతం మంది ఎస్టీలున్నారు. అలాగే, మొత్తం మీద 1,25,781 మంది మహిళలు ఉపాధి పొందారు.
తొమ్మిది నెలలుగా ఆందోళన చేస్తున్నా..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వలంటీర్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు గత ఏడాది ఎన్నికల ముందు ఉగాది పండుగ రోజున.. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో పాటు ప్రస్తుతం వారి గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఊదరగొట్టారు. అయితే, జూన్‌లో అధికారంలోకి వచ్చాక ఆ నెల నుంచి వలంటీర్ల వేతనాలను ప్రభుత్వం నిలిపివేసింది.
అంతేకాక.. అప్పటివరకూ అన్ని రకాల విధులు నిర్వహించిన వీరిని ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. దీంతో వలంటీర్లు చంద్రబాబు ఇచి్చన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తునే ఉన్నారు. అయినా, ఈ సర్కారుకు చీమ కుట్టినట్లు కూడా లేదు.
వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తాం
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా మీకు (వలంటీర్లకు) హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం. వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉగాది పండుగరోజున తీపి కబురు మీ అందరికీ ఇస్తాం. రూ.ఐదువేలు కాదు.. రాబోయే రోజుల్లో పదివేల రూపాయల పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. అది బిగినింగ్. 2024 ఉగాది పండుగ రోజున పార్టీ నిర్వహించిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు
Comments
Please login to add a commentAdd a comment