
సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ సంగన్ పాటిల్(కుడి వ్యక్తి)
ఇంటి దగ్గరికే బండి సర్వీసింగ్ సేవలు
• ఎక్కడైనా బైక్ ఆగితే 2 లీటర్ల పెట్రోల్ డెలివరీ
• నెల రోజుల్లో చెన్నైకిæ; 3 నెలల్లో బీమా సేవల్లోకి విస్తరణ
• రూ.5–6 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి
• ‘స్టార్టప్ డైరీ’తో గాడీ 360 ఫౌండర్ అండ్ సీఈఓ సంగన్ పాటిల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
ఆఫీసుకెళ్లేటప్పుడో.. అర్జెంటుగా బయటికెళ్తుంటేనో మార్గ మధ్యంలో పెట్రోల్ అయిపోతే?
సడన్‌గా బండి ట్రబుల్ ఇస్తే?
.. ఏమవుతుంది? ముందు మైండ్ బ్లాంక్ అవుతుంది! ఆ తర్వాత చేసేదేంలేక.. ఆగిన బండిని తోసుకుంటూ మెకానిక్ షాపుకి తీసుకెళ్లటమో లేదా బండిని అక్కడే పెట్టేసి మెకానిక్‌ను తీసుకొచ్చి రిపేర్ చేయించుకోవటమో చేస్తాం! ఇలాంటి కష్టాలేవీ లేకుండా జస్ట్ ఒక్క క్లిక్ చేస్తే చాలు ఆగిన బండి దగ్గరికే మెకానిక్ వచ్చి.. రిపేర్ చేసి అవసరమైతే పెట్రోల్ కూడా పోసి బండి తాళాలు చేతిలో పెట్టేస్తాడు.
అదే ‘గాడీ 360.కామ్’ ప్రత్యేకత కూడా. మరిన్ని వివరాలు సంస్థ వ్యవస్థాపకుడు సంగన్ పాటిల్ మాటల్లోనే...
సమస్యల నుంచే సంస్థ ప్రారంభమవుతుందనడానికి ‘గాడీ 360’ ప్రత్యక్ష ఉదాహరణ. ఓ రోజు పని మీద వెళుతున్నప్పుడు రోడ్డు మధ్యలో బండి మొరాయించింది. అక్కడే వదిలేసి వెళ్దామంటే తిరిగొచ్చేసరికి బండి ఉంటుందో లేదోనని అనుమానం. రిపేర్ చేయించుకుందామంటే దగ్గర్లో రిపేరింగ్ షాపు లేదు. అప్పుడే అనిపించింది దేశంలోని బైక్ సర్వీసింగ్ స్టేషన్లంటినీ ఒకే వేదిక మీదికి తీసుకొస్తే.. స్టేషన్లకు లాభంతో పాటూ కస్టమర్‌కూ ఎంతో ఉపశమనంగా ఉంటుందని! మరో మిత్రుడు సతీష్ ఆష్కితో కలిసి రూ.5 లక్షల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా 2015 ఫిబ్రవరిలో సంస్థను ప్రారంభించాం.
సర్వీసింగ్ స్టేషన్లతో ఒప్పందం..
ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో మాత్రమే సేవలందిస్తున్నాం. స్థానికంగా బెంగళూరులో 100, హైదరాబాద్‌లో 60 సర్వీసింగ్ స్టేషన్లతో ఒప్పందం చేసుకున్నాం. వెబ్‌సైట్, ఆండ్రాయిడ్ యాప్ ద్వారా సేవలందిస్తున్నాం. మీ దగ్గర్లోని సర్వీసింగ్ సెంటర్‌ను ఎంచుకున్నాక.. బైక్ పికప్ తేదీ, సమయం, వాహన సమస్య, చిరునామా అందిస్తే చాలు.. సర్వీస్ స్టేషన్ ఎగ్జిక్యూటివ్ మీ ఇంటికొచ్చి బైక్ కండీషన్‌ను చూసి సర్వీసింగ్‌కు ఎంతవుతుందో అంచనాగా చెబుతాడు. ఏవైనా పార్ట్స్ మార్చాల్సి వస్తే కొత్తవి వేసి.. పాత పార్ట్స్‌ను తిరిగి కస్టమర్‌కే ఇచ్చేస్తారు. ఇలా బైక్ పికప్ నుంచి డ్రాపింగ్ వరకూ ప్రతిదీ పక్కాగా, నమ్మకంతో సాగుతుంది.
పెట్రోల్ డెలివరీ కూడా..
బైక్ పికప్, డ్రాప్ ఉచితంగా అందించడంతో పాటూ 30 రోజుల వారంటీ ఇస్తున్నాం. బ్రేక్ డౌన్ అసిస్టెన్స్ సేవల్ని దేశవ్యాప్తంగా అందిస్తున్నాం. ఇందులో బైక్ పంక్చర్, రిపేర్ సేవలతో పాటూ ఆర్డర్ ఇస్తే 2 లీటర్ల పెట్రోల్‌నూ సరఫరా చేస్తాం. అది కూడా 7 ఏళ్ల లోపున్న వాహనానికే. అయితే బ్రేక్ డౌన్ అసిస్టెన్స్ సేవలను పొందటానికి ప్రతి బైక్‌కు ఏడాదికి రూ.600 రిజిస్ట్రేషన్ చార్జీ కింద చెల్లించాలి. ప్రస్తుతం నెలకు 600–800 బైక్స్ సర్వీసింగ్ ఆర్డర్లొస్తున్నాయి. ప్రతి సర్వీసింగ్ మీద కొంత మొత్తాన్ని కమీషన్ రూపంలో తీసుకుంటాం. గత నెల్లో రూ.12 లక్షల వ్యాపారం చేశాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి రూ.1.8 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాం.
నిధుల సమీకరణపై దృష్టి...
ప్రస్తుతం మా సంస్థలో 20 మంది ఉద్యోగులున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో చెన్నైలో గాడీ 360 సేవలను ప్రారంభిస్తాం. 3 నెలల్లో వాహన బీమా, ప్రీమియం కవరేజీ సేవల్లోకి ప్రవేశిస్తున్నాం. విస్తరణ అవసరాల కోసం రూ.5–6 కోట్ల పెట్టుబడుల కోసం ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నాం. త్వరలో డీల్‌ను క్లోజ్ చేసి పూర్తి వివరాలను వెల్లడిస్తాం. ఆ తర్వాత కార్ల సర్వీసింగ్ విభాగంలోకి విస్తరిస్తాం.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...