కోళ్ల పరిశ్రమకు డిజిటల్‌ టచ్‌! | New startup mlit for Poultry industry | Sakshi
Sakshi News home page

కోళ్ల పరిశ్రమకు డిజిటల్‌ టచ్‌!

Published Sat, Sep 1 2018 12:43 AM | Last Updated on Sat, Sep 1 2018 12:43 AM

New startup mlit for Poultry industry - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కోళ్ల పరిశ్రమ అనగానే సీజనల్‌ బిజినెస్‌ అంటారు. గుడ్ల నుంచి మొదలుపెడితే కోడి పిల్లల పెంపకం, ఫీడింగ్, కోల్డ్‌ స్టోరేజ్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌.. ఇలా ప్రతి దశలోనూ ఉష్ణోగ్రత, స్థానిక వాతావరణ ప్రభావితం చేస్తుంటాయి.

ఏ మాత్రం తేడా వచ్చినా నష్టాలే. టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లోనూ కోళ్ల పరిశ్రమలో ఇలాంటి పరిస్థితి ఎందుకా అనిపించింది హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌–అర్చన  దంపతులకు. అప్పటికే చేస్తున్న ఐటీ ఉద్యోగాలకు గుడ్‌బై కొట్టేసి ఎంఎల్‌ఐటీని ప్రారంభించారు. ఇదేంటంటే.. పొదుగు, కోడి పిల్లల ఉత్పత్తి, ఆహారం, శీతలీకరణ కేంద్రం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌.. ఇలా కోళ్ల పరిశ్రమలో ప్రతి దశలోనూ టెక్నాలజీ అందిస్తుంది. మరిన్ని వివరాలు ఎంఎల్‌ఐటీ కో–ఫౌండర్‌ అర్చన ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు.  

‘‘మాది హైదరాబాద్‌. కస్తూర్బాలో ఎంఎస్‌సీ పూర్తయింది. పెళ్లయ్యాక ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డాం. ఏడేళ్ల తర్వాత తిరిగి ఇండియాకి వచ్చి కుటుంబ వ్యాపారమైన ఇండస్ట్రియల్‌ పరికరాల తయారీలో భాగస్వామినయ్యా. నట్లు, బోల్ట్‌ల వంటి ప్రతి ఉత్పత్తి తయారీని ప్రత్యక్షంగా పరిశీలించాల్సిన అవసరం లేకుండా ఉత్పత్తుల తయారీ, నియంత్రణ, నిర్వహణ సులువుగా ఉండేలా ఐఓటీ ఆధారిత పరికరాన్ని అభివృద్ధి చేశా. ఈ ఐవోటీ పరికరం... ఉత్పత్తుల తయారీ సమయంలో ఉష్ణోగ్రత, ఒత్తిడి, వాతావరణ పరిస్థితులను నియంత్రిస్తుంది.

సింపుల్‌గా చెప్పాలంటే.. క్వాలిటీ మేనేజర్‌ పనంతా ఈ ఐఓటీ పరికరమే చేసేస్తుందన్నమాట! ఓ రోజు మా కస్టమర్‌తో మాట్లాడుతున్నప్పుడు వాళ్లకు సంబంధించిన ఓ హేచరీస్‌ ఇంక్యుబేటర్‌లో ఉష్ణోగ్రత పెరిగి గుడ్లు పాడైపోయాయని ఫోన్‌ వచ్చింది. దీన్ని మాతో చెబుతు నట్లు, బోట్ల తయారీలో ఉష్ణోగ్రతలను నియంత్రించినట్లే పౌల్ట్రీ పరిశ్రమలోనూ ఉంటే బాగుండనని అన్నారాయన. అలా ఎంఎల్‌ఐటీ కంపెనీకి పునాది పడింది. 2016లో రూ.60 లక్షల పెట్టుబడితో టీ–హబ్‌ కేంద్రంగా ప్రారంభించాం.

కన్‌సైట్, పౌల్ట్రీమాన్‌ రెండు పరికరాలు..
ప్రస్తుతం ఎంఎల్‌ఐటీ నుంచి రెండు ఉత్పత్తులున్నాయి. మొదటిది కన్‌సైట్‌. దీన్ని బిగ్‌ డేటా, క్లౌడ్‌ టెక్నాలజీ ఆధారంగా అభివృద్ధి చేశాం. కోళ్ల పరిశ్రమలో ఉష్ణోగ్రతల నియంత్రణతో పాటు ఫామ్‌ నిర్వహణ, విశ్లేషణ సేవలందించడం దీని ప్రత్యేకత. ఒకేసారి వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న అన్ని ఫామ్‌లను రియల్‌ టైమ్‌లో నిర్వహించుకునే వీలుంటుంది.

ధర రూ.60 వేలు. రెండోది పౌల్ట్రీమాన్‌. సెన్సార్లు, క్లౌడ్‌ టెక్నాలజీ అనుసంధానిత పరికరమిది. దీన్ని హేచరీలో అనుసంధానం చేస్తాం. మొబైల్‌ అప్లికేషన్స్‌తో ఎప్పటికప్పుడు ఇంక్యుబేటర్‌లోని ఉష్ణోగ్రత నివేదికలను చూడొచ్చు. ఏమాత్రం తేడా వచ్చిన అలెర్ట్‌ చేస్తుంది. ఏ దశలో సమస్య ఉందో కరెక్ట్‌ లొకేషన్‌ చూపిస్తుంది. దీంతో నేరుగా సమస్యను పరిష్కరించవచ్చు. ధర రూ.15 వేలు. వార్షిక నిర్వహణ రుసుము 12 శాతం. పౌల్ట్రీమాన్‌కు పేటెంట్‌ ఉంది.

సెప్టెంబర్‌ నుంచి సుగుణలో సేవలు..
ప్రస్తుతానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సేవలందిస్తున్నాం. దాదాపు 10 సంస్థలు మా సేవలు వినియోగించుకుంటున్నాయి. వీటిల్లో వంద వరకు ఇంక్యుబేషన్స్‌ ఉంటాయి. పెద్ద కంపెనీలతో మాట్లాడుతున్నాం. సుగుణ కంపెనీలో అన్ని విభాగాల్లోనూ పౌల్ట్రీమాన్, కన్‌సైట్‌ నిర్వహణ సేవలు సెప్టెంబర్‌ రెండో వారం నుంచి ప్రారంభిస్తున్నాం. వచ్చే ఏడాది కాలంలో బెంగళూరు, కోయంబత్తూరు, కోల్‌కతాలకు విస్తరించనున్నాం.

గతేడాది రూ.12 లక్షల ఆదాయాన్ని ఆర్జించాం. వచ్చే ఏడాది రూ.5 కోట్ల ఆదాయాన్ని, పౌల్ట్రీ పరిశ్రమలో 30 శాతం మార్కెట్‌ వాటాను లకి‡్ష్యంచాం. మా సంస్థలో ప్రస్తుతం 8 మంది ఉద్యోగులున్నారు. టెక్నాలజీ, సేల్స్‌ విభాగంలో మరో నలుగురిని తీసుకుంటున్నాం. దేశంలోని ప్రముఖ అగ్రిటెక్‌ వెంచర్‌ క్యాప్టలిస్ట్‌ నుంచి రూ.7 కోట్ల నిధులను సమీకరించనున్నాం. డీల్‌ 2 నెలల్లో పూర్తవుతుంది’’ అని అర్చన వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement