
పాలు, పేపర్ బిల్లుకూ క్లిక్కే!
⇒ పీఓఎస్ మిషన్ అవసరం లేదంటున్న ఎఫ్‌టీక్యాష్
⇒ స్మార్ట్‌ఫోన్, బ్యాంకు ఖాతా ఉంటే చాలు
⇒ రోజుకు రూ.కోటి లావాదేవీలు పూర్తి
⇒ 3 నెలల్లో రూ.50 కోట్ల నిధుల సమీకరణ
⇒ ‘స్టార్టప్ డైరీ’తో ఎఫ్‌టీ క్యాష్ కో–ఫౌండర్ వైభవ్ లోధా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెద్ద నోట్లు రద్దుచేశాక దేశంలో అంతా నగదును ఆచితూచి ఖర్చు చేస్తున్నారు. సాధ్యమైనంత వరకూ ఇంటర్నెట్ బ్యాంకింగో లేదా పీఓఎస్ మిషన్లలోనో క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారానే చెల్లిస్తున్నారు. మరి, చిన్న చిన్న అవసరాల పరిస్థితేంటి? కూరగాయలు, పాలు, పేపర్ బిల్లు, మందుల దుకాణంలో చెల్లింపులెలా? ఆయా వర్తకుల వద్ద కార్డు స్వైపింగ్ మిషన్లుంటే ఓకే? లేకపోతే? ఇదిగో ఇప్పుడా చిక్కులేవీ అక్కర్లేదంటోంది ఎఫ్‌టీ క్యాష్! పీఓఎస్ మిషన్ అవసరం లేకుండా స్మార్ట్‌ఫోన్, బ్యాంకు ఖాతా ఉంటే చాలు నగదు లావాదేవీలను పూర్తి చేసేస్తోంది. రోజుకు రూ.కోటి లావాదేవీల్ని పూర్తి చేస్తున్న ‘ఎఫ్‌టీ క్యాష్.కామ్’కు సంబంధించిన వివరాలు కో–ఫౌండర్ వైభవ్ లోధా ‘సాక్షి’తో పంచుకున్నారు.
చిన్న చిన్న వర్తకులు పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మిషన్లను నిర్వహించలేరు. వారి కోసం స్మార్ట్‌ఫోన్‌తో నగదు లావాదేవీలను జరపాలనే లక్ష్యంతో 2015 జూన్‌లో ముంబై కేంద్రంగా ఎఫ్‌టీక్యాష్.కామ్‌ను ప్రారంభించాం. మిత్రులు సంజీవ్ చందక్, దీపక్ కొఠారీతో కలిసి రూ.40 లక్షల పెట్టుబడితో దీన్ని ఆరంభించాం. ప్రస్తుతం హైదరాబాద్, పుణె, ముంబై, జైపూర్, సూరత్ నగరాల్లో సేవలందిస్తున్నాం. 20 వేల వర్తకులు నమోదయ్యారు. ఇందులో వెయ్యి మంది హైదరాబాద్ నుంచి ఉంటారు. ఇందులో కూరగాయలమ్మే వాళ్లు, పేపర్ బాయ్స్, పాలు వేసేవాళ్లు, కిరాణా , మెడికల్ షాపుల వంటి చిన్న చిన్న వర్తకులున్నారు. ప్రతి రోజు 2 వేల లావాదేవీలు, రూ.కోటి వ్యాపారం జరుగుతోంది. ప్రతి లావాదేవీపై వర్తకుడి నుంచి 1–1.8% రుసుము తీసుకుంటాం.
ఎస్‌ఎంఎస్ చాలు..
ప్రతి వర్తకుడికీ ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ లింక్ ఉంటుంది. దీన్ని వర్తకులు తమ కస్టమర్లకు మెసేజ్ లేదా వాట్సాప్ ద్వారా పంపించాలి. దీనికి వర్తకుడి దగ్గర ఇంటర్నెట్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. కస్టమర్లకొచ్చిన మెసేజ్‌ను క్లిక్ చేసి పేరు, చెల్లించాల్సిన నగదు నమోదు చేసి ఎంటర్ చేస్తే చాలు. లావాదేవీ పూర్తయినట్టే. క్రెడిట్, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, వాలెట్స్ దేనినైనా వినియోగించుకోవచ్చు. సంబంధిత సొమ్ము నేరుగా వర్తకుడి బ్యాంకు ఖాతాలో జమవుతుంది అంతే!
రూ.2 కోట్ల రుణాల మంజూరు..
పేమెంట్ సేవలతో పాటు... బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకొని వర్తకులకు రుణాలను మంజూరు చేస్తున్నాం. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, ఐసీఐసీఐ వంటి 15 బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నాం. రూ.50 లక్షల నుంచి రూ.5 లక్షల లోన్ ఇస్తాం. రుణ మొత్తాన్ని 3 నెలల నుంచి 2 ఏళ్ల లోపు చెల్లించాలి. వడ్డీ, అసలు సులభ వాయిదాల్లో నేరుగా వర్తకుని బ్యాంకు ఖాతా నుంచి కట్ అవుతుంటుంది. ఇప్పటివరకు 150 మంది వర్తకులకు రూ.2 కోట్ల లోన్స్ అందించాం. వచ్చే రెండేళ్లలో 10 లక్షల వర్తకుల్ని సభ్యులుగా చేర్చుకోవటంతో పాటు లక్ష మందికి రుణాలివ్వాలనేది లక్ష్యం.
3 నెలల్లో రూ.50 కోట్ల సమీకరణ..
ప్రస్తుతం మా సంస్థలో 80 మంది ఉద్యోగులున్నారు. గత ఏడాది కాలంలో వ్యాపారం 65 రెట్లు వృద్ధి చెందింది. ఇప్పటివరకు రూ.7 కోట్ల నిధులను సమీకరించాం. గతంలో సీడ్ రౌండ్‌లో మహారాష్ట్రకు చెందిన ఐవీ క్యాప్ వెంచర్స్ రూ.కోటి, సింగపూర్ ఏంజిల్స్, బెంగళూరుకు చెందిన ట్రాక్సన్ ల్యాబ్స్ రూ.6 కోట్లు పెట్టుబడులు పెట్టాయి. తాజాగా సిరీస్–బీ రౌండ్‌లో భాగంగా రూ.50 కోట్ల నిధుల సమీకరణపై దృష్టిపెట్టాం. వచ్చే 3 నెలల్లో డీల్‌ను క్లోజ్ చేస్తాం.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటేstartups@sakshi.comకు మెయిల్ చేయండి...